27, జనవరి 2013, ఆదివారం

సామాజిక చైతన్యంతోనే మహిళకు రక్షణ

'మహిళా రక్షణ చట్టాలు-సామాజిక బాధ్యత ' సదస్సులో జస్టిస్‌ చంద్రకుమార్‌
                సామాజిక చైతన్యంతోనే మహిళలకు రక్షణ సాధ్యమవుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి చంద్రకుమార్‌ సూచించారు. ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ స్టడీ ఫోరం ఆధ్వర్యంలో ' మహిళా రక్షణ చట్టాలు- సామాజిక బాధ్యత' అంశంపై ఆదివారం కర్నూలు సునయన ఆడిటోరియంలో సదస్సు నిర్వహించారు. సమాజంలో ఏ అన్యాయం జరిగినా సమస్య నాకేందుకులే అని దూరంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ స్పందించిననాడే అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగవని అన్నారు. ఫోరం జిల్లా కన్వీనర్‌ బిఎల్‌ఎన్‌ ప్రసాద్‌శర్మ అధ్యక్షత వహించారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ సమాజంలో ప్రతి సమస్యకు డబ్బు కారణమవుతుందన్నారు. ప్రతీది లాభం దృష్టితో చూస్తూ మహిళలను సంపదను సృష్టించే వస్తువుగా చూసే ఇలాంటి ధోరణి పోవాలన్నారు. టీవీలు, సినిమాలు మహిళలను అసభ్యంగా చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లింగ, కుల, మత, సామాజిక, ప్రాంతీయ అసమానతలు లేని సమాజ నిర్మాణానికి అందరూ నడుంబిగించాలని కోరారు. మాతృసామ్య వ్యవస్థలో మహిళలదే కీలకమైన పాత్ర అని, ఆస్తి అనేది వచ్చాక భూస్వామ్య, రాచరిక వ్యవస్థలో మహిళలను ఆస్తికింద పరిగణించారని అన్నారు. మన ప్రజాస్వామ్యంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నందున పెట్టుబడిదారుడు లాభం కోసం మహిళను వస్తువుగానే పరిగణిస్తున్నారని అన్నారు. ఈ వ్యవస్థను మార్చుకునేందుకు అవకాశం మన చేతుల్లోనే ఉందన్నారు. రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు పరిచే వారికే ఓటు వేసి ఎన్నుకోవాలని సూచించారు. వంద కోట్ల రూపాయల అవినీతి చేసిన వాడిని ఎన్నుకుంటే సమాజంలో ఇలాంటి రుగ్మతలు వస్తాయని అన్నారు. స్త్రీలు, పురుషులు ప్రకృతిలో ఒక భాగమని, మహిళలు లేకుంటే మానవజాతికి మనుగడలేదని, అలాంటి మహిళల పట్ల సమాజం వివక్ష చూపటం సరికాదని అన్నారు. మహిళల పట్ల బాల్యం నుంచే వివక్ష వుంటుందని అన్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పిస్తే వివక్ష అంతమవుతుందని చెప్పారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోవడానికి కారణం సమాజంలోని అసమానతలేనని అన్నారు. మహిళలపై జరిగే దాడుల విషయంలో, సంఘటనల్లో కోర్టులు సరైన శిక్షలు వేయడం లేదనే భావన ఉందని ఇది సరి కాదన్నారు. చట్టం చేసే అధికారం కోర్టులకు లేదని అన్నారు. చట్టసభలైన పార్లమెంటు, అసెంబ్లీలో చట్టాలు చేస్తారని చెప్పారు. ఈ చట్ట సభల్లో రాజ్యాంగాన్ని గౌరవించి పకడ్బందీగా అమలు పరిచే వారిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పెడధోరణులను చూస్తే దేశంలోని ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందా అన్న ఆందోళన కలుగుతుందని అన్నారు. మహిళల కేసుల్లో చాలా వరకు సత్వర న్యాయం జరగకపోవడానికి కారణం కేసులకు తగ్గట్టు కోర్టులు, న్యాయమూర్లులు లేకపోవడమేనని అన్నారు. మహిళలపై దాడులు జరగగానే రిపోర్టు చేయాలనే అవగాహన కూడా ప్రజల్లో ఉండాలని, విచారణ అధికారి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయాలన్నారు. సాక్షులు నిర్భయంగా వచ్చి జరిగిన సంఘటన కోర్టులో చెప్పిననాడే శిక్షలు పడతాయని అన్నారు. నేరం జరిగిన తరువాత తీసుకోవాల్సిన చర్యల కంటే నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉందన్నారు. సమాజంలో ప్రతీ పని లాభంతో ముడిపెట్టి చూస్తున్నందునే మహిళలు విలాస వస్తువులుగా మారారని అన్నారు. డబ్బు పిచ్చితో మానవతా విలువలు మంట కలుస్తున్నాయని, ఈ ధోరణి పోయేందుకు ప్రతి ఒక్కరూ చట్ట సభలకు మంచి వాళ్లను పంపించాలని సూచించారు. అదే విధంగా సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, అఘాయిత్యాలను అడ్డుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. మన కళ్లముందే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదనీ అన్నారు. ఏ స్త్రీకి అన్యాయం జరిగినా స్పందించాలని కోరారు. అయితే దీనిర్థం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్‌చాన్సలర్‌ ఆవుల మంజులత, జిల్లా జడ్జి జస్టిస్‌ జ్యోతిర్మయి మహిళా చట్టాలు, అమలు తీరుపై వివరించారు. ఈ సదస్సులో జిల్లా జడ్జిలు బి బసయ్య, రామలింగారెడ్డి, వెంకట జ్యోతిర్మయి, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి, న్యాయవాది పి నిర్మల, ఐసిడిఎస్‌ పిడి జుబేదాబేగం, ఐలు నాయకులు కె కుమార్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ ఆశీర్వాదమ్మ, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

22, జనవరి 2013, మంగళవారం

ఆకలిపై పోరుకు సిద్ధం

డిక్రీజారీ చేసిన మెక్సికో అధ్యక్షుడు

                   ఈ 21వ శతాబ్దంలో కూడా లక్షలాదిమంది మెక్సికన్లు ఆకలి, దారిద్య్రాలతో బాధపడడం దురదృష్టకరమని మెక్సికో అధ్యక్షుడు పెనా నిటో వ్యాఖ్యానించారు. 'ఆకలిపై జాతీయ పోరాటం' పేరుతో బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన డిక్రీపై ఆయన సంతకాలు చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో తమతో చేతులు కలపాల్సిందిగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అత్యంత తక్కువగా అభివృద్ధి సాధించిన కమ్యూనిటీలకు మద్దతునివ్వాల్సిందిగా కోరారు. చిపాస్‌ రాష్ట్రం దేశానికి అవసరమైన విద్యుత్‌లో 50శాతం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ప్రతి నలుగురిలో ముగ్గురు దారిద్య్రంలో బతుకీడుస్తున్నారని, ముగ్గురిలో ఒకరిది దుర్భర దారిద్య్రమని అన్నారు. తగినంత ఆహారం ప్రతి ఒక్కరికీ లభించాలన్నది రాజ్యాంగంలోని రెండవ చాప్టర్‌ కింద పేర్కొన్నారని, కానీ ఈ మానవ హక్కు పూర్తిగా విస్మరించబడుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రాధాన్యతా ప్రాతిపదికన ఈ దేశవ్యాప్త పోరాటాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది సాయం కాదని, సామాజిక సంక్షేమానికి సంబంధించిన సమగ్ర వ్యూహమని పేర్కొన్నారు. మెక్సికన్ల అవసరాలను తీర్చడానికి అనేక కార్యక్రమాలు, పథకాలతో, లక్ష్యాలతో దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

13, జనవరి 2013, ఆదివారం

సంక్రాంతి విశేషాలు

                భోగి స్నానాలు చేసేసి పండగరోజులోకి ప్రవేశించేశారు కదూ! ముందుగా మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..! ఓ వైపు చల్లటిగాలులు. మరోవైపు మంచుకురుస్తూ ధనుర్మాసం ప్రవేశిస్తుంది. అదే సంక్రాంతి నెల ప్రారంభం. ముద్దబంతులు విరబూసి మురిపించేకాలం. గుమ్మడిపూలను గొబ్బెమ్మలపై పెట్టి యువతులు ముత్యాలముగ్గులు వేసి మురిసేకాలం. గాలిపటాలు ఎగరేస్తూ యువకులు ముచ్చటపడే కాలం. అన్నీ అనుకూలిస్తే రైతన్నకు ఫలసాయాలు పుష్కలంగా చేతికొచ్చేకాలం. ఘుమఘుమలాడే పిండివంటల్ని మహిళలు తయారుచేసి అందర్నీ చవులూరించేకాలం. సంక్రాంతి అంటే అందరికీ ఇష్టమే. పిల్లలకు సెలవులు. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల ఊళ్లకు పయనాలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉపాధి కోసం ఎంత దూరంలో వున్నా పల్లెకు పయనమయ్యే పండుగ సంక్రాంతి. పిల్లాపెద్దా అందరూ ఒక్కచోట చేరి సంబరంగా గడిపే పండుగ ఇదే అంటే అతిశయోక్తి కాదు. మారిన పరిస్థితుల్లో నిజంగా ఇది అందరికీ పండుగేనా అంటే కచ్ఛితంగా అవునని చెప్పలేం. అందరం బాగున్నరోజే అసలైన పండుగ. ఏదేమైనా ఈ సంక్రాంతి క్రాంతి మన రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో, అలాగే వివిధ రాష్ట్రాల్లోనూ, వివిధ దేశాల్లోనూ ప్రసరిస్తోంది. ఆ సంక్రాంతి విశేషాలే ఈ పండుగ వేళ మీకోసం.
బంతిపూల సందళ్లు..
              ఈ పండుగకు ప్రత్యేక అలంకారం బంతిపూలు. అందుకే వీటిని 'సంక్రాంతి పూల'నీ అంటుంటారు. ఇవ్వాళా రేపూ పట్టణాల్లో ఎప్పుడుబడితే అప్పుడు పెద్దగా ఎదగనీయకుండానే చిన్న చిన్న మొక్కలకే బంతిపూలను పూయించేస్తున్నారనుకోండి. ఈ బంతిపూల సువాసన అత్యద్భుతం. పూలే కాదు వీటి ఆకులు కూడా అంతే సువాసన కలిగి వుంటాయి. బంతుల్లో బోలెడు రకాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ముద్దబంతి, రెక్కబంతి అనొచ్చు. కానీ గడపకు రాసే పసుపురంగులో, కాషాయపురంగులో, నిమ్మపండురంగులో, కుంకుమరంగులో విరబూస్తూ అలరిస్తాయి. బంతుల్లో ముద్దబంతి, నూకబంతి (నూకలు నూకలుగా వుండే నూకబంతి.. దీన్నే బియ్యపు బంతి అని కూడా అంటారు), రెక్కబంతి, కారపుబంతి.. ఇలా రకరకాలుగా ముద్దబంతైనా, రేకబంతైనా, నూకబంతైనా రంగు రంగుల్లో వికసించి కనువిందు చేస్తాయి. అన్నింటిలోకి ఆకర్షణగా నిలిచేది కారపుబంతి. ఇది కుంకుమరంగులో, కుదురుగా పెరిగి బోలెడు పూలు పూస్తుంది. ఈ పూలను కాగడా మల్లెలతోనో, వేరే బంతులతోనో కలిపి మాలలు కట్టి జడల్లో పెట్టుకోవటానికి అమ్మాయిలు మక్కువ చూపుతారు. ఇక బంతిపూలను ముగ్గుల్లో పసుపు కుంకమలతో పాటు చల్లుతారు.
కొత్తబట్టల సరదా..
               ఈ పండుగకే కొత్త బట్టల సరదా తీరేది. అప్పటి వరకూ గౌనుల్లో తిరిగే చిన్నారి సీ గానపెసూనాంబలు సైతం ఈ పండుగకు పొడుగు లంగాలు, పట్టులంగాలు కుట్టించమంటూ పేచీలు పెట్టి మరీ సాధించుకుంటారు. నిక్కర్లలో వున్న చిట్టి తమ్ముళ్లు జీన్స్‌ ప్యాంట్లు కావాలంటూ బాపు బుడుగులాగా ఊరంతా వినపడేలా ఏడ్చి మరీ కొనిపించుకుంటారు. ఇక యువతుల సందడి అంతా ఇంతా కాదు. ఓణీలు వేసుకోవాలని తహతహలాడతారు. పెద్దల నుండి పిల్లల వరకూ ఈ పండుగకు కొత్తబట్టలు కొనుక్కోవడం పరిపాటి. ఈ పండుగ సందర్భంగా అబ్బాయిలకు పంచెలు, అమ్మాయిలకు ఓణీలు కట్టబెట్టి పెద్దలు మురిసిపోతారు.
గొబ్బెమ్మలు.. ముగ్గులు..
               యువతులంతా పేపర్లలో వచ్చిన ముగ్గుల్ని పరీక్షలకు సిద్ధమైనంత శ్రద్ధగా నేర్చేసుకుని, తెల్లారికల్లా వాకిట్లో వేసేయాలని తెగ ఉబలాటపడతారు. ఇరుగుపొరుగు వారితో పోటీపడుతూ వినూత్నంగా రంగవల్లికలు తీర్చిదిద్దుతారు. వాటిల్లో రంగులు నింపి మరింత ముచ్చటగొలుపుతారు. పెద్ద పెద్ద రథం ముగ్గులు వేయడం.. దాని తాడు ఎంత పొడుగ్గా వీలైతే అంతా పొడుగ్గా వేస్తూ వేరే వాళ్ల రథం తాడుకు కలుపుతూ సంబరపడిపోతారు. ఇలా కలపడానికి సోదరీమణులకు సోదరులు సహాయపడతారు. గొబ్బెమ్మలు పట్టణాల్లో సాధ్యకాకపోయినా పల్లెల్లో అక్కడక్కడా ఇప్పటికీ పెడుతున్నారు. ఈ గొబ్బెమ్మలపై ముగ్గులతో తెల్లని అడ్డగీతలు వేసి, పూలతో, పసుపుకుంకుమలతో అలంకరిస్తారు. వాటివద్ద రేగిపండ్లు, నవధాన్యాలు ఉంచుతారు.
గాలిపటాలు..
అబ్బాయిలు ఈ పండుగ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేది గాలిపటాలు ఎగురేయడానికే. 'పద పదవే ఒయ్యారి గాలి పటమా..!' అని పండుగకు పదిరోజుల ముందే ఈ గాలిపటాల్ని, దారాల్ని (మాంజాల్ని) కొని, రెపరెపలాడిస్తూ సందడి చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను 'పతంగుల పండుగ' అని కూడా పిలుస్తారు. దీన్నిబట్టి గాలిపటాలు ఈ పండుగకు ఎంతగా ఎగరేస్తారో వేరే చెప్పనవసరం లేదనుకుంట.
భోగిపళ్లు.. బొమ్మలకొలువులు..
            భోగి పండుగకు బుజ్జి తమ్ముళ్లకూ, చెల్లాయిలకూ రేగిపళ్లతో బంతిపూలు, పైసలు (నాణేలు) కలిపి భోగిపళ్లు పోస్తారు. అలాగే ఈ పండుగకు అమ్మాయిలు ముచ్చటపడేది బొమ్మలకొలువు. ఎప్పటి నుండో కొనుక్కున్న బొమ్మలతోపాటు కొత్తగా కొనుక్కున్న వాటిని జతచేర్చి, బొమ్మల కొలువు తీర్చిదిద్దుతారు. రోజుకో ప్రసాదం అమ్మతో తయారుచేయించుకుని, చిట్టిపొట్టి పేరాంటాళ్లను పిలిచి తమ బొమ్మలన్నీ చూపించి మురిసిపోతారు. ఈ సందర్భంగా పాటలు పాడి, ఆడతారు.
పిండి వంటలు..
           ఇళ్లల్లో ఆడవాళ్లంతా ఈ పండుగ వచ్చిందంటే ఒకటే సందడి. ఇళ్లు దులుపుకోవడం దగ్గర నుండి ఇంటికి సున్నాలు వేయడం వరకూ నెల రోజుల ముందునుండే పనులు మొదలుపెడతారు. పండుగ రోజు పొంగలి, పులిహౌరా చేసుకుంటారు. అంతకు పక్షం రోజుల ముందు నుండే అమ్మలక్కలంతా కలిసి అరిసెలు వండటం ప్రారంభిస్తారు. పల్లెల్లో ఒక్కొక్కరివి ఒక్కోరోజు వండుతూ వుంటారు. ఆ సందర్భాల్లో హాస్యపు జల్లులతో ఆ వాతావరణం చూడముచ్చటగా వుంటుంది. అరిసెలు వత్తడానికి ఎక్కువగా మగవాళ్లు తమవంతు సాయం చేస్తారు. ఈ సందర్భాల్లో వరసైన వాళ్లమీద చతుర్లాడుతూ నవ్వులు పూయిస్తారు. ఇవన్నీ పల్లెల్లోని మనుషుల కల్మషంలేని మనస్సుల్ని, ఐక్యతను చాటి చెప్తాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో చకినాలు ఈ పండుగ ప్రత్యేక వంటకం. ఇంకా కారప్పూస, చక్కలు (అప్పలు), కజ్జికాయలు, బూందీ, సున్నుండలు, పోకుండలు, మిఠాయిలు, లడ్డూలు ఇలా ఎవరి ఆర్థికస్థోమతకు తగ్గట్టు వాళ్లు తయారుచేసుకుంటారు.
భోగిమంటలు, కోడిపందేలు..
                  ఈ పండుగకు బంధువులందరూ కలుసుకుంటారు. కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తగారింటికి వస్తాడు. ఈ పండుగకు పెద్ద కొయ్యదుంగలతో భోగిమంటలు వేస్తారు. అందులో ఇళ్లల్లో పనికిరాని చెక్క సామాన్లను, ముళ్లకంపల్ని, నెలరోజుల నుండి చేసిన గొబ్బెమ్మల పిడకల్ని వేస్తారు. అందరూ పెద్ద పెద్ద కాగులతో, బిందెలతో, కుండలతో నీళ్లుకాచుకుని తలస్నానాలు చేస్తారు. ఈ పండుగ నాడు గంగిరెద్దుల్ని అలకరించుకుని గంగిరెద్దుల వాళ్లు వచ్చి వాటిని ఆడిస్తారు. 'హరిలో రంగ హరి..!' అంటూ వచ్చే హరిదాసులు ఈ పండుగ ప్రత్యేక ఆకర్షణ. రైతులు పశువులకు మెడలో గంటలు, కాళ్లకు మువ్వలు కడతారు. ఎడ్ల బండ్లను, నాగళ్లు వంటి వ్యవసాయ సామగ్రిని రంగులతో, పూలతో అలంకరిస్తారు. పశువుల్ని బండ్లకు కట్టి తీసికెళుతుంటే వాటి మెడలోని గంటల, కాలి మువ్వల శబ్ధాలు లయబద్ధంగా వినసొంపుగా వుంటాయి. కనుమ రోజు గారెలు చేసి, కోడికూర వండడం ప్రత్యేకం. ఒకప్పుడు వేడుకగా జరిగే కోడిపందేలు రానురానూ రాజకీయ ప్రోద్భలంతో డబ్బు పంపిణీకి ప్రధాన వేదికగా మారిపోయాయి. నిషేధం అమల్లో వున్నా నేటికీ ఈ పండుగకు ఇవి అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి.

9, జనవరి 2013, బుధవారం

30 ఏళ్ల సోషల్‌ మీడియాకు జేజేలు

                      సోషల్‌ మీడియా ప్రారంభించి ఓ తరం దాటింది. తరమంటే గందరగోళ పడకండి. ఒక తరం అంటే 30 ఏళ్లు అని అర్థం.30 ఏళ్లలో అన్ని రంగాల్లో అనేక మార్పులు వచ్చాయి. అలాగే సోషల్‌ మీడియాలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు సోషల్‌ మీడియాఅంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది సమాచారం చదవండి......
                సోషల్‌ మీడియా వ్యాపార సాధనంగా, వ్యాపారంగా మొదలైంది. ఒక సరుకును ఇంటర్నెట్‌ ద్వారా ప్రచారం చేయడం, దానిపై వినియోగదారుల స్పందనలు తెలుసుకోవడం, వాటి ఆధారంగా కొత్త వినియోగదారులను ఆకర్షించడం, మార్కెట్‌ను విస్తరించుకోవడం-ఇదీ సోషల్‌ మీడియా పని చేసే తీరు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మైస్పేస్‌, లింక్‌డ్‌ఇన్‌, యూట్యూబ్‌ వగైరాలన్నీ ఈ కోవకు చెందినవే. వీటిల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఆధారపడి అడ్వర్‌టైజ్‌మెంట్సు వస్తాయి. అదే ఆదాయం. అలా గూగుల్‌, ఫేస్‌బుక్‌లు ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలుగా మారాయి. సమాచార వ్యవస్థపై గుత్తాధిపత్యం దిశగా అడుగులేస్తున్నాయి. ఇంటర్నెట్‌పై నేడు అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. వెబ్‌సైట్స్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే అమెరికా కంపెనీలనే ఆశ్రయించాలి. ఇటీవల దుబారులో జరిగిన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ సదస్సులో ఆధిపత్య పోరాటం జరిగింది. అమెరికా ఆధిపత్యం కొనసాగాలని కొద్ది దేశాలు వాదించగా, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆయా దేశాల ప్రభుత్వాల ఆధిపత్యం ఉండాలని మెజారిటీ దేశాలు నిర్ణయించాయి. ఒక స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో నడవాలని మరి కొన్ని దేశాలు చెప్పాయి. మన దేశం ఎటూ చెప్పకుండా తిరిగొచ్చింది.
                   లాభం కోసం ఆరంభమైన కార్పొరేట్‌ ఇంటర్నెట్‌ కంపెనీలు అచేతనంగానే ఈ-తరాన్ని చైతన్య స్రవంతిలోకి లాగుతున్నాయి. టీవీ, పత్రికలకు భిన్నమైంది సోషల్‌ మీడియా. టీవీల్లో వ్యాఖ్యాతలు చెప్పేది వినాలి. పత్రికల్లో ఎడిటర్లు రాసింది చదవాలి. జనం పాఠకులుగానో, వీక్షకులుగానో ఉంటారు. ఇది ఒక రకమైన ప్రేక్షక పాత్ర. దీనికి భిన్నంగా సోషల్‌ మీడియాలో నెట్‌జనులదే ప్రధానపాత్ర. ఒక అభిప్రాయాన్ని మీడియాకు పంపిస్తే వాళ్లు ప్రసారం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దాన్నే సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తే అనేక మందికి చేరుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ తమతమ అభిప్రాయాలు ఇతరులకు తెలపొచ్చు. దానిపై ఇతరులు స్పందించవచ్చు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకోవచ్చు. అందరి భావాలకూ సమాన విలువే ఉంటుంది. నచ్చిన అభిప్రాయాలపై ఏకాభిప్రాయానికి రావచ్చు. అందరి అభిప్రాయాలూ ఒక చోట కలిస్తే అదే ఒక శక్తిగా మారుతుంది. దీన్నే భావాలు భౌతికశక్తిగా మారడం అన్నాడు లెనిన్‌. అరబ్‌ దేశాల్లోనూ, అమెరికాలోనూ, నేడు ఇండియాలోనూ జరుగుతున్నదదే.
                     సరిగ్గా 30 ఏళ్ళ క్రితం ఇంటర్నెట్‌ ఆవిర్భవించింది. అంతకు ముందు నుంచే కంప్యూటర్లున్నాయి. కంప్యూటర్ల మధ్య అనుసంధానం కూడా ఉంది. కానీ ఒక కంప్యూటర్‌కిచ్చే ఐపి అడ్రసు ద్వారా అందులో ఉండే సమాచారాన్ని ఎక్కడ నుండైనా మరో కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకొని చూడగలిగే అవకాశం ఇంటర్నెట్‌ కల్పించింది. టెలిఫోన్‌ కేబుల్‌ ద్వారా వీటి మధ్య అనుసంధానం జరుగుతుంది. ఈ టెక్నాలజీనే అర్పానెట్‌ అనేవాళ్లు. 1983 జనవరి 1న తొలిసారి అమెరికా రక్షణశాఖ 500 మిలిటరీ కంప్యూటర్లను జయప్రదంగా అనుసంధానించింది. సోవియట్‌ యూనియన్‌ను దెబ్బకొట్టడానికి, తనను తాను కాపాడుకోవడానికి మిలిటరీ దీన్ని ఉపయోగించుకుంది. 1960లలోనే అమెరికా ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మిలిటరీ కేంద్రాల రహస్యాలు, వివిధ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాల నుంచి వచ్చే నిగూఢ సమాచారం, సిఐఎ ఏజెంట్లు పంపే సాంకేతిక సమాచారం సోవియట్‌ యూనియన్‌కు చేరకుండా, టెలిగ్రాఫ్‌, టెలిఫోన్‌ లైన్ల మధ్యలో దూరి వేరెవరైనా తస్కరించకుండా ఈ ఏర్పాటు చేసుకున్నారు. సోవియట్‌ పతనం తర్వాత 1995లో దీన్ని వాణిజ్య అవసరాలకు కూడా విడుదల చేశారు. వరల్డ్‌వైడ్‌ వెబ్‌(డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు), నెట్‌స్కేప్‌ అప్లికేషన్‌ రావడంతో ఈ పరిణామం మరింత వేగవంతమైంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ ఆర్థిక కార్యకలాపాలు పెంచుకునేందుకు అమెరికా దీన్ని ఉపయోగించుకుంది. కార్పొరేట్‌ కంపెనీలకు ప్రపంచంలో చౌకగా శ్రమ ఎక్కడ దొరికినా ఉపయోగించుకునే సామర్థ్యం పెరిగింది. సమాచార, సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు, ప్రపంచీకరణ విస్తరణకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. మన దేశానికి అవుట్‌సోర్సింగ్‌ ద్వారా కాల్‌ సెంటర్లు, ఐటి ఉద్యోగాలు రావడంతో ఇంజనీరింగులో కంప్యూటర్‌ ఆధారిత కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. కాలేజీలు పెరిగాయి. యువతరం మధ్య నెట్‌ సంబంధాలు విస్తరించాయి. అది అలా అలా విస్తరించి సామాన్యుల చెంతకు చేరింది. సిటిజనుల్లో నెట్‌జనులనే కొత్త పొర ఏర్పడింది. వారే నేడు సోషల్‌ మీడియాకు వాహకులు.
        ఒకప్పుడు కంప్యూటర్‌ ఉంటేనే ఇంటర్నెట్‌. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కనెక్ట్‌ కావచ్చు. వచ్చే రెండేళ్ళలో స్మార్ట్‌ఫోన్‌ వాడకందార్లు రెట్టింపవుతారని పారిశ్రామిక వర్గాల అంచనా. మన దేశంలో ప్రస్తుతం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నవాళ్లు దాదాపు 14 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 55 శాతం మొబైల్‌ వినియోగదారులే. గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్‌ లెక్కల ప్రకారం ప్రపంచంలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 6.50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులున్నారు. ట్విట్టర్‌ వాడుతున్నవాళ్లు దాదాపు మరో రెండు కోట్లు. ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 75 శాతం 35 సంవత్సరాల లోపు పట్టణ యువతరం. సోషల్‌ మీడియా ద్వారా 45 శాతం రాజకీయ చర్చల్లో చురుగ్గా ఉంటున్నారని ఈ మధ్య 'ప్యూ' అనే పరిశోధనా సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ విషయంలో కొన్ని అరబ్‌ దేశాలు మనకన్నా ముందున్నాయి. ఇంటర్నెట్‌ విస్తరించేకొద్దీ సమాజంలో దాని పాత్ర, ప్రభావితం చేసే శక్తి పెరుగుతోంది. లాభం కోసమైనా అది ప్రజల వద్దకు రాక తప్పలేదు. ప్రజల భావాలను మోయకా తప్పలేదు. ఇంటర్నెట్‌ ఒక సాధనం మాత్రమే. అది ఎవరి చేతిలో ఉంటే వారికి ఉపయోగపడుతుంది. ప్రగతిశీలురే కాదు అభివృద్ధి నిరోధక శక్తులు, ప్రభుత్వమూ కూడా ప్రజలను ప్రభావితం చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నాయి. టీవీ, పత్రికలకు ఇది పోటీ కాదు. పైగా వాటికి సహాయకారి.