31, డిసెంబర్ 2010, శుక్రవారం

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

''అన్నదాతల అప్పుల బాధలు... ఆత్మహత్యలు.... ఆకలిచావులు..ఆగని వలసలు... ఆగిన ప్రాజెక్టుల నిర్మాణాలు ఇలా అనేక విషయాలు గతేడాది జిల్లా ప్రజలను వేదించాయి. ప్రజాసంక్షేమం పరిడవిల్లేలా..2011లో పాలకులు కృషి చేస్తారని ఆసిద్దాం..... అవినీతి...అక్రమాలుకు అడ్డుకట్టా పడాలని కోరుకుందాం. అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆంగ్ల సంవత్సరాదికి స్వాగతం పలుకుదాం....సగటు మనిషి బాగుపడాలని కోరుకుందాం.''

30, డిసెంబర్ 2010, గురువారం

చరిత్ర సృష్టించిన డిసెంబర్‌ 30

రైతుకోసం భారీ సభ: ఈ ఏడాది డిసెంబర్‌ 30 చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ' రైతుకోసం ' సభ నిర్వహించారు. దీనిని టిడిపి, వామపక్షాల ఆధ్వర్యంలో జరిగింది. జాతీయ పార్టీల నేతలు హాజరయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ , టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు, ఆర్‌ఎల్‌డి నేత అజిత్‌సింగ్‌, ఎండిఎంకె నాయకులు గణేష్‌మూర్తి, ఫార్వార్డ్‌బ్లాక్‌ నాయకులు దేవరాజన్‌, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమ నిర్మాణానికి వివిధ పార్టీల జాతీయనేతలు పిలుపునిచ్చారు. ఆత్మహత్యల బాటపట్టిన అన్నదాతలను కాపాడేందుకు జాతీయస్థాయిలో ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు. ఈ ఉద్యమానికి అందరం తోడుగా నిలుస్తామని ఉద్ఘాటించారు.అన్నదాతల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చేందుకు పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. తుపానులకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాశీనంగా వ్యవహరించడాన్ని అన్నిపార్టీల నేతలు తప్పుబట్టారు. తక్షణం పరిహారాలు ఇచ్చి ఆదుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సభకు హాజరైన ప్రజానీకం ఆద్యంతం ఆసక్తిగా నేతల ఉపన్యాసాలు విన్నారు.
చిదంరం చేతికి శ్రీకృష్ణకమిటీ నివేదిక
ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ప్రదేశ్‌ డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ సభ్యులు గడువుకు ఒకరోజు ముందుగా, కేంద్ర హోం మంత్రి చిదంబరానికి గురువారమిక్కడ నివేదికను సమర్పించారు. జనవరి 6న నివేదికను బహిర్గతం చేస్తామని, అదే రోజు ఆంధ్రప్ర దేశ్‌లోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అనంతరం చిదంబరం ప్రకటించారు.
కృష్ణా టిబ్యునల్‌ తీర్పు వెల్లడి
 65శాతం ఆధారపడిన ( డిపెండబిలిటీ) నీటిపై లెక్కలు గట్టి కృష్ణానదిలో 2,578 టిఎంసీల నికర జలాలు ఉన్నట్లు తేల్చింది. నికర జలాలను ఆంధ్రప్రదేశ్‌కు 1,001, కర్నాటకకు 911, మహారాష్ట్రకు 666 టింఎసీలుగా పంపిణీ చేసింది. 
 మిగులు జలాలను 448 టిఎంసీలుగా లెక్కతీసి ఆంధ్రప్రదేశ్‌కు 190, కర్నాటకకు 177, మహారాష్ట్రకు 81 టిఎంసీలను కేటాయించింది. కర్నాటక నిర్మిస్తున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 524.256మీటర్లకు పెంచుకోవడానికి అనుమతించింది. ట్రిబ్యునల్‌ తీర్పును అమలు చేయడానికి 'కృష్ణా జలాల నిర్ణయాల అమలు బోర్డు'ను కేంద్రం నియమించాలి. తుంగభద్ర ఎడమ కాలువ. రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ కూడా తుంగభద్ర బోర్డు పరిధిలోకి తీసుకోవాలి. చెన్నై నగర తాగునీటి అవసరాలకు నీటి సరఫరా బాధ్యత మూడు రాష్ట్రాలకు పంచింది.
కణ్ణబీరన్‌ మృతి
 కణ్ణభీóరన్‌ 1929 నవంబర్‌ 9న... నెల్లూరులోని స్టోన్‌హౌస్‌ పేటలో జన్మించారు. తార్కుండే కమిటీ, భార్గవ కమిషన్‌లకు కార్యదర్శిగా పనిచేసిన కన్నాభిరాన్‌ 1981 అక్టోబర్‌లో బీహార్‌లోని పాట్నా జిల్లాలో రైతు కూలీలపై జరిగిన కాల్పుల్లో పియూసిఎల్‌లో నిజనిర్ధారణ బృందానికి నేతృత్వం వహించిన కన్నాభిరాన్‌. పియూసిఎల్‌ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో పియుసిఎల్‌ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  కన్నాబిరాన్‌పై 'ది అడ్వకేట్‌' పేరుతో గంటన్నర నిడివి గల డాక్యుమెంటరీ తీసిన దీపాధన్‌రాజ్‌. కన్నాబిరాన్‌ కుటుంబాన్ని హతమారుస్తామని 2003 అక్టోబర్‌లో బెదిరింపు కాల్‌. ఆగంతకులు బెదిరించిన మడమతిప్పని కన్నాబిరాన్‌. బాలగోపాల్‌తో కలిసి పౌరహక్కుల ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.  మూడున్నర దశాబ్దాలుగా న్యాయవాదిగా, పౌరహక్కుల పోరాట యోధుడిగా పనిచేశారు.  1968-2005 హక్కుల కార్యకర్తల తరఫున వందలాది కేసులు వాదించిన కన్నాబిరాన్‌. 1978-94 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన జగన్‌
రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎంపి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బృందం డిల్లీలోని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్‌సిపి నేత శరత్‌ పవార్‌ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది.
రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం
శ్రీకృష్ణ కమిటీ నివేదిక తరువాత కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించినా ఆమోదిద్దామని, ఇష్టానుసారం మాట్లాడకుండా సంయమనం పాటించాలని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. దీనికి మంత్రులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ మనుగడపై రహదారుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై ప్రధానంగా చర్చ జరిగింది. ధర్మాన మాట్లాడుతూ ''కొన్ని పార్టీల నేతలు రెచ్చగొడ్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ప్రజల హక్కులకు భంగం కలగకుండా భరోసా ఇవ్వాలి. ఇందులో విఫలమైతే పరిస్థితి చేయి దాటిపోతుంది. పాలన ఎవరి చేతుల్లోకైనా వెళ్ళిపోయే ప్రమాదముంటుంది. దీనిపై ప్రభుత్వపరంగా కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందాం'' అని సహచరులకు సూచించారు.

28, డిసెంబర్ 2010, మంగళవారం

రచ్చకెక్కిన కాగ్రెస్‌ 'అనంత' గ్రూపు రాజకీయాలు

కాంగ్రెస్‌ పార్టీలో అనంతపురం జిల్లా గ్రూపు రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాటకు దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో కొట్టుకున్నారు. ఫర్నీచరు ధ్వంసం చేశారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 125వ వ్యవస్థాపక దినోత్సవం గ్రూపు తగాదాలకు వేదికగా మారింది. చాలా కాలంగా జిల్లాలో మాజీ మంత్రి జెసి.దివాకర్‌రెడ్డి, మంత్రులు రఘువీరారెడ్డి, శైలజనాథ్‌ మధ్య పొసగడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆధిక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులిద్దరూ ఏనాడైనా జగన్‌ వైపు వెళ్లేవారేననీ, తానొక్కడినే కాంగ్రెస్‌లో మిగులుతాననీ జెసి.దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పటి నుండీ ఇరు గ్రూపుల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశానికి రెండు గ్రూపులకు చెందిన వారు హాజరయ్యారు. ప్రారంభం నుంచే రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జెసి హాజరవలేదు. ఆయన సోదరుడు జెసి.ప్రభాకర్‌రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. మంత్రులు రఘువీరారెడ్డి, డాక్టర్‌ శైలజనాథ్‌ పార్టీ పతకావిష్కరణ అనంతరం జాతీయగీతం ఆలపిస్తుండగానే జెసి అనుచరులు, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇరు గ్రూపులవారు కార్యాలయంలోని ఫర్నీచరు ధ్వంసం చేశారు. పరస్పర దాడుల్లో ఓ పత్రికా ఫొటోగ్రాఫర్‌ తలకు గాయమైంది. ఇంత జరుగుతున్నా మంత్రులిద్దరూ ప్రేక్షకపాత్ర వహించారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేశారు. గొడవ చేస్తున్న వారిని బయటకు పంపించారు. అనంతరం జెసి.ప్రభాకర్‌రెడ్డి కలుగజేసుకుని సమావేశం కొనసాగించాలని మంత్రులను కోరారు. శైలజనాథ్‌ ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. వైఎస్‌ఆర్‌ పేరును ప్రస్తావించకుండా ప్రసంగం కొనసాగించడం పట్ల జగన్‌ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి దయతో గెలుపొంది మంత్రి పదవులు అనుభవిస్తున్న వారు ఆయన్ను విస్మరించడం ఏమిటని నిలదీశారు. జై కాంగ్రెస్‌... జైజై కాంగ్రెస్‌.. అంటూ మంత్రి శైలజ నాథ్‌ ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ మనలో మనం పోట్లాడుకోవడం ద్వారా ఫలితం లేదన్నారు. ప్రతిపక్షపార్టీలు దీన్ని అవకాశంగా తీసుకుని బలపడేందుకు ప్రయత్నిస్తాయని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే పరస్పరం కూర్చొని చర్చిం చుకుందామని తెలిపారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఖాసీం ఖాన్‌ ప్రసంగిస్తున్న సమయంలో బయట అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి బొమ్మ ఉన్న ప్లెక్సీని కొందరు చింపారు. దాంతో మళ్లీ గొడవ మొదలైంది. కాంగ్రెస్‌ కార్యాలయం పక్కనేవున్న దివాకర్‌రెడ్డి గ్యారేజీలో ఉన్న బస్సులపై గురునాథరెడ్డి అనుచరులు రాళ్లురువ్వారు. పరస్పరం దాడులకు దిగడంతో సమావేశం మళ్లీ గందరగోళానికి దారితీసింది. ఈ దాడుల్లో డిఎస్పీ హర్షవర్ధన్‌రాజు భుజానికి గాయమైంది. మంత్రులు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి అక్కడి నుంచి జారుకున్నారు.

26, డిసెంబర్ 2010, ఆదివారం

కాంగ్రెస్‌ దొంగాట!

తెలంగాణా విషయంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరితో లేదని అనిపిస్తోంది. తెలంగాణా ఇచ్చేది మేమే తెచ్చేదీ మేమే అన్న కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు నిరాహారదీక్షలు చేస్తామని లేదా రాజీనామాలు చేస్తామని తెలంగాణాలోని కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు అంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు జరినప్పుడు తెలంగాణా కోసం ఆందోళన చేసిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అప్పుడు స్పష్టంగా నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు చప్పుడు చేయకుండా ఉన్న తెలంగాణా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసులు ఎత్తేయక పోతే దీక్షలు చేస్తామని ఇప్పుడు అంటున్నారు. అంటే ఏమిటి తెలంగాణా కోసం పోరాటం చేస్తున్న పార్టీలకు ఎక్కడ గుర్తింపు వస్తుందోనని గమనించి ఇప్పుడు ఇలాంటి ప్రకటన ఇస్తున్నారా? లేక శ్రీకృష్ణ కమిటీ రాగానే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఏమయినా సంకేతాలు వచ్చాయా? అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎందుకు ద్వంద వైఖరి ప్రదర్శిస్తుంది. తెలంగాణా ఉద్యమం తీవ్రమైనప్పుడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లి సోనియాగాంధీకి మెమోరాండం ఇచ్చారు. ఒకపక్క పోలీసుల బలగాలను దింపుతున్నామని చెబుతున్నారు. మరోపక్క ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది.ఇవ్వంది తేల్చుతూ ఒక ప్రకటన చేయవచ్చు గదా?. రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు. ఒకపక్క రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన సాగుతుంది. ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక పక్క వేర్పాటు వాద ఉద్యమాలు, పలు రకాల సమస్యల్లో ఉన్నామని ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వీటన్నింటినీ వదిలిపెట్టి ఒక్క తెలంగాణా విషయంపైనే కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగుతామంటున్నారు. కొందరు శ్రీకృష్ణకమిటీ నివేదికతో సంబంధం లేకుండానే తెలంగాణా ఇవ్వాలని మాట్లాడుతున్నారు. వేర్పాటు వాద ఉద్యమాలపై స్పష్టమైన అవగాహన ఉన్న కాంగ్రెస్‌కు దోంగాట ఎందుకనేది అర్థంగాని పరిస్థితి.
చలిలో వేడి పుట్టించిన ప్రధాన పార్టీల ప్రకటనలు
శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఈ నెల 31న కేంద్రానికి అందజేస్తున్న తరుణంలో ఒక్కసారిగా తెలంగాణాలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌ వైపునకు ప్రజల దృష్టి మళ్లించేందుకన్నట్లు ఆదివారం మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్‌ తెలంగాణా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై ప్రత్యేక రాష్ట్ర ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తేయకుంటే సోమవారం నుండి నిరవధిక దీక్ష చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం కోసం అవసరమైతే పదవులకు రాజీనామా చేస్తామని ఎంపి కె కేశవరావు అన్నారు. తెలుగుదేశం తెలంగాణా ఫోరం కన్వీనర్‌ నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణాను ఇస్తే సంతోషిస్తాం, లేకుంటే అంతు చూస్తాం అని అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి స్టీరింగ్‌ కమిటీలో టిఆర్‌ఎస్‌ అధినేత కె చంద్రశేఖరరావు 'పోలీసులను ప్రయోగిస్తే.. చేతులు కాల్చుకుంటారు' అని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేసేందుకు కార్యాచరణ ప్రకటించారు.

23, డిసెంబర్ 2010, గురువారం

శ్రీ కృష్ణ కమిటీ నివేదికతో ఏమవుతుంది?

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో ఏదో జరుగుతుందని. ..తెలంగాణాకు అనుకూలంగా రాకుంటే యుద్ధమేనని కెసిఆర్‌ ప్రకటనకు భయపడుతున్నారా?. ఇంతకు తెలంగాణాకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎందుకు ఆ కమిటీ నివేదిక వస్తుందనుకుంటున్నారు.? ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమించిన మొక్కుబడి కమిషన్‌. ఎన్నికమిషన్లు వేశారు. ఏం తేల్చాయని. కాంగ్రెస్‌ అనుకుంటేనే ఏదో ఒకటి అవుతుంది తప్ప. శ్రీకృష్ణకమిటీ నివేదిక ఆధారంగా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని లేదు. ఇవ్వకూడదని లేదు. ప్రాంతాల వారీగా కమిటీ ప్రజల, రాజకీయ పార్టీల, సంఘాల, ఉద్యోగుల తదితరుల మనోభావాలు తెలుసుకున్నది. ఎన్నికలకు ముందు ఒక్క సిపిఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా కావాలనే చెప్పాయి. సిపిఎం కూడా ఒకటి స్పష్టం చేసింది. మాప్రమేయం లేకుండా పాలకులు ఎన్నోనిర్ణయాలు తీసుకున్నారు. అమలు చేశారు. ముందుగా శాసనమండలి వద్దని సిపిఎం చెప్పింది. అయినా ఆగిందా? అమలు చేశారు. ప్రపంచబ్యాంకు ఒప్పందాలు ప్రమాదకరమని, అణుఒప్పందం నష్టదాయకమని చెప్పినా వినలేదు. రాష్ట్రం విడిపోవడానికి తాము వ్యతిరేకం కాని విడగొడితే తాము చేసేదేమి లేదని స్పష్టం చేసింది. మిగతా పార్టీలన్నీ ప్రత్యేక రాష్ట్రానికి తలూపి తరువాత ప్రాంతాల వారీగా మాట మార్చాయి.
శ్రీకృష్ణ కమిటీ పరిశీలనలను ప్రభుత్వం ముందు పెడుతుంది. కాని నిర్ణయించేది కాంగ్రెస్‌ ప్రభుత్వం. దాని ప్రయోజనానికే పెద్దపేట వేస్తుంది. ప్రజల ప్రయోజనాలను మాత్రం పట్టించుకోపోవచ్చు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలను కుంటే ఉంచవచ్చు. విడగొట్టాలనుకుంటే విడగొట్టవచ్చు. కాని జనాన్ని ఇంతరెచ్చగొట్టి ఉద్యమాలవైపు మళ్లించాక గొడవలు చేయకుండా ఉంటారా? ఉన్నా తెలంగాణా తెస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు ప్రశాంతంగా ఉండనిస్తారా? అనేది ప్రశ్న.
ఏది చేయాలన్నా పోలీసు బలగాలను పెట్టి ఆందోళన కారులను అదుపులో పెట్టవచ్చు. మధ్యన ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా చూడవచ్చు. శ్రీకృష్ణ కమిటీ బూచీతో 2013 వరకు మరో పరిశీలన కమిటీ వేసి కాలయాపన చేయవచ్చు. 2014లో ప్రత్యేక రాష్ట్రం చేయవచ్చు చేయక పోవచ్చు. ఇవ్వన్ని కాదనుకుంటే ముందుగానే కేంద్రం శ్రీకృష్ణకమిటీ నివేదిక వచ్చిన రోజే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన చేయాలి. కమిటీ ఏ నివేదిక ఇచ్చినా ఆమోదిస్తామని చెప్పిన రాజకీయ పార్టీల నాయకులను సమావేశ పరిచి సరయిన నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలి.

22, డిసెంబర్ 2010, బుధవారం

చలిలో వేడెక్కిస్తున్న ఎపి రాజకీయాలు

చలికాలం తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో 44 ఏళ్ల తరువాత ఇంతటి చలి వచ్చిందని నిఫుణులు చెబుతున్నారు. 1966 డిసెంబర్‌ 24న 8.7 డిగ్రీలు నమోదు కాగా 2010 డిసెంబర్‌ 21న 8.9 డిగ్రీలు, 22న 8 డిగ్రీలకు పడిపోయింది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం విశేషం. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం డిసెంబర్‌ 31నాటికి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు వస్తుంది. ఆతరువాత తెలంగాణా ఉద్యమం ఉదృతం చేస్తామని, టిఆర్‌ఎస్‌, తెలంగాణా వాదులు హెచ్చరికలు చేయడంతో ముందుచూపుగానే ప్రభుత్వం ప్రత్యేక బలగాలను సిద్దం చేస్తోంది. సంక్రాంతిదాకా చూస్తాం కేంద్రం స్పందించకపోతే దీక్షలు ప్రారంభిస్తానని కెసిఆర్‌ హెచ్చరించారు. మర్రిచెన్నారెడ్డి కాలంలో జరిగిన పరిస్థితి పునరావృతం కాకూడదని ప్రభుత్వం అనుకుంటుండగా యుద్ధం తప్పదని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అంటున్నారు. అందులో భాగంగానే హెచ్చరికగా వరంగల్‌లో సభ పెట్టారు. విదేశాల్లో ఉండే తెలంగాణా వాదులు కూడా స్పందిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 2014 వరకు కాంగ్రెస్‌కు అధికారంలో ఉండే అవకాశం ప్రజలు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాలంటే చిదంబరంతో మరో సానుకూల ప్రకటన ఇచ్చి మరో కమిటీ వేసి కాలయాపన చేయవచ్చని అనుకుంటున్నారు. లేదా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాం కదా త్వరలో తేల్చుతామంటారా? లేక మూడు ప్రాంతాల ప్రజలకు అనుకూల మైన నిర్ణయం తీసుకుంటారా అనేది చర్చ జరుగుతుంది. ఇటీవల అకాల వర్షాల వల్ల రైతులను నిలువునా ముంచాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగింది.
దీనిని ఆసరాగా చేసుకుని చంద్రబాబు ఆందోళనకు దిగారు. తెలంగాణాలో ఎలాగు మాట్లాడే ఆవకాశం లేకుండా పోయింది. మహారాష్ట్ర వెళ్లి ఆందోళన చేసినా తెలంగాణా ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిన టిడిపి రైతుల పక్షాన దీక్షలు చేసి లబ్ధిపొందాలని అనుకున్నారు. ప్రతిపక్షనేతలంతా మద్దతు తెలిపారు. వామపక్షనేతలు సంఘీభావం తెలిపారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ ఎపి రైతులను ఆదుకోవాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేక రాశారు. అదే విధంగా రాష్ట్రంలో సిపిఎం , సిపిఐ పార్టీల శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. రైతుల పక్షాన పోరాడటం మంచిదే కాని అధికారంలో లేనప్పుడే అన్ని గుర్తుకొస్తాయి మన నేతలకు. ముఖ్యమంత్రి పదవి దక్కలేదని ఏంపీ పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జగన్‌ కూడా త్వరలో పార్టీ పేరు ప్రకటిస్తానన్నారు. ఆయనకూడా రైతుల పక్షాన పోరాడితే మంచి ఫలితాలుంటాయని ఆలోచించారు. విజయవాడలో 24 గంటల దీక్షకు కూర్చున్నారు. అధికారంలో ఉండగా రైతులుగాని, వాళ్ల సమస్యలు గాని పట్టని నేతలు ఇప్పుడు దీక్షలు చేయడం సరయినదేనా? కాదా? ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగుతుంతే రాష్ట్ర ఎంపీలు ఢిల్లీలో సమావేశమై రైతులను ఆదుకుంటామని చెప్పారు. మేము ఒకపక్క సర్వేలు చేస్తున్నాం. నివేదికలు రాకుండా ఆదుకోవడమెలా అని కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి అంటున్నారు. మరో పక్క అధికధరలు, అవినీతి వివిధ సమస్యలపై ఆయా సంఘాలు, ప్రతిపక్షపార్టీల ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలిసే ప్రయత్నం మాత్రం ముమ్మరమైంది. ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు. ఎవరు వారివారి ప్రయోజనాలకోసం పని చేస్తున్నారనేది అర్థం చేసుకోవల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రజల పక్షాన పోరాడుతున్న చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ల వద్ద కోట్ల రూపాయలు ఉన్నాయి కదా అందులో నుంచి కొన్ని కోట్లు సహాయం చేస్తే రైతుల సమస్యలు తీరుతాయని ఓ ప్రతిపాదన వచ్చింది. అది మాటలకే పరిమితం తప్ప అలాంటిది సాధ్యం కాదు. మన రాజకీయ నాయకులు పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించు కోవడం తప్ప పంపిణీ చేయడం సాధ్యమయ్యేదేనా? . ఇవన్ని జరుగుతున్న ప్రభుత్వం మాత్రం దున్నపోతుమీద వాన కురిసిన చందంగా ఉంది. ప్రభుత్వం మంటే ఎవరో కాదండి మన ప్రధాని, మఖ్యమంత్రి, యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీయే. ఈ మధ్య కాంగ్రెస్‌ ప్లీనం జరిగింది. అందులో అవినీతిపై చర్చిస్తూ గత అవినీతి కుంభకోణాలకు బాధ్యవ వహించకుండా దేశంలో బిజెపి , సిపిఎం రెండూ అవినీతి పార్టీలే నని ఓ తీర్మానం చేశారు. ఇదెక్కడి న్యాయం పశ్చిమ బెంగాల్‌లో 35 సంవత్సరాల పాటు ఏకధాటిగా అధాకారంలో ఉన్న సిపిఎంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. మంత్రులు కూడా సాధారణ జీవనం గడుపుతారు. వ్యక్తిగత ఆస్తులకు ప్రాధాన్యత ఇవ్వరు. అదే బిజెపి మతపరమైనపార్టీ, అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కున్న నేతలున్న పార్టీ. గాలిజనార్థన్‌రెడ్డి- మైనింగు కుంభకోణం, యడ్యూరప్ప- భూమి కుంభకోణం, నితీష్‌గడ్గరీ- ఆదర్శ్‌ అపార్టుమెంట్ల కుంభకోణం, లలిత్‌మోడి- ఐపిఎల్‌ కుంభకోణం ఇలా అనేక అవినీతి పరులున్న బిజెపి ఎక్కడ జీవితాలను త్యాగం చేసిని మార్క్సిస్టు పార్టీ ఎక్కడ ఈ పోలికను చూస్తే ఎఐసిసి ప్లీనం తీర్మానాలకు ఎంత నిర్ధిష్టత, నైతికత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అధికారంలో ఎంతకాలం ఉంటామో అనేది కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి, తెలంగాణా వస్తుందో లేదోనని కెసిఆర్‌కు, ఇలాంటి పరిస్థితిలో జనంలో ఎలా పేరు పొందాలనేది టిడిపికి, వీలయినంతగతొందరగా కీర్తి పొందాలనేది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయ చలి వణికిస్తుందనేది మాత్రం వాస్తవం. పరిస్థితిని గమనించి ప్రజలంతా పోరుబాట పడితే అసలయిన వేడి పుట్టే అవకాశం ఉంది. చిరంజీవి మాత్రం చలిని తట్టుకోలేక ఎక్కడో దాచుకున్నట్లు కనబడుతుంది.

16, డిసెంబర్ 2010, గురువారం

వివాహ విందులో రాజకీయ సందడి

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూతురి వివాహ విందులో రాజకీయ సందడి కనిపించింది. కాటసాని రాంభూపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కని నేపధ్యంలో కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరు కావడం రాజకీయ చర్చకు తెరలేపింది. గురువారం కర్నూలు రాగమ యూరి రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన వివాహ విందుకు వైఎస్‌ జగన్‌ గ్రూపుగా భావించే వారే ఎక్కువగా హాజరయ్యారు. జగన్‌కు పలువురు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, సోదరులు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎస్‌వి మోహన్‌రెడ్డి, ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు కోట్ల హరిచక్రపాణి రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు గౌరు వెంకటరెడ్డి, వై.జయరాజు, డోన్‌ ఎంపిపి శ్రీరాములు, ఆత్మకూరు కాంగ్రెస్‌ నాయకులు మోహన్‌రెడ్డి, కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ చైౖర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్‌ రాంభూపాల్‌రెడ్డి, నంద్యాల మాజీ ఎంపీ నాయకులు భూమానాగిరెడ్డి, ఎవి సుబ్బారెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జగన్‌కు స్వాగతం పలికారు. హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాగానే వచ్చిన వారంతా చుట్టుముట్టడంతో జగన్‌ దిగలేక లోపలే ఉండిపోయారు. హెలిప్యాడ్‌ నుంచి రిసార్ట్స్‌ వరకు జగన్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లారు. యువత జగన్‌తో కరచాలనం చేసేందుకు రావడంతో ముందుకు పోవడం చాలా కష్టంగా మారింది. పోలీసులు అతికష్టం మీద జగన్‌ను రిసెప్సన్‌ వరకు తీసుకెళ్లి తిరిగి హెలిప్యాడ్‌ వద్దకు చేర్చారు. నూతన వధూవరులను ఆశీర్వదించాక, జగన్‌ అక్కడే రిసార్ట్స్‌లోని సమావేశపు హాలులో జిల్లా నేతలతో సమావేశమయ్యారు. భూమానాగిరెడ్డి, లబ్బివెంకటస్వామి, బాలనాగిరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, శిల్పాచక్రపాణిరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, ఎస్‌వి మోహన్‌రెడ్డిలతో కొత్తగా పెట్టబోయే పార్టీపై సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరు కావడం జిల్లాలో చర్చనీయాంశమయ్యింది. కొందరు ఎమ్మెల్యేలు , మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు వివాహానికి వెళ్లినప్పటికీ జగన్‌రాక తెలుసుకుని విందుకు మాత్రం హాజరు కాలేదు. కర్ణాటక మంత్రి గాలిజనార్ధన్‌రెడ్డి దంపతులు కూడా వివాహవిందుకు హాజరయ్యారు. ఇది కేవలం వివాహవిందు అయినప్పటికీ జగన్‌ ప్రత్యేక రహస్య సమావేశం జరపడం చర్చనీయాంశమైంది. పార్టీ ఏర్పాటు చేస్తే ఎంతమంది రావచ్చనేది చర్చించినట్లు చెబుతున్నారు.

14, డిసెంబర్ 2010, మంగళవారం

నాకల నిజమైతే బావుండు!


తెల్లవారు జామున నాలుగు గంటలకు మేల్కొని నాభార్యను నిద్రనుంచి లేపాను. ఏంటి మామ నాలుగు గంటలకేనా అంటూ నిద్రలోకి పోతుంటే బలవంతంగా మేల్కోలిపాను. వైఎస్‌ జగన్‌ , టి.సుబ్బారామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్‌ తదితర కోటీశ్వరులు ఇంటికి వస్తున్నారు. కాఫీ చేయవే అన్నాను. ఇంతతొందరగా ఎందుకొస్తున్నారు. మామ నిజమా నన్నొదులు నిద్రొస్తుంది. వినవే పిచ్చిదానా డిసెంబర్‌ 10న ''అవినీతిని ఎవరు నిర్మూలించాలి ? '' శీర్షికన ఆకలి బ్లాగులో ఒక పోస్ట్‌ అప్‌ చేశాను. అది జగన్‌తోపాటు, ఎన్‌ఆర్‌ఐలు మరి కొందరు కోటీశ్వరులు చదివారట. నీవు చూపిన పరిష్కారం బాగుంది. అందరు కోటీశ్వరులతో మాట్లాడాను. అందరినీ నీబ్లాగు చదవమన్నాను. చదివాక ఫోన్‌ చేశారు. అందరికీ ఆ పరిష్కారం నచ్చిందని జగన్‌నాకు ఫోన్‌ చేశాడు. ఏం బ్లాగు... ఏం పోస్టు.. పరిష్కారమేంటి? ... అదేనే అవినీతిని అదుపు చేయాలంటే రాజకీయాల్లో , స్వచ్చందసేవా కార్యక్రమాల్లో, గజిటెడ్‌ ఆ పై ఉద్యోగాల్లో ఉండే వారందరూ వ్యక్తిగత ఆస్తులను ప్రభుత్వానికి సరెండర్‌ చేయ్యాలి. అందరూ సైనికుల్లా పని చెయ్యాలి. ఎన్నికల్లో పోటీ చేసే వారి ఎన్నికల ఖర్చంతా ప్రభుత్వమే పెట్టాలి. వ్యక్తిగత ప్రచారం చేయరాదు. కీలకమైన పదవుల్లో ఉండే వారంతా నిజాయితీగా పని చేస్తే అవినీతిని అరకట్టవచ్చు అని రాశాను. అది అందరికీ నచ్చిందట. అందరూ ఆస్తులను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తామని ఒప్పుకున్నారట. ' ఇంకేమైనా సలహాలు ఇస్తావా అన్నారు. రమ్మని చెప్పాను. ముందు నీవు లేవు. వాళ్లు ఇంటికొస్తారు.' అయ్యో నీకు కల వచ్చినట్లుంది. లేదే ఇప్పుడేగా ఫోన్లో మాట్లాడాను. మామ ఫోన్‌ స్విచ్చాప్‌ చేసి ఛార్జింగు పెట్టావు... వచ్చిందే రాత్రి రెండు గంటలకు మళ్లీ నాలుగు గంటలకే మేల్కొలిపావు. నీకలలతో సచ్చిపోతున్నా నాకు నిద్రలేకుండా చేస్తున్నావ్‌ అని విసుక్కుంది నా భార్య. సారీ చెప్పి నిద్రపోవే అన్నాను. ఈ లోపు మా పెద్దోడు మామాటలు విని మేల్కొని డాడి నీకల రావడం నాకు మంచిదైంది. ఈ రోజు యూనిట్‌ టెస్టు ఉంది చదువుకోవాలి. నీసుత్తి విన్నాక నానిద్ర పోయింది. వంటచేస్తాను. నీవయితే పడుకో అని నాభార్య చెప్పింది. నాకల నిజమైతే కోటీశ్వరులు ఆస్తులను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. పేదలంతా బాగు పడుతారు. అదంతా జరిగేది కాదులే...గాని మూసుకొని నిద్రపో మామ అని తను పనిలోకి వెళ్లింది.

11, డిసెంబర్ 2010, శనివారం

కొండాసురేఖ ఇప్పుడెందుకలా స్పందించారు?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రమాదవాశాత్తు హెలికాప్టర్‌ కూలి చనిపోయారని సిబిఐ, ఇతర పరిశోధనా సంస్థలు తేల్చాయి. ఏడాది దాటిన తరువాత వైఎస్‌ఆర్‌ ప్రాణ స్నేహితుడు కెవిపి రాంచందర్‌రావు అవినీతి గురించి మాజీమంత్రి కొండాసురేఖకు గుర్తుకొచ్చింది. కెవిపి రాంచందర్‌రావు వల్లనే రాజశేఖర్‌రెడ్డికి చెడ్డపేరు వచ్చిందని చెబుతున్నారు. మరి ఏడాది పొడవునా ఎందుకు గుర్తుకు రాలేదు. ఆయన జగన్‌వెంట వుండి ప్రచారం చేసివుంటే కెవిపి చేసిన అవినీతి బయటికి వచ్చేది కాదేమో. ఆయన కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలపడం వల్ల అవినీతి గుర్తుకు వచ్చిందా?. జలయజ్ఞం పనులు ఏఏ కంపెనీలకు ఇచ్చారో మీరు మంత్రి పదవిలో కొనసాగారు గదా మీకు తెలువదా? తెలిస్తే అంత నీతిమంతురాలివి ఎందుకు అప్పుడు ప్రశ్నించలేదు. రాజశేఖర్‌రెడ్డి మీకు మంచివాడయితే ఆయన ప్రాణస్నేహితుడు మీకెలా చెడ్డవాడయ్యారు. సరే ఇప్పటికయినా అవినీతిని ప్రశ్నించారు మంచిదే మరి ఆ అవినీతి సొమ్మంతా జగన్‌ వారసుడుగా అనుభవిస్తున్నాడు. ఆయనేమో మీకు మంచివాడు. అధిష్టానం ఆయనపట్ల తప్పుచేసింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు తప్పుచేశారు. మరింకా కాంగ్రెస్‌లోనే ఎందుకున్నారు. మీకు చాలా మేలు చేసిన రాజశేఖర్‌రెడ్డి చనిపోతే ఆయన మరణాన్ని జీర్జించుకోలేని 680 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గుండేఆగి చనిపోయారు. అంత ఎక్కువ అభిమానం ఉన్న మీకు ఏమి కాలేదేమి? వైఎస్‌ కుటుంబసభ్యులెవ్వరూ చనిపోలేదే. ఎలాంటి సంబంధం లేని 680 మంది ఎలా ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో బ్యాంకులు జాతీయం చేసి, భూసంస్కరణల చట్టం తెచ్చి పేదల పెన్నిదిగా పేరుగాంచిన ఇందిరాగాంధీని కాల్చి చంపితే అంతమంది ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు. అంతమంది గుండెలు కూడా ఆగలేదు. మరి కుంభకోణాలు చేసి ప్రజాధనం దోచుకున్న రాజశేఖర్‌రెడ్డి చనిపోతే అంతమంది ఆత్మహత్య చేసుకోవడం సాధ్యమేనా?. రాజకీయాల్లో ఉండి ఏది మాట్లాడినా నడుస్తుందిలే అని మీరు అనుకుంటున్నారా?. సరే కెవిపి అవినీతి చేశాడు. ఆయనే కోట్లు సంపాదిస్తే ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఇంకెంత సంపాదించి ఉంటారో అని ప్రతిపక్షాలు, స్వపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సమాధానం ఎవరు చెప్పాలి. ఎందుకమ్మా సురేఖ ఈ ప్రస్తావన జగన్‌కోసం చేశావా? నీ రాజకీయ భవిష్యత్తుకోసం చేశావా? కెవిపిని అభాసుపాలు చేయడానికా? జనం ఏది చెప్పినా నమ్ముతారనా?. సమాధానం మీరే చెప్పాలి.

10, డిసెంబర్ 2010, శుక్రవారం

అవినీతిని ఎవరు నిర్మూలించాలి?

అవినీతిని ఎవరు నిర్మూలించాలంటే చెప్పడం సులభం. యాంటికరప్షన్‌ బ్యూరో (ఎసిబి) అని చెబుతాం. లేదా ఆయా శాఖలలోని అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యులు కాని అది సాధ్యమేనా!? ఎసిబి, ఇతర పోలీసు, రక్షణ శాఖలన్నీ ఎవరి ఆదీనంలో ఉంటాయి. చట్టసభల చేతిలో ఉంటాయి. అంటే పార్లమెంటు, శాషన సభ , వీటికింద అధికారులు, న్యాయస్థానాలు, పోర్త్‌ ఎస్టేట్‌గా భావించే మీడియా ఇవన్ని అవినీతిని అదుపు చేస్తున్నాయా? చేస్తే ఇంతగా అవినీతి ఎందుకు పెరిగి పోతుంది. పేదోడు పేదోడవుతున్నాడు. ధనవంతుడు ధనవంతుడవుతున్నాడు. మనది ప్రజాస్వామ్య దేశం అంటున్నాం. కాబట్టి ప్రజలు ప్రజాప్రతినధులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు. ఓటు హక్కు ఎంతో పవిత్రమైనదని చెబుతున్నాం. కాని నిజాయితీగా ఓటు వేస్తున్నామా? వేయనిస్తున్నారా? అనేది కూడా ప్రశ్నే . ఓట్లను కొంటున్నారు. డబ్బు ఎవ్వడు ఎక్కువ ఖర్చు చేస్తే వాడికి ఓట్లు పడుతున్నాయి. కొన్ని చోట్ల దౌర్జన్యంగా బూత్‌ క్యాప్చర్‌ చేసి ఓట్లు వేసుకుంటున్నారు. ఇలా గెలుపొందిన వారు చట్టసభల్లో ప్రజలగురించి ఎంతవరకు మాట్లాడి న్యాయం చేస్తున్నారు. అస్సలు ప్రజల గురించి ఆలోచిస్తున్నారా?. పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వారు వారి స్వప్రయోజనాలగురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎలా సంపాదించాలో ఆలోచిస్తున్నారు. అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. ఐపిఎల్‌ కుంభకోణంలో శశిథరూర్‌, 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం, జలయజ్ఞం, కార్గిల్‌ అమరవీరులకు ఆదర్ష్‌ అపార్టు మెంట్ల నిర్మాణంలో , కర్ణాటక ఆంధ్రసరిహద్దులో ఇనుపఖనిజం కుంభకోణం, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డూరప్ప భూముల కుంభకోణం ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రజలను మోసం చేస్తున్నారు. న్యాయస్థానాలకు తప్పుడు సాక్షాలు చూపి తప్పించుకు తిరుగుతున్నారు. శిక్ష పడేవాళ్లు నూటికో కోటికో ఒకరు ఉంటున్నారు. మీడియాలో కూడా పెట్టుబడిదారులు వచ్చారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన మీడియాలో కూడా కార్పొరేటీకరణ పెరిగింది. ఇందులో కొందరు మాత్రమే నిష్పక్ష పాతంగా ఉన్నారు. ఎవరు ఏంటనేది మనం నిత్యం చూస్తున్నాం. కొన్ని పత్రికలు ప్రజల పక్షాన అన్ని రాస్తారు. కాని కారణం ఎవరు. ఎవరిని శిక్షించాలనేది మాత్రం చెప్పరు. మరి కీలకమైన రాజకీయ పార్టీలు చూస్తే ఈ దేశానికి సోషలిజం తెస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జవహర్‌లాల్‌నెహ్రూ చెప్పారు. కాని ఆపార్టీ పరిస్థితి మనకు అర్థమైంది. కమ్యూనిస్టు పార్టీ ఆపార్టీ సిద్దాంతం మాత్రం బాగుంది. వ్యక్తి ఆస్తి ఉండకూడదు. అందరికీ సమానమే అని చెప్పారు. చైనా, లాటిన్‌ అమెరికా దేశాల్లో కమ్యూ నిస్టు పార్టీ అధికారంలో ఉన్న సంగతి మనకు తెలుసు. రష్యాలో సోషలిజం పడిపోయాక కమ్యూనిస్టుపార్టీలపై ప్రజలకు ఇంకా పూర్తిస్థాయిలో విశ్వాసం రాలేదు. ఆతరువాత మనదేశంలో పెట్టుబడిదారులది పైచేయి కావడం. ప్రజలు కమ్యూనిజం వైపు వెళ్లకుండా జాతుల, మతాల, ప్రాంతాల, కులాల వారీగా విడగొడుతున్నారు. మనం చూస్తున్నాం. బిజెపి మతంపేరుతో వచ్చింది. అధికారం చేతికొచ్చాక జనాన్ని మోసం చేసింది. అభాసుపాలయ్యింది. జనతాదల్‌ వచ్చింది. అదికూడా ముక్కలుగా విడిపోయింది. అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. నూతన ఆర్థిక విధానాలు వచ్చాక దేశంలో అవినీతి మరింత పెరిగిపోయింది.
మరిప్పుడేం చేయ్యాలి. ప్రధానంగా రాజకీయాలు అంటే సేవాభావంతో ఉండాలి. కమ్యూనిస్టులు మినహా అన్ని పార్టీలు వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారు. కోటీశ్వరులుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయదలిచిన వారు తమ పూర్తి ఆస్తులను ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలి. పదవికాలం పూర్తయ్యాక తమ ఆస్తిని వినియోగించుకోవాలి. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులన్నీ పద్దతి ప్రకారం చెల్లించాలి. పేదల శ్రమదోపిడీని అరికట్టాలి. అదే తరహాలో గజిటెడ్‌ ర్యాంకు అధికారులు కూడా తమ ఆస్తులను ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలి. స్వశ్చంద సంస్థలు, ప్రజలకు సేవచేస్తామని వచ్చేవారందరూ అలానే చేయాలి. అలా ముందుకు వచ్చిన వారందరి కనీస అవసరాలు ప్రభుత్వం తీర్చాలి.. వ్యక్తిగత వ్యాపారాలు చేసేవారంతా ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం పన్నులు చెల్లించాలి. ఎన్నికల్లో పోటీ చేసే వారి తరుపున ప్రభుత్వమే ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గాని, ఆయన బందువులు గాని ఎలాంటి ప్రచారం, ప్రకటనలు ఇవ్వకూడదు. ప్రజలు స్వశ్చందంగా ఓటు చేయడానికి కావల్సిన సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలి. అవినీతిని అరికట్టేందుకు సులభమవుతుందని నాఅభిప్రాయం.

6, డిసెంబర్ 2010, సోమవారం

మంత్రుల కు స్వాగతం పలకని ఎమ్మెల్యేలు

కర్నూలు జిల్లా టిజి వెంకటేష్‌, ఏరాసు ప్రతాపరెడ్డికి మంత్రి పదవులు లభించాయి. ఇద్దరూ సోమవారం కర్నూలు నగరానికి వచ్చారు. వారికి నగరంలో భారీ స్వాగతం లభిస్తుందని అనుకున్నారు. ప్రజలు , కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. కాని జిల్లాలోని 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గాను కేవలం నందికొట్కూరు ఎమ్మెల్యే ఏరాసు ప్రతాపరెడ్డి మాత్రమే వచ్చారు. మిగతావారెవరూ రాకపోవడంతో చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి సారి కర్నూలు నగరానికి వచ్చిన న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్‌లు కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో రహస్య సమావేశం నిర్వహించారు. మంత్రులకు స్వాగతం పలకడానికి కాకపోయినా ప్రజాప్రతినిధులుగా సమీక్షా సమావేశానికి కూడా రాలేదు. ఈ సమీక్షా సమావేశానికి మొదట జర్నలిస్టులను ఆహ్వానించిన జిల్లా ఉన్నతాధికారులు ఆ తరువాత మంత్రుల సూచన మేరకు వారిని బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు జర్నలిస్టులను, ఫొటో గ్రాఫర్లను, వీడియో గ్రాఫర్లను బయటికి పంపించేశారు. పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను సమీక్షించాల్సిన మంత్రులు రహస్యంగా సమీక్షించడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా నిరసించారు. ఈ మేరకు కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ బయటికి వచ్చి మళ్లీ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేల్లో ఒక్కరు మినహా అంతా గైర్హాజరు కావడం చర్చనీయాంశమయింది. నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మినహా ఎమ్మెల్యేలంతా మంత్రుల పర్యటనకు దూరంగా ఉన్నారు. తొలిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రులు మొదట ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. అతిథి గృహంలోనూ కాంగ్రెస్‌ నేతలు లబ్బి వెంకటస్వామి మినహా నగరంలోని మిగిలిన నాయకులెవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి గ్రూపుగా ముద్ర పడిన జడ్‌పి ఛైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి, కోడుమూరు ఎమ్మెల్యే మురళీ కృష్ణ సైతం మంత్రుల పర్యటనకు దూరంగా ఉండడం చర్చనీయాంశమయింది. తొలిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రులకు ఎమ్మెల్యేలంతా దూరంగా ఉండడంతో భవిష్యత్తులో సహాయ సహకారాలు అందుతాయో లేదోనన్న చర్చసాగింది. గతంలో శిల్పా మోహన్‌ రెడ్డికి కొంత మంది నుంచి ఇబ్బందులు ఉన్నా మిగిలిన ఎమ్మెల్యేలంతా కలుపుకుపోయే విధంగానే వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌లో పెద్ద చీలిక రావడంతో ఎమ్మెల్యేలు కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లోని మంత్రులకు ఏ మాత్రం సహకారం అందిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పటికే జిల్లాలో లబ్బి వెంకటస్వామి, నీరజా రెడ్డి, బాలనాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు జగన్‌ గ్రూపుగా ముద్ర పడి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి తోడు తెలుగుదేశం ఎమ్మెల్యేలూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌లోనే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, శిల్పా మోహన్‌ రెడ్డిలు బహిరంగంగానే ముఖ్యమంత్రిని విమర్శించారు.

5, డిసెంబర్ 2010, ఆదివారం

చరిత్రలో ఈరోజు

1.చరిత్రలో ఈరోజు అంటే డిసెంబర్‌ 6న కొన్ని విషాదకర , వివాదాస్పద సంఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనవి. భారత రాజ్యాగ నిర్మాత డాక్టర్‌ భీమ్‌రావ్‌ రాంజీ అంబేద్కర్‌ 1956 డిసెంబర్‌ 6న మరణించారు. భారత జాతి శోక సంద్రంలో మునిగింది.
2. 1992 డిసెంబర్‌ 6న కరసేవకులు అయోధ్యలోని బాబ్రీమసీదును ధ్వంసం చేసి వివాదాస్పదం చేశారు. ప్రపంచలోని ముస్లింలను, లౌకిక వాదుల మనుసులను కలచి వేసింది.
3. 1997 డిసెంబర్‌6న చెన్నైనుంచి బయలు దేరిన మూడు రైళ్లలో జరిగిన బాంబుపేళుళ్లలో తొమ్మిది మంది మరణించారు. పలువురిని కలిచి వేసింది.
అంబేద్కర్‌ గురించి కొంత
అంబేద్కర్‌ గురించి కొంతయినా వివరంగా తెలుసుకోవడం అవసరం. డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ 1891 ఏప్రిల్‌ 14న జన్మించారు. అప్పుడు భయంకరమైన అంటరానితనం సమాజాన్ని పట్టి పీడించే రోజులు. అంబేద్కర్‌ను అంటరాని వారన్నందుకు ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ ప్రముఖుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. ఎంఏ, పిహెచ్‌డి, డిఎస్సీ, ఎల్‌ఎల్‌.డి, డి.లిట్‌, బారిస్టర్‌ అట్‌లా ఈ చదువులన్నీ అంబేద్కర్‌ పూర్తి చేశారు. ఆయన జ్యోతిరావుఫూలేను గురువుగా ఎంచుకున్నారు. బహిష్కృత భారతి (మరాఠీ), మూక్‌నాయక్‌ పత్రికలను ఆయన నిర్వహించారు. అంబేద్కర్‌ మహాత్మాగాంధీల మధ్య పూనా ఒడంబడిక 1931లో జరిగింది. రాజ్యాంగ డ్రాప్టు కమిటీకి అంబేద్కర్‌ ఛైర్మన్‌గా ఉండి రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 ప్రభుత్వానికి అందజేశారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ తొలిక్యాబినెట్‌లో న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. 1990లో డాక్టర్‌ బిఆర్‌ అంబ్కేదర్‌కు భారత రత్న అవార్డు లభించింది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో 1956లో బౌద్దమతాన్ని స్వీకరించారు. 1956 డిసెంబర్‌ 6న ఆయన నిద్రలోనే తుదిశ్వాస వదిలారు. అంబేద్కర్‌ సిద్దాంతాలతో కాన్షిరాం బహుజన సమాజ్‌పార్టీని స్థాపించారు. అనేక ప్రసంగాలు, రచనలు చేసిన అంబేద్కర్‌ ఎంతో కీర్తిని గడించారు. ఇదంతా రేఖామాత్రంగా మాత్రమే అంబేద్కర్‌ గురించి చెప్పాలంటే ఎంతో ఉంది.

3, డిసెంబర్ 2010, శుక్రవారం

నిజాయితీతో అడుగేస్తే జగన్‌కు మంచి భవిష్యత్తుంది

జగన్‌ ఆలోచించి అడుగేస్తే మంచి భవిష్యత్తు ఉంది. మాఘలో పుట్టి పుబ్బలో అస్తమించిన పార్టీల మాదిరిగా కాకుండా విలువలతో కూడిన రాజకీయాలను ప్రవేశపెట్టాలి. అంటే మనరాష్ట్రంలో సాధ్యమా అంటే సాధ్యమవుతాయి. డబ్బు, దర్పం, అవినీతి, బంధుప్రీతి, స్వార్థం అనే వాటికి దూరంగా ఉండాలి. సాధ్యమా ? కాదా? నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టిన వారంతా గొప్ప నాయకులే అయ్యారు. మహారాష్ట్రలో షరత్‌పవార్‌, పచ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జి లాంటి వారు వారి రాష్ట్రాల్లో ఎదిగారు. కాని వారంతా రాజకీయ విలువలకు కట్టుబడి లేనందున రాష్ట్ర రాజకీయాలను శాసించలేక పోయారు. అయితే గుర్తింపు పొందడానికి నేటివిటీ కూడా ఉపయోగపడుతుంది. వచ్చిన చిక్కంతా ఒకటే రాజకీయాలు డబ్బు, కులం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రెండింటినీ ఎలా మేనేజ్‌ చేస్తారనేది చూడాలి. తెలంగాణా సాధన పేరుతో డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణా ప్రజాసమితి నుంచి ఇటీవల సామాజిక న్యాయం పేరుతో వచ్చిన ప్రజారాజ్యం వరకు చూస్తే ఒక్క టిడిపి మాత్రమే సక్సెస్‌ అయ్యింది. తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్‌ను గడగడలాండించారు ఎన్‌టి రామారావు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో ఆపరిస్థితి లేదు. ఎన్‌టిరామారావుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకతీతంగా సినిమా అభిమానులున్నారు. జగన్‌కు తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు, ఆయన సంపాదించిన డబ్బు తండ్రి పేరు కాంగ్రెస్‌వల్ల వచ్చింది. కాంగ్రెస్‌కు జగన్‌కు రాజీనామా చేయడం వల్ల సగానికి పైగా కాంగ్రెస్‌లోనే రాజశేఖర్‌రెడ్డికి ఉన్న కీర్తి పోయింది. ఇప్పుడు జగన్‌కు కొద్దిపాటి సానుభూతి మాత్రమే ఉంది. ఆసానుభూతికి కాంగ్రెస్‌, టిడిపి ఇతర పార్టీలనుంచి వచ్చే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణాలో జగన్‌కు వ్యతిరేకతనే ఎక్కువ. నూతన ఆర్థిక విధానాల పుణ్యమాని రాష్ట్రంలో సంపన్నులు మరింత సంపన్నులయ్యారు. పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడ్డారు. చెప్పాలంటే ఇంకా అనేక సమస్యలున్నాయి. కులాల వారీగా ప్రజల ఐక్యత దెబ్బతిన్నది. మతోన్మాదుల సంగతి చెప్పనవసరం లేదు. వేర్పాటు వాద ఉద్యమాలున్నాయి. ఐక్యంగా ఉందామని ఒక్క సిపిఎం మాత్రమే ధైర్యంగా చెబుతుంది. మిగతా పార్టీలన్నీ గోడమీది పిల్లి వాటంగా ఉన్నాయి. వీటన్నింటినీ భేరీజు వేసుకునే శక్తి సామర్థ్యాలు కావాలి. పార్టీకి కొన్ని కొన్ని సిద్ధాంతాలుండాలి. వాటిని అమలు చేయగల మొక్కవోని ధైర్యముండాలి. ఈ దేశానికి సైనికుల్లాంటి సేవాభావం ఉన్న నాయకత్వం కావాలి. ఒకరినొకరు దోచుకునే వ్యవస్థను ప్రశ్నించాలి. అప్పుడే జగన్‌ పెట్టే కొత్త పార్టీ హిట్టు అవుతుంది.లేదంటే ఫట్టే...!

1, డిసెంబర్ 2010, బుధవారం

కిరణ్‌ మంత్రివర్గంలో కొరవడిన సామాజిక న్యాయం

రాష్ట్ర మంత్రి వర్గంలో గతంలో మాదిరిగానే కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోనూ సామాజిక న్యాయం కొరవడింది. మొత్తం 39 మందిలో అగ్రభాగానా అగ్రవర్ణాల వారున్నారు. మంత్రి వర్గంలో కులాల పొందిక చూస్తే రెడ్డి కులస్తులకు 13, బిసిలకు 11, ఎస్సీలకు ఆరు, కాపు మూడు, వెలమ ఒకటి, కమ్మ ఒకటి, వైశ్య ఒకటి, బ్రాహ్మణ ఒకటి, ఎస్‌టి ఒకటి చొప్పున మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రాంతాల వారీగా చూస్తే తెలంగాణాకు 16 మందికి, కోస్తాకు 15, రాయలసీమకు ఎనిమిది మంది చొప్పున అవకాశం కల్పించారు.
ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి 39 మంది మంత్రుల జాబితాను బుధవారం ఉదయం గవర్నర్‌కు పంపారు. సిఎం కార్యాలయ కార్యదర్శి జవహర్‌ రెడ్డి మంత్రుల జాబితాను గవర్నర్‌కు అందజేశారు. కాబోయే మంత్రులకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. మంత్రివర్గంలో 11 మంది కొత్తవారికి చోటు దక్కింది. ఐదుగురు తాజా మాజీ మంత్రులకు ఉద్వాసన పలికారు.
రాజ్‌భవన్‌లో 39 మంది ప్రమాణస్వీకారం చేశారు. ముగ్గురు ఆంగ్లంలో ప్రమాణం చేయగా మిగతా వారు తెలుగులోనే చేశారు. ఎక్కువమంది దేవుని సాక్షిగా ప్రమాణం చేయగా , మనస్సాక్షిగా అని కొందరు ప్రమాణం చేశారు. దైవసమానులయిన తల్లిదండ్రుల సాక్షిగా అని అనంతపురం జిల్లాకు చెందిన ఎన్‌.రఘువీరారెడ్డి ప్రమాణం చేశారు.
భారత రాజ్యాంగంలోని శాసనాలను అనుగుణంగా , భయం , పక్షపాతం లేకుండా రాగధ్వేశాలకు అతీతంగా ప్రజలకు తనకర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని, అవసరమైన మేరకు తప్ప ప్రభుత్వ రహస్యాలను ఇతరులకు చెప్పనని మంత్రులందరూ ప్రమాణ పత్రాలను చదివారు. ఆవిధంగా గతంలో పని చేసిన మంత్రులందరూ ప్రమాణం చేశారు. కాని పద్దతులను తప్పారు. అడ్డగోలుగా సంపాదించారు. భవిష్యత్తులో నయినా చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేస్తారని ఆశిద్దాం.
జిల్లాల వారిగా మంత్రుల వివరాలు..
1. మెదక్‌: సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనరసింహ
2. హైదరబాద్‌: ముఖేష్‌ గౌడ్‌, దానం నాగేందర్‌, శంకర్రావు
3. మహబూబ్‌నగర్‌: జూపల్లి కృష్ణారావు, డికె అరుణ
4. నల్గొండ: జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
5. రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి
6. ఖమ్మం: రాంరెడ్డి వెంకటరెడ్డి
7. గుంటూరు: కన్నా లకిëనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, మోపిదేవి వెంకటరమణ కాసు వెంకటకృష్ణారెడ్డి
8. వరంగల్‌: బసవరాజుసారయ్య, పొన్నాల లక్ష్మయ్య
9. నిజామాబాద్‌ : సుదర్శన్‌ రెడ్డి
10. కరీంనగర్‌: డి. శ్రీధర్‌ బాబు
11. అనంతపురం : రఘువీరారెడ్డి, శైలజానాథ్‌
12. నెల్లూరు: ఆనం రామనారాయణరెడ్డి
13. కృష్ణా: కె.పార్థసారథి
14. విశాఖ: పసుపులేటి బాలరాజు
15. ప్రకాశం: మానుగుంట మహీధర్‌ రెడ్డి
16. పశ్చిమగోదావరి: పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్‌
17. శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, శుత్రుచర్ల విజయరామరాజు
18. కడప: వైఎస్‌ వివేకానందరెడ్డి, డిఎల్‌ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా
19. తూర్పుగోదావరి: పి. విశ్వరూప్‌, తోటనర్సింహ
20. కర్నూలు: టిజి వెంకటేష్‌, ఏరాసు ప్రతాపరెడ్డి
21. చిత్తూరు: గల్లా అరుణకుమారి
22. విజయనగరం: బొత్సనారాయణ
మనరాష్ట్రంలోని 23 జిల్లాలకు గాను ఒక్క ఆదిలాబాద్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు.