13, జనవరి 2021, బుధవారం

ఎపి లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం అవాస్తవం : డిజిపి గౌతం సవాంగ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, సత్యదూరం అని ఎపి డిజిపి గౌతం సవాంగ్‌ ఐపిఎస్‌ స్పష్టం చేశారు. బుధవారం గౌతం సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తుందన్నారు. దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఎపి లో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని తెలిపారు. తమ రాష్ట్రంలో కూడా ఈ భద్రతా ప్రమాణాలను అమలుపరచడానికి సాధ్యాసాధ్యాలను అధికారులతో పలు రాష్ట్రాల ప్రతినిధుల బృందం చర్చించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ లో గత సెప్టెంబరు 5 వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్‌ తో అనుసంధానం చేశామన్నారు. 43,824 సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను ఎపి లోని అన్ని ఆలయాలకు కల్పిస్తున్నామని డిజిపి గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతోపాటు 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను, ముఠాలను అరెస్ట్‌ చేశామన్నారు. గత సంవత్సరం (2020) సెప్టెంబర్‌ 5 అనంతరం దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్‌ కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్‌ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23256 గ్రామ రక్షణ దళాలకు గాను, 15394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తామని డిజిపి ప్రకటించారు.

    కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని అన్నారు. అలా ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నామని డిజిపి తెలిపారు. ఎపి రాష్ట్రం మత సామరస్యానికి ఒక ప్రతీక దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని హితవు పలికారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు లో ఉన్న అన్ని కేసుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతోపాటు సిట్‌ ను ఏర్పాటు చేశామని తెలిపారు. తరచుగా ఈ రకమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయలలో నేరాలకు సంబంధించిన 4895 మంది ఎంఒ అఫెండర్స్‌ ను ఇప్పటికే గుర్తించామని, వారందరినీ జియో మ్యాపింగ్‌ తో అనుసంధానం చేశామని చెప్పారు. వీరిపై నిరంతర నిఘాను కొనసాగించడంతోపాటు అవసరమైన వారిపై సస్పెక్ట్‌ షీట్స్‌ ను ఓపెన్‌ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఎపి లో దేవాలయాలకు, పవిత్ర స్థలాలకు పటిష్టమైన భద్రతను ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ కల్పిస్తోందని స్పష్టం చేశారు. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిది అని, అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డిజిపి కోరారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ 100 కి, దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా 9392903400 నెంబర్‌ కు సమాచారం ఇవ్వాలని డిజిపి గౌతం సవాంగ్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ ఎల్లవేళలా నిరంతరం ప్రజలుకు అందుబాటులో ఉంటుందని డిజిపి పేర్కొన్నారు.

మోడీ విధానాలు .. ప్రజాస్వామ్యానికి ముప్పు : జర్నలిస్ట్‌ పి. సాయినాథ్‌

చంఢీఘర్ ‌ : ఒక్కో రంగాన్ని దశలవారీగా ధ్వసం చేసే మోడీ ప్రభుత్వ విధానంతో.. ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, రైతుల పోరాటం .. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధానంగా ఉధ్భవించిందని ప్రముఖ జర్నలిస్ట్‌ పి. సాయినాథ్‌ అన్నారు. జనవరి 26 రిపబ్లిక్‌ డే సందర్భంగా రైతులు పిలుపునిచ్చిన ట్రాక్టర్‌ ర్యాలీని అభినందించారు. ఈ ఉద్యమంతో దేశంలోని రైతులు తాము కోల్పోయిన ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. చంఢఘీర్‌లో రైతుల తిరుగుబాటుపై ఆయన ప్రసంగిస్తూ..రిపబ్లిక్‌ డే రోజున రైతులు చేపడుతున్న ట్రాక్టర్‌ ర్యాలీ చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఇది ప్రజల పరేడ్‌ అని, ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించాలని అన్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేయాలన్న మోడీ ప్రభుత్వ ప్రతి వ్యూహాన్ని ధైర్యంగా తిప్పి కొట్టారని అన్నారు. కార్పోరేట్‌ మీడియా, పోలీసుల దాడి ఇలా ప్రతి వ్యూహాన్ని ఎదుర్కొన్నారని అన్నారు. ప్రధాని దూకుడుగా దాడి చేస్తున్నారని, ఒకదాని తర్వాత మరోకటి రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నిస్తూనే ఉన్నారని అన్నారు. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు ప్రాంతీయ, మత, కులాల పరంగా విభజనలు సృష్టించడం (ఖలిస్తానీయులని), పోలీసులను ప్రయోగించడం, ఇందులో కొందరు మేథావులు కూడా పాల్గొన్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం తప్పుడు మార్గంలో ప్రయాణిస్తోందని అన్నారు. వలస పాలకులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలకు ఇప్పుడు రైతులు చేపడుతున్న ఉద్యమానికి చాలా పోలీకలు ఉన్నాయని, చరిత్ర విద్యార్థిని గనుక తాను స్పష్టం చేయగలుగుతున్నానని అన్నారు. అప్పుడు కూడా చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే అశాభావంతో ఉన్నానని అన్నారు. గత మూడేళ్లలో దేశంలోని మధ్యతరగతి ప్రజలు రైతుల పట్ల సానుభూతి చూపుతున్నారని, గతంలో అలా జరగలేదని అన్నారు. ఈ సందర్భంగా కార్పోరేట్‌ మీడియా తీరును కూడా ఎండగట్టారు. దేశంలోని అతిపెద్ద కార్పోరేట్‌ మీడియాలకు ఈ చట్టాలతో భారీ ప్రయోజనాలు చేకూరుతాయని, దీంతో మీడియాలో అధిక భాగం వారి యజమానుల ప్రయోజనాలకు విరుద్ధమైన వైఖరిని తీసుకోలేరని అన్నారు.