20, నవంబర్ 2012, మంగళవారం

భారత ప్రజలు మోడీని ప్రధానిగా అంగీకరించరు

తీస్తా సెతల్వాద్‌     

         నరేంద్ర మోడీని ఈ దేశ ప్రధానిగా భారత ప్రజలు ఎన్నడూ అంగీకరించబోరని కంబాట్‌ కమ్యూనలిజం పత్రిక ఎడిటర్‌, గుజరాత్‌ ఊచకోత బాధితులకు న్యాయం చేకూర్చేందుకు రాజీలేని పోరు సాగిస్తున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ చెప్పారు. బడా కార్పొరేట్‌ శక్తుల అండ, తనకు తానుగా ఎంతగా ప్రచారం చేసుకున్నప్పటికీ మోడీ నిరంకుశ రాజకీయ పోకడలను గుజరాత్‌ వెలుపల ప్రజలు అంగీకరించబోరని ఆమె అన్నారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో వివిధ సమావేశాల్లో పాల్గొంటూ బిజీగా గడిపిన సెతల్వాద్‌ ప్రజాశక్తికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు...

                 గత రెండు రోజులుగా మీరు హైదరాబాద్‌లో వివిధ సెక్షన్లకు చెందిన ప్రజానీకంతో సమావేశాలు జరిపారు. సభల్లో మాట్లాడారు. హైదరాబాద్‌ పాత బస్తీలో ఇటీవల చేసుకున్న మత ఉద్రిక్తతల గురించి మీ అభిప్రాయం ఏమిటి?
           భాగ్యలక్ష్మి ఆలయ వివాదం హఠాత్తుగా ముందుకొచ్చింది. ఘర్షణల దాకా పరిస్థితి దారితీయడానికి గత కొన్ని మాసాలుగా ప్రయత్నాలు జరిగినట్లు నాకు అనిపిస్తోంది. హిందూత్వ, ఎంఐఎం ఈ రెండు మతతత్వ శక్తులు దీనికి మతం రంగు పులిమి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ఇటువంటి అంశాలను సొమ్ము చేసుకోవడానికి హిందూత్వ శక్తుల కుతంత్రాలు కుయుక్తులు అందరికీ తెలిసిందే.కర్ణాటకలోని చిక్‌మగ్‌లూరు జిల్లా బాబా బుదాన్‌గిరి మసీదు విషయంలో బజరంగ్‌ దళ్‌, విహెచ్‌పిల చర్యలు మతఘర్షణలకు ఎలా దారితీస్తున్నాయో చూస్తున్నాము. వారికి ఇది కొత్తకాదు. వారు ఇటువంటి అంశాల కోసం గోతికాడ నక్కలా కాచుక్కూర్చొంటారు.
మతత్వాన్ని రెచ్చగొట్టడంలో ఇరు శక్తులూ పోటీపడుతున్న హైదరాబాద్‌లో ఇటువంటి పన్నాగాలను ఎదుర్కోవడం ఎలా?
               ఇరు మతాలకు చెందిన సాధారణ, మాన్యులు, సదాలోచనాపరులు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ఇరు పక్షాలకు చెందిన మతతత్వ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం యావత్‌ సమాజాన్ని కల్లోలంలోకి నెట్టేందుకు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. మతతత్వ శక్తులు తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు పన్నిన పన్నాగాల్లో తాము పావులుగా ఉపయోగపడుతున్నామా, లేక వారి ఆటకట్టించేందుకు ప్రయత్నిస్తున్నామా అనేది సాధారణ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి.
          బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం పార్లమెంట్‌ ప్రార్థనా స్థలాల చట్టాన్నొకదానిని తీసుకొచ్చింది. ప్రార్థనా స్థలాల వివాదాలకు సంబంధించి 1947 నాటికి ఉన్న యథాతథ పరిస్థితే కొనసాగాలని ఆ చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ, మతతత్వ శక్తులను బుజ్జగించడం కోసం దీనిని పాలనా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఏదో ఒక వంకతో వివాదాలు రేపడానికి మనకు తగినన్ని ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తే ఈ సమస్య రాదు. దురదృష్టవశాత్తూ వాటిని అమలు చేసే నాథుడే కరువయ్యాడు. ఈ వివాదాలు, రాద్ధాంతాలు సామాన్యులకు ఏమీ పనికొచ్చేవి కావు. పైగా ఇటువంటి వాటివల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్యులే. కర్ఫ్యూలు, శాంతిభద్రతలు వంటివి ఈ వర్గ ప్రజానీకం బతుకు చిత్రాన్ని చిదిమేస్తాయి.అందుకే వీరు శాంతి సామరస్యాల కోసం ప్రజలను సమీకరించాలి. ఇటువంటి భావోద్వేగ అంశాలపై
లౌకిక శక్తుల కన్నా మతతత్వ శక్తులే సులువుగా ప్రజలను సమీకరించగలుగుతున్నాయి కదా...
               ఈ శక్తులు అటువంటి అంశాలను లేవనెత్తడానికి సదా ఎందుకు ప్రయత్నిస్తున్నాయంటే అందుకు కారణం ఈ విచ్ఛిన్నకర అంశాలు ఎన్నికల రాజకీయాలు ముడిపడి ఉండడమే. మీరు గనుక ఒకటి రెండు ఎన్నికలను గనుక చూస్తే ప్రలు మరీ ముఖ్యంగా యువత ఇటువంటి అంశాలపట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. దీని వెనుక ఉన్న పన్నాగాల గురించి వారికి తెలుసు కాబట్టే వారు దీనికి దూరంగా ఉంటున్నారు. దేశ లౌకిక వ్యవస్థను దెబ్బతీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బిజెపి, హిందూత్వ శక్తులు అందుకే ఒక రకమైన నిరాశనిస్పృహకు లోనవుతున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మతతత్వశక్తుల ప్రేరేపణతో 12 మతహింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. లౌకికత్వానికి ఆలంబనగా ఉండే ఫైజాబాద్‌లో కూడా ఇటీవల ఇటువంటి హింస చెలరేగడం చూశాం. గత ఎన్నికల్లో యుపిలో బిజెపి చాలా పేలవమైన ఫలితాలు సాధించింది. దీని నుంచి తిరిగి నిలదొక్కుకోవడానికి అక్కడ అను నిత్యం విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది. మత పరంగా ప్రజలను సమీకరించి తన ఓటు బ్యాంకును పటిష్టపరచుకోవాలని ప్రయత్నిస్తోంది. అక్కడ చట్టబద్ధమైన పాలన సాఫీగా సాగేలా చూసేందుకు లౌకిక పార్టీలు దృఢంగా, నికరంగా వ్యవహరించాలి.
గుజరాత్‌ విషయానికొద్దాం. 2002 గుజరాత్‌ నరమేథంలో బాధితులకు న్యాయం కోసం జరుగుతున్న పోరాటం అంటే దాదాపు మీరు జరుపుతున్న పోరాటంగానే భావించవచ్చు. ఈ క్రమంలో నరోడా పాటియా కేసులో సుప్రీం కోర్టు ఆ మధ్య ఇచ్చిన తీర్పు ఎటువంటి ప్రాధాన్యత కలిగి ఉందంటారు?
          సుప్రీం కోర్టు ఆగస్టు29న ఇచ్చిన ఆ తీర్పు చారిత్రాత్మకమైనది. గుజరాత్‌ నరమేధం కేసులో బాధితులకు న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో ఇదొక పెద్ద ముందడుగు. బాధితులకు న్యాయం చేకూర్చే విషయంలోనే కాదు, ముఖ్యమైన రాజకీయ నాయకులను దోషులుగా నిలబెట్టిన మొట్టమొదటి తీర్పుగా కూడా ఇది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.తప్పు చేసినా శిక్షపడకుండా తప్పించుకునే సంస్కృతికి ఇది బ్రేక వేసింది. దోషులకు అధికారంలో ఉన్నవారికి ఎంత సన్నిహితులన్నదాంతో నిమిత్తం లేకుండా వారిని న్యాయం ముందు నిలబెట్టిందీ తీర్పు.
               అయితే ఇంత ముఖ్యమైన తీర్పునకు మీడియాలో తగినంత ప్రాధాన్యత లభించకపోవడం నాకు బాధ కలిగించింది. అమెరికాలో 'సిక్కు'లపై దాడులు జరిగితే దానిని 'ద్వేషపూరిత నేరం'గా పరిగణిస్తుంది. కానీ, గుజరాత్‌లో జరిగిన నరమేథాన్ని 'హేయమైన నేరంగా' పేర్కొనడానికి అది ఇష్టపడడం లేదు. ఈ తీర్పుతో బిజెపి జాతీయ స్థాయిలో ఇరుకునపడాల్సింది. కానీ, అలా జరగలేదు. అగ్రవర్ణాలు, పెత్తందారీ వర్గాలు, మధ్య తరగతివారు మతతత్వం, విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల పట్ల కరకుగా వ్యవహరించడానికి అంతగా సుముఖత చూపడం లేదు.అవినీతిపై వీరు తీవ్రంగా ఆందోళన చెందుతారు. కానీ, మన దేశ మూలాలను తొలిచేసే మతోన్మాదాన్ని ఒక కేన్సర్‌లా చూడడానికి వీరు నిరాకరిస్తారు. మతతత్వశక్తులతో పోరాడడానికి బదులు ఈ విషయాలను మరుగుపరిచేందుకు ప్రయత్నిస్తారు.
నరేంద్రమోడీని భావి భారత ప్రధానిగా చూపించేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. దీనిని మీరు ఏ విధంగా చూస్తారు?
               గుజరాత్‌ నరమేథంలో తన పాత్రను కప్పిపుచ్చు కునేందుకు 2004-05లో నరేంద్ర మోడీ అభివృద్ధి గురించి ప్రచార ఊదరను పకడ్బందీగానే చేపట్టారు. ఇందుకోసం తన ముఖ్యమంత్రి హోదాను కూడా వాడుకున్నారు. ఆయన చూపిన అభివృద్ధి ఎంత డొల్లో ఆత రువాత వచ్చిన అనేక నివేదికలు, స్థానిక ప్రతిపక్ష నాయకులు బట్టబయలు చేశారు. జాతీయ మీడియా దీనిని అంతగా పట్టించుకోలేదు. మోడీ మీడియాతో నెరిపే సంబంధాలు అటువంటివి. మోడీ ఏర్పాటు చేసుకున్న ప్రెస్‌ రిలేషన్స్‌ (మీడియాతో సంబంధాలు) యంత్రాంగం ఆయనకు లేని ప్రతిష్టను కల్పించేందుకు బాగా ఉపయోగపడింది. ఇందుకోసం ఆయన ఆప్కో వరల్డు వైడ్‌ అనే ఒక అంతర్జాతీయ పిఆర్‌ సంస్థను ఏర్పాటు చేసుకుని దానికి ప్రతి నెలా పాతికవేల డాలర్లు చెల్లిస్తున్నాడు. ఆ పిఆర్‌ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే మోడీలాంటి నియంతలకు ప్రపంచవ్యాపితంగా ఒక మంచి ఇమేజిని సృష్టించడం. ఈ ప్రచారానికి చెల్లించిన డబ్బు ఎవరిది? మోడీదా? లేక గుజరాత్‌ ప్రభుత్వానిదా? అనే విషయమై తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం కింద మేము ఒక దరఖాస్తు దాఖలు చేశాము. వారు మాత్రం ఆ వివరాలు ఇవ్వడం లేదు.
అంబానీలు, మిట్టల్‌, రతన్‌ టాటా, బజాజ్‌ వంటి బడా పారిశ్రామికవేత్తలు ప్రధాని పదవికి మోడీ అత్యుత్తమమైన అభ్యర్థిగా అప్పుడే ఆకాశానికెత్తేస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలు ఒక వ్యక్తిని ఈ విధంగా ప్రధాని అభ్యర్థికి బలపరచడం భారత దేశ చరిత్రలో బహుశా ఇదే ప్రథమం. బడా వ్యాపారులు మోడీని బాహాటంగా సమర్థిస్తున్నారనేది స్పష్టం. హిందూత్వ మితవాద సంస్థలు, గ్లోబల్‌ పెట్టుబడి, భారత బడా వ్యాపారవర్గాలు ఆయనకు పెద్ద యెత్తున డబ్బు సమకూర్చుతుండడానికి కారణం లేకపోలేదు.నిరంకుశ ధోరణితో కూడిన మోడీ పని తీరు వారికి ఎంతగానో నచ్చింది. ఈ దేశంలో వనరులను, సంపదను యథేచ్ఛగా లూటీ చేసుకునేందుకు వారికి ఇటువంటి లక్షణాలున్న వ్యక్తే కావాలి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. అయితే నేను ఒక విషయం మాత్రం చెప్పగలను. భారత ప్రజలు మోడీని ప్రధానిగా తిరస్కరిస్తారు. గుజరాత్‌ దాటితే మిగిలిన దేశాన్ని మోడీ తన వెంట తీసుకెళ్ళలేరు. 2009 సాధారణ ఎన్నికల్లో మోడీ 122 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించగా, వీటిలో సగానికిపైగా సీట్లలో బిజెపి ఓడిపోయింది.
చివరిగా వ్యక్తిగతానికి సంబంధించిన ఒక అంశం అడుగుతున్నాను. న్యాయం కోసం మీరు జరుపుతున్న ఈ సుదీర్ఘ పోరాటంలో వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులను మీరు ఎలా ఎదుర్కొంటున్నారు?
      మంచి ప్రశ్నే. 2004 తరువాత నాకు, అలాగే ఈ కేసుల్లో సాక్షులకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. వీటి గురించి మేము సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టు మాకు భద్రత కల్పించమని ఆదేశాలు జారీ చేసింది. అంతకన్నా ముఖ్యంగా మతాలకతీతంగా గుజరాత్‌ ప్రజల నుంచి మాకు విస్తృత మద్దతు లభించింది. ఇది నాకు కొండంత స్థయిర్యాన్ని ఇచ్చింది. అయితే, నేను భయపడిన సందర్భాలు కూడా కొన్ని లేకపోలేదు. ఆ భయాన్ని న్యాయం కోసం జరిపే పోరాటంలోకి నేను మలచుకున్నాను. ఈ మొత్తం కాలంలో నా భర్త జావెద్‌ ఆనంద్‌ నాకు పూర్తి వెన్నుదన్నుగా నిలిచారు. నేను, మా బృంద సభ్యులు లౌకికత్వ వేదికనుంచి ఇంత విజయవంతంగా ఈ పోరాటం నడుపుతున్నామంటే అందుకు ఈ తోడ్పాటు కూడా ఒక కారణం.ఈ పోరాటం ద్వారా మాకు సమాజంలోని వివిధ సెక్షన్ల నుంచి విస్తృత మద్దతు లభిస్తోంది.

9 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

If religious fundamentalism is dangerous, secular fundamentalism is all the more dangerous, for it takes away any respect people have for secularism. The anti Modi campaign is in the hands of secular fundamentalists.

అజ్ఞాత చెప్పారు...

I fully agree with Sri. Prasad

అజ్ఞాత చెప్పారు...

దేవగౌడ, చరణ్సింగులను ప్రధానులుగా భారత ప్రజలు ఎన్నుకున్నారా? మన్‌మోహన్ సింగును భారత ప్రజలు భరించడం లేదూ? అంజయ్య, రాబ్రీ లాంటోళ్ళే ముఖ్యమంత్రులయి పోతుంటే.

ఇలాంటి స్పాన్సర్డ్ తాటాకు చప్పుళ్ళు ఈ దేశంలో కొత్తనా? ఇంతకీ ఈవిడెవరో!

durgeswara చెప్పారు...

ఈవిడ హిందువులు మాత్రమే మతోన్మాదులు అని గాఠ్ఠిగా నమ్మిన సెక్యులరిస్ట్ .

panuganti చెప్పారు...

ఇటీవల బిజెపినేత ఎల్‌ కె అద్వాని మనోగతం మీరు చదివి ఉంటారు. ఆయన ట్విట్టర్‌లో 2014 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, కాంగ్రేసేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అభిప్రాయ పడ్డారు. కాబట్టి తీస్తాసెతల్వాద్‌ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పేమి లేదు. ఒక వేల ఆమె చెప్పిన దానికంటే భిన్నంగా ఆయన ప్రధాని అవుతారనుకుంటే ఉన్న అవకాశాలేమిటో చెప్పండి. ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి కాంగ్రెస్‌ పార్టీల పట్ల ప్రజలు విసుగెత్తి ఉన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆరెండు పార్టీల నుంచి కాకుండా మరొకరు ప్రధాని కావచ్చేమో. లేదంటే నరేంద్ర మోడీ బిజెపికి రాజీనామా చేసి ఇరత పార్టీల్లో చేరి ప్రధాని అయ్యే అవకాశాలయితే ఉండక పోవచ్చని నాఅంచనా. ఎందుకు ఆయనను ప్రధానిగా అంగీకరించరో తీస్తాసెతల్వాద్‌ కొన్ని ఉదాహరణలు చెప్పారు. అందుకే నరేంద్రమోడీని ప్రధానిగా అంగీకరించబోరని చెప్పారు

Saahitya Abhimaani చెప్పారు...

మీరు మెచ్చుకునే "ఆవిడ" భారత ప్రజలందరి ప్రతినిధా లేక అందరి మన్సుల్లోకి దూరి ఎవరు ప్రధాని అవ్వాలి ఎవరు అవ్వక్కర్లేదు అని చెప్పే శాసకి యా. ఏదో ప్రచారానికి ఒక కమ్యూనిస్ట్ పేపర్లో వచ్చిన స్పాన్సర్డ్ వ్యాసం చూసి ఇలా అభిప్రాయాలకి వచ్చేస్తే ఎలా మాష్టారూ. ఈ రోజున మీడియా అనేది ఎంతటి పక్షపాతంగా ఉంటుందో, మోడి వ్యవహారం ఒక పెద్ద ఉదాహరణ. జర్నలిజం నిజంగా నేర్చుకునే విద్యార్ధులు అంటూ ఉంటె గింటే, మోడీ వ్యవహారాన్ని పత్రికల్లో ఒక విషయం గురించి ఎలా వ్రాయకూడదో అన్న దానికి ఒక కేస్ స్టడీగా వాళ్ళకు చూపించవచ్చు. మీడియా గుజరాత్ వ్యవహరాన్ని రిపోర్ట్ చేసే విధానం, మోడీ గురించి చేసే దుష్ప్రచారాన్ని, మోడీ ప్రధాని అనంగానే ఎందుకు ఇలా కొంతమంది ఉలిక్కిపడుతున్నారో, తత్తరపాటుకు గురవుతున్నారో తరచి చూసుకోవాలి. ప్రజల మనోగతం ఏమిటి అని నిజంగా తేలాలంటే, ప్రధాని పదవికి ప్రత్యక్ష ఎన్నికలు పెడితే బాగా తెలుస్తుంది కాని, ద్వేషంతో రగిలిపోతున్న మహిళ చెప్పే మాటలవల్ల, ఆ మాటలు ప్రచురించే కమ్యూనిస్ట్ పత్రికల వ్యాసాల వల్ల కాదని నా ఉద్దేశ్యం.

అజ్ఞాత చెప్పారు...

/వారు ఇటువంటి అంశాల కోసం గోతికాడ నక్కలా కాచుక్కూర్చొంటారు. /
వీరూ అంతే. ఇలాంటి అంశాలు ఎప్పుడొస్తాయా, వాటి మీద తమ మేతావిత్వం పేపర్లలో ఎప్పుడు చాటుకుందామా అని కాచుకు కూచొని వుంటారు. :)
పోనీ ఇలాంటి మేతావులు రాహుల్ ప్రధాని ఎందుకు కావాలో చెప్పమనండి. మోడీ కనీసం ఓ స్టేట్‌లో ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంలో వున్నారు. అతనిపై బ్రిటన్, అమెరికాలు తమ హేటువాదాన్ని సమీక్షించుకున్నాయి.
రాహుల్ ప్రధానిగా, జగన్ ముఖ్యమంత్రిగా కావాలనుకునే వాళ్ళు, అవిటివాళ్ళ కడుపులుకొట్టిన ఖుర్షీద్, 13మందిని రాజకీయ హత్యలు చేశామని బాహాటంగా జబ్బలు చరుచుకున్న నాయకులున్న(CPI-M) ఈ దేశంలో వుండగా మోడీ ఎందుకు కాకూడదు?!

panuganti చెప్పారు...

రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారనే చర్చకు తీస్తా సెతల్వాద్‌ కారణం కాదు. అదేవిధంగా జగన్‌ ముఖ్యమంత్రి అవుతారనే వారు కూడా ఉన్నారు. దానికి కూడా ఆమె కారణం కాదు. మనదేశంలో రకరకాల సిద్ధాంతాలు, అంచనాలు, ఆలోచనలు ఉన్నవారు, అలాంటి పత్రికలు, ఛానళ్లు ఉండటం సహజం. అందులో మనమూ భాగమే. ఏదయితేనేం.... రాహుల్‌గాంధీ, జగన్‌లాంటి వారితో నరేంద్ర మోడీని పోల్చుకున్నారూ మంచిదే. జనం అంగీకరిస్తే ఎవరు ప్రధాని అయినా ఉలిక్కి పడాల్సింది. తత్తరపాటు ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. అయితే సమాజానికి కీడు చేసే వారు, ప్రజల సంపదను దోచుకునే వారు, దేశసార్వభౌమత్వాన్ని దెబ్బతీసే వారు కాకుండా మంచి ఉత్తముడు, ప్రజల కష్ట నష్టాలు అర్థం చేసుకునే వారు ప్రధాని అయితే మంచిది.

Saahitya Abhimaani చెప్పారు...

"....దేశసార్వభౌమత్వాన్ని దెబ్బతీసే వారు కాకుండా మంచి ఉత్తముడు, ప్రజల కష్ట నష్టాలు అర్థం చేసుకునే వారు ప్రధాని అయితే మంచిది. ..."

That is why in any opinion poll Narendra Modi is far ahead of any other person, the media misinformation and sponsored leftist propaganda notwithstanding.