30, ఆగస్టు 2019, శుక్రవారం

‘సాహో’ రివ్యూ

 
బ్యాన‌ర్‌: యు.వి.క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, నీల్ నితిన్ ముఖేష్‌, జాకీష్రాఫ్‌, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ‌, అరుణ్ విజ‌య్‌, ఎవ్‌లిన్ శ‌ర్మ‌, చుంకీపాండే, లాల్‌, మందిరాబేడి, మ‌హేశ్ మంజ్రేక‌ర్‌, టిన్ను ఆనంద్‌, షాసా చెట్రి త‌దిత‌రులు
మ్యూజిక్: త‌నిష్క్ బ‌గ్చి, గురురంద్వా, బాద్షా, శంక‌ర్ ఎహ్‌సాన్‌లాయ్‌
బ్యాగ్రౌండ్ స్కోర్‌: జిబ్రాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.మ‌ది
ఎడిటింగ్‌: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: వంశీ, ప్ర‌మోద్‌
ద‌ర్శ‌క‌త్వం: సుజిత్‌
 
                  తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి `బాహుబ‌లి`తో తెలియ‌జేసిన హీరో ప్ర‌భాస్‌. ఈ హీరో త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. అలాంటి తరుణంలో.. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఒకే ఒక్క సినిమా అనుభ‌వ‌మున్న సుజిత్ అనే యువ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నట్లు ప్ర‌క‌టించాడు ప్ర‌భాస్. బాహ‌ుబ‌లితో ప్ర‌భాస్ రేంజ్ అంత‌ర్జాతీయ స్థాయికి చేర‌డంతో నిర్మాత‌లు సాహోను ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించారు. బాలీవుడ్ తార‌లు, హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ఈ సినిమాకు ప‌నిచేయ‌డం, బాహుబ‌లి ఇమేజ్, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ ఇవ‌న్నీ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చాయి. మ‌రి సాహో ఈ అంచ‌నాల‌ను అందుకుందా? లేదా? ప‌్ర‌భాస్ ఇమేజ్ పెరిగిందా? లేదా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం...
 
క‌థ‌
           ముంబైలో అతి పెద్ద దొంగ‌త‌నం జ‌ర‌గుతుంది. రెండు వేల కోట్ల రూపాయ‌ల‌ను ఓ దొంగ చిన్న సాక్ష్యం కూడా దొరక్కుండా  కొట్టేస్తాడు. కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీస‌ర్ డేవిడ్‌(ముర‌ళీశ‌ర్మ‌), కానిస్టేబుల్ గోస్వామి(వెన్నెల‌కిషోర్‌) దొంగెవ‌రో తెలుసుకునే ప్రయత్నంలో విఫలమవుతారు. దీంతో ప్ర‌భుత్వం ఓ స్పెష‌ల్ ఆఫీస‌ర్ అశోక్ చ‌క్ర‌వ‌ర్తి(ప్ర‌భాస్‌)ను నియ‌మిస్తుంది. అశోక్ కేసుని ఛేదిస్తుండగా చివ‌ర‌కు జై(నీల్ నితిన్ ముఖేష్‌)నే ఆ దొంగ అని తెలుస్తుంది. అయితే జైకు పోలీసుల నుంచి సమాచారం వ‌స్తుండ‌టంతో త‌ప్పించుకుంటూ ఉంటాడు.
 
జైనే అస‌లు దొంగ అని సాక్ష్యాల‌తో ప‌ట్టుకోవాలంటే ఏదో ఒక‌టి చేయాల‌ని.. అత‌నితో స్నేహం చేయ‌డానికి హీరో అత‌నుండే ప‌బ్‌కి వెళ‌తాడు. అదే స‌మ‌యంలో అమృతానాయ‌ర్‌(శ్ర‌ద్ధాక‌పూర్‌)కి డ్యూటీ వేస్తాడు. క్ర‌మంగా అశోక్ ఆమెను ల‌వ్ చేస్తుంటాడు. ఓసారి తాగిన మైకంలో జై ఓ క్లూ అశోక్‌కు ఇస్తాడు. వాజీ న‌గ‌రంలో ఉండే బ్లాక్ బాక్స్‌లో కోట్ల రూపాయ‌లున్నాయని అది ద‌క్కితే తానే అదృష్ట‌వంతుడిన‌ని, అందుకోసం తాను ప్ర‌యత్నిస్తున్న‌ట్లు చెబుతాడు. ఆ బ్లాక్ బాక్స్ దొంగ‌త‌నం చేసే క్ర‌మంలో అత‌న్ని రెడ్ హ్యాండ్‌గా ప‌ట్టుకోవాల‌ని ప్ర‌భాస్ పోలీసుల‌తో క‌లిసి ప్లాన్ చేస్తాడు.
 
         ఈ క్ర‌మంలో సిటీలో పెద్ద డాన్ రాయ్‌(జాకీ ష్రాఫ్‌)ను కొంద‌రు చంపేస్తారు. ఆయ‌న స్థానంలో డాన్ అయిన ఆయ‌న త‌న‌యుడు విశ్వాంక్‌(అరుణ్ విజ‌య్‌) తండ్రిని చంపిన వారిని ప‌ట్టుకోవ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో అనుకోని షాకింగ్ విష‌యాలు రివీల్ అవుతూ వ‌స్తాయి. అస‌లు అశోక్ ఎవ‌రు? అత‌నికి, రాయ్ గ్యాంగ్‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి? అస‌లు బ్లాక్ బాక్స్ ర‌హ‌స్య‌మేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేష‌ణ‌
             బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెర‌గ‌డంతో సాహోపై అంచ‌నాలు ఆకాశాన్ని అంటాయి. ఈ అంచనాల‌కు త‌గ్గ‌ట్లే నిర్మాతలు, హీరో, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు భారీ బ‌డ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో సాహో సినిమాను రూపొందించారు. రాజ‌మౌళి వంటి ద‌ర్శ‌కుడి త‌ర్వాత సుజిత్ వంటి ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ సినిమా చేయ‌డ‌మంటే .. నిజంగా అత‌ని తెగువకు అభినందించాల్సిందే. అయితే ఈ అంచ‌నాల కార‌ణంగా సాహో ఇండియ‌న్ మూవీ అనే అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు వ‌స్తాడ‌న‌డంలో సందేహం లేదు. ఈ అంచ‌నాల‌కు ధీటుగా సినిమా ఉండాలి. దీని వ‌ల్ల సినిమాలో సాంకేతిక హంగులు పెరిగాయి. దీంతో సినిమా బాలీవుడ్ రంగు పులుముకున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తుంది. యాక్ష‌న్ డ్రామా.. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను చిత్రీక‌రించారు.
 
             ఎంత పెద్ద భారీ చిత్ర‌మైనా ఓ భావోద్వేగం కూడా చాలా ముఖ్యం. ఈ ఎమోష‌న్ పార్ట్ సినిమాలో అంత ఎఫెక్టివ్‌గా, క‌నెక్టింగ్‌గా ఉండ‌దు. సినిమా ప్ర‌థ‌మార్థం అంతా నెమ్మదిగా సాగుతోంది. అయితే అదంతా క‌థ‌లోకి తీసుకెళ్ల‌డానికి ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నాల‌ని అర్థం చేసుకోవాలంటే, ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌తో తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో వ‌రుస ట్విస్టులతో షాకులిచ్చే ప్ర‌య‌త్నం చేశాడు కానీ.. ఈ షాకుల వ‌ల్ల ప్రేక్ష‌కుడు గందరగోళానికి లోనవుతాడు. ప్లాష్ బ్యాక్ పార్ట్‌ను మిక్స్ చేసి చూసిన త‌ర్వాత ఇది రివేంజ్ డ్రామానా అనిపిస్తుంది. సినిమాలో యాక్ష‌న్ పార్ట్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నా.. వాటిని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి త‌గ్గ‌ట్లు న‌చ్చేలా తెరకెక్కించడం క‌ష్ట‌మైంద‌నే చెప్పాలి.
 
           ప్ర‌భాస్ యాక్ష‌న్ సన్నివేశాల్లో అద్భుతంగా చేసినా.. ఎవ‌రితో, ఎందుకు చేస్తున్నాడ‌నే క‌న్‌ఫ్యూజ‌న్ క‌న‌ప‌డుతుంది. ప్ర‌తి విష‌యంలో ట్విస్ట్‌, థ్రిల్లింగ్ ఇవ్వాల‌నే త‌లంపుతో ప్ర‌తి విష‌యాన్ని దాచి పెట్ట‌డం.. చివ‌ర‌కు రివీల్ చేయ‌డంతో కాస్త తిక‌మ‌క‌గా త‌యారైంది. సినిమాలో కామెడీ పార్ట్ ఉన్న‌దే అనుకుని సంతృప్తిపడాలి. ఇక నటీన‌టుల ప‌రంగా చూస్తే ప్ర‌భాస్ గురించి మ‌నం త‌క్కువ చేయ‌లేం. బాహుబ‌లితో అతనేంటో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలో న‌టుడిగా చాలా రిస్కుల‌తో న‌టించాడు. అలాగే శ్ర‌ద్ధాక‌పూర్ గ్లామర్ సినిమాకు పెద్ద ప్ల‌స్‌. పాట‌ల పిక్చ‌రైజేష‌న్ అద్భుతంగా ఉంది కానీ.. హిందీ పాట‌ల్లా అనిపిస్తాయి. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. మ‌ది కెమెరా వ‌ర్క్ ఎక్స్‌ట్రార్డిన‌రీ. యాక్ష‌న్ ఎలిమెంట్స్ సూప‌ర్బ్‌. ఇత‌ర న‌టీన‌టులంద‌రూ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు.

28, ఆగస్టు 2019, బుధవారం

రాజుకున్న రాజధాని

తారస్థాయిలో అమరావతి రాజకీయం
తెదేపా అపోహలు సృష్టించొద్దు.. స్పష్టమైన ప్రకటన చేయాలి

భాజపా మార్పు అసాధ్యం.. మారిస్తే ఊరుకునేది లేదు

కాంగ్రెస్‌ అమరావతిలోనే కొనసాగించాలి

సీపీఎం ప్రజలు ఊరుకోరు..  రాజధానిపై స్పష్టత ఇవ్వాల్సిందే

రోడ్డెక్కిన రైతులు

ఆందోళన వద్దన్న ఉపరాష్ట్రపతి

సుజనా, తెదేపా నేతలు భూములు కొన్నారన్న బొత్స..

వారు మినహా మిగతా వారికి న్యాయం చేస్తామని హామీ

సెంటు భూమీ కొనలేదన్న సుజనా

ఆందోళన చేస్తున్న రైతులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి రాజధాని తరలింపు ఆలోచనలను విరమించుకునేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ తెరపై రాజధాని కీలక చర్చనీయాంశమైంది. రాజధాని రైతుల్లో ఆందోళనలకు, పార్టీల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. రాజధాని అమరావతిలో కొనసాగడంపై ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజుకున్న ఈ రాజకీయం మంగళవారం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష పార్టీలన్నీ రాజధానిని అక్కడే కొనసాగించాలని ఆందోళనకు దిగాయి. రాజధాని రైతులూ రోడ్డెక్కారు. మరోవైపు ప్రభుత్వం.. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని, రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి, చంద్రబాబు బంధువులకు భూములన్నాయని ఆరోపించింది. అలాంటి వారిని పక్కనబెట్టి మిగిలిన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేసింది.
రాజధానిని కదిలిస్తే ఊరుకోబోమని భాజపా హెచ్చరించింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరి వైకాపా తీరుపై ధ్వజమెత్తారు. బాధ్యతారహిత ప్రకటనలపై సీఎం జగన్‌ స్పందించాలని డిమాండు చేశారు. రాజధానిపై స్పష్టత ఇవ్వకపోతే ప్రజాగ్రహం తప్పదని సీపీఎం నేత మధు హెచ్చరించారు. రాజధాని గ్రామాల్లో సీపీఎం నేతలు పర్యటించి రైతులకు మద్దతుగా నిలిచారు. రాజధానిని ప్రస్తుతమున్న ప్రాంతంలోనే కొనసాగించాలని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. రాజధానిపై రాజకీయాలు చేయొద్దని కోరుతూ మంగళగిరి మండలం యర్రబాలెం రైతులు రహదారిపై ఆందోళనకు దిగారు.
ఊరట: ఈ రాజకీయ వివాదం మధ్య రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు సొమ్మును విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం వారికి ఊరటనిచ్చింది.
అన్నీ బయటపెడతాం

రాజధాని ప్రాంతంలో సుజనా, చంద్రబాబు బంధువులకు భూములు

ఏ ఒక్కరికో మేలు జరిగేలా వ్యవహరించం: మంత్రి బొత్స
ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర రాజధాని అనేది ఒక ప్రాంతానిదో.. ఒక సామాజికవర్గానిదో.. నాయకుల సొంతానిదో కాదు.. 5 కోట్ల మంది ప్రజానీకానిది. 13 జిల్లాలకు సంబంధించినది’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతూ తలసరి ఆదాయం పెరగాలనేదే సీఎం జగన్‌ ఆలోచన. అంతేగానీ ఒకరికి మేలు చేసేలా మా ప్రభుత్వం వ్యవహరించదు’ అని వివరించారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాజధానిలో కొందరు వ్యక్తుల పేర్లతో 25వేల చదరపు గజాల స్థలాలున్నాయి. త్వరలో పేర్లతో సహా వెల్లడిస్తాం. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి, చంద్రబాబు బంధువులకు భూములున్నాయి. అక్రమాలను వరుసగా వెల్లడిస్తాం’ అని చెప్పారు. అరగంట ఆగితే చంద్రబాబు ఇల్లూ మునిగేది

‘వరదల్లో ఇల్లు మునిగిపోతుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ హైదరాబాద్‌ వెళ్లారు. వరదలు తగ్గాక వచ్చి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబు ఇంటిని ముంచాలనుకుంటే.. ఇంకో అరగంట ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరవకపోతే సరిపోయేది కదా’ అని వ్యాఖ్యానించారు.
భాజపా నేతలు ఎందుకు మారారో?

‘రాజధాని ఒక కుంభకోణం.. అవినీతి జరుగుతోందని భాజపా గతంలో ఆరోపించింది. రూ.వేల కోట్ల టెండర్లు పిలిచారని, భూ సమీకరణలో అక్రమాలు జరిగాయని వైకాపాతోపాటు ఆ పార్టీ చెప్పింది. వాళ్లు ఇప్పుడెందుకు విధానాన్ని మార్చుకున్నారో అర్థం కావటం లేదు’ అని బొత్స పేర్కొన్నారు.
రైతులకిచ్చిన హామీలను నెరవేరుస్తాం

రాజధానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. పింఛన్లు ఇస్తున్నాం. కౌలు చెల్లిస్తున్నాం. భూములు అభివృద్ధి చేసి ఇస్తాం. రాజధానికి భూములిచ్చిన రైతులు నన్ను కలిసి ఈ ఏడాది కౌలు చెల్లించాలని కోరారు. వెంటనే రూ.187.40 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చాం.
బొత్స ప్రధాన ఆరోపణలు

* సుజనా చౌదరి బంధువు, గ్రీన్‌టెక్‌ కంపెనీలో డైరెక్టరు అయిన జితిన్‌ కుమార్‌ పేరుతో చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాల భూములున్నాయి. ఈడీ ఇచ్చిన జాబితా ప్రకారం ఆయనకు ఉన్న 120 సంస్థల్లో ఇదీ ఒకటి. ఆయన సోదరుడి కుమార్తె అయిన యలమంచిలి రుషికన్య పేరుతో వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలున్నాయి. ఆయన రాజధాని ప్రాంతంలో ఎకరా ఉంటే చూపించమన్నారు. 124 ఎకరాలు చెప్పా.

* చంద్రబాబు వియ్యంకుడికి వియ్యంకుడు అయిన ఎంఎస్‌బీ రామారావుకు చెందిన వీబీసీ సంస్థకు ఏపీఐఐసీ ద్వారా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఎకరా రూ.లక్ష చొప్పున 493 ఎకరాలిచ్చారు. ప్రభుత్వంలో ఉన్న వారెవరైనా ఎకరా రూ.లక్ష చొప్పున ఇంట్లో వాళ్లకు ఇచ్చుకోవడం ఎక్కడైనా జరిగిందా? దీన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనాలా? క్విడ్‌ ప్రో కో అనాలా?

* చంద్రబాబు రాజధానిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిందంటున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమహేంద్రవరంలలో పెరిగాయని నా స్నేహితులు చెబుతున్నారు. చంద్రబాబు ఆలోచనేంటి? అక్కడెక్కడా పెరగకుండా అమరావతిలోనే పెరగాలా? 
మెట్రోకు అంత అవసరమా?

‘మొత్తం 67 కిలోమీటర్ల దూరంతో అమరావతి మీదుగా వెళ్లేలా రూ.24,460 కోట్ల అంచనా వ్యయంతో విజయవాడ మెట్రోకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేశారు. ఇంత మొత్తంతో మెట్రో అవసరమా?
భూములు కొన్నవారి చిట్టా త్వరలోనే...

ట్విటర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజధాని అమరావతిలో బినామీ పేర్లతో భూములు కొన్నవారి చిట్టా త్వరలోనే బయటకు వస్తుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘అమరావతిలో భూములు కొన్నవారంతా రాజధాని తరలిపోతే రూ.కోట్ల పెట్టుబడులు ఏమైపోతాయోనని పీడకలలు కంటున్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో భూముల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఆయనకు రియల్‌ ఎస్టేట్‌ తప్ప ఇంకెలాంటి సమస్యలు కనిపించడం లేదా?’’ అని మంగళవారం ట్విటర్‌లో విమర్శించారు. ఎంపీ సుజనాచౌదరి భాజపాలో చేరినా ఆయన మదిలో చంద్రబాబే ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు.
సెంటు భూమీ కొనలేదు: సుజనా
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఒక్క సెంటు భూమీ కొనలేదని రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనా చౌదరి స్పష్టం చేశారు. 3 నెలల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మంత్రి బొత్స సత్యనారాయణ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే కొత్త పదాన్ని వారే కనిపెట్టారని, ఒకవేళ అదే జరిగి ఉంటే అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంది కాబట్టి విచారణ జరపొచ్చని సవాల్‌ చేశారు. మంగళవారం రాత్రి విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మంత్రి బొత్స కొండను తవ్వి ఎలుకను పట్టారు. రాజధానికి 100 కిలోమీటర్ల దూరంలో మా పూర్వీకులకు, మా అన్న, వదినల పేరు మీద 120 ఎకరాల భూములున్నాయని చెబుతున్నారు. ఆ భూములు ఎప్పుడు ఎవరు అమ్మారో? కొన్నారో? ఆ వివరాలివ్వాలి. రాజధానికి 20 కిలోమీటర్ల దూరంలోనూ... ఇంకా దూరంగా కోదాడలోనూ మాకు భూములుంటాయి. ఉన్నంత మాత్రాన ఇష్టారీతిన మాట్లాడతారా? బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న బొత్స తనకు తెలిసిన సమాచారాన్ని సరిచూసుకుని మాట్లాడాలి. ఊరికే మాట్లాడుతూ ప్రజల సమయాన్ని వృథా చేయకుండా పాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది’ అని సుజనా వ్యాఖ్యానించారు.
రాజధానిని కదిలిస్తే ఊరుకోం

భాజపా నేతలు లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి
ఈనాడు, గుంటూరు: నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని, దాన్ని అక్కడినుంచి కదిలించే ఆలోచన చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని భాజపా నేతలు హెచ్చరించారు. మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనాచౌదరి ధ్వజమెత్తారు. రైతుల మనోభావాలను తెలుసుకునేందుకు వీరిద్దరూ మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాయపూడి వద్దకు చేరుకున్న 29 గ్రామాల రైతులనుద్దేశించి మాట్లాడారు. ‘రాజధాని అంటే వేసుకుని వదిలేసే చొక్కాలాంటిది కాదు. అభివృద్ధిని నిర్ణయించేది. రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చారు. వారిని ఇరకాటంలో పడేసేలా మంత్రి బొత్స మాట్లాడుతున్నారు’ అంటూ సుజనాచౌదరి మండిపడ్డారు. రాజధానిలోని 29 గ్రామాల్లో ఎక్కడైనా తన పేరిట సెంటుభూమి ఉన్నా నిరూపించాలని సవాల్‌ విసిరారు.
పాదయాత్రలో జగన్‌ చెప్పింది గుర్తుంది: కన్నా

పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి రాజధానిని మార్చేది లేదని చెప్పినట్లు తనకు గుర్తుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధానిని మారుస్తామంటూ మంత్రులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. అమరావతిని తరలిస్తామంటే భాజపా చూస్తూ ఊరుకోదన్నారు. ‘ఇప్పటిదాకా ఈ ప్రాంతం మునిగిన దాఖలాలు లేవు. 7, 8 మీటర్లు తవ్వగానే నేలలో రాయి తగులుతుంది. మంచి రవాణావ్యవస్థ ఉంది. ఇన్ని ప్రయోజనాలుంటే అమరావతి రాజధానికి సరైనది కాదంటున్నారు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రాంతం వరదల్లో మునుగుతుందని నిరూపిస్తే తన పుట్టింటోళ్లు ఇచ్చిన మూడెకరాలు మంత్రికి రాసిస్తానని మందడం గ్రామానికి చెందిన బత్తుల గంగాభవాని సవాలు విసిరారు. విజయవాడ నుంచి సుజనాచౌదరి తొలుత తాళ్లాయపాలెం వచ్చారు. అక్కడ రైతులతో మాట్లాడుతుండగా వారి పక్కనుంచే సీఎం కాన్వాయ్‌ వెళుతోంది. ఆ సమయంలో రైతులు అమరావతి జిందాబాద్‌, రాజధాని ఇక్కడే ఉండాలని నినాదాలు చేయగా.. సీఎం కారులో నుంచే రైతుల వైపు చూసి నమస్కరిస్తూ వెళ్లిపోయారు.
ఉప రాష్ట్రపతిని కలిసిన రైతులు
ఉంగుటూరు, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధి కోసం తమ భూములు ఇచ్చామని..రాజధాని మార్పు అనే ప్రచారం సాగుతోందని, అక్కడ నిర్మాణాలు నిలిచిపోయినందున అందరిలో ఆందోళన నెలకొందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పలువురు రైతులు వాపోయారు.

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ విజయవాడ చాప్టర్‌లో మంగళవారం ఆయనను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన.. రాజధాని విషయంలో ఎటువంటి అధికార ప్రకటన వెలువడనందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను రాజకీయాలు మాట్లాడకూడదని, అయినా రాజ్యాంగబద్ధంగానే తన నిర్ణయం ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనాలోచనతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని రైతులకు సూచించారు.

26, ఆగస్టు 2019, సోమవారం

‘మిస్‌ ఇండియా’ కీర్తి సురేశ్‌..


                    హైదరాబాద్‌: కథానాయిక కీర్తి సురేశ్‌ ‘మిస్‌ ఇండియా’గా కనిపించనున్నారు. అదేంటి..? అనుకుంటున్నారు. ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకుడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. జగపతిబాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, భానుశ్రీ మెహ్రా, సుమంత్‌, నదియా తదితరులు నటిస్తున్నారు.
                    ఈ సినిమా టైటిల్‌ రివీల్‌ టీజర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేశ్‌ నాజూకుగా, స్టైలిష్‌గా కనిపించారు. చిత్రం షూటింగ్‌ దాదాపు విదేశాల్లో జరిగినట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర బృందం పేర్కొంది. ఇది ‘మహానటి’ తర్వాత కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సినిమాగా కావడం విశేషం.

24, ఆగస్టు 2019, శనివారం

అరుణ్‌జైట్లీ కన్నుమూత




23, ఆగస్టు 2019, శుక్రవారం

ఫోటోగ్రాఫర్ సుధాకర్ కు సన్మానం


           
విజయవాడలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా   రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు రవాణా శాఖ మాత్యులు    పేర్ని వెంకట్రామయ్య (Nani), రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ ,  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్   ముఖ్య        అతిథులుగా పాల్గొన్నారు.  పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆధ్వర్యంలో పెన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపకులు బడే ప్రభాకర్ అధ్యక్షతన  సీనియర్ జర్నలిస్టులకు ఫోటో వీడియో జర్నలిస్టులకు అభినందన సత్కార సభ ఏర్పాటు చేయడమైనది. ఈ సభను ఉద్దేశించి పలువురు వక్తలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో సాహసంతో కూడుకున్న పని అని, ఈ ఫోటోలు  నిరంతరం  చిరకాలం జ్ఞాపకాలతో పాటు ప్రతి ఒక్క ప్రతిమలకు కార్యక్రమాలకు గుర్తింపుగా ఉండిపోతుంది.  ఎటువంటి లాభాపేక్ష లేకుండా  జర్నలిజంలో వృత్తిలో పని చేస్తూ ఉన్న ఫోటోగ్రాఫర్లకు  సన్మానించారు.  కర్నూల్ సీనియర్ ఫోటోగ్రాఫర్ సుధాకర్ గారికి సన్మానం చేశారు . ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా కర్నూలు జిల్లాలో  ఎంపికయిన సుధాక రు ను. సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మంచి ఫోటో గుర్తింపు గా సన్మానం అందుకోవడం అదృష్టమన్నారు. ఇందులో పలువురు సీనియర్ నాయకులు పాత్రికేయులు పాల్గొన్నారు.

18, ఆగస్టు 2019, ఆదివారం

ఎపిని మార్చడమే నా కల

* పరిశ్రమలకు ఎర్ర తివాచీతో స్వాగతం
* ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పాత్ర గొప్పది
* డల్లాస్‌ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

                రాష్ట్రాన్ని అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రంగా మార్చాలన్నదే తన కల అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంవత్సరానికి ఒకటి, రెండు సార్లయినా సొంత గ్రామాలకు వచ్చి అందరినీ పలకరించాని, పెట్టుబడులు పెట్టడానికి ముందడుగు వేస్తూ మీరు రావాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుంటుందని సిఎం చెప్పారు. గ్రామాల్లో మీరు చదువుకున్న బడులను మార్చాలని ఆరాటం ఉన్నవాళ్లు, గ్రామాల్లో వైద్యశాలలు మార్చాలని తపన ఉన్నవాళ్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి గ్రామాలను బాగుపరుచుకుందామని, ప్రభుత్వ ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతివ్వాలని కోరారు. పరిశ్రమలకు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నామని, పిపిఎల సమీక్ష ద్వారా పరిశ్రమలకు మేలు కలుగుతుందని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పోషించిన పాత్ర చాలా గొప్పదని, చరిత్రాత్మక విజయం వెనుక మీ కృషి ఉందని అన్నారు. అమెరికన్లను మించి తెలుగువారు, భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా రెండున్నర నెలల పాలనలో విప్లవాత్మక చర్యలు చేపట్టామని, ప్రతి మనిషీ, ప్రతి కుంటుంబమూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు చేశామని చెప్పారు. అన్నం పెడుతున్న రైతులకు అన్నం దొరక్క అప్పులు పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాకూడదన్నది, రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదన్నది, పల్లెలు కళకళలాడాలని, ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు ఉండాలన్నది తన కోరికని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలని, పేదవాడు వైద్యం ఖర్చు భరించలేక, చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పటికీ రాకూడదన్నది, సొంత ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నది, పేదరికం, నిరుద్యోగంతో పస్తులు ఉండకూడదన్నది తన కల అని చెప్పారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు తావులేకుండా వివక్ష లేని పరిపాలన అందించాలన్నది తన కల అని తెలిపారు. రెండున్నర నెలల వ్యవధిలోనే గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను తీసుకువస్తున్నానన్నారు. అణగారిన వర్గాలు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా, నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడాలేని చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలను కుదుర్చుకుంటున్నామని తెలిపారు. మూడేళ్లలో పాఠశాలలు, ఆస్పత్రుల పరిస్థితిని మారుస్తామని, నాడు, నేడు అని ఫొటోలు చూపిస్తామని చెప్పారు.

13, ఆగస్టు 2019, మంగళవారం

విమానం కాదు.. స్వేచ్ఛ కావాలి : రాహుల్‌


గవర్నర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ 

         దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పర్యటించేందుకు రావాలన్న గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌ ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ స్వాగతించారు. అయితే అందుకు విమానం పంపాల్సిన అవసరం లేదన్నారు. తనతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు జమ్మూకశ్మీర్‌లో పర్యటించి, ప్రజలు, సైనికులను కలిసి మాట్లాడేందుకు స్వేచ్ఛ కల్పించాలని రాహుల్‌ గవర్నర్‌ను కోరారు. ‘ప్రతిపక్ష నాయకుల బృందం జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో పర్యటించాలన్న మీ ఆహ్వానం చాలా గొప్పది. కానీ అక్కడ పర్యటించి ప్రజలు, సైనికులతో కలిసి మాట్లాడే స్వేచ్ఛ మాకు కావాలి’ అని రాహుల్‌ గవర్నర్‌కు ట్వీట్‌ చేశారు.  
            కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నిన్న మండిపడ్డారు. రాహుల్‌ను తాను కశ్మీర్‌కు ఆహ్వానించానని, ఆయనకు విమానం కూడా పంపుతానని, వచ్చి ఇక్కడి పరిస్థితి గమనించి అప్పుడు మాట్లాడాలని ఆయన అన్నారు.

12, ఆగస్టు 2019, సోమవారం

మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌2


           అహ్మదాబాద్‌: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ -2 మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చేరనుంది. ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి.. సెప్టెంబరు 7న జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. 
    భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శివన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్‌ 2 విశేషాలను పంచుకున్నారు. ‘జులై 22న చంద్రయాన్‌-2ను ప్రయోగించిన తర్వాత ఐదు సార్లు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టాం. అవన్నీ విజయవంతమయ్యాయి. అత్యంత కీలకమైన కక్ష్య పెంపు ప్రక్రియను బుధవారం ఉదయం చేపట్టనున్నాం. ఆగస్టు 14న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ట్రాన్స్‌-లూనార్‌ ఇంజెక్షన్‌ ప్రక్రియ జరుపుతాం. దీంతో చంద్రయాన్‌ -2 భూకక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్య దిశగా పయనిస్తుంది. ఆ తర్వాత లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ ప్రక్రియ చేపడతాం. ఆగస్టు 20 నాటికి జాబిల్లి స్థిర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కూడా కొన్ని కక్ష్య పెంపులు చేపట్టిన తర్వాత చివరగా సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుంది’ అని శివన్‌ తెలిపారు. 
           ప్రస్తుతం వ్యోమనౌక పక్కాగా ఉందని, అన్ని సిస్టమ్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. జులై 22న జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 ద్వారా చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

9, ఆగస్టు 2019, శుక్రవారం

జాతీయ అవార్డులు: ఉత్తమ నటి కీర్తిసురేశ్‌

జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన
దిల్లీ: ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకుముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు అందజేశారు. దర్శకుడు రాహుల్‌ రాలీ జ్యూరీ సభ్యులతో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి||ల||సౌ||’ చిత్రాలకు అవార్డులు దక్కాయి.
* ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)
* ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉరి)
* ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్‌(ఉరి)
* ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌(మహానటి)
* ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌కిరే(చంబక్‌)
* ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయ్‌ హో)

* ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)
* ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్‌
* ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్‌ హో
* ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌రెడ్డి యాకంటి(నాల్‌: మరాఠీ)

* జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌
* జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
* జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌
* జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌
* ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ(పద్మావత్‌)
* జాతీయ ఉత్తమ యాక్షన్‌ చలన చిత్రం: కేజీఎఫ్‌
* ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)

* ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం:  చి||ల||సౌ||
* ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ‘అ!’(తెలుగు) కేజీఎఫ్‌(కన్నడ)
* ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
* ఉత్తమ మేకప్‌: ‘అ!’
* ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌: మహానటి
* ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కమ్మార సంభవం(మలయాళం)

* ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
* ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి
* ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌
* ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బెంగాలీ)
* ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
* ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)
* ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే

* నర్గీస్‌ దత్‌ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)

8, ఆగస్టు 2019, గురువారం

వాసిరెడ్డి పద్మకు కీలక పదవి

        ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వైకాపా సీనియర్‌ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమెను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పద్మ కొనసాగనున్నారు. ఇప్పటిదాకా ఈ పదవిలో కొనసాగిన నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

7, ఆగస్టు 2019, బుధవారం

సుష్మాస్వరాజ్‌ ‘ప్రస్థానం’


         సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా.. కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు సుష్మా స్వరాజ్‌. భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రత్యేక స్థానం సంపాదించారు‌. విద్యార్థి నాయకురాలి నుంచి కేంద్ర మంత్రిగా ఆమె ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. భాజపాలో చేరి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన మహిళా నాయకురాలామె. విదేశాంగమంత్రిగా ఎంతో మంది భారతీయులకు ఆపన్నహస్తం అందించారు. భారతీయులకే కాదు విదేశీయులకు కూడా ఆమె స్వయంగా సహాయం చేసిన సందర్భాలెన్నో. 67ఏళ్ల సుష్మా06-08-2019  మంగళవారం రాత్రి గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సుష్మాస్వరాజ్‌ గురించి..
బాల్యం, విద్యాభ్యాసం
సుష్మాస్వరాజ్ కళాశాల విద్య వరకు అంబాలాలోనే జరిగింది. ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.
సుష్మా రాజకీయ జీవితం

1977లో జనతా పార్టీ తరఫున హరియాణా విధానసభ సభ్యురాలిగా ఎన్నికై 1982 వరకు ఆ పదవిని నిర్వహించి మళ్ళీ 1987లో రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ తరఫున హరియాణా విధానసభకు ఎన్నికయ్యారు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రిగా పనిచేశారు. 1984లో సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోకదళ్-భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, పౌరసరఫరాలశాఖ మంత్రిగా వ్యవహరించారు. 
జాతీయ రాజకీయాలు
1990లో సుష్మాస్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. అంతకుముందు 1980, 1984, 1989లలో కార్నాల్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందారు. 1996లో దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజపేయీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో 12వ లోక్‌సభకు మళ్లీ  రెండో సారి దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజపేయీ రెండో మంత్రివర్గంలో మళ్లీ అదే శాఖకు మంత్రిగా పనిచేశారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యునికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. 
దిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా
దిల్లీ శాసనసభ ఎన్నికల్లో  విజయం సాధించడానికి 1998 అక్టోబరులో భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం సుష్మాస్వరాజ్‌ను రంగంలో దింపింది. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో సుష్మా దిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. దిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 
బళ్ళారిలో సోనియాగాంధీపై పోటీ
1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. సోనియాగాంధీపై పోటీకి భారతీయ జనతా పార్టీ తరఫున సుష్మాస్వరాజ్‌ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ ఓడిపోయినప్పటికీ.. సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
‘ఆపన్న’ సుష్మ
కేంద్ర మాజీ మంత్రి సుష్మా సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఆపదలో ఉన్నామని ట్విటర్‌ వేదికగా ఆమెను ఆశ్రయించిన వారిని ఆపన్న హస్తం అందించేవారు. అందుకే ఆమెను అభిమానులు ‘ట్విటర్‌ క్వీన్‌’ అని ముద్దుగా పిలుచుకునేవారు. ఇరాక్‌లో చిక్కుకున్న ఎంతో మందికి ఆమె స్వయంగా రంగంలోకి దిగి సాయం అందించారు. 
తీజ్‌ వేడుకల్లో
సుష్మా రాజకీయాల్లో నే కాదు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తారు. పలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దిల్లీలో భాజపా మహిళా మోర్చ నిర్వహించిన తీజ్‌ వేడుకల్లో పాల్గొని ఇలా చిన్న పిల్లలా ఉయ్యాలలూగారు.
వ్యక్తిగత జీవితం
       క్రిమినల్‌ న్యాయవాది స్వరాజ్‌ కౌశల్‌ను 1975 జులై 13న సుష్మ వివాహమాడారు. రాజకీయాల్లో రాణించేలా ఆయన సుష్మకు పూర్తి ప్రోత్సాహం అందించారు. 1990-93 మధ్య మిజోరం గవర్నర్‌గా కౌశల్‌ పనిచేశారు. మనదేశంలో అతి పిన్న వయసులో గవర్నర్‌ పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. 1998-2004 మధ్య కౌశల్‌ ఎంపీగా కూడా ఉన్నారు. సుష్మ-కౌశల్‌ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పేరు బన్సూరీ కౌశల్‌. బన్సూరీ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.
విదేశీ ప్రతినిధులతో
          భారత పర్యటనకు వచ్చిన ఎంతో మంది విదేశీ ప్రతినిధులతో సుష్మా సమావేశమై పలు విషయాలను చర్చించేవారు. 2017 అక్టోబర్‌ 17న భూటాన్‌ రాజు నాలుగురోజుల పర్యటనకు భారత్‌ వచ్చారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికి మాట్లాడారు. భూటాన్‌ రాజకుమారుడితో సుష్మా సరదాగా గడిపారు. హైదరాబాద్‌లో 2017 నవంబర్‌ 28న గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ జరిగింది. ఈ సమ్మిట్‌కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ వచ్చారు. అప్పుడు సుష్మా ఆమెతో కాసేపు సమావేశమయ్యారు.
మానవీయ కోణం
            పాకిస్తాన్‌లో బలవంతపు వివాహం బారిన పడి స్వదేశానికి చేరుకున్న భారత మహిళ ఉజ్మాను పరామర్శిస్తున్న అప్పటి విదేశాంగ మంత్రి  సుష్మా స్వరాజ్‌. భారత్‌కు చెందిన ఉజ్మా మలేషియాలో పరిచయమైన తహీర్‌ అలీని కలిసేందుకు 2018లో పాకిస్థాన్‌ వెళ్లారు. ఆలీ ఆమెను తుపాకీతో బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యకార్యాలయ అధికారులను ఆశ్రయించింది. దీనిపై ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఉజ్మాను భారత్‌కు పంపించడంతోపాటు, వాఘా సరిహద్దు వరకు రక్షణ కల్పించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది.
          పాకిస్థాన్‌కు చెందిన రంజాన్‌ మహ్మద్‌ బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించాడు. 2009లో మహ్మద్‌ తల్లిదండ్రులు విడిపోయారు. వారు విడిపోయే సమయంలో కుమార్తె తల్లి వద్ద, కుమారుడు తండ్రి వద్ద ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. 2010లో రంజాన్‌తో కలిసి తండ్రి బంగ్లాదేశ్‌కు వచ్చాడు. అక్కడ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ రంజాన్‌ను ఇబ్బందులు పెట్టింది. దీంతో తన తల్లి వద్దకు వెళ్లాలని భావించిన అతనికి స్థానిక వ్యక్తి సలహా మేరకు భోపాల్‌ చేరుకున్నాడు. పోలీసుల తనిఖీలో పట్టుబడి స్వచ్ఛంద సంస్థ ఆశ్రమానికి చేరుకున్నాడు. వారు రంజాన్‌ వివరాలను తెలుసుకుని పాకిస్థాన్‌లోని తల్లిని ఫోన్‌లో సంప్రదించారు. వీసా సమస్యతో బాలుడు పాకిస్థాన్‌ వెళ్లే అవకాశం లేకపోవడంతో ఎన్‌జీవో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదించింది. ఆమె బాలుడిని పాకిస్థాన్‌ పంపించే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

6, ఆగస్టు 2019, మంగళవారం

ఆకలి చంపుకోకండి


* ‘ఆలస్యమవుతోంది... నాకొద్దు టిఫిన్‌’ అంటూ కాలేజీ బస్సుకోసం పరుగెత్తింది కృతి.
* ‘ఎప్పుడూ పప్పు, బెండకాయలేనా? నేను  క్యాంటీన్‌లో తింటాను... లంచ్‌బాక్స్‌ వద్దు’ అంటూ వెళ్లిపోయింది పావని.
ఇలా సమయంలేదని... రుచులు నచ్చక... తిండి మానేస్తే సన్నగా కనిపిస్తామని... చాలామంది అమ్మాయిలు ఏదో ఒక వంకతో పొట్ట మాడ్చుకుంటారు. సమస్యలు ఎన్ని ఉన్నా... కౌమారంలో సరైన పోషకాలు అందకపోతే... భవిష్యత్తులో కొన్నిరకాల జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. వాటిని ఇప్పటినుంచే రాకుండా చేయాలంటే... ఆహారంలో ఈ మార్పులు అవసరం. అవేంటో చూసేయండి మరి.
           దయం పూట అల్పాహారం మానేసి... మధ్యాహ్నం ఆకలికి ఎక్కువగా తినడం వల్ల క్రమంగా హార్మోన్లలో అసమతుల్యత ఎదురవుతుంది. సమయానికి తగినంత ఆహారం తీసుకోకపోతే... గ్యాస్‌ సమస్యలు తప్పవు. బరువూ పెరుగుతారు. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. రక్తహీనత సమస్యా ఎదురవుతుంది.
* అమ్మాయిలు చిప్స్‌, ప్రాసెస్‌ చేసిన పదార్థాలు, మసాలా ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటం మామూలే. వాటివల్ల శరీరానికి కావలసిన పోషకాలేవీ అందవు. అదనంగా కెలొరీలు చేరతాయి. బరువు పెరిగేకొద్దీ నెలసరిలో తేడా మొదలవుతుంది. పీసీఓడీ సమస్యా బాధించొచ్చు.
* తిండి మానేస్తే సన్నగా మారిపోతామనుకుంటారు అమ్మాయిలు. సరిగ్గా తినక సన్నగా మారినా... అనారోగ్యకరంగా, పేలవంగా కనిపిస్తారు. వాటికి హార్మోన్ల మార్పులూ తోడవుతాయి.

