30, నవంబర్ 2012, శుక్రవారం

మాజీ ప్రధాని ఐ కె గుజ్రాల్‌ కన్నుమూత

                   భాతర మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్‌ (93) అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధితో హర్యానా రాష్ట్రం గుర్గావ్‌లోని ఆ సుపత్రిలో చికిత్స పోదుతూ తుదిస్వాస విడిచారు. దేశానికి 12వ ప్రధానిగా 1997 ఏప్రెల్‌ నుంచి 1998 మార్చి వరకు గుజ్రాల్‌ పని చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పని చేశారు. 1919 డిసెంబర్‌ నాలుగున జన్మించిన ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1980లో కాంగ్రెస్‌ పార్టీని వీడారు. 1989లో జలంధర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీపీసింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేవేగౌడ తరువాత యునైటెడ్‌ ప్రంట్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గుజ్రాల్‌ సతీమణి షీలాగుజ్రాల్‌ పంజాబీ , హిందీ, ఆంగ్ల తదితర బాషలో అనేక రచనలు చేశారు. గుజ్రాల్‌ సోదరుడు సతీష్‌ గుజ్రాల్‌ ప్రముఖ చిత్రకారుడు. 1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గుజ్రాల్‌ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నారు. అనంతరం కొంతకాలం సోవియట్‌ యూవియట్‌ యూనియన్‌లో భారత రాయభారీగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. వీపీసింగ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌లో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 1996లో దేవేగౌడ సారధ్యంలో ఏర్పడిన యునైటెడ్‌ ప్రంట్‌ సర్కారులోనూ విదేశాంగ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం. గుజ్రాల్‌ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు నూతన సిద్దాంతాన్ని విదేశీవిధానంలో ప్రవేశపెట్టారు.

20, నవంబర్ 2012, మంగళవారం

భారత ప్రజలు మోడీని ప్రధానిగా అంగీకరించరు

తీస్తా సెతల్వాద్‌     

         నరేంద్ర మోడీని ఈ దేశ ప్రధానిగా భారత ప్రజలు ఎన్నడూ అంగీకరించబోరని కంబాట్‌ కమ్యూనలిజం పత్రిక ఎడిటర్‌, గుజరాత్‌ ఊచకోత బాధితులకు న్యాయం చేకూర్చేందుకు రాజీలేని పోరు సాగిస్తున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ చెప్పారు. బడా కార్పొరేట్‌ శక్తుల అండ, తనకు తానుగా ఎంతగా ప్రచారం చేసుకున్నప్పటికీ మోడీ నిరంకుశ రాజకీయ పోకడలను గుజరాత్‌ వెలుపల ప్రజలు అంగీకరించబోరని ఆమె అన్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో వివిధ సమావేశాల్లో పాల్గొంటూ బిజీగా గడిపిన సెతల్వాద్‌ ప్రజాశక్తికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు...

                 గత రెండు రోజులుగా మీరు హైదరాబాద్‌లో వివిధ సెక్షన్లకు చెందిన ప్రజానీకంతో సమావేశాలు జరిపారు. సభల్లో మాట్లాడారు. హైదరాబాద్‌ పాత బస్తీలో ఇటీవల చేసుకున్న మత ఉద్రిక్తతల గురించి మీ అభిప్రాయం ఏమిటి?
           భాగ్యలక్ష్మి ఆలయ వివాదం హఠాత్తుగా ముందుకొచ్చింది. ఘర్షణల దాకా పరిస్థితి దారితీయడానికి గత కొన్ని మాసాలుగా ప్రయత్నాలు జరిగినట్లు నాకు అనిపిస్తోంది. హిందూత్వ, ఎంఐఎం ఈ రెండు మతతత్వ శక్తులు దీనికి మతం రంగు పులిమి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ఇటువంటి అంశాలను సొమ్ము చేసుకోవడానికి హిందూత్వ శక్తుల కుతంత్రాలు కుయుక్తులు అందరికీ తెలిసిందే.కర్ణాటకలోని చిక్‌మగ్‌లూరు జిల్లా బాబా బుదాన్‌గిరి మసీదు విషయంలో బజరంగ్‌ దళ్‌, విహెచ్‌పిల చర్యలు మతఘర్షణలకు ఎలా దారితీస్తున్నాయో చూస్తున్నాము. వారికి ఇది కొత్తకాదు. వారు ఇటువంటి అంశాల కోసం గోతికాడ నక్కలా కాచుక్కూర్చొంటారు.
మతత్వాన్ని రెచ్చగొట్టడంలో ఇరు శక్తులూ పోటీపడుతున్న హైదరాబాద్‌లో ఇటువంటి పన్నాగాలను ఎదుర్కోవడం ఎలా?
               ఇరు మతాలకు చెందిన సాధారణ, మాన్యులు, సదాలోచనాపరులు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ఇరు పక్షాలకు చెందిన మతతత్వ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం యావత్‌ సమాజాన్ని కల్లోలంలోకి నెట్టేందుకు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. మతతత్వ శక్తులు తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు పన్నిన పన్నాగాల్లో తాము పావులుగా ఉపయోగపడుతున్నామా, లేక వారి ఆటకట్టించేందుకు ప్రయత్నిస్తున్నామా అనేది సాధారణ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి.
          బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం పార్లమెంట్‌ ప్రార్థనా స్థలాల చట్టాన్నొకదానిని తీసుకొచ్చింది. ప్రార్థనా స్థలాల వివాదాలకు సంబంధించి 1947 నాటికి ఉన్న యథాతథ పరిస్థితే కొనసాగాలని ఆ చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ, మతతత్వ శక్తులను బుజ్జగించడం కోసం దీనిని పాలనా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఏదో ఒక వంకతో వివాదాలు రేపడానికి మనకు తగినన్ని ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తే ఈ సమస్య రాదు. దురదృష్టవశాత్తూ వాటిని అమలు చేసే నాథుడే కరువయ్యాడు. ఈ వివాదాలు, రాద్ధాంతాలు సామాన్యులకు ఏమీ పనికొచ్చేవి కావు. పైగా ఇటువంటి వాటివల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్యులే. కర్ఫ్యూలు, శాంతిభద్రతలు వంటివి ఈ వర్గ ప్రజానీకం బతుకు చిత్రాన్ని చిదిమేస్తాయి.అందుకే వీరు శాంతి సామరస్యాల కోసం ప్రజలను సమీకరించాలి. ఇటువంటి భావోద్వేగ అంశాలపై
లౌకిక శక్తుల కన్నా మతతత్వ శక్తులే సులువుగా ప్రజలను సమీకరించగలుగుతున్నాయి కదా...
               ఈ శక్తులు అటువంటి అంశాలను లేవనెత్తడానికి సదా ఎందుకు ప్రయత్నిస్తున్నాయంటే అందుకు కారణం ఈ విచ్ఛిన్నకర అంశాలు ఎన్నికల రాజకీయాలు ముడిపడి ఉండడమే. మీరు గనుక ఒకటి రెండు ఎన్నికలను గనుక చూస్తే ప్రలు మరీ ముఖ్యంగా యువత ఇటువంటి అంశాలపట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. దీని వెనుక ఉన్న పన్నాగాల గురించి వారికి తెలుసు కాబట్టే వారు దీనికి దూరంగా ఉంటున్నారు. దేశ లౌకిక వ్యవస్థను దెబ్బతీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బిజెపి, హిందూత్వ శక్తులు అందుకే ఒక రకమైన నిరాశనిస్పృహకు లోనవుతున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మతతత్వశక్తుల ప్రేరేపణతో 12 మతహింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. లౌకికత్వానికి ఆలంబనగా ఉండే ఫైజాబాద్‌లో కూడా ఇటీవల ఇటువంటి హింస చెలరేగడం చూశాం. గత ఎన్నికల్లో యుపిలో బిజెపి చాలా పేలవమైన ఫలితాలు సాధించింది. దీని నుంచి తిరిగి నిలదొక్కుకోవడానికి అక్కడ అను నిత్యం విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది. మత పరంగా ప్రజలను సమీకరించి తన ఓటు బ్యాంకును పటిష్టపరచుకోవాలని ప్రయత్నిస్తోంది. అక్కడ చట్టబద్ధమైన పాలన సాఫీగా సాగేలా చూసేందుకు లౌకిక పార్టీలు దృఢంగా, నికరంగా వ్యవహరించాలి.
గుజరాత్‌ విషయానికొద్దాం. 2002 గుజరాత్‌ నరమేథంలో బాధితులకు న్యాయం కోసం జరుగుతున్న పోరాటం అంటే దాదాపు మీరు జరుపుతున్న పోరాటంగానే భావించవచ్చు. ఈ క్రమంలో నరోడా పాటియా కేసులో సుప్రీం కోర్టు ఆ మధ్య ఇచ్చిన తీర్పు ఎటువంటి ప్రాధాన్యత కలిగి ఉందంటారు?
          సుప్రీం కోర్టు ఆగస్టు29న ఇచ్చిన ఆ తీర్పు చారిత్రాత్మకమైనది. గుజరాత్‌ నరమేధం కేసులో బాధితులకు న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో ఇదొక పెద్ద ముందడుగు. బాధితులకు న్యాయం చేకూర్చే విషయంలోనే కాదు, ముఖ్యమైన రాజకీయ నాయకులను దోషులుగా నిలబెట్టిన మొట్టమొదటి తీర్పుగా కూడా ఇది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.తప్పు చేసినా శిక్షపడకుండా తప్పించుకునే సంస్కృతికి ఇది బ్రేక వేసింది. దోషులకు అధికారంలో ఉన్నవారికి ఎంత సన్నిహితులన్నదాంతో నిమిత్తం లేకుండా వారిని న్యాయం ముందు నిలబెట్టిందీ తీర్పు.
               అయితే ఇంత ముఖ్యమైన తీర్పునకు మీడియాలో తగినంత ప్రాధాన్యత లభించకపోవడం నాకు బాధ కలిగించింది. అమెరికాలో 'సిక్కు'లపై దాడులు జరిగితే దానిని 'ద్వేషపూరిత నేరం'గా పరిగణిస్తుంది. కానీ, గుజరాత్‌లో జరిగిన నరమేథాన్ని 'హేయమైన నేరంగా' పేర్కొనడానికి అది ఇష్టపడడం లేదు. ఈ తీర్పుతో బిజెపి జాతీయ స్థాయిలో ఇరుకునపడాల్సింది. కానీ, అలా జరగలేదు. అగ్రవర్ణాలు, పెత్తందారీ వర్గాలు, మధ్య తరగతివారు మతతత్వం, విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల పట్ల కరకుగా వ్యవహరించడానికి అంతగా సుముఖత చూపడం లేదు.అవినీతిపై వీరు తీవ్రంగా ఆందోళన చెందుతారు. కానీ, మన దేశ మూలాలను తొలిచేసే మతోన్మాదాన్ని ఒక కేన్సర్‌లా చూడడానికి వీరు నిరాకరిస్తారు. మతతత్వశక్తులతో పోరాడడానికి బదులు ఈ విషయాలను మరుగుపరిచేందుకు ప్రయత్నిస్తారు.
నరేంద్రమోడీని భావి భారత ప్రధానిగా చూపించేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. దీనిని మీరు ఏ విధంగా చూస్తారు?
               గుజరాత్‌ నరమేథంలో తన పాత్రను కప్పిపుచ్చు కునేందుకు 2004-05లో నరేంద్ర మోడీ అభివృద్ధి గురించి ప్రచార ఊదరను పకడ్బందీగానే చేపట్టారు. ఇందుకోసం తన ముఖ్యమంత్రి హోదాను కూడా వాడుకున్నారు. ఆయన చూపిన అభివృద్ధి ఎంత డొల్లో ఆత రువాత వచ్చిన అనేక నివేదికలు, స్థానిక ప్రతిపక్ష నాయకులు బట్టబయలు చేశారు. జాతీయ మీడియా దీనిని అంతగా పట్టించుకోలేదు. మోడీ మీడియాతో నెరిపే సంబంధాలు అటువంటివి. మోడీ ఏర్పాటు చేసుకున్న ప్రెస్‌ రిలేషన్స్‌ (మీడియాతో సంబంధాలు) యంత్రాంగం ఆయనకు లేని ప్రతిష్టను కల్పించేందుకు బాగా ఉపయోగపడింది. ఇందుకోసం ఆయన ఆప్కో వరల్డు వైడ్‌ అనే ఒక అంతర్జాతీయ పిఆర్‌ సంస్థను ఏర్పాటు చేసుకుని దానికి ప్రతి నెలా పాతికవేల డాలర్లు చెల్లిస్తున్నాడు. ఆ పిఆర్‌ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే మోడీలాంటి నియంతలకు ప్రపంచవ్యాపితంగా ఒక మంచి ఇమేజిని సృష్టించడం. ఈ ప్రచారానికి చెల్లించిన డబ్బు ఎవరిది? మోడీదా? లేక గుజరాత్‌ ప్రభుత్వానిదా? అనే విషయమై తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం కింద మేము ఒక దరఖాస్తు దాఖలు చేశాము. వారు మాత్రం ఆ వివరాలు ఇవ్వడం లేదు.
అంబానీలు, మిట్టల్‌, రతన్‌ టాటా, బజాజ్‌ వంటి బడా పారిశ్రామికవేత్తలు ప్రధాని పదవికి మోడీ అత్యుత్తమమైన అభ్యర్థిగా అప్పుడే ఆకాశానికెత్తేస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలు ఒక వ్యక్తిని ఈ విధంగా ప్రధాని అభ్యర్థికి బలపరచడం భారత దేశ చరిత్రలో బహుశా ఇదే ప్రథమం. బడా వ్యాపారులు మోడీని బాహాటంగా సమర్థిస్తున్నారనేది స్పష్టం. హిందూత్వ మితవాద సంస్థలు, గ్లోబల్‌ పెట్టుబడి, భారత బడా వ్యాపారవర్గాలు ఆయనకు పెద్ద యెత్తున డబ్బు సమకూర్చుతుండడానికి కారణం లేకపోలేదు.నిరంకుశ ధోరణితో కూడిన మోడీ పని తీరు వారికి ఎంతగానో నచ్చింది. ఈ దేశంలో వనరులను, సంపదను యథేచ్ఛగా లూటీ చేసుకునేందుకు వారికి ఇటువంటి లక్షణాలున్న వ్యక్తే కావాలి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. అయితే నేను ఒక విషయం మాత్రం చెప్పగలను. భారత ప్రజలు మోడీని ప్రధానిగా తిరస్కరిస్తారు. గుజరాత్‌ దాటితే మిగిలిన దేశాన్ని మోడీ తన వెంట తీసుకెళ్ళలేరు. 2009 సాధారణ ఎన్నికల్లో మోడీ 122 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించగా, వీటిలో సగానికిపైగా సీట్లలో బిజెపి ఓడిపోయింది.
చివరిగా వ్యక్తిగతానికి సంబంధించిన ఒక అంశం అడుగుతున్నాను. న్యాయం కోసం మీరు జరుపుతున్న ఈ సుదీర్ఘ పోరాటంలో వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులను మీరు ఎలా ఎదుర్కొంటున్నారు?
      మంచి ప్రశ్నే. 2004 తరువాత నాకు, అలాగే ఈ కేసుల్లో సాక్షులకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. వీటి గురించి మేము సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టు మాకు భద్రత కల్పించమని ఆదేశాలు జారీ చేసింది. అంతకన్నా ముఖ్యంగా మతాలకతీతంగా గుజరాత్‌ ప్రజల నుంచి మాకు విస్తృత మద్దతు లభించింది. ఇది నాకు కొండంత స్థయిర్యాన్ని ఇచ్చింది. అయితే, నేను భయపడిన సందర్భాలు కూడా కొన్ని లేకపోలేదు. ఆ భయాన్ని న్యాయం కోసం జరిపే పోరాటంలోకి నేను మలచుకున్నాను. ఈ మొత్తం కాలంలో నా భర్త జావెద్‌ ఆనంద్‌ నాకు పూర్తి వెన్నుదన్నుగా నిలిచారు. నేను, మా బృంద సభ్యులు లౌకికత్వ వేదికనుంచి ఇంత విజయవంతంగా ఈ పోరాటం నడుపుతున్నామంటే అందుకు ఈ తోడ్పాటు కూడా ఒక కారణం.ఈ పోరాటం ద్వారా మాకు సమాజంలోని వివిధ సెక్షన్ల నుంచి విస్తృత మద్దతు లభిస్తోంది.

15, నవంబర్ 2012, గురువారం

వణుకుతున్న శ్రీనగర్‌

ఉష్టోగ్రత మైనస్‌ 8 డిగ్రీలు
             జమ్మూ కాశ్మీర్‌లో ఈ సీజనులోనే అత్యంత శీతల రాత్రిని శ్రీనగర్‌ ప్రజలు 2012 నవంబర్‌ 14న బుధవారం రాత్రి అనుభవించారు. రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే పరిస్థితి ఉందని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ కనీస ఉష్ణోగ్రతలు మాత్రం కాశ్మీర్‌ లోయలోనూ, లడఖ్‌లోనూ ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. అరేబియన్‌ సముద్రం నుంచి వచ్చే పశ్చిమ పవనాలు (వెస్ట్రన్‌ డిస్ట్రబెన్సెస్‌) ఈ ప్రాంతాన్ని సమీపిస్తున్నందున వచ్చే రెండు రోజుల్లో మంచు లేదా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఇప్పటివరకు మైనస్‌ 11.2 డిగ్రీలుగా ఉంటూ వచ్చిన ఉష్ణోగ్రత గత రాత్రి మరో మూడు డిగ్రీలు తగ్గి మైనస్‌ 8కి చేరింది. లేV్‌ాలో ఇది అతి తక్కువ ఉష్ణోగ్రత కలిగిన రికార్డని వాతావరణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చెరువులు, సరస్సులు గడ్డ కట్టుకుపోయాయి. అధికారులు పైప్‌ల ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా మాత్రమే ప్రజలకు నీటిని అందిస్తున్నారు. సరిహద్దు పట్టణమైన కార్గిల్‌లో కనీస ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పూ లేదు. బుధవారం కనీస ఉష్ణోగ్రత మైనస్‌ 4.8 డిగ్రీలు కాగా, ఈ రోజు మైనస్‌ 4.6 డిగ్రీలకి చేరింది. కాగా శ్రీనగర్‌-లేV్‌ా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. లడఖ్‌ ప్రాంతాన్ని మిగిలిన రాష్ట్రంతో కలిపే ఏకైక రహదారి ఇదే కావడం గమనార్హం.

14, నవంబర్ 2012, బుధవారం

118 కోట్లు పలికిన గోల్కొండ వజ్రం

క్రిస్టీన్‌ వేలంలో గోల్కొండ వజ్రానికి రికార్డు ధర
రంగులేని 76 క్యారట్ల వజ్రంగానూ రికార్డు
              రంగులేని అరుదైన, అద్భుతమైన 76 క్యారెట్ల వజ్రం రికార్డులను తలదన్ని జెనీవాలో నిర్వహించిన వేలంలో 16.9 మిలియన్‌ యూరోలు (118,16,98,700) పలికిందని గార్జియన్‌ పత్రిక ప్రకటించింది. పేరొందిన కోహినూర్‌ , బ్లూహోవ్‌ వజ్రాలు లభించిన గోల్కొండ వజ్రాల గనుల్లోనే ఈవజ్రం కూడా లభించిందని వేలం నిర్వహించిన క్రిస్టీన్‌ సంస్థ తెలిపింది. గోల్కొండలో లభించిన వజ్రాలలో రంగులేని వజ్రాల కేటగిరీలోనూ ఇది రికార్డు ధర అని పేర్కొన్న క్రిస్టీన్‌ ప్రతినిధి నాణ్యతలో దీన్ని కోహినూర్‌తో పోల్చవచ్చని అన్నారు. ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్‌డ్యూక్‌ జోసెఫ్‌ ఆగస్ట్‌ పేరుమీద ఉన్న ఈ వజ్రం ఆయన కుమారుడి నుంచి చేతులు మారుతూ వచ్చినాలుగుసార్లు వేలంలోనిలిచి తాజాగా ఈరికార్డు సృష్టించింది.

12, నవంబర్ 2012, సోమవారం

ఆహార భద్రత కోసం 5 కోట్ల సంతకాలు

సర్కారుకు వినతిపత్రం 

నాలుగు వామపక్షాల నిర్ణయం

                     దేశంలోని ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించే విధంగా ప్రజాపంపిణీ వ్యవస్థను విస్తరించాలని డిమాండ్‌ చేస్తూ ఐదు కోట్ల సంతకాలతో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని సిపిఎం, సిపిఐ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నిర్ణయించాయి. ఈ నాలుగు పార్టీల నేతలు 2012 నవంబర్‌ 12 సోమవారం ఇక్కడ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జులై నుండి సెప్టెంబర్‌ వరకూ జరిగిన ప్రచారోద్యమానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వున్న ప్రజల నుండి మంచి స్పందన లభించిందని పార్టీ నేతలు వివరించారు. ఈ ప్రచారోద్యమాన్ని విస్తృతం చేయటం కోసం దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని నిర్వహించాలని వామపక్ష నేతల నిర్ణయించామన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నుండి వచ్చే ఏడాది జనవరి చివరి వరకూ కొనసాగే ఈ ఉద్యమంలో పార్టీ కార్యకర్తలు, సభ్యులు ఇంటింటికీ తిరిగి సంతకాలను సేకరిస్తారు. ఈ సంతకాలతో కూడిన వినతిపత్రంలో ప్రజలను పేదరిక రేఖ ఎగువ/దిగువ అని విభజించకుండా అందరికీ ప్రయోజనం చేకూరేలా ప్రజాపంపిణీ వ్యవస్థను విస్తృతం చేయాలని, కిలో రెండు రూపాయల వంతున కుటుంబానికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని, ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేయనున్నారు. ఈ సమావేశంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, సీనియర్‌ నేత సీతారాం ఏచూరి, మరో నేత ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లరు, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీనియర్‌ నేత ఎబి బర్దన్‌, మరో నేత డి రాజా, ఆరెస్పీ నేత దేవవ్రత విశ్వాస్‌, ఫార్వర్డ్‌బ్లాక్‌ నేత అబనీరారు తదితరులు పాల్గొన్నారు.

9, నవంబర్ 2012, శుక్రవారం

స్విస్‌ బ్యాంక్‌ చిట్టా విప్పిన కేజ్రీవాల్‌

రాహుల్‌ నేస్తాలు, అంబానీ సోదరులు సహా 700 మందికి ఖాతాలు
            అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈసారి స్విస్‌ బ్యాంకులో 'నల్ల' ఖాతాలున్న కుబేరుల గుట్టు విప్పారు. కార్పొరేట్‌ దిగ్గజాలైన అంబానీ సోదరులు ముఖేష్‌, అనిల్‌ వంద కోట్ల రూపాయల చొప్పున, రిలయన్స్‌ గ్రూపునకు చెందిన మోటెక్‌ సాఫ్ట్‌వేర్‌ రూ.2,100 కోట్లు, సందీప్‌, అన్నూ టాండన్‌ రూ.125 కోట్ల చొప్పున, నరేశ్‌ గోయెల్‌ రూ. 80 కోట్లు, డాబర్‌ బర్మన్‌ సోదరులు రూ.25 కోట్ల చొప్పున జెనీవాలో నల్ల డబ్బు దాచారని ఆయన 2012 నవంబర్‌ తొమ్మిదిన శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. జెనీవాలోని హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో భారత జాతీయులకు చెందిన దాదాపు 700 ఖాతాల వివరాలు తమ చేతికి అందాయని, ఈ జాబితా ప్రభుత్వానికి ఆరేళ్ల క్రిందటే అందిందని వివరించారు. అయితే ఈ జాబితాను బయట పెట్టే ధైర్యం ప్రభుత్వానికి ఇంతవరకూ రాలేదన్నారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ సన్నిహితురాలు అనూ టాండన్‌, ఆమె భర్త మాజీ ఐఆర్‌ఎస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారి సందీప్‌ టాండన్‌, రిలయన్స్‌ గ్రూప్‌లకు ఈ బ్యాంకులో రు.125 కోట్ల మేర డిపాజిట్లు వున్నాయని కేజ్రీవాల్‌ చెప్పారు.దేశాన్ని దోచుకుని విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్న 'నల్ల ధనికు'లకు కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తోందని కేజ్రీవాల్‌ విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న 'నల్లధనికు'ల జాబితా, అందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద వున్నప్పటికీ వాటిని బహిర్గతం చేసే ధైర్యం చేయడం లేదన్నారు. 'నల్లధనికు'లకు అండగా వుంటున్న సర్కారు, వారి ప్రయోజనాల కోసం దేశ ప్రజల భవితను పణంగా పెడుతోందని మండిపడ్డారు. గత ఏడాది జులైలో కేంద్ర ప్రభుత్వం అందుకున్న ఈ జాబితాలో వున్న వారి పేర్లను పూర్తిగా బయట పెట్టటం తమకు సాధ్యం కాలేదన్నారు. తమకు అందిన జాబితాలోని ఖాతాల నిల్వలను వివరించారు. స్విస్‌ బ్యాంకుల్లో దాదాపు రు.25 లక్షల కోట్ల నల్లధనం మూలుగుతోందని చెప్పిన కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి అందిన 700 పేర్లకు చెందిన ఖాతాల్లో కేవలం రు. 6 వేల కోట్లు మాత్రమే వుందని తెలిపారు. హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా నల్లధనానికి ఆశ్రయం కల్పిస్తున్నదని ఆయన విమర్శించారు.
మాకెక్కడా ఖాతాల్లేవు : అంబానీ సోదరులు
             కేజ్రివాల్‌ చేసిన ఆరోపణలన్నింటినీ అంబానీ సోదరులు తిరస్కరించారు. జెనీవాలోని హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో తమకు నల్లధనం ఉందని కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ, తమకెక్కడా ఏ ఖాతాలూ లేవన్నారు. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ తనకుగానీ, రిల్‌కుగానీ ప్రపంచంలో ఎక్కడా అక్రమ ఖాతాలు లేవని చెప్పారు. సాధారణ వాణిజ్య కార్యకలాపాల్లో భాగంగా రిల్‌ అంతర్జాతీయ అనుబంధ సంస్థలు హెచ్‌ఎస్‌బిసితో సహా అనేక ప్రపంచ బ్యాంకులతో లావాదేవీలు జరుపుతాయని, ఈ ఖాతాలన్నీ పూర్తిగా నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవేనని తెలిపారు. రిలయన్స్‌ గ్రూపు అధినేత అనీల్‌ అంబానీ కూడా ఈ ఆరోపణలన్నింటినీ ఒక ప్రకటనలో తోసిపుచ్చారు. తమకు కూడా జెనీవాలోని హెచ్‌ఎస్‌బిసిలో ఖాతాల్లేవని పేర్కొన్నారు. దీనిపై స్పందించేందుకు హెచ్‌ఎస్‌బిసి ప్రతినిధి, బర్మన్‌ సోదరులు నిరాకరించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, కొంతమంది ప్రమేయంతోనే కేజ్రివాల్‌ ఆరోపణలు చేస్తున్నారని టాండన్‌ అన్నారు.

7, నవంబర్ 2012, బుధవారం

ఓడిన ఒబామా ప్రత్యర్థి

ఓడిన ఒబామా ప్రత్యర్థి

                         ఒబామా ప్రత్యర్థి ఓటమి పాలయ్యారు. ఒబామాను ఓడించేందుకు రోమ్నీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షునిగా రెండోసారి గెలిచారు. పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగినా ఒపీనియన్‌ పోల్స్‌లో ఫలితాలు కూడా అదే రీతిలో వెలువడినా చివరకు ఒబామానే విజయం వరించింది. మొత్తం 50 రాష్ట్రాలకు గానూ ఇప్పటి వరకు 42 రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. ఒబామాకు 303 ఓట్లు రాగా, రోమ్నీకి 206 ఓట్లు మాత్రమే లభించాయి. మొత్తం 538 ఓట్లకు గానూ 270 మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకున్నవారు అధ్యక్ష పీఠాన్ని అధిష్టిస్తారు. 22 రాష్ట్రాల్లో రోమ్నీ, 20 రాష్ట్రాల్లో ఒబామా విజయం సాధించారు. అప్పటికే ఒబామాకు అవసరమైన 270 ఓట్లు వచ్చేశాయి. దాంతో రోమ్నీ తన ఓటమిని అంగీకరిస్తూ ఒబామాను అభినందించారు. ప్రస్తుతం దేశం ముందున్న సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొనగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన విజయం ఖాయమని తెలిసిన వెంటనే ఒబామా ట్విట్టర్‌లో తన ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఈ విజయం అమెరికా ప్రజలందరిదీనూ అని ఆయన వ్యాఖ్యానించారు. మున్ముందు అమెరికాకు మంచి రోజులున్నాయని, రాబోయే కాలంలో అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఫలితాలు వెలువడిన వెంటనే డెమొక్రాట్లు ఆనందంతో వీధుల్లోకొచ్చి సంబరాలు జరుపుకున్నారు. చికాగోలో ఒబామా తన భార్య మిషెల్‌, కుమార్తెలు సాషా, మలియాలతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమెరికా ప్రజల కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మధ్య తరగతి ప్రజల కోసం పాటు పడతామని అన్నారు. మన ముందున్న పయనం చాలా సుదీర్ఘమైనది, కఠినమైనది. ఈ పరిస్థితుల్లో సొంతంగా శక్తి సామర్ధ్యాలు పుంజుకుని మన ప్రాభవాన్ని పొందేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. వేలాది మంది మద్దతుదారులు, అభిమానుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రసంగం సాగింది. అమెరికాకు ఇంకా మంచి రోజులు ముందున్నాయన్నారు. రోమ్నీతో తాను మాట్లాడానని, ఆయన్ని, ఆయన సహచరుడు పాల్‌ రాన్‌ను అభినందించానని చెపుతూ త్వరలోనే వారితో కలిసి కూచుని ముందుకెలా సాగాలో చర్చిస్తానని చెప్పారు. 'ఎన్నికల ప్రచారం సందర్భంగా మేం భీకరంగా పోరాడి వుండవచ్చు, కానీ అది కూడా ఈ దేశాన్ని అమితంగా ప్రేమిస్తున్నందువల్లనే' అని ఒబామా అన్నారు. మన భవిష్యత్‌ పట్ల అత్యంత జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి వుందన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఓటింగ్‌లో తన ప్రత్యర్థికి మద్దతు తెలిపిన వారిని ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ''మీ ఓటు నాకు వచ్చిందో లేదో తెలియదు. కానీ మీరు చెప్పేది నేను వింటాను, మీరందరూ కలిసి నన్ను ఒక మంచి అధ్యక్షుడిగా చేయండి.'' అని అన్నారు. ఇన్ని రోజులుగా ప్రచారంలో పాల్గొని మీ అందరి కష్టసుఖాలు విన్నాను, గతంలో కన్నా కృత నిశ్చయంతో వున్నా, మీ నుండి మరింత స్ఫూర్తి పొందానని చెప్పారు. ఇప్పటివరకు మనం ఎన్ని కష్టాలు అనుభవించినా ఇక మన ముందున్న భవిష్యత్తు సుందరమయంగా చేసుకోగలమని ఆశిస్తున్నానన్నారు. తన విజయం కోసం కృషి చేసిన వారందరికీ ఆయన పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. మనమందరం కలిసికట్టుగా మన భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ''మన రాజకీయాలు శాసిస్తున్నట్లుగా మనలో విబేధాలు రాకూడదు, మన వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ఈ దేశ ప్రయోజనాలే మనకు మిన్న'' అని అన్నారు. మీ అందరి సహకారంతో ఈ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.

5, నవంబర్ 2012, సోమవారం

సుందరయ్య సందేశం ఆదర్శనీయం

సిపిఎం జిల్లా కార్యదర్శి కిల్లెగోపాల్‌

ఆకట్టుకున్న 'ప్రజాపోరులో పాటలయాత్ర'

                 పీడిత ప్రజల కోసం నిరంతరం పోరాడి మార్క్సిజమే మానవాళికి మనుగడ అని చెప్పిన మహానేత సుందరయ్య జీవితం ఆదర్శనీయమని సిపిఎం మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి కిల్లెగోపాల్‌ అన్నారు. 2012 నవంబర్‌ ఐదున అంబేద్కర్‌ కళాభవన్‌లో సుందరయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో 'ప్రజాపోరులో పాటల యాత్ర'లో సుందరయ్య జీవిత ఘట్టాలను కళాకారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కిల్లెగోపాల్‌ మాట్లాడారు. నేడు రాజకీయం అంటే అవినీతి, అశ్రిత పక్షపాతం, కుంభకోణాలు అని పలువురు విమర్శిస్తున్నారని అన్నారు. సుందరయ్య ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవులకే వన్నె తెచ్చిన మచ్చలేని మహానాయకుడు అని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం పాలక విధానాలకు వ్యతిరేకంగా ముందుండి పోరాడిన ధీరశాలి అని కొనియాడారు. నేడు యువతరం విద్యార్థులు సుందరయ్య పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ప్రజాపోరాటంలో సుందరయ్య ఏనాడూ వెనుకంజ వేయలేదని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న చైతన్య కళలు ఉద్యమానికి ఊతం ఇస్తాయన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ఉద్యమాలు చేసి సమసమాజ స్థాపన చేయడమే సుందరయ్యకు నిజమైన నివాళి అని అన్నారు. కళారూపాల్లో సుందరయ్య కళారూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. విప్లవ నేత సుందరయ్యకు పోరుదండాలు అనే గీతం కంటతడి పెట్టించింది. మధ్యమధ్యలో జీవిత విశేషాలు, పోరాట ఘట్టాలను కళారూపాలను కళాకారులు ఆవిష్కరించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కరెంటు కోత, ఛార్జీల మోతపై కెవ్వు కేక నాటిక నవ్వించడమే కాకుండా ప్రజలను ఆలోచింపజేసింది. శ్రమజీవుల చెమటచుక్కపై నృత్యరూపకం ప్రదర్శించారు. అన్ని వర్గాల ప్రజల జీవనశైలిని చూపించారు. జానపద కళాకారులు సుందరయ్యకు నివాళ్లు అర్పిస్తూ ప్రదర్శించిన 'కదంబం' పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ధరల దెబ్బ నాటిక, వాల్‌మార్ట్‌, షాపింగ్‌మాల్‌ తదితర నాటికలు ప్రభుత్వ విధానాల తీరును ప్రశ్నించేలా ఉన్నాయి. లఘునాటికలు ప్రజలను చైతన్య పరిచాయి. కళారూపాలు ప్రారంభం నుంచి అత్యంత ఉత్తేజితంగా సాగాయి. కళారూపాల బృందం మేనేజర్‌ గాదె సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు జగన్‌, పిఎన్‌ఎం రాష్ట్ర నాయకులు సోమన్న, సాహితీ స్రవంతి కళాకారులు వల్లబాపురం జనార్దన్‌, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యమ్రానికి పిఎన్‌ఎం జిల్లా కార్యదర్శి గోపాల్‌ అధ్యక్షత వ్యవహరించారు..