29, ఆగస్టు 2013, గురువారం

స్వార్థ రాజకీయాలే అనిశ్చితికి కారణం

ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి

                   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనిచ్ఛితికి రాష్ట్రంలో, దేశంలో పాలక పార్టీల అవకాశ వాద స్వార్థ రాజకీయాలే కారణమని ప్రజాశక్తి సంపాదకులు , ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్‌, బిజెపిలు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ , తెలుగుదేశం పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రజల మధ్య వైశమ్యాలు పెరిగేవి కావని అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది శాస్త్రీయ అవగాహన లేకుండా పచ్చి అవకాశవాదంతో కేంద్రం తెలుగు ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమిర్శించారు. 2013 ఆగస్టు29న గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు కార్మిక కర్షక భవన్‌లో ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ స్టడీ ఫోరం ఆధ్వర్యంలో 'భాషాప్రయుక్త రాష్ట్రాలు-ప్రస్తుత పరిస్థితులు' అంశంపై సదస్సు నిర్వహించారు. ఫోరం కన్వీనర్‌ బిఎల్‌ఎన్‌ ప్రసాద్‌శర్మ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో తెలకపల్లిరవి ముఖ్యోపన్యాసం చేశారు. ప్రపంచంలో ఒకేభాష మాట్లాడేవారంతా ఒక దేశంగా ఉన్నారని తెలిపారు. భారతదేశంలో మాత్రమే వేర్వేరు భాషలు మాట్లాడే వారంతా ఒక దేశంగా ఉన్నారని చెప్పారు. ఒకే భాష, ఒకే సంస్కృతి ఉంటే పాలనాపరమైన సమస్యలు రావని అన్నారు. మన దేశంలో జాతీయోద్యమ కాలం నుంచే భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమాలు జరిగాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన విభజన ఉద్యమం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని అన్నారు. 1913లో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ భాషాప్రయుక్త రాష్ట్రాలకు భీజం వేసిందన్నారు. 1942 తర్వాత కమ్యూనిస్టు పార్టీలు సైద్ధాంతికంగా భాషాప్రయుక్త రాష్ట్రాల వల్ల ఉండే పరిపాలనా పరమైన అంశాలను చెబుతుండడంతో భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఉండాలనే శాస్త్రీయ పద్ధతి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాఉద్యమాలు బలంగా సాగుతున్న 2000 సంవత్సరంలోనే ఈ ప్రాంతీయ ఉద్యమాలు బయల్దేరాయని చెప్పారు. 2000లో నాటి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన ఉద్యమాలు వచ్చాయన్నారు. నాడు రాష్ట్రంలో ప్రపంచీకరణ విధానాలకు ప్రతిఘటన తీవ్రరూపం దాల్చిందని తెలిపారు. వెర్రి తలలు వేసే ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా తీవ్రరూపం దాల్చిన ప్రజా ఉద్యమాలను, ప్రజల అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు కెసిఆర్‌ ప్రాంతీయ ఉద్యమాలను లేవనెత్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రాంతీయ వాదాన్ని బలపర్చారని చెప్పారు. 2001లో కొత్తగా ఏర్పాటైన ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, ఉత్తరాంచల్‌ రాష్ట్రాల్లో ఎక్కడా భాషాప్రయుక్త రాష్ట్రాల సూత్రానికి ముప్పు వాటిల్లలేదని తెలిపారు. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల ప్రాతిపదికన ఆ రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే తమ ఆటలు సాగవని కాంగ్రెస్‌, బిజెపిలు చిన్న రాష్ట్రాలుగా విడదీసేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి తీసుకురావాలనేదే ప్రపంచీకరణ నేపథ్యమన్నారు. దానికనుగుణంగానే కాంగ్రెస్‌, బిజెపిలు బలమైన ప్రజాఉద్యమాలు రాకుండా చిన్నచిన్న రాష్ట్రాలుగా విడగొట్టేందుకు పూనుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడే సమైక్యమని చెప్పే రాజకీయ నాయకులు అశాస్త్రీయంగా ముందుకు పోతున్నారని అన్నారు.
               రాష్ట్ర విభజన కోరేవాళ్లు ఐక్యంగా ఉన్నారని తెలిపారు. సమైక్య రాష్ట్రం కోరుకునేవారిలో ఒకరు రాయలతెలంగాణా అంటే, మరొకరు గ్రేటర్‌ రాయలసీమ అని, ఇంకొందరు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే బాగుంటుందని వాదిస్తున్నారని అన్నారు. ఇలా ఎవరి ప్రయోజనాల కోసం వారు అవాస్తవ, అశాస్త్రీయ ప్రతిపాదనలతో ఈ ఉద్యమం సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్‌, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలోని బూటకపు సమైక్య ఉద్యమంలో సిపిఎం భాగస్వామ్యంగా ఉండదని స్పష్టం చేశారు. మొదటినుంచీ సిపిఎం సమైక్యతకు కట్టుబడి ఉందని చెప్పారు. పార్టీల పరంగా నిర్ణయాలు మార్చుకోకుండా వ్యక్తిగతంగా సమైక్యవాదులుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో సిపిఎం తరపున సీతారాం ఏచూరి రాష్ట్ర విభజనను వ్యతిరేకించారని అన్నారు. రాష్ట్రం విడిపోతే ఉద్యోగాలు, నదీజలాలు, పెట్టుబడులు, రాజధానిలాంటి సమస్యలను శాస్త్రీయ కోణంలో ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. కేంద్రంలో 2009 నుంచి 2013 వరకు నాలుగేళ్ల పాటు విభజన విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా పాలకులు చీకట్లో ఉంచారని చెప్పారు. కాంగ్రెస్‌ ఉన్నపళంగా విభజన నిర్ణయం తీసుకోవడంతోనే రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక మాటంటే మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి మరోమాట మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్ర విభజనపై ఇంతదూరం వచ్చాక కూడా 'అంతా అయిపోయింద'ని కొందరంటే, 'ఆగిపోయింద'ని సీమాంధ్రవాదులంటున్నారని అన్నారు. ఇలా రాజకీయ అనిశ్చితిలోకి ప్రజలను నెట్టి కేంద్రం తెలుగు ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు. మీడియా ఒకప్పుడు తెలంగాణా వాదానికి ఊతమిచ్చిందని, ప్రస్తుతం సమైక్య ఆందోళనకు అదే విధంగా పబ్లిసిటీ ఇస్తుందని చెప్పారు. సదస్సులో ఫోరం కన్వీనర్లు డాక్టర్‌ బడేసాహెబ్‌, టి నరసింహ మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: