16, డిసెంబర్ 2010, గురువారం

వివాహ విందులో రాజకీయ సందడి

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూతురి వివాహ విందులో రాజకీయ సందడి కనిపించింది. కాటసాని రాంభూపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కని నేపధ్యంలో కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరు కావడం రాజకీయ చర్చకు తెరలేపింది. గురువారం కర్నూలు రాగమ యూరి రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన వివాహ విందుకు వైఎస్‌ జగన్‌ గ్రూపుగా భావించే వారే ఎక్కువగా హాజరయ్యారు. జగన్‌కు పలువురు అభిమానులు భారీగా స్వాగతం పలికారు. నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, సోదరులు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎస్‌వి మోహన్‌రెడ్డి, ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు కోట్ల హరిచక్రపాణి రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు గౌరు వెంకటరెడ్డి, వై.జయరాజు, డోన్‌ ఎంపిపి శ్రీరాములు, ఆత్మకూరు కాంగ్రెస్‌ నాయకులు మోహన్‌రెడ్డి, కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ చైౖర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్‌ రాంభూపాల్‌రెడ్డి, నంద్యాల మాజీ ఎంపీ నాయకులు భూమానాగిరెడ్డి, ఎవి సుబ్బారెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జగన్‌కు స్వాగతం పలికారు. హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాగానే వచ్చిన వారంతా చుట్టుముట్టడంతో జగన్‌ దిగలేక లోపలే ఉండిపోయారు. హెలిప్యాడ్‌ నుంచి రిసార్ట్స్‌ వరకు జగన్‌ను ఊరేగింపుగా తీసుకెళ్లారు. యువత జగన్‌తో కరచాలనం చేసేందుకు రావడంతో ముందుకు పోవడం చాలా కష్టంగా మారింది. పోలీసులు అతికష్టం మీద జగన్‌ను రిసెప్సన్‌ వరకు తీసుకెళ్లి తిరిగి హెలిప్యాడ్‌ వద్దకు చేర్చారు. నూతన వధూవరులను ఆశీర్వదించాక, జగన్‌ అక్కడే రిసార్ట్స్‌లోని సమావేశపు హాలులో జిల్లా నేతలతో సమావేశమయ్యారు. భూమానాగిరెడ్డి, లబ్బివెంకటస్వామి, బాలనాగిరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, శిల్పాచక్రపాణిరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, ఎస్‌వి మోహన్‌రెడ్డిలతో కొత్తగా పెట్టబోయే పార్టీపై సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరు కావడం జిల్లాలో చర్చనీయాంశమయ్యింది. కొందరు ఎమ్మెల్యేలు , మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు వివాహానికి వెళ్లినప్పటికీ జగన్‌రాక తెలుసుకుని విందుకు మాత్రం హాజరు కాలేదు. కర్ణాటక మంత్రి గాలిజనార్ధన్‌రెడ్డి దంపతులు కూడా వివాహవిందుకు హాజరయ్యారు. ఇది కేవలం వివాహవిందు అయినప్పటికీ జగన్‌ ప్రత్యేక రహస్య సమావేశం జరపడం చర్చనీయాంశమైంది. పార్టీ ఏర్పాటు చేస్తే ఎంతమంది రావచ్చనేది చర్చించినట్లు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు: