27, సెప్టెంబర్ 2014, శనివారం

కోమలవల్లికి నాలుగేళ్లు జైలు

      
      అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (కోమలవల్లి)ను దోషిగా నిర్ధారించింది బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం. 2014 సెప్టెంబర్‌ 27న  ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఆమె తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆమెతోపాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. వీరందరికీ కూడా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జయలలితకు రూ.100 కోట్ల భారీ జరిమానా విధించింది. మిగతా దోషులకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు జరిమానా విధించింది. 
 కర్ణాటకలో మాత్రమే అప్పీలుకు అవకాశం
      ప్రత్యేక కోర్టు తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో మాత్రమే అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంది. తీర్పును సవాలు చేస్తూ ఆమె అప్పీలుకు వెళ్లనున్నారు.
        బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో జయలలితపై నేరం రుజువు కావడంతో తమిళనాడు ఆర్థిక మంత్రి పన్నీర్‌ సెల్వం కోర్టు హాలులో కంటతడిపెట్టారు. బెంగళూరుకు చేరిన పలువురు ఆమె అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాదాపు 18 ఏళ్లపాటు సాగిన ఈ కేసు 14 మంది న్యాయమూర్తుల సమక్షంలో విచారణ సాగింది. 259 మంది ప్రాసిక్యూషన్‌ సాక్ష్యులు, 99 మంది డిఫెన్స్‌ సాక్ష్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. బెంగళూరు పరస్పన అగ్రహార జైలు ఆవరణలోని ప్రత్యేక కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు వద్దకు వేలాది మంది ఎఐఎడిఎంకె కార్యకర్తలు తరలివచ్చారు.
                                                              కేసు పూర్వాపరాలు
        ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 1996లో జయలలితపై కేసు నమోదయింది. ఆమెకు అత్యంత సన్నిహితురాలు శశికళ, ఆమె కుమారుడు సుధాకరన్‌, బంధువులు ఇళవరసి కూడా కేసులో నిందితులుగా ఉన్నారు. అప్పట్లో జయలలిత ఇంట్లో జరిగిన సోదాల్లో 880 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 10 వేలకు పైగా చీరలు, 90కి పైగా వాచీలు, 750 జతల పాదరక్షలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అనేక చోట్ల జయలలిత ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలొచ్చాయి. కేవలం ఒక్క రూపాయి వేతనం తీసుకుని ఇంత ఆస్తి ఎలా కూడబెట్టారనే అభియోగం నమోదయింది. జయ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ న్యాయమూర్తి స్వయంగా పరిశీలించారు. దీనిపై 2011లో జయలలిత స్వయంగా కోర్టుకెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగింది. ఈ కేసు విచారణ తొలుత చెన్నైలోనే జరిగినా మళ్లీ జయలలిత సిఎం కావడంతో న్యాయస్థానాన్ని ప్రభావితం చేస్తారని డిఎంకె పిటిషన్‌ దాఖలు చేసింది. డిఎంకె పిటిషన్‌తో కేసు విచారణ బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానానికి మారింది.
                                                          జయలలిత జీవిత విశేషాలు
      సెల్వ జయలలిత 1948 ఫిబ్రవరి 24న కర్ణాటక రాష్ట్రం మైసూరులో  జన్మించారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళ, తెలుగు భాషల్లో సినీనటి. ఆ రాష్ట్ర ప్రాంతీయ పార్టీ అయిన ఆలిండియా ద్రవిడ మున్నేట్ర కళగం కార్యదర్శి. తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వకంగా కలిగిన జయలలిత 1981లో రాజకీయాల్లో ప్రవేశించారు. 1984లో తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్‌కు సన్నిహితంగా మెలిగారు. ఆయన మరణానంతరం రామచంద్రన్‌ భార్య ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఎక్కువ రోజులు పదవిలో ఉండలేకపోయారు. గ్లామర్‌ వల్ల జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించారు. 1991లో రాజీవ్‌గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల చేత ఎన్నికయిన తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రి జయలలిత. 2006 మేలో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయింది. తిరిగి మిత్రపక్షాలతో కలిసి 1977 తర్వాత అత్యంత పటిష్టమైన ప్రతిపక్షంగా నిలువ గల సీట్లను పొందారు. ఆమె ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి. అభిమానులు ఆమెను అమ్మ అని, పురుచ్చితలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అలనాటి సినీనటి సంధ్య కూతురు ఈమె. మైసూరులో జన్మించిన జయలలిత రాజకీయరంగ ప్రవేశానికి మునుపు తమిళ చిత్రరంగంలో విజయవంతమైన సినీనటి. కుటుంబ పరిస్థితుల వల్ల ఆమె తల్లి బలవంతంతో 15వ ఏట సినిమా రంగంలోకి వచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో ఆమె నటించారు. ఆమె అవివాహితగానే జీవితాన్ని గడిపారు. 1988లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. 1989, 1991లో గెలిచారు. 1996లో జయలలితపై వచ్చిన అభియోగాల కారణంగా ఓడిపోయారు. 2001లో అత్యధిక మెజార్టీతో గెలిచారు. 2006లో ఓడిపోయారు. 2011లో తిరిగి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలితపై అనేక కేసులు పెట్టినా ఎదురు నిలిచి పోరాడారు. ఆమె మీద పెట్టిన 11 కేసుల్లో తొమ్మిది పూర్తయ్యాయి. రెండు కేసులు కీలకమయ్యాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసుపై ప్రత్యర్థులు బలమైన ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

మహేష్ 'ఆగడు'

ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన మహేష్ బాబు 'ఆగడు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట మరియు అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక,తమన్ సంగీతాన్ని అందించారు. సినిమా ఎలావుందో చూద్దాం.
మొదట సినిమా కథ విషయానికే వస్తే శంకర్(మహేష్)ఓ అనాథ,కాని చాల తెలివైన కుర్రాడు.తనలోని చురుకుదనాన్ని చుసిన రాజా రావు(రాజేంద్రప్రసాద్)అనే ఇన్స్ పెక్టర్ శంకర్ ను చేరదీసి పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటాడు.కాని అనుకోని కారణాలవల్ల చేయని హత్యను తనమీద వేసుకొని జైలుకు వెళుతాడు.అరెస్టయిన శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ ఆఫీసర్ అవుతాడు.అలా శంకర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందుతాడు.దాము అలియాస్ దామోదర్(సోనూ సూద్)అక్రమాలను అరికట్టడానికి ఒక పట్టణానికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. శంకర్ ను.అసలు దాము ఎవరు?శంకర్ జైలుకు వెళ్ళడానికి కారణం ఏంటి? మొదలగునవి తెర మీద చూడాల్సిందే.
మహేష్ బాబు ఇంట్రడక్షన్ తోపాటు మొదటి సాంగ్ చాలా బాగొచ్చింది.సినిమాలో మహేష్ బాబు పంచ్ డైలాగ్ లు బాగానే ఉన్నాయి.అయితే పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువైన ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది.ఇక తమన్నా విషయానికి వస్తే అంతగా ప్రాధాన్యంలేని పాత్ర.మహేష్ బాబుకు ప్రేయసిగా కనిపిస్తుంది.కొన్ని పాటల్లో గ్లామర్ డోస్ పెంచింది.సినిమా మొదటి భాగం బాగానే ఉంటుంది.రెండవ భాగంలోకి వచ్చే సరికి ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడతారు.నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది.శీను,పోసాని,రఘుబాబులతో చేయించిన'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీక్వెన్స్ కూడా నవ్వించకపోగా బోర్ కొట్టిస్తుంది.బ్రహ్మనందం బ్రోకర్ పాత్రలో కనిపిస్తాడు కాని అంతగా ఆకట్టుకోలేదు.రొటీన్ కామెడీ తప్పా శ్రీనువైట్ల కామెడీ మాత్రం కనిపించలేదు సినిమాలో.పంచ్ డైలాగ్ లమీద చూపిన శ్రద్ధ సినిమా కథమీద చూపిస్తే సినిమా బాగుండేది.మహేష్ బాబు ఇమేజ్,మహేష్ బాబు పేల్చే డైలాగ్ ల మీడీ శ్రీనువైట్ల ఆధారపడ్డాడు.సినిమా రెండవ భాగం 'దూకుడు' సినిమాను పోలి ఉందని ప్రేక్షకులు పెదవి విరుస్తారు.
ప్లస్ పాయింట్లు
సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమా అంతా మహేష్ అనే చెప్పాలి.మహేష్ పేల్చే పంచ్ డైలాగ్ లు ఆకట్టుకుంటాయి.టోటల్ గా మహేష్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుంది.
మైనస్ పాయింట్లు
ముఖ్యంగా సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం మైనస్ గా నిలిచింది.మూస ధోరణిలో సాగడం,సినిమాలో పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువవడం,సరైన కథ-కథనం లేకపోవడం,రెండవ భాగం,ఎక్కువ నిడివి.

దసరాకు ముందే ప్రేక్షకులను అలరించాలని 'ఆగడు' యూనిట్ అనుకున్నా అందులో సక్సెస్ కాలేదని చెప్పొచ్చు.కాకుంటే ప్రస్తుతానికి పెద్ద హీరోల సినిమాలు ఏవి లేకపోవడంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.