3, జనవరి 2011, సోమవారం

సూరి జీవితం నెత్తుటితోనే సమాప్తం

బయటకొచ్చిన ఏడాదిలోపే హతం
కత్తులతో సహవాసం... నెత్తుటితో సమాప్తం అన్న సినీ నానుడి నిజమైంది. ఫ్యాక్షన్‌లో పుట్టి పగలు, ప్రతీకారంతో బతికిన గంగుల సూర్య నారాయణరెడ్డి అలియాస్‌ మద్దెలచెరువు సూరి జీవితం కూడా రక్తంతోనే అర్థాంతరంగా ముగిసింది. 11 సంవత్సరాల జైలు జీవితం గడిపి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టి ఏడాది తిరగకుండానే మరణించడం అనంతపురం జిల్లాలో సంచలనం రేపింది. మద్దెలచెరువు సూరికి ఫ్యాక్షన్‌ చరిత్ర ఉంది. మూడున్నర దశాబ్దాలకాలంగా మద్దెలచెరువు సూరి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబాల మధ్య ఫ్యాక్షన్‌ ముఠాకక్షలు నడుస్తున్నాయి. 1975 ముందు పరిటాల, గుంగుల కుటుంబాల మధ్య ఆదిపత్యపు పోరు ప్రారంభమైంది. 1975 తరువాత పరిటాల రవీంద్ర తండ్రి శ్రీరాములయ్య హత్యకు గురయ్యారు. దీనికి గంగుల నారాయణరెడ్డిపైనే ఆరోపణలొచ్చాయి. ఆ తరువాత 1982లో పరిటాల రవీంద్ర సోదరుడు పరిటాల హరిని పోలీసులు గ్రామం మధ్యలో ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇందులోనూ నారాయణరెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఆ తరువాత పరిటాల రవీంద్ర నక్సల్స్‌ వైపు మొగ్గుచూపారు. ఆ తరువాత 1983లో గంగుల నారాయణరెడ్డి అనంతపురం నగరంలోని ఒక లాడ్జీలో నక్సల్స్‌ చేతిలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రధాన కారణం పరిటాల రవీంద్రనే అన్న ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ సాక్ష్యాధారాలు లభించలేదు. ఈ హత్య తరువాత రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో 1993లో సంక్రాంతి పండుగ రోజున మద్దెలచెరువు సూరి నివాసంలో టీవి బాంబు పేలడంతో సూరి తప్ప కుటుంబ సభ్యులంతా చనిపోయారు. అప్పటి నుంచి సూరి బెంగుళూరులో అజ్ఞాతంలో జీవితం గడిపారు. పరిటాల రవీంద్రను లక్ష్యంగా చేసుకుని 1997లో హైదరాబాదులోని ఫిల్మ్‌సిటీలో కారుబాంబు పేల్చడం ద్వారా సూరి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఈ ఘటనలో 26 మంది చనిపోగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ హత్యాయత్నం నుంచి పరిటాల రవీంద్ర బయటపడ్డాడు. మద్దెలచెరువు సూరికి ఈ కేసులో జీవిత ఖైదు పడింది. శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే 2005 జనవరి 25వ తేదీన అనంతపురం నగరంలోని తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు. సూరి బావ కళ్లలో ఆనందం చూసేందుకే తాను ఈ హత్య చేశానని జూలకంటి రంగారెడ్డి అలియాస్‌ మొద్దుశీను తరువాత ప్రకటించారు. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ మద్దెలచెరువు సూరిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. దీంతో ఈ కేసు విచారణ అనంతపురం జిల్లా కోర్టులో జరుగుతోంది. ఇప్పటి వరకు 122 మంది సాక్షులను కోర్టు విచారించింది. మరో రెండు మాసాల్లో పరిటాల రవీంద్ర హత్య కేసుకు సంబంధించి తీర్పు కూడా వెలువడే అవకాశముంది. కారుబాంబు కేసుకు సంబంధించి 2009లో సూరికి ప్రభుత్వం క్షమాబిక్ష ప్రసాదించింది. అయితే పరిటాల హత్యకు సంబంధించిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో కొంతకాలం రిమాండులో కొనసాగాల్సి వచ్చింది. అయితే 2009 డిసెంబరు 12న కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. హత్యకేసు తీర్పు వెలువడే వరకు జిల్లాలో ఉండేందుకు వీల్లేదని ఆంక్షలు విధించింది. సిబిఐ ఎదుట వారానికి రెండుసార్లు హాజరవ్వాలని సూచించింది. దీంతో బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నప్పటికీ హైదరాబాదులోనూ ఉంటూ వస్తున్నారు. బయటకొచ్చాక బెంగుళూరు, హైదరాబాదులతోపాటు విజయవాడల్లోనూ దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఈక్రమంలో ఆయన హత్యగావించబడటం పలు అనుమానాలకు తావిస్తోంది. పాత కక్షలు కారణమై ఉంటాయా లేక సెటిల్‌మెంట్లలో వచ్చిన తేడాలు కారణమా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి.
