9, డిసెంబర్ 2017, శనివారం

వింత ఆచారం

Pregnent Womens Village Expulsion  in Madakashira - Sakshi
మడకశిరలో వింత ఆచారం
బాలింతలు, బహిష్టు మహిళలకు గ్రామ బహిష్కరణ
ఊరి బయట గుడిసెల్లో అవస్థలు
ఆచరిస్తున్న యాదవ(గొల్ల)     సామాజిక వర్గం
తరాలు మారినా రాత మారని అమ్మ
చైతన్యం కల్పించే విషయంలో మీనమేషాలు
            ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం   అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 334 గ్రామాలు ఉండగా.. 50 గ్రామాల్లో యాదవ కుల సామాజిక వర్గీయులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం కరువుకు పుట్టినిల్లు. అయితే రాజకీయ చైతన్యం ఉంది. నియోజకవర్గం ఆంధ్రలో భాగమైనా అధికంగా కర్ణాటక సంస్కృతి కనిపిస్తుంది. 70 శాతం ప్రజలు కన్నడ మాట్లాడతారు. మడకశిర నియోజకవర్గంలోనే కాకుండా సమీప కర్ణాటక ప్రాంతాలైన చిత్రదుర్గం, తుమకూరు, కోలార్‌ జిల్లాలోనూ మూఢాచారం పాతుకుపోయింది. మొత్తంగా 90 శాతం కుటుంబాలు ఈ కులాచారాన్ని కొనసాగిస్తున్నాయి. మడకశిరతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అయినప్పటికీ ఎవరూ వీరిలో చైతన్యం తీసుకురాకపోవడం గమనార్హం. హట్టిగొల్ల సామాజిక వర్గంలో మహిళలను ప్రసవానంతరం మూడు నెలల పాటు గ్రామబహిష్కరణ చేస్తారు. పసికూన సహా తల్లిని గ్రామానికి దూరంగా ఉంచుతారు. బాలింతకు కుటుంబ సభ్యులు తొమ్మిది రోజులు మాత్రమే భోజనం అందిస్తారు. ఆ తర్వాత వంట సామగ్రి అందిస్తే.. 51 రోజులు పాటు బాలింత స్వయంపాకం చేసుకోవాల్సిందే. కుండపోత వర్షం కురిసినా, ఎముకలు కొరికే చలిలోనూ వీరి అవస్థలు వర్ణనాతీతం.
గొడుగు గుడిసే దిక్కు..గ్రామ బహిష్కరణ తర్వాత బాలింత నివసించే గుడిసె ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది. విస్తీర్ణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. గుడిసెలో లేవాలన్నా.. నిల్చోవాలన్నా కష్టమే. లోపలికి వెళ్లాలంటే పూర్తిగా వంగి అడుగు వేయాల్సిందే. లోపల ఒక మనిషి ఉండేందుకు కూడా  ఇబ్బంది.
రాజకీయ చైతన్యం సరే..
నియోజకవర్గంలోని యాదవ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం అధికంగా ఉంది. అయినా మూఢాచారాలు పాటిస్తున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. రాష్ట్ర కాంగ్రెస్‌కు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. ప్రస్తుతం అసెంబ్లీ బీసీ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఇలా ఈ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం ఉన్నా మూఢాచారాలు రూపుమాపడానికి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. ఓ దశలో సామాజిక వర్గానికి చెందిన నేతలే మూఢాచారాలను ప్రోత్సహిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
పట్టించుకోని స్వచ్ఛంద సంస్థలు..
సమర్థించుకుంటున్న కుల పెద్దలు నియోజకవర్గంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మైరాడా, ఆర్డీటీ, ఫోర్డు తదితర స్వచ్ఛంద సంస్థలు పనిస్తున్నాయి. మైరాడా స్వచ్ఛంద సంస్థకు రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నా.. మూఢాచారాలను రూపుమాపడానికి చొరవ చూపలేకపోయింది. మూఢాచారాన్ని కొందరు కులపెద్దలు సమర్థించుకుంటున్నారు. తమ కులానికి చెందిన వారు కష్టజీవులనేది కులపెద్దల వాదన. ఈ సామాజికవర్గంలోని విద్యావంతుల కుటుంబాలు కులాచారానికి దూరంగా ఉంటున్నాయి.
పట్టించుకోని మహిళా శిశు సంక్షేమ శాఖ
మూఢాచారాలతో ఎక్కువగా మహిళలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మూఢాచారాలను రూపుమాపడానికి మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంత వరకు ఎక్కడా ఈ శాఖ అధికారులు కులాచారాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోని పరిస్థితి. ఈ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 438 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయినా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాల్లేవు.
బహిష్టు అయినా బహిష్కరణే !
ఈ సామాజిక వర్గానికి చెందిన మహిళలు బహిష్టు అయినా మూడు రోజుల పాటు నివాసం నుంచి బయటకు పంపుతారు. బాలింతలకు ఉండటానికి కనీసం చిన్న గుడిసె అయినా ఉంటుంది. బహిష్టు అయిన మహిళలకు ఉండటానికి ఎలాంటి సౌకర్యం ఉండదు. మూడు రోజుల పాటు బయటి ప్రదేశంలో ఎండనక, వాననక దుర్భరంగా గడపాల్సిందే. ఈ మహిళలను మూడు రోజుల తర్వాత ఇంటి ఎదుట మరో రెండు రోజులు ఉంచుకుని 5వ రోజు ఇంట్లోకి ఆహ్వానించే మూఢాచారం కొనసాగుతోంది. ప్రతి గొల్లహట్టిలో కూడా ఆ రోజుల్లో కమ్యూనిటీ భవనాలను నిర్మించారు. గ్రామ బహిష్కారానికి గురైన బాలింతలు, బహిష్టు మహిళలను ఈ కమ్యూనిటీ భవనంలో ఉంచాలని వీటిని నిర్మించారు. ఇలాంటి కమ్యూనిటీ భవనాలు నియోజకవర్గంలోని గొల్లహట్టిల్లో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి.

