13, ఫిబ్రవరి 2013, బుధవారం

పెళ్లిళ్ల సందడి

               వివాహము అనగా పెండ్లి, పాణిగ్రహణము, కన్యాదానము, పరిణయము, కళ్యాణము, సప్తపది పలు విధములుగా అర్థాలున్నాయి. పెళ్లికి ఆంగ్ల భాషలో '' మ్యారేజ్‌'' అని అర్థం. ఆడమగ ఇద్దరు ఇష్టపడిన తరువాత వారి తల్లిదండ్రులు, పెద్దల అంగీకారం మేరకు వివాహం చేస్తారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో వారివారి అభిరుచులు, అవసరాలు, అలవాట్లు, అందుబాటు, అవసరార్థం, అవకాశం, ఆర్థిక స్థితిగతుల , ఆకాంక్షల మేరకు సంబంధాలు కలుపుకుని పెండ్లి చేసుకుంటున్నారు. కాలక్రమంలో అనేక మార్పులు వచ్చాయి. వివిధ మతాలు, సాంప్రదాయాలు, కులాలు, జాతులు, దేశాలు, ప్రాంతాలలో పెండ్లి చేసుకోవడంలో తేడాలుంటున్నాయి. ఏదేమయినా ఆడామగ మనుషులు సహజీవనం చేయడానికి పెళ్లి అనేతంతును ఏర్పాటు చేసుకున్నారు. 2013 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా అంటే లక్షల్లో జగడం విశేషం. .......

పెళ్లిళ్లే పెళ్లిళ్లు

                      ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కళ్యాణశోభ వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పెళ్లిసందడి కనిపించింది. 2013 ఫిబ్రవరి 13న బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల పెళ్ళిళ్లు జరిగినట్లు అంచనా. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే ఈ సంఖ్య 30 వేల దాకా ఉంది. నగరంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కూడా పెళ్లిళ్ల జోరు కొనసాగింది. ఉదయం 11 గంటలకే 3వేల జంటలు రిజ్రిస్ట్రేషన్‌ చేసుకోగా సాయంత్రానికి ఈ సంఖ్య 6వేలకు చేరింది. తిరుమల, అన్నవరం, భద్రాచలం వంటి దేవాలయాలు కిక్కిరిసి కనిపించాయి. పెద్దసంఖ్యలో పెళ్ళిళ్లు జరగడంతో తిరుమలకు విఐపిల తాకిడి పెరిగింది. దీంతో సాధారణ భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. మిగిలిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ ఇదే స్థితి కనిపించింది. రాష్ట్ర రాజధాని నగరంలో కళ్యాణమండపాలు కిక్కిరిసి కనిపించాయి. ఒక్కో కళ్యాణమండపంలో ఒకే సమయంలో మూడు, నాలుగు పెళ్లిళ్లు కూడా జరిగాయి. కళ్యాణమండపాలకు కొరత ఏర్పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గురు, శుక్రవారాల్లో కూడా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. గురువారం ప్రేమికుల రోజు కూడా కావడంతో ఆ రోజు పెళ్ళిలు చేసుకోవాలని కోరుకునే జంటల సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకే 10వేలకు పైగా దరఖాస్తులు అందాయి. దీంతో ఆ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు వేగంగా పూర్తిచేసేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కళ్యాణమండపాల్లో కూడా ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని కళ్యాణ మండపాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అదనపు వేదికలను నిర్మిస్తున్నారు. గురువారం నగరంలోని అన్ని కళ్యాణమండపాలు, బస్తీల్లో కలిపి 50 నుండి 60 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా. శుక్రవారం 15 నుండి 20వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 14న గురువారం నాలుగు లక్షల వివాహాలు జరగనున్నట్లు అంచనా. పెళ్లిళ్లకు హాజరుకావడానికి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వారితో రాజధాని నగరం కిక్కిరిసిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. మెట్రో రైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. కొన్ని చోట్ల మూడు, నాలుగు గంటల పాటు వాహనాల శ్రేణులు నిలిచిపోయాయి. అతికష్టమ్మీద పోలీసులు ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో గురువారం ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఆర్టీసీ ఏర్పాటు చేసిన 5 వేలకుపైగా ప్రత్యేక బస్సులు కూడా కిక్కిరిసినడుస్తున్నాయి. వీటిని నగరశివార్లలోని నిలిపివేయాలని సూచించారు. ప్రైవేటు బస్సులను కూడా సాధ్యమైనంత మేర నియంత్రించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహా వేడుకల్లో వరంగల్‌ జిల్లాలో విఫాదం చోటుచేసుకుంది. ఈ జిల్లాలో పెళ్ళి బస్పు బోల్తా పడటంతో ఏడుగురు మృతి చెందారు.
పురోహితులకు భారీ డిమాండ్‌
               పెద్ద సంఖ్యలో జరుగుతున్న పెళ్ళిళ్లతో పురోహితులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. డిమాండ్‌ను తట్టుకోవడానికి స్థానిక పురోహితులు తమిళనాడు, కర్నాటకల నుండి పెద్దసంఖ్యలో ను నగరానికి తీసుకువచ్చారు. వీరికి అన్ని వసతులు కల్పించి, రోజుకు ఐదు నుండి ఆరు వేల రూపాయల దాకా చెల్లిస్తున్నారు. పెళ్ళిలు జరుపుతున్న కుటుంబాల స్థాయి, డిమాండ్‌ను బట్టి 15 వేల నుండి 50 వేల రూపాయల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం.అట్టహాసంగా జరిగే వివాహా వేడుకల్లో ఈ మొత్తం ఇంకా పెరుగుతోంది. మంగళవాయిద్యకారులకు కూడా డిమాండ్‌ పెరిగింది. రాష్ట్రంలోని అన్ని నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
పూల ధరలకు రెక్కలు!
                 పెద్దసంఖ్యలో వివాహాలు జరుగు తుండటంతో హైదరాబాద్‌ నగరంలో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. వివాహ వేదికల్లో అలంకరించే మల్లెలు, మొగలిపూల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. మూర మల్లెపూలు 75 నుండి 80 రూపాయల దాకా పలుకుతోంది. మెగలిపువ్వు ఒకటి 200 రూపాయలు చెబుతున్నారు. పెద్దసంఖ్యలో పెళ్ళిళ్లతో పాటు, ప్రేమికుల రోజు కూడా కావడంతో గులాబీల ధర అమాంతం పెరగిపోయింది. ఒక్కోగులాబీ పువ్వును రకాన్ని బట్టి 10 రూపాయల నుండి 30 రూపాయలకు విక్రయిస్తున్నారు.
సచివాలయం వెలవెల
         పెళ్ళిళ్ళ ప్రభావం సచివాలయంపై పడింది. తమ తమ నియోజకవర్గాల్లో జరిగే వివాహాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులంతా జిల్లాలకే పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సైతం క్యాంప్‌ ఆఫీస్‌కే పరిమితమయ్యారు. మధ్యాహ్నం నుండి ఆయన రెండు పెళ్లిళ్లకు హాజరయ్యారు. ఉదయం పూట మంత్రులు కొడ్రు మురళి, విశ్వరూప్‌ మాత్రమే సచివాలయానికి వచ్చారు. కాసేపు ఉన్న తరువాత వారుకూడా పెళ్లిళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన మంత్రుల్లో అధికశాతం మంది మంగళవారం నాడే వారి వారి జిల్లాలకు వెళ్ళిపోయారు. సచివాలయంలో 5 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా బుధవారం కేవలం రెండు వేల మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

9, ఫిబ్రవరి 2013, శనివారం

కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం

119 గుడిసెలు దగ్ధం

రూ 2 కోట్ల పైబడి ఆస్తి నష్టం

               ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు నగరంలో 2013 ఫిబ్రవరి 9న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగర శివారు నందికొట్కూరు రోడ్డులో ఉన్న అరుంధతి నగర్‌లో జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో 119 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఈ దుర్ఘటనలో రెండు కోట్లరూపాయలకు పైబడి ఆస్తి నష్టం వాటిల్లింది. అరుంధతినగర్‌లో ఐదారేళ్లుగా పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అక్కడ నివసించే పేదలంతా నగరంలోకి వచ్చి పనులు చేసుకుని రాత్రికి తిరిగి ఇళ్లకు వెళ్తారు. ఎండతీవ్రత ఎక్కువ ఉండటంతో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఒక ఇంటికి అంటుకున్న నిప్పు కాలనీ అంతా వ్యాపించింది. అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకునే లోపు గుడిసెలన్నీ కాలిపోయాయి. ఇళ్లలో నిల్వ ఉంచుకున్న దాన్యం, దుస్తులు, చీరలు, టివిలు ఇలా ప్రతి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఖాళీ బూడిదయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో రెండు కోట్ల రూపాయలకు పైబడి నష్టం వాటిల్లి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దానమయ్య అనే వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం అప్పు చేసి తెచ్చుకున్న నాలుగు లక్షల రూపాయల నగదు కాలిపోయింది. 500 రూపాయల నోట్లు కాలిన బూడిదలో కనిపించాయి.