సూరి.. కుటుంబ జీవితానికి దూరం.
మద్దెలచెరువు సూరి జీవితం మొత్తం కుటుంబ జీవితానికి దూరంగా గడిపాడు. ఆయన చిన్నతనంలోనే 1983లో తండ్రి హత్యకు గురయ్యాడు. ఆ తరువాత 15 ఏళ్ల వయసు అంటే 1993లో ఆయన స్వగ్రామమైన మద్దెలచెరువులోని నివాసంలో టీవి బాంబు పేలింది. ఈ ఘటనలో తల్లి సారమ్మ, తమ్ముడు రఘునాథరెడ్డి, అక్క పద్మలతోపాటు బోయ చంద్రశేఖర్‌, నారయణప్పలు మృతిచెందారు. ఈ ఘటనతో వారి కుంటుంబంలో మిగిలింది సూరి ఒక్కరే. ఆ తరువాత నుంచి కర్నాటకలో ఆజ్ఞాతంలో గడిపాడు. అక్కడే బెంగుళూరులో ఉంటూ భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహమైన రెండేళ్లలోపే 1997లో జరిగిన కారుబాంబు కేసులో సూరి అరెస్టయ్యాడు. ఇందులో జీవిత ఖైదు శిక్ష కూడా పడింది. అప్పటి నుంచి ఆయన భార్య గంగుల భానుమతి సూరి స్వగ్రామమైన మద్దెలచెరువులో ఉంటూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ కీలకంగా ఉంటూ పరిటాల రవీంద్రకు వ్యతిరేకంగా పనిచేశారు. పెనుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో కీలకమైన నాయకురాలిగా ఎదిగి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల రవీంద్రకు వ్యతిరేకంగా పోటీ చేశారు. అంతేకాకుండా గట్టిపోటీని కూడా ఇవ్వగలిగింది. ఆ తరువాత 2005 జనవరి 24న పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యాడు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లోనూ పరిటాల సునీతకు వ్యతిరేకంగా పోటీచేయాలని భావించినా టికెట్టు ఆమెకు ఇవ్వలేదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో నియోజకవర్గంలో ఆమె పట్టును మరింత పెంచుకోగలిగారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఆమెను ప్రోత్సహించారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం తరుపున పోటీచేయాలని భావించారు. టికెట్టు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో సూరికి వరుసకు సోదరుడు అయ్యే సుధీర్‌రెడ్డి స్వతంత్రంగా పోటీచేయాలని నామినేషన్‌ కూడా వేశారు. భర్తను బయటకు తీసుకొస్తామన్న హామీని కాంగ్రెస్‌ పెద్దలు భానుమతికివ్వడంతో ఎన్నికల బరిలోనుంచి తప్పుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు 2009 ఎన్నికల తరువాత సూరికి కారుబాంబు కేసు నుంచి విముక్తి కల్పించారు. సూరి బయటకు వచ్చేందుకు మార్గం సుగమం అయినప్పటి నుంచి భానుమతితో విభేదాలు వచ్చినట్టు సమాచారం. దీంతో సూరి జైలు నుంచి బయటకొచ్చే సమయంలోనూ భానుమతి కనిపించలేదు. ఒక దశలో భానుమతిని చంపేసారన్న ప్రచారం కూడా సాగింది. అయితే పరిటాల రవీంద్ర హత్యకేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకుగాను అనంతపురం జిల్లా కోర్టుకు వచ్చినప్పుడు ఆమె క్షేమంగా ఉందని నిర్ధారణ అయింది. బయటకొచ్చాక కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. సూరి జైలులోనున్న సమయంలో ఎప్పుడూ మద్దెలచెరువులోనున్న భానుమతి ఆ తరువాత నుంచి ఉండటం లేదు. బెంగుళూరులో తన తల్లివద్దే ఉంటున్నట్టు సమాచారం. రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో సూరి హత్యకు గురయ్యారు. ఈ విధంగా సూరి జీవతం మొత్తం కుటుంబానికి దూరంగానే గడపాల్సి వచ్చింది.
నమ్మకద్రోహం...?
భానుప్రకాశ్‌పైనే అనుమానాలు
చలసాని పండు తరహాలోనే మద్దెలచెరువు సూరిని నమ్మకమైన వ్యక్తే కడతేర్చాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్షనిస్టుగా ముద్రపడిన సూరికి అత్యంత నమ్మకమైన వ్యక్తి భానుప్రకాశ్‌. సూరి ప్రతి కదలికా వెనుక భానుప్రకాశ్‌ ప్రమేయముండేది. అనంతపురం నగరం సాయినగర్‌ ఏడవ క్రాస్‌లో నివాసముండే భానుప్రకాశ్‌ తండ్రి పశుసంవర్ధక శాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండే వాడు. తల్లి రిటైర్డు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు. చిన్న తనం నుంచి కూడా భానుప్రకాశ్‌ అల్లరిచిల్లరిగా తిరుగుతూ రౌడీయిజం చేస్తుండేవాడు. అనంతపురం నగరానికి చెందిన ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి ద్వారా జైలులోనున్న సూరికి అతను పరిచమయ్యాడు. ధర్మవరంలో జరిగిన బాంబు పేలుడు కేసు, పరిటాల రవీంద్రను చంపేందుకు ఐస్‌క్రీం బండిలో బాంబు అమర్చినకేసులో భానుప్రకాశ్‌ నిందితుడిగానున్నాడు. ఇంతేకాకుండా హైదరాబాదులోని అక్రమ ఆయుధాలు అమ్ముతూ పట్టుబడిన కేసులోనూ నిందితుడిగానున్నాడు. సూరి తరుపున జరిగే ప్రతి సెటిల్‌మెంటులోనూ భానుప్రకాశ్‌ ప్రమేయం ఉండేది. ఆయన ద్వారానే సూరి పంచాయతీలు చేయడం వంటివి చేసేవాడు. అనుచరులకు డబ్బులు సమకూర్చడం వంటి ఆర్థిక లావాదేవీలన్నీ భానుప్రకాశ్‌యే చేసేవాడు. జైలులోనున్న సూరిని కలవాలంటే కుటుంబ సభ్యులకు సైతం మొదట భానుప్రకాశ్‌ అనుమతి ఉండాల్సి వచ్చేది. ఈ విధంగా ఎదిగిన భానుప్రకాశ్‌ సూరికి అత్యంత నమ్మకంగా ఉంటూ వచ్చాడు. పరిటాల రవీంద్ర హత్య తరువాత పంచాయతీలు, సెటిల్‌మెంట్లు సూరి పేరు మీద భానుప్రకాశ్‌ మరింత ఎక్కువ చేశాడు. అయితే ఇంత నమ్మకంగానున్న భానుప్రకాశ్‌ను అప్పుడప్పుడు సూరి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాడని సమాచారం. ఈ విషయంలోనూ సూరి పట్ల కొంత విముఖతతో భానుప్రకాశ్‌ ఉన్నట్టు సమాచారం. ఈ విషయంలోనే కొంతకాలం వీరు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవలే మధ్యవర్తులు కొంత మంది జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఒక పెద్ద సెటిల్‌మెంటు చేసినట్టు సమాచారం. ఈ సెటిల్‌మెంటు పంపకాల్లో తేడాలొచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సూరిని హతమార్చడానికి కారణమై ఉండవచ్చునన్న సందేహాలు కలుగుతున్నాయి. నమ్మకంగా ఉంటున్న వాడే వెన్నుపోటు పొడిచాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
'అనంత'లో భద్రత కట్టుదిట్టం
రాష్ట్ర రాజధానిలోని మద్దెలచెరువు సూరిని కాల్చి చంపిన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్లర్లు జరిగే అవకాశాలున్నాయన్న భయంతో దుకాణాలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్‌ బంక్‌లు మూతపడ్డాయి. చనిపోయిన విషయం తెలిసిన అరగంటలోపు జిల్లాలో, ముఖ్యంగా నగరంలో బంద్‌ వాతావరణం నెలకొంది. అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, గుంతకల్లు, రామగిరి, కనగానపల్లి మండలాల్లో పోలీసులు హైఅలర్టు ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లలో బలగాలను మోహరించారు. సూరికి మంచి సంబంధాలున్న ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలు కావడంతో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్‌ సిన్హా ధర్మవరంలోనే ఉండి భద్రతను సమీక్షించారు. ఆర్టీసి బస్సులపై దాడులు జరగకుండా ఉండే విధంగా పోలీసులు భద్రత నడుమ వాటిని డిపోలకు చేర్చారు. అనంతపురం నగరంలోని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇంటి వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. వారి బంధువుల ఇళ్ల వద్ద కూడా పోలీసు పహారా ఏర్పాటు చేశారు.

కామెంట్‌లు లేవు: