4, జనవరి 2011, మంగళవారం

నోబుల్‌ సాధిస్తే గర్వపడతా

రాష్ట్ర స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించిన గవర్నర్‌
శాస్త్ర విజ్ఞాన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ నోబుల్‌ బహుమతిని సాధించే లక్ష్యంగా పని చేయాలని గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆకాంక్షించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ధర్మాపూర్‌ శివారులో గల జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గవర్నర్‌ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ముఖ్యోపన్యాసం చేశారు. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్రం నోబుల్‌ బహుమతిని కైవసం చేసుకోవాలని, ఆ మేరకు కృషి, పట్టుదల, ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. మానవ జీవన పురోగమనానికి సైన్స్‌ ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం సైన్స్‌ను విస్మరించడం సరికాదన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, రక్షిత మంచినీరు, పర్యావరణం, జీవరసాయన వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువ శాస్త్రవేత్తలు ఈ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. మొక్కుబడి ప్రదర్శనలు చేయకుండా ఫలితం సాధించేలా ఉండాలన్నారు. ఆ మేరకు ఉపాధ్యాయులు ఎంతో పట్టుదలతో విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సమకాలీన విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. ధనార్జనే ధ్యేయంగా విద్యాభ్యాసం సరికాదని అభిప్రాయపడ్డారు. సైన్స్‌ చదివిన ప్రతి ఒక్కరూ సమాజాన్ని ప్రభావితం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులను దేశ భవిష్యత్తుగా అభివర్ణించారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర వ్యాప్తంగా 575 ఉన్నత పాఠశాలల నుండి 1,150 మంది విద్యార్థులు హాజరయ్యారు. జీవ రసాయన, వ్యవసాయ అంశాలపై విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను గవర్నర్‌ తిలకించారు. వారిని అభినందించారు. ప్రశ్నలు వేసుకోవడం, సమాధానాల కోసం వెతకడం, ఆధారాలను నిరూపించడం సైన్స్‌ విద్యార్థులకు ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సరిగ్గా 30 నిముషాల్లో గవర్నర్‌ పర్యటన ముగిసింది. కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి డికె అరుణ, జిల్లా కలెక్టర్‌ ఎం.పురుషోత్తమరెడ్డి మాట్లాడారు. జెడ్పీ ఛైర్మన్‌ కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరు సుధాకర్‌రెడ్డి, ఎస్‌.జగదీశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే ఎన్‌.రాజేశ్వర్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ టి.చిరంజీవులు, అదనపు జాయింట్‌ కలెక్టర్‌ భారతీలక్పతినాయక్‌, జిల్లా విద్యాధికారి డాక్టర్‌ విజరుకుమార్‌ ఉన్నారు.

2 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

"కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన"
పనిని చేసేటంతవరకే మనకధికారముంది,ఫలితంపైన కాదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు.ఓ రాజకీయనాయకుల్లారా! శాస్త్రవేత్తలను స్వేచ్చగా పనిచేయనివ్వండి, ప్రోత్సహించండి.క్రొత్తది కనిపెట్టినప్పుడు అడ్డుతగలకుండా ఉండండి,పరిశోధనల్లోకూడా రాజకీయాలు చెయ్యద్దు.పతకాలు అవంతట అవే వస్తాయి.

అజ్ఞాత చెప్పారు...

వందన సమర్పణ, జాతీయ గీతాలాపన చేశారా, లేదా? :D