29, ఆగస్టు 2013, గురువారం

స్వార్థ రాజకీయాలే అనిశ్చితికి కారణం

ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి

                   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనిచ్ఛితికి రాష్ట్రంలో, దేశంలో పాలక పార్టీల అవకాశ వాద స్వార్థ రాజకీయాలే కారణమని ప్రజాశక్తి సంపాదకులు , ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్‌, బిజెపిలు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ , తెలుగుదేశం పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రజల మధ్య వైశమ్యాలు పెరిగేవి కావని అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది శాస్త్రీయ అవగాహన లేకుండా పచ్చి అవకాశవాదంతో కేంద్రం తెలుగు ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమిర్శించారు. 2013 ఆగస్టు29న గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు కార్మిక కర్షక భవన్‌లో ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ స్టడీ ఫోరం ఆధ్వర్యంలో 'భాషాప్రయుక్త రాష్ట్రాలు-ప్రస్తుత పరిస్థితులు' అంశంపై సదస్సు నిర్వహించారు. ఫోరం కన్వీనర్‌ బిఎల్‌ఎన్‌ ప్రసాద్‌శర్మ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో తెలకపల్లిరవి ముఖ్యోపన్యాసం చేశారు. ప్రపంచంలో ఒకేభాష మాట్లాడేవారంతా ఒక దేశంగా ఉన్నారని తెలిపారు. భారతదేశంలో మాత్రమే వేర్వేరు భాషలు మాట్లాడే వారంతా ఒక దేశంగా ఉన్నారని చెప్పారు. ఒకే భాష, ఒకే సంస్కృతి ఉంటే పాలనాపరమైన సమస్యలు రావని అన్నారు. మన దేశంలో జాతీయోద్యమ కాలం నుంచే భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమాలు జరిగాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన విభజన ఉద్యమం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని అన్నారు. 1913లో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ భాషాప్రయుక్త రాష్ట్రాలకు భీజం వేసిందన్నారు. 1942 తర్వాత కమ్యూనిస్టు పార్టీలు సైద్ధాంతికంగా భాషాప్రయుక్త రాష్ట్రాల వల్ల ఉండే పరిపాలనా పరమైన అంశాలను చెబుతుండడంతో భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఉండాలనే శాస్త్రీయ పద్ధతి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాఉద్యమాలు బలంగా సాగుతున్న 2000 సంవత్సరంలోనే ఈ ప్రాంతీయ ఉద్యమాలు బయల్దేరాయని చెప్పారు. 2000లో నాటి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన ఉద్యమాలు వచ్చాయన్నారు. నాడు రాష్ట్రంలో ప్రపంచీకరణ విధానాలకు ప్రతిఘటన తీవ్రరూపం దాల్చిందని తెలిపారు. వెర్రి తలలు వేసే ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా తీవ్రరూపం దాల్చిన ప్రజా ఉద్యమాలను, ప్రజల అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు కెసిఆర్‌ ప్రాంతీయ ఉద్యమాలను లేవనెత్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రాంతీయ వాదాన్ని బలపర్చారని చెప్పారు. 2001లో కొత్తగా ఏర్పాటైన ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, ఉత్తరాంచల్‌ రాష్ట్రాల్లో ఎక్కడా భాషాప్రయుక్త రాష్ట్రాల సూత్రానికి ముప్పు వాటిల్లలేదని తెలిపారు. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల ప్రాతిపదికన ఆ రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే తమ ఆటలు సాగవని కాంగ్రెస్‌, బిజెపిలు చిన్న రాష్ట్రాలుగా విడదీసేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి తీసుకురావాలనేదే ప్రపంచీకరణ నేపథ్యమన్నారు. దానికనుగుణంగానే కాంగ్రెస్‌, బిజెపిలు బలమైన ప్రజాఉద్యమాలు రాకుండా చిన్నచిన్న రాష్ట్రాలుగా విడగొట్టేందుకు పూనుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడే సమైక్యమని చెప్పే రాజకీయ నాయకులు అశాస్త్రీయంగా ముందుకు పోతున్నారని అన్నారు.
               రాష్ట్ర విభజన కోరేవాళ్లు ఐక్యంగా ఉన్నారని తెలిపారు. సమైక్య రాష్ట్రం కోరుకునేవారిలో ఒకరు రాయలతెలంగాణా అంటే, మరొకరు గ్రేటర్‌ రాయలసీమ అని, ఇంకొందరు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే బాగుంటుందని వాదిస్తున్నారని అన్నారు. ఇలా ఎవరి ప్రయోజనాల కోసం వారు అవాస్తవ, అశాస్త్రీయ ప్రతిపాదనలతో ఈ ఉద్యమం సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్‌, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలోని బూటకపు సమైక్య ఉద్యమంలో సిపిఎం భాగస్వామ్యంగా ఉండదని స్పష్టం చేశారు. మొదటినుంచీ సిపిఎం సమైక్యతకు కట్టుబడి ఉందని చెప్పారు. పార్టీల పరంగా నిర్ణయాలు మార్చుకోకుండా వ్యక్తిగతంగా సమైక్యవాదులుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో సిపిఎం తరపున సీతారాం ఏచూరి రాష్ట్ర విభజనను వ్యతిరేకించారని అన్నారు. రాష్ట్రం విడిపోతే ఉద్యోగాలు, నదీజలాలు, పెట్టుబడులు, రాజధానిలాంటి సమస్యలను శాస్త్రీయ కోణంలో ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. కేంద్రంలో 2009 నుంచి 2013 వరకు నాలుగేళ్ల పాటు విభజన విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా పాలకులు చీకట్లో ఉంచారని చెప్పారు. కాంగ్రెస్‌ ఉన్నపళంగా విభజన నిర్ణయం తీసుకోవడంతోనే రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక మాటంటే మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి మరోమాట మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్ర విభజనపై ఇంతదూరం వచ్చాక కూడా 'అంతా అయిపోయింద'ని కొందరంటే, 'ఆగిపోయింద'ని సీమాంధ్రవాదులంటున్నారని అన్నారు. ఇలా రాజకీయ అనిశ్చితిలోకి ప్రజలను నెట్టి కేంద్రం తెలుగు ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు. మీడియా ఒకప్పుడు తెలంగాణా వాదానికి ఊతమిచ్చిందని, ప్రస్తుతం సమైక్య ఆందోళనకు అదే విధంగా పబ్లిసిటీ ఇస్తుందని చెప్పారు. సదస్సులో ఫోరం కన్వీనర్లు డాక్టర్‌ బడేసాహెబ్‌, టి నరసింహ మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

15, ఆగస్టు 2013, గురువారం

సమిష్టిలో ఆకలిలేని భారత్‌

స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌

                పేదరికం, ఆకలి, వ్యాధి, అజ్ఞాన రహిత భారతదేశ నిర్మాణానికి సమిష్టి కృషి అవసరమని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల వారికి అభివృద్ధి ఫలాలను అందించాలని కోరారు. రాజకీయ సుస్థిరత, సామాజిక ఐక్యత, భద్రత అవసరమని ఉద్ఘాటించారు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, పలు సమస్యల నేపథ్యంలో భారతీయులు సమిష్టి సహకారాలను అందజేసిన విషయాలను కొనియాడారు. ఆకలి, పేదరికాలను కొలత వేయడం కష్టసాధ్యమైన పని అని, దీనికి నిర్వచనమేదైనా తగ్గింపు వేగం పెరిగిందన్నారు. విద్యా వ్యవస్థను ఇంకా ఎంతో సంస్కరించాల్సివుందని అనేక పాఠశాలల్లో ఇప్పటికీ మంచినీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు లేవని అన్నారు. విద్యా ప్రమాణాలను పెంచాల్సిన అవసరం వుందని, ఉపాధ్యాయ శిక్షణపై దృష్టి సారించాల్సివుందని ప్రధాని చెప్పారు. గతేడాది ఆర్థిక వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయయిందని చెబుతూ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
మెరుగ్గా పొరుగు సంబంధాలు..
               గతంలో లేని విధంగా నేడు దేశాల మధ్య పరస్పర అనుసంధానం పెరిగిందని, ఈ పరిస్థితిని భారత్‌ ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకునేందుకు వీలుగా విదేశీ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. తొమ్మిదేళ్లలో ప్రధాన ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకున్నామని గుర్తు చేశారు. జాతీయ భద్రతలో కూడా అభివృద్ధి సాధించినట్లు ప్రధాని తెలిపారు. 2012లోనూ, ఈ ఏడు ఏవో కొన్ని మత ఘర్షణలు మినహా గడిచిన తొమ్మిదేళ్లలో మంచి మతసామరస్యం నెలకొంద న్నారు. ఉగ్రవాద, నక్సలైట్‌ హింసాకాండ కూడా తగ్గిందని చెప్పారు. అయినా కూడా జాతి భద్రతలపై నిరంతర నిఘా ఉంచడం చాలా అవసరమని పేర్కొన్నారు. గత మే 25న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన నక్సల్‌ హింసాకాండ వంటి ఘటనలు ప్రజాస్వామ్యంపై గొడ్డలిపెట్టు వంటి వని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల వాస్తవాధీన రేఖ వద్ద జవాన్లపై పాకిస్తాన్‌ దాడిని ప్రస్తావిస్తూ మున్ముందు ఈ ఘాతుకాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆహార భద్రత చట్టం వచ్చి న తరవాత దాని అమలు మన ప్రాధాన్యతల్లో ఒకటిగా వుంటుందన్నారు.
మధ్యాహ్న భోజనంలో మార్పులు..
                     ప్రజా పంపిణీ వ్యవస్థను కంప్యూటరీకరించే ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. పిల్లలకు ఇచ్చే భోజనం పోషక సమృద్ధమే కాక వంటలు కూడా పరిశుభ్రంగా జరగాలని చెప్పారు. ఆధునాతన, ప్రగతిశీల, లౌకికవాద దేశంలో సంకుచిత సిద్ధాంతాలకు తావులేదని చెప్పారు. ఈ విధమైన సిద్ధాంతాలు సమాజాన్ని విభజించి, ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తాయన్నారు. వీటిని ప్రోత్సహించరాదని కోరారు. పరస్పర సహనాన్ని, గౌరవాన్ని పెంచుకునే విధంగా వున్న సంప్రదాయాన్ని పటిష్టం చేసుకోవాలని కోరారు.

14, ఆగస్టు 2013, బుధవారం

ఇదీ మన స్వాతంత్య్రం

ఆకలి పెరుగుతోంది
అవినీతి విజృంబిస్తుంది
స్వార్థం పరిడవిల్లుతోంది
స్వాతంత్య్రం ఎవరికొచ్చింది?.

ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి
అందరూ గుర్తించి నట్లే నటిస్తున్నారు
మనిషి మనిషినే అవమానిస్తున్నాడు
మనుషులమని పాలకులే మోసగిస్తున్నారు!!.

ఎవరి తిండి వారు సంపాదించుకోవాలి
ఎవరి దుస్తులు వారు కొనుక్కోగలగాలి
ఎవరి ఇల్లు వారు నిర్మించుకోగలగాలి
ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోగలగాలి
ఎవరైనా విద్యను పొందగలగాలి
అవమానం లేని ఆత్మగౌరవంతో బతకాలి.

బతుకుపై ఆశచావని పేదలంతా ఎదురు చూస్తున్నారు
మార్పును కోరే పాలకులొస్తారని........................
ఆర్థిక అంతరాలుపోతాయని
మనిషి మనిషిగా బతకొచ్చని.!!!!!!!!!!!!!!!!!!!!..???.

13, ఆగస్టు 2013, మంగళవారం

నటి శ్రీదేవికి జన్మదిన శుభాకాంక్షలు

                               శ్రీదేవి 50వ జన్మదిన శుభాకాంక్షలు. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో నటించారు. సూపర్‌స్టార్‌ కృష్ణ శ్రీదేవితో కలిసి నటించిన సినిమాలు తెలుగులోఎక్కువగా ఉన్నాయి. వారిద్దరి కాంబినేషన్‌ సినిమాలు చాలావరకు మంచి రికార్డు సృష్టించాయి. 1979 నుంచి 1988 వరకు 31 సినిమాలలో నటించారు. తెలుగులో మాత్రం కృష్ణతో ఎక్కువ సినిమాల్లో నటించారు. నటి, సినిమానిర్మాతగా స్థిరపడ్డారు. హిందీహీరో బోనికాపూర్‌ను వివాహమాడిన ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అగ్రశ్రేణి నటుల సరసన నటించిన ఆమె అనేక అవార్డులు పొందారు. కృష్ణతో నటించిన సినిమాలివే.... 1.సమాజానికి సవాల్‌, 2.బుర్రిపాలెంబుల్లోడు, 3.రామ్‌రబర్ట్‌ రహీమ్‌, 4.మామా అల్లుళ్ల సవాల్‌, 6.ఘరానాదొంగ,7.దేవుడిచ్చిన కొడుకు ,8. చుట్టాలున్నారు జాగ్రత్త ,9.బంగారుబావ, 10.గడసరిఅత్త సొగసరి కోడలు, 11. బోగభాగ్యాలు,12. వయ్యారి భామలువగలమారి భర్తలు, 13. శంషీర్‌శంకర్‌, 14. ప్రేమనక్షత్రం, 15. 16. కృష్ణావతారం, 17.కృష్ణార్జునులు, 18. కలవారి సంసారం,19.బంగారుకొడుకు, 20. బంగారు భూమి, 21.రామరాజ్యంలో భీమరాజు, 22.కిరాయికోటిగాడు, 23. అడవి సంహాలు, 24. కంచుకాగడా, 25. వజ్రాయుధం,26. పచ్చని కాపురం, 27.ఖైదిరుద్రయ్య, 28. జయం మనదే, 29. మకుటంలేని మహారాజు, 30. మావూరి మగాడు, 31. మహారాజశ్రీ మాయగాడు.

8, ఆగస్టు 2013, గురువారం

19నుంచి ఇంజనీరింగు కౌన్సిలింగు

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం -ఆన్‌లైన్‌లోనే బి కేటగిరీ సీట్ల భర్తీ

              విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌కు హైకోర్టు పచ్చజెండా ఊపింది.2013 ఆగస్టు 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆగస్టు8న ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వారం ముందు విడుదల చేయాలని కూడా సూచించింది. ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనే ప్రవేశాలు, యాజమాన్య కోటా సీట్ల భర్తీలపై వేసిన పిటీషన్లపై వాదనలు ముగిసిన తర్వాత గురువారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. దీనికి సంబంధించి జస్టీస్‌ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్‌ జరపాలని ప్రభుత్వానికి సూచించారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ పత్రికల్లో నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణ, తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లోనే కౌన్సెలింగ్‌ జరపాలన్నారు. అన్ని విషయాలపై త్వరితగతిన చర్యలు తీసుకునేవిధంగా ఉన్నతవిద్యామండలికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన వివరాల్ని కూడా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని హైకోర్టు సూచించింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ కూడా ఆన్‌లైన్‌ ్వరానే భర్తీ చేయాలని ఆదేశించింది. కన్వీనర్‌ కోటా మాదిరిగానే బీ కేటగిరి సీట్లకు కౌన్సెలింగ్‌పై పత్రికా ప్రకటనలు ఇవ్వాలన్నారు. దరఖాస్తుల జాబితాను అనుసరించి మెరిట్‌ లిస్టును వెబ్‌సైట్‌లో చూపాలన్నారు. మెరిట్‌ జాబితాపై ఉన్నత విద్యామండలి తరపున పరిశీలన చేయాలన్నారు. ప్రక్రియను త్వరగా ముగియడానికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 12న ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఆ రోజున అడ్మిషన్ల కమిటీ సమావేశమవుతుందని, అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళతామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజరుజైన్‌, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాశ్‌రావు తెలిపారు. హైకోర్టు నిర్ణయాన్ని తూచతప్పకుండా పాటిస్తామన్నారు. అయితే వారం ముందే ప్రకటన ఇవ్వాలని హైకోర్టు సూచించినా విభజన ప్రకటన నేపథ్యంలో జరుగుతున్న పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుంటామని అధికారులు చెబు తున్నారు. ఈ నెల 12 నుంచి ఎపి ఎన్‌జివోలు సమ్మెకు దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి పరి స్థితులను కూడా అంచనా వేసి హైకోర్టుకు వివరాలు అందజేస్తామన్నారు. ప్రభుత్వ అను మతితో19న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. అన్ని విషయాలపై ఈ నెల 12న సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రెండున్న లక్షల విద్యార్థుల ఎదురుచూపు
            ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో రెండున్నర లక్షలమంది విద్యార్థుల ఎదురుచూపులు ఫలించాయి. ఏప్రిల్‌లో ఇంటర్‌మీడియట్‌ ఫలితాలు వచ్చాయి. జూన్‌ మొదటివారంలో ఎంసెట్‌ ఫలితాలు విడుదల య్యాయి. రెండున్నర లక్షలమంది క్వాలిఫైడ్‌ అయ్యారు. సుప్రీంకోర్టు ప్రకారం జూన్‌ రెండోవారం నుంచే ప్రవేశాలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటిం చింది. కానీ ఫీజులు ఖరారుకాకపోవడం, బీ కేటగిరి సీట్లపై హైకోర్టులో పిటీషన్‌ పడడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యమైంది. బీ కేటగిరి సీట్లపై ప్రభు త్వానికి, కాలేజీల యాజమాన్యాల మధ్య వాదనలు జరిగాయి. రెండువైపులా వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ సమ యంలో కౌన్సెలింగ్‌ ఆలస్యం కావడంపై హైకోర్టులో మరో పిటీషన్‌ పడింది. దాంతో రెండు పిటీషన్లపై గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకానొక సమయంలో కౌన్సెలింగ్‌ ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. రాష్ట్ర విభజనపై ప్రకటన నేప థ్యంలో ఒక ప్రాంతంలో ఆందోళనలు చెలరేగు తున్నాయి. హైకోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పట్లో కౌన్సెలింగ్‌ జరగదని అందరూ భావించారు. కానీ హైకోర్టే తన ఉత్తర్వుల్లో తేదీని కూడా చెప్పడంతో తప్పనిసరిగా కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేయకతప్పదు.