31, జులై 2014, గురువారం

ఆకలిని పెంచుతున్న పెట్టుబడి

భూపంపిణీతో ప్రజలకు కొనుగోలు శక్తి
పభాత్‌ పట్నాయక్‌
వ్యకాస ప్రతినిధుల సభలో ప్రారంభోపన్యాసం

       దేశంలో అత్యధిక ప్రజల ఆకలి సమస్యకు నయా ఉదారవాదం, అంతర్జాతీయ ఫైనాన్స్‌ కేపిటల్‌ ప్రధాన కారణమని ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ చెప్పారు. నిన్నటి వరకు పాలించిన యుపిఎ, నేడు అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వాలు అంతర్జాతీయ ఫైనాన్స్‌ కేపిటల్‌ ఒత్తిళ్లకు లొంగి పని చేస్తున్నాయని, ఫలితంగా వ్యవసాయరంగం, గ్రామీణ ప్రజానీకం మనుగడ ప్రశ్నార్ధకమైందని పేర్కొన్నారు. సరళీకరణ విధానాలకు ప్రత్యామ్నా యాలు ూన్నాయని,  వాటిని అమలు చేయించు కోవడం కోసం రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర గ్రామీణ ప్రజానీకం ఐక్య పోరాటాలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. 2014 జులై 31న తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లాలో  జరుగుతున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) మహాసభ ప్రతినిధుల సమావేశాన్ని గురువారం ప్రభాత్‌ పట్నాయక్‌ ప్రారంభించారు. ఎఐఎడబ్ల్యుయు అఖిల భారత అధ్యక్షుడు పాటూరు రామయ్య అధ్యక్షతన నిర్వహిం చిన సభనుద్దేశించి ప్రభాత్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ భారత సమాజం వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, ప్రభుత్వాలు సరళీకరణ దృక్పథాన్ని ఎంచుకున్నాక రైతుల ఆత్మహత్యలు పెరిగి సంక్షోభం తీవ్రమైందని పేర్కొన్నారు. ఈ సంక్షోభం ప్రభావం వ్యవసాయ కార్మికులు, ఇతర గ్రామీణ పేదలపై పడిరదన్నారు. ఆహార ధాన్యాల ూత్పత్తికి, ఆహార లభ్యతకు మధ్య అంతకంతకూ వ్యత్యాసం పెరగడం ప్రమాదకరమని వివరించారు. ‘నిపుణుల లెక్కల ప్రకారం ప్రతి మనిషికీ తలసరి 200 కిలోల ఆహార ధాన్యాలు కావాలి. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో 145 కిలోల ఉత్పత్తి జరిగింది. బ్యాంకుల జాతీయకరణ, భూపంపిణీ, వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడుల వలన 1980లలో 180 కిలోలకు పెరిగింది. ఇన్నేళ్లలోనూ జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగనేలేదు’ అని తెలిపారు. ప్రజలందరి అవసరాలకు సరిపడ ఒక పక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగకపోయినా విదేశాలకు మాత్రం పెద్ద ఎత్తున ఎగుమతులవుతున్నాయని ఎద్దేవా చేశారు.     2012లో ప్రభుత్వం వద్ద 82 మిలియన్‌ ఆహార ధాన్యాల నిల్వలుంటే, వాటిలో 42 మిలియన్‌ టన్నులు విదేశాలకు ఎగుమతయ్యాయని పేర్కొన్నారు. ఆకలి, పోషకారలోపం నివారణలో మన దేశం పలు ఆఫ్రికా దేశాల కంటే వెనుకబడి ఉందన్నారు. ప్రతి వ్యక్తికీ 2,400 కేలరీలు కావాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుండగా 2,200 కేలరీలు మాత్రమే అందుతోందని చెప్పారు. సరిపడ కేలరీలు అందని ప్రజలు 1973లో 56 శాతం మంది ఉండగా నేటికి ఆ సంఖ్య 75 శాతానికి చేరిందన్నారు. గోదాముల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) ద్వారా ఉచితంగా లేక చౌక ధరలకు పంపిణీ చేయాలని కోరితే సబ్సిడీల భారం పడుతుందని, ద్రవ్యలోటు పెరుగుతుందని ప్రభుత్వం, కొందరు ఆర్థిక వేత్తలు అర్థం లేని వాదనలు చేస్తున్నారని తప్పుబట్టారు. ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. ‘అంతర్జాతీయ ఫైనాన్స్‌ కేపిటల్‌, బహుళజాతి సంస్థలు సబ్సిడీలు పెంచేందుకు అంగీకరించవు. అందుకే ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. ఆకలిని పెంచుతున్నది వారే’ అని ప్రభాత్‌ అన్నారు. వ్యవసాయ కార్మికుల పోరాటాలు, వామపక్షాల ఒత్తిడి వలన యుపిఎ`1 సర్కారు ఉపాధి హామీని ప్రారంభించగా, ఎన్‌డిఎ దాన్ని క్రమంగా ఎత్తేసేందుకు చూస్తోందన్నారు. ఉపాధి హామీకి సర్కారు కేటాయించింది కేవలం రూ.34 వేల కోట్లు. దేశ స్థూలోత్పత్తి రూ.12 లక్షల కోట్లు కాగా అందులో ఉపాధి హామీకి ప్రతిపాదించింది 0.3 శాతం మాత్రమే’ అని తెలిపారు. యుపిఎ సర్కారు చివరి సంవత్సరంలో రూ.34 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, రూ.38 వేల కోట్లు ఖర్చు చేసింది. కూలీలు చేసిన పనికి రూ.4 వేల కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. మొత్తం కలిపితే రూ.42 వేల కోట్లవుతుంది. కానీ అధికారంలోకొచ్చిన ఎన్‌డిఎ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో కేవలం రూ.34 వేల కోట్లనే కేటాయించడాన్ని బట్టి ఉపాధి హామీని క్రమంగా ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందని వివరించారు. ఉపాధి హామీ నిరుపయోగం అన్నట్లు వ్యూహాత్మకంగా కొన్ని వర్గాలు మానసికంగా దాడి చేస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయరంగం సంక్షోభానికి విరుగుడుగా ప్రత్నామ్నాయాలను ప్రభాత్‌ పట్నాయక్‌ సూచించారు. భూసంస్కరణలు, భూమి పున్ణపంపిణీ జరగాలన్నారు. భూపంపిణీ చేస్తే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. సహకార పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సార్వజనీన పిడిఎస్‌ అమలు చేయాలన్నారు. ప్రజలకు ఉచిత విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని,ఉపాధి అనేది ప్రజల ప్రాధమిక హక్కుగా ఉండాలని, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ ఉపకరణాలు, సంస్థాగత రుణాలు అందించాలని సూచించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎఫ్‌డిఐలను అనుమతించి ప్రైవేటీకరించేందుకు ఎన్‌డిఎ ప్రయత్నిస్తోందని, అదే జరిగితే బ్యాంకులపై సామాజిక బాధ్యత ఉండదని, రైతులకు, ఇతర వర్గాలకు తక్కువ వడ్డీపై రుణాలు లభించవని చెప్పారు. ప్రారంభ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎపి రాష్ట్ర కార్యదర్శి పి మధు, ఎఐకెఎస్‌ నాయకులు హన్నన్‌ మొల్ల, రామచంద్రన్‌ పిళ్లై, ఎఐఎడబ్య్లూయు ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్‌, సుభాషిణి అలీ పాల్గొన్నారు.