24, అక్టోబర్ 2023, మంగళవారం

నంద్యాల తొలి ఎమ్మెల్యే మల్లు సుబ్బారెడ్డి

                     

నంద్యాల మొదటి ఎమ్మెల్యే అయిన మల్లు రామసుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు ఉమ్మడి జిల్లా పాణ్యం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు ఒక సోదరి. మల్లు సుబ్బారెడ్డి ఎస్‌ఎస్‌ఎల్‌ సి వరకు నంద్యాల ఎస్‌పిజి హై స్కూల్‌లో ఆ తరువాత ఇంటర్మీడియట్‌ , డిగ్రీ అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో చదివారు. తర్వాత 'లా' డిగ్రీ మద్రాసు 'లా 'కాలేజ్‌ లో పూర్తి చేసి నంద్యాలలో న్యాయవాద వృత్తి చేపట్టారు.1941 సంవత్సరంలో బ్రిటీష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని మూడు నెలలు బళ్లారి సెంట్రల్‌ జైలులో గడిపి తరువాత 1942 సంవత్సరం నుండి 1944 వ సంవత్సరం వరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఒకటిన్నర సంవత్సరములు వెల్లూరు, తంజావూరు జైళ్లలో శిక్ష అనుభవించారు. స్వాతంత్య్ర వచ్చిన తరువాత 1952వ సంవత్సరంలో స్వాతంత్రం తొలి శాసనసభ ఎన్నికల్లో మల్లు సుబ్బారెడ్డి నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1954వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎత్తివేయాలని ఓటింగ్‌ నిర్వహించింది. ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మల్లు సుబ్బారెడ్డికి మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పినా మల్లు సుబ్బారెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయమని అడిగినా తిరస్కరించి మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ ఒక్క ఓటుతో ప్రభుత్వం పడి పోయింది. మరలా 1955వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. మరలా 1962వ సంవత్సరంలో నంద్యాల నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 1967 వ సంవత్సరము వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1968 డిసెంబర్‌ 5న తుదిశ్వాస విడిచారు. మల్లు సుబ్బారెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడైన మల్లు రామచంద్రారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ నంద్యాలలో మెడిసేవా డయాగ్నోసిస్‌ సర్వీసెస్‌ ఎండిగా కొనసాగుతున్నారు.