27, డిసెంబర్ 2017, బుధవారం

లిస్బన్‌, అమరావతి : రెండు నగరాల కథ




            ప్రముఖ ఆంగ్ల రచయిత చార్లెస్‌ డికెన్స్‌ రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల 'ఏ టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌'- రెండు నగరాల కథ. 1789 మే ఐదున ప్రారంభమై 1799 నవంబర్‌ 9న రాచరిక వ్యవస్థ కూల్చివేతతో ముగిసిన ఫ్రెంచ్‌ విప్లవం నేపథ్యం, విప్లవానికి ముందు, తర్వాత ప్యారిస్‌, లండన్‌ నగరాల్లో చోటు చేసుకున్న మార్పులు ఈ నవల ప్రధాన ఇతివృత్తం. పోర్చుగీస్‌ నావికుడు వాస్కోడిగామా మన దేశానికి సముద్ర మార్గాన్ని స్థిరీకరించిన అనంతరం వలస రాజ్యాల నుంచి దోచుకున్న సంపదతో లండన్‌, ప్యారిస్‌, లిస్బన్‌ వంటి యూరోపియన్‌ నగరాలు సుపంపన్నం అవుతున్న కాలం అది. రాచరిక వ్యవస్థ కూల్చివేత తర్వాత సమాజంలో మంచి మార్పులు వచ్చి సామాన్యుల స్థితిగతులు మెరుగవుతాయని ఆశించి భంగపడిన మేధావుల్లో చార్లెస్‌ డికెన్స్‌ ఒకరు. ఆయన తన ఆవేదనను రెండు నగరాల కథలో 'సమాజం స్వార్థపూరితంగా, యాంత్రికంగా మారింది. దానిని నియంత్రించే శక్తి సామాన్యులకు లేదు. మిల్లులో నలిగిన ధాన్యాల నుంచి వచ్చే వ్యర్థాలుగా వారు మారారు. విప్లవాలు కూడా సామాన్యులకు ఏమీ చేయలేకపోయా యనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?' అంటారు. నిజానికి ఆనాటి పరిస్థితికి నేటికి పెద్దగా ఏమీ మార్పు రాలేదు. నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా సామాన్యులకు ఒనగూరుతున్న దేమీ లేదు.
              ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయిన తర్వాత ఎన్నో ఆశలతో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టారు. రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఇచ్చారని, ఆ లోటు తీర్చేందుకు తాను రేయింబవళ్లు కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో రాజధానిని నిర్మిస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక ఎక్కువ కాలం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే గడిపారు. ఈ నేపథ్యంలో 'ఓటుకు నోటు కేసు' మీద పడడంతో ఆగమేఘాల మీద అమరావతికి తరలి వచ్చారు. అప్పటి నుంచి అమరావతి ప్రహసనం ప్రారంభమైంది. రాజధాని నిర్మాణం పేరుతో దేశ దేశాలు పట్టి తిరగడం, విదేశీ ప్రతినిధులను ఆహ్వానించడం, డిజైన్లు తయారు చేయించడం, తిరస్కరిం చడం నిత్యకృత్యంగా మారింది. అమరావతిని ఎంపిక చేసి ఒక్క శాశ్వత కట్టడమైనా కట్టకుండా తాత్కాలిక భవనాల పేరిట వందలాది కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు.
                చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలు తిరుగుతూ ఏ నగరానికి వెళితే ఆ నగరంలాగా అమరావతిని తీర్చిదిద్దుతానని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. కనీస పౌర సదుపాయాలు లేని నగరాలను కూడా గొప్పగా పొగిడే ముఖ్యమంత్రి దృష్టిలో పోర్చుగీస్‌ రాజధాని లిస్బన్‌ నగరం పడలేదు. ప్రపంచ మేటి నగరాల్లో 29వ స్థానంలో ఉన్న ఈ నగరం 1775లో భూకంపం, సునామీ, అగ్ని ప్రమాదాల కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. శిధిలాల మయంగా మారిన లిస్బన్‌ నగరాన్ని కేవలం ఐదేళ్ళలో అంటే 1780వ సంవత్సరానికల్లా అద్భుత నగరంగా పునర్‌నిర్మించారు. ఏడు కొండల మధ్యలో సుమారు 25 వేల ఎకరాల విస్తీర్ణంలో 237 సంవత్సరాల క్రితం ఈ నగరాన్ని భారీ భూకంపాలను కూడా తట్టుకునే విధంగా కట్టారు. ఆనాడు నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరకపోవడం, నేటికీ సుమారు ఐదు లక్షల మంది ప్రజల ఆవాస అవసరాలు తీర్చుతుండడం గొప్ప విశేషం.
1775వ సంవత్సరం నవంబర్‌ ఒకటో తేదీన లిస్బన్‌ వాసులు 'ఆల్‌ సెయింట్స్‌ డే' ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9.40 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలు మీద సుమారు 8.5 నుంచి 9 పాయింట్ల మాగ్నిట్యూడ్‌ తీవ్రత గల భూకంపం సంభవించింది. నగరం మొత్తం నేలమట్టమైంది. వేలాది మంది అక్కడికక్కడే చనిపోయారు. వందలాది మంది ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్ర తీరానికి చేరుకున్నారు. అయితే భూకంపం వచ్చిన 50 నిముషాలలోపే సునామీ అలలు రావడంతో తీర ప్రాంతంలో తలదాచుకున్న వారిలో అత్యధికులు ప్రాణాలు కోల్పోయారు. 'ఆల్‌ సెయింట్స్‌ డే' ప్రార్థనల కోసం ఇళ్ళలోను, చర్చిలలోనూ వెలిగించిన కొవ్వొత్తుల కారణంగా నగరమంతటా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒకేసారి వచ్చిన ఈ మూడు ఉపద్రవాలతో లిస్బన్‌ నగరం నామరూపాలు లేకుండా పోయింది. వాస్కోడిగామా తన సముద్రయాన అనుభవాలను పొందుపరిచిన పత్రాలతో సహా విలువైన కళాఖండాలు, గ్రంథాలు, పెయింటింగ్స్‌ సమస్తం కాలిపోయాయి.
             నిరాశ్రయులైన పోర్చుగల్‌ రాజు జోసెఫ్‌-1, అతని కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడానికి పొరుగునే ఉన్న స్పెయిన్‌ అంగీకరించింది. అయితే జోసెఫ్‌-1 శిధిల నగరం మధ్యలో ఉన్న కొండపై టెంట్‌లు వేయించి అక్కడి నుంచే పాలన సాగించాడు. విధ్వంసం జరిగిన నెలలోగానే అంటే 1775 డిసెంబర్‌ నాలుగో తేదీన రాజాస్థాన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మాన్యూల్‌ డ మైయ నగర నిర్మాణానికి చక్కటి ప్రణాళిక తయారు చేశారు. వేరే ప్రాంతంలో నగరాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. శిధిలాల్లో పనికి వచ్చే రాళ్ళు, కలప, ఇనుము ఇతర సామాగ్రి ఒకచోట చేర్చి పునర్‌నిర్మాణ పని ప్రారంభించారు. తిరిగి నిర్మించే నగరంలో విశాలమైన స్క్వేర్‌లు, వెడల్పాటి రహదారులు, బ్రిడ్జిలు, అద్భుతమైన భవంతులు, గృహ సముదాయాలకు సంబంధించిన ప్రణాళిక లను నెల రోజుల లోపులోనే రూపొందించడం విశేషం. శిధిలా లను తొలగించడానికి సుమారు ఏడాది కాలం పట్టింది. కేవలం నాలుగేళ్ళలో లిస్బన్‌ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలి గారు. నగర పునర్‌నిర్మాణా నికి ముందు పోర్చుగీస్‌ ప్రధాన మంత్రి సెబాస్టియో డి మెలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 'భూకంపం సృష్టించిన విధ్వంసం చూసి దిగులు చెందవద్దు. భూకంపం కారణంగా వచ్చిన కొత్త నీటి ఊటలు చూసి ఆనంద పడదాం. ఈ విధ్వంసం మన మేధో శక్తికి, శక్తి సామర్థ్యాలకు, ఐక్యకతు సవాల్‌ విసిరింది. పోర్చుగీస్‌ వాసుల సత్తాను మరోసారి ప్రపంచానికి చాటడానికి ఇది మంచి అవకాశం' అన్నారు. నిజానికి పోర్చుగీస్‌ చాలా చిన్న దేశమే అయినప్ప టికి శక్తివంతమైన నావికాదళం ఉండేది. పోర్చుగీస్‌ నావికుడు వాస్కోడిగామా నౌకా మార్గం ద్వారా ఇండియా వచ్చి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల మొదట లబ్ధిపొందిన యూరోపియన్‌ దేశం పోర్చుగీస్‌.
              విధ్వంసం తర్వాత పోర్చుగీస్‌ వాసులు ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి తమ సత్తా చాటారు. నిజానికి నాడు పోర్చుగీస్‌ వాసుల ఇబ్బందులతో పోల్చితే ప్రస్తుతం మన రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తక్కువే. అయినా మన పాలకులు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనలు వేసి మూడేళ్లు కావస్తున్నా ఇంకా డిజైన్లు కూడా ఖరారు చేయలేకపోయారు. నాటి పోర్చుగీస్‌ పాలకులు తమ ప్రజలతో పాటు గుడారాలలో నివసించారు. నేటి మన పాలకులు విలాసవంతమైన భవనాల్లో నివశించడానికే మోజు పడుతున్నారు. లిస్బన్‌లో విధ్వంసం జరిగిన ఏడాదిలోగానే నగర నిర్మాణానికి ప్లాన్‌లు సిద్ధం చేస్తే, ఇక్కడ మాత్రం అవి ఇంకా డ్రాయింగ్‌ బోర్డులపైనే ఉన్నాయి. లిస్బన్‌లో ప్రతి రాయినీ తిరిగి ఉపయోగించడానికి ప్రయత్నించగా ఇక్కడ ప్రతి పైసానూ తమ స్వార్థ ప్రయోజనాలు, ప్రచారం కోసం వాడుతున్నారు.
            237 సంవత్సరాల క్రితం నిర్మించిన లిస్బన్‌ భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉంటే అమరావతిలో వందలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన తాత్కాలిక భవనాలు బీటలు వారుతున్నాయి. లిస్బన్‌లోని ప్రతి అంగుళం భూమిని ప్రజల కోసం ఉపయోగిస్తే నేడు మన పాలకులు అమరావతిలోని వందలాది ఎకరాలు విదేశీ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. నాటి లిస్బన్‌ నగర నిర్మాణం త్యాగాలకు, సమష్టి కృషికి, ప్రతిభా పాటవాలకు నిదర్శనంగా నిలబడగా నేటి అమరావతి స్వార్థ ప్రయోజనాలకు, సంకుచిత అలోచనలకు, మిడిమిడి జ్ఞానాలకు, ఏకపక్ష నిర్ణయాలకు కొలువుగా మారింది. ప్రతి పనికి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే అమరావతి 'భ్రమరావతి'గానే మిగిలిపోతుంది.

- వివిఆర్‌ కృష్ణంరాజు ( రచయిత ఎపి ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు,
సెల్‌ : 9505292299 )

26, డిసెంబర్ 2017, మంగళవారం

ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువతి


            అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం సృష్టి ధర్మం. మరి అమ్మాయే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ యువతి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ముగ్గురమ్మాయిలను వివాహం చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపుతోంది. పులివెందులలో పెళ్లి పేరుతో ఓ యువతి ఆడిన నాటకం  2017 డిసెంబర్ 26న వెలుగుచూసింది. మగాడిలా వేషం మార్చుకుని మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. మగాడి వేషంలో మౌనిక అనే యువతితో పరిచయం పెంచుకున్న రమాదేవి ఆమెను వివాహం చేసుకుంది. రమాదేవి మోసాన్ని గుర్తించిన మౌనిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
               పోలీసులు విచారణ జరపగా మోసం బయటపడింది. పులివెందులలో ఓ కాటన్ మిల్లులో పని చేస్తున్న రమాదేవి, అదే మిల్లులో పనిచేస్తున్న మౌనికతో పరిచయం పెంచుకుంది. అది పెళ్లి వరకు దారి తీసింది. పెళ్లై రెండు నెలలు అవుతున్నా మౌనిక పుట్టింట్లోనే ఉంది. తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పలేదు. అయితే రమాదేవి స్వయంగా మౌనిక ఇంటికి వెళ్లి అసలు విషయం చెప్పింది. మొత్తం తెలుసుకున్న మౌనిక కుటుంబసభ్యులు జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. మౌనిక కంటే ముందే రమాదేవి మరో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెళ్లి కంటే ముందే బాధితులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సెటిల్ చేసుకున్నట్లు తెలియవచ్చింది. మూడు పెళ్లిళ్ల మాట నిజమే అని ఆమె స్వయంగా రమాదేవి ఒప్పుకుంది. రమాదేవికి ఊహ తెలిసినప్పటినుంచి మగాడిలా ఉండడమంటే ఇష్టమట. అసలు కాటన్ మిల్లులో పనికి కూడా మగాడులానే చేరింది. చుట్టుపక్కల ఉన్నవారు ఆమెలో తేడా గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు ఈ విషయంపై స్పందించిన మౌనిక... రమాదేవి తనకు 2సార్లు కూల్ డ్రింక్‌లో, ఓసారి పెరుగన్నంలో మత్తుమందు కలిపి ఇచ్చిందని తెలిపింది. పెళ్లి మాత్రం కాలేదని చెబుతోంది. పూర్తి స్థాయి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

25, డిసెంబర్ 2017, సోమవారం

చుక్కల్లో ధనవంతుడు.. పాతాళంలో పేదవాడు!

Major difference between Rich and poor people assets in India - Sakshi
భారత్‌ సాధించిన ఆర్థిక పురోగతి ఇదే
               అమెరికా, చైనా దేశాల తర్వాత భారత దేశం ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా బలపడుతోంది. గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో సరాసరి ఏడు శాతం ఆర్థిక వృద్ధిరేటును సాధించడమే అందుకు కారణం. దీన్ని మనకు ఆర్థిక నిపుణులు గొప్పగా చెబుతారు. మన నాయకులు కూడా తమ విజయంగా ఈ విషయాన్నే వల్లె వేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. భారత్‌ మూడవ బలమైన ఆర్థిక శక్తిగా బలపడిందంటే కొనుగోలు శక్తిలో మాత్రమే. దీన్ని కూడా గర్వించతగ్గ పరిణామంగానే పరిణమించినా ప్రపంచంలోనే ప్రజల మధ్య ధనిక, పేద వ్యత్యాసాల్లో రష్యా తర్వాత స్థానాన్ని భారతదేశం ఆక్రమించి ఉందన్న అపకీర్తిని ఎలా జీర్ణించుకోవాలి?
            క్రెడిట్‌ సూస్స్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అంచనాల ప్రకారం భారత దేశంలోని 60 శాతం ఆస్తి కేవలం ఒక్క శాతం ప్రజల వద్దనే పేరుకుపోయింది. అదే రష్యాలోనైతే 74 శాతం ఆస్తి కేవలం ఒక్క శాతం ప్రజల వద్దనే పేరుకుపోయింది. ఇక 80 శాతం భారత్‌ ఆస్తి 10 శాతం ప్రజల వద్దనే పోగుబడిపోయింది. మన జాతీయ స్థూల ఉత్పత్తి తలసరి సరాసరి సగటు 1990 నుంచి ఇప్పటివరకు ఆరు రెట్లు పెరిగింది. అంటే, 1,130 డాలర్ల నుంచి 6, 576 డాలర్లకు పెరిగింది. దీంతో మౌలిక సౌకర్యాలతోపాటు పరిశుభ్రత, మహిళల్లో అక్షరాస్యత పెరిగింది. ప్రసవ సమయంలో తల్లుల మృతి, అదే సమయంలో పిల్లల మృతి తగ్గుముఖం పట్టి ఆయు: ప్రమాణం పెరిగింది. దేశ జనాభా 130 కోట్లకు చేరుకుంది. మొత్తంగా జీవన ప్రమాణాల్లో భారత్, బంగ్లా, పాకిస్థాన్‌ లాంటి దేశాలను అధిగమించింది.
              అయితే ఈ అభివృద్ధి దేశంలోని ఉన్నత వర్గాలకే పరిమితం అయింది. హిందువుల్లోని అగ్రకులాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీ వర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసం ఎంతో పెరిగింది. ఈ వర్గాలకు చెందిన 28 శాతం ప్రజలు, అంటే 36 కోట్ల మంది కటిక దారిద్య్రంలో బతుకుతున్నారు. ప్రపంచ ధనిక దేశాల్లో ఒకటిగా భాసిల్లుతున్న భారత్‌లో సగటు భారతీయులు దారిద్య్రంలోనే జీవిస్తున్నారు. భారత ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం ఆర్థిక వృద్ధి రేటుపై ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆ ఆర్థికాభివృద్ధిని ప్రజలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూసినప్పుడు మాత్రమే ఆ ఆర్థిక ఫలాలు పేదలకు కూడా చేరుతాయి. దాన్నే సామాజిక అభివృద్ధిగా నిపుణులు చెబుతారు.
               2000 సంవత్సరం నుంచి 2016 వరకు భారత్‌ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందినా.. సంపన్నులే ఎక్కువగా లబ్ధి పొందారు. 2000 సంవత్సరంలో 1 శాతం ధనికుల వద్ద 36.8 శాతం ఆస్తులుండగా, నేటికి అవి 60 శాతానికి చేరుకున్నాయి. మొత్తం దేశం ఆస్తిలో 4.1 శాతం వాటానే పేదలు అనుభవిస్తున్నారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్‌ సూస్స్, ఆక్స్‌ఫామ్‌ సంస్థల అంచనా ప్రకారం 1988 నుంచి 2011 మధ్య కాలంలో పేదవారిలో పది శాతం పేద వారి ఆదాయం సగటున రెండు వేల రూపాయలకు చేరుకోగా, పదిశాతం సంపన్నుల ఆదాయం సగటున 40వేల రూపాయలకు పెరిగింది. పేదవారి ఆదాయం ఏటా ఒకశాతం పెరగ్గా, సంపన్నుల ఆదాయం ఏటా 25 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. క్రోని క్యాపిటలిజం, కార్పొరేషన్‌ సంస్థలు తమ ఎగ్జిక్యూటివ్‌లకు, వాటాదారులకు డివిడెండ్లు ఎక్కువగా ఇవ్వడం, ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ రావడం వల్ల ప్రజల మధ్య ఈ ఆదాయ అంతరాలు తీవ్రంగా పెరిగాయి.
మధ్య తరగతి కూడా పెద్ద దెబ్బ
                   ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్కృతి సంరక్షణలో కీలక పాత్ర పోషించే మధ్య తరగతిపై కూడా ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఎంతో ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం 2011లో భారత్‌లోని మధ్య తరగతి ఆదాయం రోజుకు పది డాలర్ల నుంచి 20 డాలర్ల వరకు ఉంది. అంతకుముందు నుంచి వారి ఆదాయం పురోగతిని పరిశీలిస్తే ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, చైనా దేశాలకన్నా భారత్‌ వెనుకబడింది.

24, డిసెంబర్ 2017, ఆదివారం

దినకరన్‌ ప్రభంజనం.. బీజేపీ కన్నా నోటాకే అధికం!


ttv dinakaran won in rk nagar by election - Sakshi













గట్టిపోటీ ఇవ్వలేకపోయినా అన్నాడీఎంకే.. డీఎంకే డిపాజిట్‌ గల్లంతు
                  ప్రతిష్టాత్మకంగా మారిన తమిళనాడు ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్‌ ఘనవిజయం సాధించారు. 2017 డిసెంబర్ 24న ఫలితాలు వెలువడ్డాయి. తన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌పై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్‌ అఖండ విజయాన్ని సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్‌ ప్రభంజనం ముందు ప్రత్యర్థి పార్టీలు కొట్టుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా బీజేపీ, ఇతర చిన్న పార్టీలు డిపాజిట్‌ కోల్పోయాయి.
                దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌.. హోరాహోరీగా సాగుతుందని అంతా భావించారు. కానీ,  అధికార అన్నాడీఎంకే.. శశికళ వర్గం తరఫున బరిలోకి దిగిన టీటీవీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఉప ఎన్నికలో కుక్కర్‌ గుర్తుతో పోటీచేసిన దినకరన్‌ మొదటినుంచి లీడ్‌లో కొనసాగుతూ.. ఇటు అధికార అన్నాడీఎంకే, అటు ప్రతిపక్ష డీఎంకే ఊహించనిస్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నారు.
బీజేపీ కన్నా నోటాకే ఎక్కువ
                 ఈ ఎన్నికల్లో దినకరన్‌కు 89,013 ఓట్లు రాగా, అన్నాడీఎంకేకు 48,306 ఓట్లు వచ్చాయి. డీఎంకేకు 24,651 ఓట్లు, నామ్‌ తమిళార్‌ పార్టీకి 3,802 వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఏమాత్రం కలిసిరాలేదు. తమిళనాడు రాజకీయాల్లో మెరుగుపడాలని ఎంతగా తపిస్తున్నా.. కమళదళం ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో అతికష్టం వెయ్యిమార్కును దాటింది. బీజేపీ అభ్యర్థికి 1,368 ఓట్లు రాగా, బీజేపీ కన్నా ఎక్కువగా నోటా (పైవారెవరూ కారు)కు 2,203 ఓట్లు వచ్చాయి.

23, డిసెంబర్ 2017, శనివారం

సంచలన తీర్పుపై లాలూ స్పందన

Lalu Prasad Yadav  responds CBI Special court verdict on Fodder scam case - Sakshi
                   దాణా కుంభకోణం కేసులో 23-12-2017 saturday సీబీఐ వెలువరిచిన సంచలన తీర్పుపై లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స్పందించారు. తనను దోషిగా తేల్చడంపై లాలూ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ డర్టీ గేమ్‌ ఆడుతుందంటూ విమర్శల వర్షం కురిపించారు. కోర్టు తీర్పు ఏకపక్షంగా ఉందని.. న్యాయకోసం తమ పోరాటం కొనసాగిస్తామంటూ పేర్కొన్నారు.
చివరికి న్యాయమే గెలుస్తుందంటూ చెప్పుకొచ్చారు. నిజం చెప్పులేసుకునే లోపే.. అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటూ ఆరోపించారు. కోర్టు తీర్పు ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమే అంటూ లాలూ ప్రసాద్‌ పార్టీ ఆర్జేడీ కూడా మండిపడుతోంది. సాక్ష్యాలను తారుమారు చేశారని, ఈ కేసులో న్యాయం కోసం హైకోర్టుకు వెళ్తామంటూ పేర్కొంది. 
కాగ, నేడు వెలువరిచిన దాణ కుంభకోణం కేసులో లాలూని సీబీఐ స్పెషల్‌ కోర్టు దోషిగా తేల్చింది. లాలూతో పాటు 15 మందిని దోషులుగా తేల్చింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కోర్టులోనే అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు.
             1991-96 కాలంలో దియోగఢ్‌(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసిన క్రమంలో సీబీఐ ఈ కేసు నమోదుచేసింది. 1997, అక్టోబర్‌ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.

18, డిసెంబర్ 2017, సోమవారం

గుజరాత్‌లో మరోసారి బీజేపీ ప్రభుత్వం!

            అత్యంత హోరాహోరీగా జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ పట్టు చాటుకుంది. ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో వరుసగా ఆరోసారి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సమయాత్తమవుతోంది. అయితే, గుజరాత్‌లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడక కాలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన దానికి భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ చాలా గట్టిపోటీ ఇచ్చింది. 180 స్థానాలు ఉన్న గుజరాత్‌లో బీజేపీ 99 స్థానాలు మాత్రమే గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ 92 సీట్లు అవసరం కాగా.. బొటాబొటీ మెజారిటీతో బీజేపీ గట్టెక్కింది. రాహుల్‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మరోసారి అధికారానికి దూరంగానే ఉండిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 77 సీట్లు గెలుచుకోగా.. మిత్రపక్షాలు మూడుచోట్ల విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌ కూటమికి 80 సీట్లు తగ్గాయి.  ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. 2012 ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్‌ సీట్లు 19 పెరగడం గమనార్హం. 2012లో 115 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి 16 స్థానాలు తక్కువ గెలుపొందింది. 100 సీట్ల మార్కును దాటలేకపోయింది.
              ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న పరిశ్రమలు, వ్యాపారస్తులు దెబ్బతిన్నట్టు ఎన్నికలకు ముందు విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ ప్రభావం గుజరాత్‌ ఎన్నికలపై ఉంటుందని భావించారు. కానీ ఎన్నికల ఫలితాలను చూస్తే వాణిజ్య, పారిశ్రామికవర్గాలు అండగా నిలబడినట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా పట్టణప్రాంతాల్లో బీజేపీ మళ్లీ పట్టు నిలుబెట్టుకోగలిగింది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ 46 స్థానాల్లో గెలుపొందగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కేవలం 10 సీట్లకు పరిమితమైంది. అదే గ్రామీణప్రాంతాల్లో ఓ మేరకు కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు హస్తానికి మొగ్గుచూపడంతో ఆ పార్టీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 67 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ 54 గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో గెలుపొందింది. ప్రధానంగా బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య ద్విముఖ పోరుగా ఈ ఎన్నికలు సాగాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు పెద్దగా ప్రభావం చూపలేదు.
           పటేల్‌ సామాజికవర్గానికి రిజర్వేషన్‌ కోసం ఉద్యమం నిర్వహించిన హార్థిక్‌ పటేల్‌ ప్రభావం ఈ ఎన్నికల్లో కొంతమేరకు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసిందని భావించవచ్చు. పటేల్‌ సామాజికవర్గం అధికంగా ఉండే సూరత్‌లో ఈ ఉద్యమ ప్రభావం అంతగా కనిపించకపోయినా.. సౌరాష్ట్రలో మాత్రం బీజేపీకి గట్టిపోటీనిచ్చింది. బీజేపీ అగ్రనేతలు సౌరాష్ట్రలో విజయం కోసం హోరాహోరీగా పోరాడాల్సిన పరిస్థితి కలిగింది. పటేల్‌ ఉద్యమానికి కేంద్రంగా ఉన్నా ఉన్జా నియోజకవర్గంలో బీజేపీ ఓటమిపాలైంది. ఇక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ్‌భాయ్‌ లల్లూదాస్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థి ఆశా పటేల్‌ ఓడించారు. ప్రధాని మోదీ సొంతూరు వాద్‌నగర్‌ ఈ నియోజకవర్గంలోనే ఉంది. మొత్తానికి పటేల్‌ సామాజికవర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ పర్వాలేదనిపించగా.. ఓబీసీ సామాజికవర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పాగా వేసింది.
విజేతలు..పరాజితులు
                  గుజరాత్‌ సీఎం విజయ్‌ రుపానీ రాజ్‌కోట్‌ వెస్ట్‌ నియోజకవర్గంలో గెలుపొందారు. మెహసానా నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ను విజయం వరించింది. కాంగ్రెస్‌కు మద్దతు పలికిన యువనేతలైన దళిత హక్కుల కార్యకర్త జిగ్నేష్‌ మేవానీ, ఓబీసీ నేత అల్ఫేష్‌ ఠాకూర్‌ విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. భావ్‌నగర్‌లో బీజేపీ గుజరాత్‌ చీఫ్‌ జీతు వాఘనీ గెలుపొందారు. పోర్‌బందర్‌లో కాంగ్రెస్‌ కీలక నేత అర్జున్‌ మొద్వాడియా ఓడిపోయారు. బీజేపీ కీలక నేత రాఘవ్‌జీభాయ్‌ పటేల్‌ జామ్‌నగర్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు.
ఓట్ల శాతం!
               ఈ ఎన్నికల్లో బీజేపీకి 49.1శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌ పార్టీకి 41.4శాతం ఓట్లు వచ్చాయి. గుజరాత్‌ ఎన్నికల్లో ‘నోటా’కు కూడా గణనీయంగా ఓట్లు పడ్డాయి. బరిలోకి దిగిన అభ్యర్థులెవరూ నచ్చలేదంటూ..  5,51,580మంది (1.8%) ఓటర్లు నోటాకు ఓటేశారు.

9, డిసెంబర్ 2017, శనివారం

వింత ఆచారం

Pregnent Womens Village Expulsion  in Madakashira - Sakshi
మడకశిరలో వింత ఆచారం
బాలింతలు, బహిష్టు మహిళలకు గ్రామ బహిష్కరణ
ఊరి బయట గుడిసెల్లో అవస్థలు
ఆచరిస్తున్న యాదవ(గొల్ల)     సామాజిక వర్గం
తరాలు మారినా రాత మారని అమ్మ
చైతన్యం కల్పించే విషయంలో మీనమేషాలు
            ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం   అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 334 గ్రామాలు ఉండగా.. 50 గ్రామాల్లో యాదవ కుల సామాజిక వర్గీయులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం కరువుకు పుట్టినిల్లు. అయితే రాజకీయ చైతన్యం ఉంది. నియోజకవర్గం ఆంధ్రలో భాగమైనా అధికంగా కర్ణాటక సంస్కృతి కనిపిస్తుంది. 70 శాతం ప్రజలు కన్నడ మాట్లాడతారు. మడకశిర నియోజకవర్గంలోనే కాకుండా సమీప కర్ణాటక ప్రాంతాలైన చిత్రదుర్గం, తుమకూరు, కోలార్‌ జిల్లాలోనూ మూఢాచారం పాతుకుపోయింది. మొత్తంగా 90 శాతం కుటుంబాలు ఈ కులాచారాన్ని కొనసాగిస్తున్నాయి. మడకశిరతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అయినప్పటికీ ఎవరూ వీరిలో చైతన్యం తీసుకురాకపోవడం గమనార్హం. హట్టిగొల్ల సామాజిక వర్గంలో మహిళలను ప్రసవానంతరం మూడు నెలల పాటు గ్రామబహిష్కరణ చేస్తారు. పసికూన సహా తల్లిని గ్రామానికి దూరంగా ఉంచుతారు. బాలింతకు కుటుంబ సభ్యులు తొమ్మిది రోజులు మాత్రమే భోజనం అందిస్తారు. ఆ తర్వాత వంట సామగ్రి అందిస్తే.. 51 రోజులు పాటు బాలింత స్వయంపాకం చేసుకోవాల్సిందే. కుండపోత వర్షం కురిసినా, ఎముకలు కొరికే చలిలోనూ వీరి అవస్థలు వర్ణనాతీతం.
గొడుగు గుడిసే దిక్కు..గ్రామ బహిష్కరణ తర్వాత బాలింత నివసించే గుడిసె ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది. విస్తీర్ణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. గుడిసెలో లేవాలన్నా.. నిల్చోవాలన్నా కష్టమే. లోపలికి వెళ్లాలంటే పూర్తిగా వంగి అడుగు వేయాల్సిందే. లోపల ఒక మనిషి ఉండేందుకు కూడా  ఇబ్బంది.
రాజకీయ చైతన్యం సరే..
నియోజకవర్గంలోని యాదవ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం అధికంగా ఉంది. అయినా మూఢాచారాలు పాటిస్తున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. రాష్ట్ర కాంగ్రెస్‌కు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. ప్రస్తుతం అసెంబ్లీ బీసీ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఇలా ఈ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం ఉన్నా మూఢాచారాలు రూపుమాపడానికి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. ఓ దశలో సామాజిక వర్గానికి చెందిన నేతలే మూఢాచారాలను ప్రోత్సహిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
పట్టించుకోని స్వచ్ఛంద సంస్థలు..
సమర్థించుకుంటున్న కుల పెద్దలు నియోజకవర్గంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మైరాడా, ఆర్డీటీ, ఫోర్డు తదితర స్వచ్ఛంద సంస్థలు పనిస్తున్నాయి. మైరాడా స్వచ్ఛంద సంస్థకు రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నా.. మూఢాచారాలను రూపుమాపడానికి చొరవ చూపలేకపోయింది. మూఢాచారాన్ని కొందరు కులపెద్దలు సమర్థించుకుంటున్నారు. తమ కులానికి చెందిన వారు కష్టజీవులనేది కులపెద్దల వాదన. ఈ సామాజికవర్గంలోని విద్యావంతుల కుటుంబాలు కులాచారానికి దూరంగా ఉంటున్నాయి.
పట్టించుకోని మహిళా శిశు సంక్షేమ శాఖ
మూఢాచారాలతో ఎక్కువగా మహిళలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మూఢాచారాలను రూపుమాపడానికి మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంత వరకు ఎక్కడా ఈ శాఖ అధికారులు కులాచారాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోని పరిస్థితి. ఈ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 438 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయినా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాల్లేవు.
బహిష్టు అయినా బహిష్కరణే !
ఈ సామాజిక వర్గానికి చెందిన మహిళలు బహిష్టు అయినా మూడు రోజుల పాటు నివాసం నుంచి బయటకు పంపుతారు. బాలింతలకు ఉండటానికి కనీసం చిన్న గుడిసె అయినా ఉంటుంది. బహిష్టు అయిన మహిళలకు ఉండటానికి ఎలాంటి సౌకర్యం ఉండదు. మూడు రోజుల పాటు బయటి ప్రదేశంలో ఎండనక, వాననక దుర్భరంగా గడపాల్సిందే. ఈ మహిళలను మూడు రోజుల తర్వాత ఇంటి ఎదుట మరో రెండు రోజులు ఉంచుకుని 5వ రోజు ఇంట్లోకి ఆహ్వానించే మూఢాచారం కొనసాగుతోంది. ప్రతి గొల్లహట్టిలో కూడా ఆ రోజుల్లో కమ్యూనిటీ భవనాలను నిర్మించారు. గ్రామ బహిష్కారానికి గురైన బాలింతలు, బహిష్టు మహిళలను ఈ కమ్యూనిటీ భవనంలో ఉంచాలని వీటిని నిర్మించారు. ఇలాంటి కమ్యూనిటీ భవనాలు నియోజకవర్గంలోని గొల్లహట్టిల్లో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి.

నారా వారి నికర ఆస్తులు 75 కోట్లే!

 

Nara's net assets is 75 crores! - Sakshi
     కుటుంబ ఆస్తులను ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌
     ఆస్తులు రూ.142.34 కోట్లు.. అప్పులు రూ.67.26 కోట్లు
     హెరిటేజ్‌ మాకు ప్రధాన ఆదాయ వనరు
     మార్కెట్‌ విలువ కాదు, కొన్నప్పటి విలువే లెక్కించాం
                      ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా తమ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.75.06 కోట్లు మాత్రమేనని ఆయన కుమారుడు, ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. తన తండ్రి, తల్లి, భార్య, కుమారుడికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.142.34 కోట్లుకాగా, అప్పులు రూ.67.26 కోట్లు ఉన్నాయని తెలిపారు. తమ కుటుంబ ఆస్తుల వివరాలను లోకేశ్‌ 2017 డిసెంబర్ 8న ఎపి రాజధాని అమరావతి ఉండవల్లిలోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన తండ్రి చంద్రబాబు ఆస్తుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తమ కుటుంబానికి ఆదాయం హెరిటేజ్‌ సంస్థ ద్వారానే వస్తోందని, దాని టర్నోవర్‌ రూ.2,600 కోట్లకు చేరుకుందని వివరించారు.
తాము కొనుగోలు చేసినప్పటి విలువ ప్రకారం ఆస్తులను మదించామని, మార్కెట్‌ ధర ప్రకారం వాటి విలువ మారుతూ ఉంటుందని అన్నారు. తన తండ్రి చంద్రబాబు పేరుతో రూ.8.17 కోట్ల ఆస్తులుండగా, 5.64 కోట్ల అప్పులున్నాయని తెలిపారు. తన తల్లి భువనేశ్వరి పేరుతో రూ.46.31 కోట్ల విలువైన ఆస్తులుండగా, రూ.20.90 కోట్ల అప్పులున్నాయని, తన పేరుతో రూ.26.39 కోట్ల ఆస్తులు, రూ.11.17 కోట్ల అప్పులున్నాయని లోకేశ్‌ వెల్లడించారు. తన భార్య బ్రాహ్మణి పేరుతో రూ.15.37 కోట్ల ఆస్తులు, రూ.36 లక్షల అప్పులు, కుమారుడు దేవాన్ష్ పేరుతో రూ.11.54 కోట్ల ఆస్తులున్నాయన్నారు. తమ కుటుంబ సంస్థ నిర్వాణ హోల్డింగ్స్‌ కంపెనీ పేరుతో రూ.34.56 కోట్ల ఆస్తులు, రూ.29.19 కోట్ల అప్పులున్నాయని తెలిపారు. 
                                                         వారసుడిగా అవకాశం వచ్చింది నిజమే  
                       హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కొత్తగా నిర్మించిన ఇంటికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి తన తండ్రి, తాను ఉమ్మడిగా రుణం తీసుకున్నట్లు లోకేశ్‌ విడుదల చేసిన పత్రాల్లో చూపారు. అదే రుణాన్ని రెండుచోట్లా అప్పులుగా చూపడం గమనార్హం. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా తమలాగే స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించాలని లోకేశ్‌ అన్నారు. ఏడేళ్లుగా తాము ఆస్తులు ప్రకటిస్తున్నామని, తమపై విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడైనా ఆస్తులు ప్రకటించారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో తామే ప్రతిపక్షంగా వ్యవహరించామని, రాష్ట్రంలో ప్రతిపక్షం లేనేలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారని, అసెంబ్లీలో పోలవరం సహా అన్ని అంశాలపైనా చర్చించామని చెప్పారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా అఖిలపక్షం అంటూ డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. వారసుడిగా తనకు అవకాశం వచ్చిన మాట నిజమేనని, కానీ ప్రజామోదం ఉండి, సమర్థంగా పనిచేస్తేనే నిలబడగలమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక ప్యాకేజీ ఏపీ హక్కు అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అసలు ఏమీ చేయడం లేదనేది సరికాదన్నారు. కే?ంద్ర, రాష్ట్రాల మధ్య, టీడీపీ–బీజేపీ మధ్య ఎటువంటి గ్యాప్‌ లేదని తేల్చిచెప్పారు.