నారా వారి నికర ఆస్తులు 75 కోట్లే!

 

Nara's net assets is 75 crores! - Sakshi
     కుటుంబ ఆస్తులను ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌
     ఆస్తులు రూ.142.34 కోట్లు.. అప్పులు రూ.67.26 కోట్లు
     హెరిటేజ్‌ మాకు ప్రధాన ఆదాయ వనరు
     మార్కెట్‌ విలువ కాదు, కొన్నప్పటి విలువే లెక్కించాం
                      ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా తమ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.75.06 కోట్లు మాత్రమేనని ఆయన కుమారుడు, ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. తన తండ్రి, తల్లి, భార్య, కుమారుడికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.142.34 కోట్లుకాగా, అప్పులు రూ.67.26 కోట్లు ఉన్నాయని తెలిపారు. తమ కుటుంబ ఆస్తుల వివరాలను లోకేశ్‌ 2017 డిసెంబర్ 8న ఎపి రాజధాని అమరావతి ఉండవల్లిలోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన తండ్రి చంద్రబాబు ఆస్తుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తమ కుటుంబానికి ఆదాయం హెరిటేజ్‌ సంస్థ ద్వారానే వస్తోందని, దాని టర్నోవర్‌ రూ.2,600 కోట్లకు చేరుకుందని వివరించారు.
తాము కొనుగోలు చేసినప్పటి విలువ ప్రకారం ఆస్తులను మదించామని, మార్కెట్‌ ధర ప్రకారం వాటి విలువ మారుతూ ఉంటుందని అన్నారు. తన తండ్రి చంద్రబాబు పేరుతో రూ.8.17 కోట్ల ఆస్తులుండగా, 5.64 కోట్ల అప్పులున్నాయని తెలిపారు. తన తల్లి భువనేశ్వరి పేరుతో రూ.46.31 కోట్ల విలువైన ఆస్తులుండగా, రూ.20.90 కోట్ల అప్పులున్నాయని, తన పేరుతో రూ.26.39 కోట్ల ఆస్తులు, రూ.11.17 కోట్ల అప్పులున్నాయని లోకేశ్‌ వెల్లడించారు. తన భార్య బ్రాహ్మణి పేరుతో రూ.15.37 కోట్ల ఆస్తులు, రూ.36 లక్షల అప్పులు, కుమారుడు దేవాన్ష్ పేరుతో రూ.11.54 కోట్ల ఆస్తులున్నాయన్నారు. తమ కుటుంబ సంస్థ నిర్వాణ హోల్డింగ్స్‌ కంపెనీ పేరుతో రూ.34.56 కోట్ల ఆస్తులు, రూ.29.19 కోట్ల అప్పులున్నాయని తెలిపారు. 
                                                         వారసుడిగా అవకాశం వచ్చింది నిజమే  
                       హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కొత్తగా నిర్మించిన ఇంటికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి తన తండ్రి, తాను ఉమ్మడిగా రుణం తీసుకున్నట్లు లోకేశ్‌ విడుదల చేసిన పత్రాల్లో చూపారు. అదే రుణాన్ని రెండుచోట్లా అప్పులుగా చూపడం గమనార్హం. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా తమలాగే స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించాలని లోకేశ్‌ అన్నారు. ఏడేళ్లుగా తాము ఆస్తులు ప్రకటిస్తున్నామని, తమపై విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడైనా ఆస్తులు ప్రకటించారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో తామే ప్రతిపక్షంగా వ్యవహరించామని, రాష్ట్రంలో ప్రతిపక్షం లేనేలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారని, అసెంబ్లీలో పోలవరం సహా అన్ని అంశాలపైనా చర్చించామని చెప్పారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా అఖిలపక్షం అంటూ డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. వారసుడిగా తనకు అవకాశం వచ్చిన మాట నిజమేనని, కానీ ప్రజామోదం ఉండి, సమర్థంగా పనిచేస్తేనే నిలబడగలమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక ప్యాకేజీ ఏపీ హక్కు అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అసలు ఏమీ చేయడం లేదనేది సరికాదన్నారు. కే?ంద్ర, రాష్ట్రాల మధ్య, టీడీపీ–బీజేపీ మధ్య ఎటువంటి గ్యాప్‌ లేదని తేల్చిచెప్పారు. 

8, అక్టోబర్ 2017, ఆదివారం

నడక వలన నడుంనొప్పికి ఉపశమనం

                
నడుం నొప్పి అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్యే కాదు. దీర్ఘకాల సమస్య కూడా! ఈ నొప్పికి తాత్కాలిక ఉపశమనంగా మందులు వాడడం కన్నా నడక మంచిది అంటున్నారు అమెరికా పరిశోధకులు. దీర్ఘకాలంగా వేధిస్తున్న నడుంనొప్పికి మాత్రమే నడక పనిచేస్తుంది తప్ప తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే నొప్పికి ఇది పనిచేయదని వారు చెబుతున్నారు. సుమారు లక్షన్నర మంది మీద వారు అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరు దీర్ఘకాలంగా నడుంనొప్పితో బాధపడుతుండగా, మరికొందరు తాత్కాలిక నొప్పితో బాధపడుతున్నారు. కొందరికి ఎలాంటి సమస్యా లేదు. వీరందరిని ప్రతిరోజూ అరగంట పాటు నడవమన్నారు. కొంత కాలం తరువాత వీరి నడుంనొప్పిని పరిశీలించారు. దీర్ఘకాలంగా నడుంనొప్పితో బాధపడుతున్న వారిలో పదహారు శాతం మంది నడుంనొప్పి నుంచి ఉపశమనం పొందిన విషయం వీరి దృష్టికి వచ్చింది. తాత్కాలిక నడుంనొప్పితో బాధపడుతున్న వారిలో ఈ లక్షణాలను వీరు గుర్తించలేదు.  నడక వలన నడుంనొప్పి తగ్గడానికి గల కారణాలను వీరు విశ్లేషించారు. ఎలాంటి వ్యాయామం చేయని వారిలో అధికబరువు సమస్యల తలెత్తుతుందనీ, ఇదే నడుంనొప్పి, వీపు నొప్పికి కారణం అని వారు అభిప్రాయపడుతున్నారు.