మరేం తినాలి...
            ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, నట్స్‌, గుడ్లు... వంటి అన్ని రకాల పోషకాలు అందే సమతులాహారం  ఎంచుకోవాలి. పాలు, పాల పదార్థాలు తప్పనిసరి.  ఉదయం: నిద్రలేచిన గంటలోపు నూనె తక్కువగా ఉండే ఇడ్లీ, ఉప్మా, ఓట్స్‌ వంటివాటిల్లో ఏదో ఒకటి తినాలి.    రెండు ఖర్జూరాలు, ఓ పండు, గ్లాసు పాలూ తీసుకోవచ్చు. మధ్యాహ్నం: భోజనంలో రెండు కప్పుల అన్నం లేదా మూడు రోటీలు తీసుకోవచ్చు. దీనిలోకి పప్పూ, చికెన్‌, గుడ్డు, పనీర్‌... ఇలా ఏదో ఒకటి ఉండేలా చూసుకోవాలి.  ఓ కప్పు కూరగాయల సలాడ్‌ తప్పనిసరి.

      సాయంత్రం: తేలిగ్గా జీర్ణమయ్యే చిరుతిళ్లు ఏవైనా సాయంత్రం నాలుగు-ఐదు గంటల మధ్య తినాలి. మొలకల చాట్‌, సూప్‌, శాండ్‌విచ్‌, డోక్లా, వెజిటబుల్‌ ఫ్రాంకీ... ఇలా ఏవైనా తినొచ్చు.
           రాత్రి: భోజనంలో రెండు చపాతీలు, లేదా రెండు జొన్న రొట్టెలు, రాగిదోశవంటివి తీసుకోవచ్చు. పడుకునే ముందు కప్పు పాలు తాగితే మంచిది.
ఈ పోషకాలు అవసరం
         ఇనుము: ఈ వయసులోనే వారికి రుతుచక్రం మొదలవుతుంది. నెలసరి వల్ల రక్తహీనత ఎదురుకాకుండా ఉండాలంటే... ఈ పోషకం తప్పనిసరిగా అందాలి. చేపలు, కాలేయం వంటివాటితో పాటు సజ్జలు, రాగులు, ఆకుకూరలు, సెనగలు, ఉలవలు, పల్లీలు, నువ్వులు, కాయగూరలు, పండ్ల నుంచి ఇనుము అధికమోతాదులో లభిస్తుంది.
         క్యాల్షియం: ఇనుము తరువాత ఎక్కువగా అవసరమయ్యే ఖనిజం క్యాల్షియం. దీన్ని తగినంతగా తీసుకోకపోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. వయసుపెరిగేకొద్దీ కీళ్లనొప్పులు రాకుండా ఉండాలంటే... పాలు, పనీర్‌ వంటివి తీసుకోవాలి. అవి ఇష్టపడనివారు పెరుగు తినొచ్చు. వీటితో పాటు తాజా ఆకుకూరలు, నువ్వులు, రాగులు, రాజ్మా, వేరుసెనగ పప్పు, పప్పుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
         మేలు చేసే కొవ్వులు: చాలామంది కొవ్వు పదార్థాల్ని హానికరం అనుకుంటారు. వీటిల్లోనూ శరీరానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. బీఎంఐ 18 కంటే తక్కువ ఉన్న అమ్మాయిల్లో నెలసరి క్రమంగా రాకపోవడానికి కొవ్వుల లోపం కారణమైతే... స్థూలకాయుల్లో ఇవి ఎక్కువ కావడం మరో కారణం. వీటిని తగిన మోతాదులో తీసుకోవాలి. ఈ పోషకం సరిగ్గా ఉంటేనే ఎ, డి, ఇ, కె విటమిన్లను శరీరం స్వీకరిస్తుంది. రోజులో కనీసం 35 నుంచి 40 మి.లీ. నూనె తీసుకోవచ్చు. వేరుసెనగ, బాదం, పిస్తా, వాల్‌నట్లు, నువ్వులు వంటివాటి నుంచి మేలుచేసే కొవ్వులు అందేలా చూసుకోవాలి.

5, ఆగస్టు 2019, సోమవారం

28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు..


              జూన్‌ 2, 2014కి ముందు 28గా ఉన్న రాష్ట్రాల సంఖ్య తెలంగాణ ఏర్పాటుతో 29కి చేరింది. ఇప్పుడు ఆ సంఖ్య మళ్లీ 28కి చేరింది. జమ్ముకశ్మీర్‌ను విభజిస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రాల సంఖ్య తగ్గి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య పెరిగింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈరోజు రాజ్యసభలో ప్రకటించారు. జమ్ము-కశ్మీర్‌ చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లఢఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు కానున్నాయి. రెండు ప్రాంతాలకు ప్రత్యేక లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఉండనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రాల సంఖ్య 28కి చేరగా.. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది.
            ఇప్పటివరకు కశ్మీర్‌లో 22 జిల్లాలు ఉండేవి. వాటిని జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌ రీజియన్లుగా వ్యవహరించేవారు. కాగా, జమ్ములో 10 జిల్లాలు, కశ్మీర్‌లో 10, లద్దాఖ్‌లో రెండు జిల్లాలు ఉండేవి. తాజా కేంద్రం నిర్ణయంతో లెహ్‌, కార్గిల్‌ జిల్లాలతో కూడిన లఢఖ్ రీజియన్‌ చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. పది జిల్లాలతో కూడిన కశ్మీర్‌ను మరో పది జిల్లాలతో కూడిన జమ్ముతో కలిపి చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేశారు.
జమ్ముకశ్మీర్‌ పునర్విభజన బిల్లును ఈరోజు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రేపు లోక్‌సభ ఆమోదానికి రానుంది. అలాగే వీటితో పాటు అధికరణ 370ని కేంద్ర రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

జమ్ముకశ్మీర్‌ విభజనబిల్లుకు రాజ్యసభ ఆమోదం
 జమ్ముకశ్మీర్‌ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ బిల్లును ఈ రోజు ఉదయం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ జరిగింది. హోంమంత్రి వివరణ అనంతరం ఓటింగ్‌ నిర్వహించగా.. స్వల్ప సాంకేతిక సమస్య రావడంతో స్లిప్పులతో ఓటింగ్‌ చేపట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదావేశారు. ఈ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది.