9, నవంబర్ 2012, శుక్రవారం

స్విస్‌ బ్యాంక్‌ చిట్టా విప్పిన కేజ్రీవాల్‌

రాహుల్‌ నేస్తాలు, అంబానీ సోదరులు సహా 700 మందికి ఖాతాలు
            అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈసారి స్విస్‌ బ్యాంకులో 'నల్ల' ఖాతాలున్న కుబేరుల గుట్టు విప్పారు. కార్పొరేట్‌ దిగ్గజాలైన అంబానీ సోదరులు ముఖేష్‌, అనిల్‌ వంద కోట్ల రూపాయల చొప్పున, రిలయన్స్‌ గ్రూపునకు చెందిన మోటెక్‌ సాఫ్ట్‌వేర్‌ రూ.2,100 కోట్లు, సందీప్‌, అన్నూ టాండన్‌ రూ.125 కోట్ల చొప్పున, నరేశ్‌ గోయెల్‌ రూ. 80 కోట్లు, డాబర్‌ బర్మన్‌ సోదరులు రూ.25 కోట్ల చొప్పున జెనీవాలో నల్ల డబ్బు దాచారని ఆయన 2012 నవంబర్‌ తొమ్మిదిన శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. జెనీవాలోని హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో భారత జాతీయులకు చెందిన దాదాపు 700 ఖాతాల వివరాలు తమ చేతికి అందాయని, ఈ జాబితా ప్రభుత్వానికి ఆరేళ్ల క్రిందటే అందిందని వివరించారు. అయితే ఈ జాబితాను బయట పెట్టే ధైర్యం ప్రభుత్వానికి ఇంతవరకూ రాలేదన్నారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ సన్నిహితురాలు అనూ టాండన్‌, ఆమె భర్త మాజీ ఐఆర్‌ఎస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారి సందీప్‌ టాండన్‌, రిలయన్స్‌ గ్రూప్‌లకు ఈ బ్యాంకులో రు.125 కోట్ల మేర డిపాజిట్లు వున్నాయని కేజ్రీవాల్‌ చెప్పారు.దేశాన్ని దోచుకుని విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటున్న 'నల్ల ధనికు'లకు కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తోందని కేజ్రీవాల్‌ విమర్శించారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న 'నల్లధనికు'ల జాబితా, అందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద వున్నప్పటికీ వాటిని బహిర్గతం చేసే ధైర్యం చేయడం లేదన్నారు. 'నల్లధనికు'లకు అండగా వుంటున్న సర్కారు, వారి ప్రయోజనాల కోసం దేశ ప్రజల భవితను పణంగా పెడుతోందని మండిపడ్డారు. గత ఏడాది జులైలో కేంద్ర ప్రభుత్వం అందుకున్న ఈ జాబితాలో వున్న వారి పేర్లను పూర్తిగా బయట పెట్టటం తమకు సాధ్యం కాలేదన్నారు. తమకు అందిన జాబితాలోని ఖాతాల నిల్వలను వివరించారు. స్విస్‌ బ్యాంకుల్లో దాదాపు రు.25 లక్షల కోట్ల నల్లధనం మూలుగుతోందని చెప్పిన కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి అందిన 700 పేర్లకు చెందిన ఖాతాల్లో కేవలం రు. 6 వేల కోట్లు మాత్రమే వుందని తెలిపారు. హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా నల్లధనానికి ఆశ్రయం కల్పిస్తున్నదని ఆయన విమర్శించారు.
మాకెక్కడా ఖాతాల్లేవు : అంబానీ సోదరులు
             కేజ్రివాల్‌ చేసిన ఆరోపణలన్నింటినీ అంబానీ సోదరులు తిరస్కరించారు. జెనీవాలోని హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో తమకు నల్లధనం ఉందని కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ, తమకెక్కడా ఏ ఖాతాలూ లేవన్నారు. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ తనకుగానీ, రిల్‌కుగానీ ప్రపంచంలో ఎక్కడా అక్రమ ఖాతాలు లేవని చెప్పారు. సాధారణ వాణిజ్య కార్యకలాపాల్లో భాగంగా రిల్‌ అంతర్జాతీయ అనుబంధ సంస్థలు హెచ్‌ఎస్‌బిసితో సహా అనేక ప్రపంచ బ్యాంకులతో లావాదేవీలు జరుపుతాయని, ఈ ఖాతాలన్నీ పూర్తిగా నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవేనని తెలిపారు. రిలయన్స్‌ గ్రూపు అధినేత అనీల్‌ అంబానీ కూడా ఈ ఆరోపణలన్నింటినీ ఒక ప్రకటనలో తోసిపుచ్చారు. తమకు కూడా జెనీవాలోని హెచ్‌ఎస్‌బిసిలో ఖాతాల్లేవని పేర్కొన్నారు. దీనిపై స్పందించేందుకు హెచ్‌ఎస్‌బిసి ప్రతినిధి, బర్మన్‌ సోదరులు నిరాకరించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, కొంతమంది ప్రమేయంతోనే కేజ్రివాల్‌ ఆరోపణలు చేస్తున్నారని టాండన్‌ అన్నారు.

కామెంట్‌లు లేవు: