9, డిసెంబర్ 2017, శనివారం

నారా వారి నికర ఆస్తులు 75 కోట్లే!

 

Nara's net assets is 75 crores! - Sakshi
     కుటుంబ ఆస్తులను ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌
     ఆస్తులు రూ.142.34 కోట్లు.. అప్పులు రూ.67.26 కోట్లు
     హెరిటేజ్‌ మాకు ప్రధాన ఆదాయ వనరు
     మార్కెట్‌ విలువ కాదు, కొన్నప్పటి విలువే లెక్కించాం
                      ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా తమ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.75.06 కోట్లు మాత్రమేనని ఆయన కుమారుడు, ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. తన తండ్రి, తల్లి, భార్య, కుమారుడికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.142.34 కోట్లుకాగా, అప్పులు రూ.67.26 కోట్లు ఉన్నాయని తెలిపారు. తమ కుటుంబ ఆస్తుల వివరాలను లోకేశ్‌ 2017 డిసెంబర్ 8న ఎపి రాజధాని అమరావతి ఉండవల్లిలోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన తండ్రి చంద్రబాబు ఆస్తుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తమ కుటుంబానికి ఆదాయం హెరిటేజ్‌ సంస్థ ద్వారానే వస్తోందని, దాని టర్నోవర్‌ రూ.2,600 కోట్లకు చేరుకుందని వివరించారు.
తాము కొనుగోలు చేసినప్పటి విలువ ప్రకారం ఆస్తులను మదించామని, మార్కెట్‌ ధర ప్రకారం వాటి విలువ మారుతూ ఉంటుందని అన్నారు. తన తండ్రి చంద్రబాబు పేరుతో రూ.8.17 కోట్ల ఆస్తులుండగా, 5.64 కోట్ల అప్పులున్నాయని తెలిపారు. తన తల్లి భువనేశ్వరి పేరుతో రూ.46.31 కోట్ల విలువైన ఆస్తులుండగా, రూ.20.90 కోట్ల అప్పులున్నాయని, తన పేరుతో రూ.26.39 కోట్ల ఆస్తులు, రూ.11.17 కోట్ల అప్పులున్నాయని లోకేశ్‌ వెల్లడించారు. తన భార్య బ్రాహ్మణి పేరుతో రూ.15.37 కోట్ల ఆస్తులు, రూ.36 లక్షల అప్పులు, కుమారుడు దేవాన్ష్ పేరుతో రూ.11.54 కోట్ల ఆస్తులున్నాయన్నారు. తమ కుటుంబ సంస్థ నిర్వాణ హోల్డింగ్స్‌ కంపెనీ పేరుతో రూ.34.56 కోట్ల ఆస్తులు, రూ.29.19 కోట్ల అప్పులున్నాయని తెలిపారు. 
                                                         వారసుడిగా అవకాశం వచ్చింది నిజమే  
                       హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కొత్తగా నిర్మించిన ఇంటికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి తన తండ్రి, తాను ఉమ్మడిగా రుణం తీసుకున్నట్లు లోకేశ్‌ విడుదల చేసిన పత్రాల్లో చూపారు. అదే రుణాన్ని రెండుచోట్లా అప్పులుగా చూపడం గమనార్హం. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా తమలాగే స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించాలని లోకేశ్‌ అన్నారు. ఏడేళ్లుగా తాము ఆస్తులు ప్రకటిస్తున్నామని, తమపై విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడైనా ఆస్తులు ప్రకటించారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో తామే ప్రతిపక్షంగా వ్యవహరించామని, రాష్ట్రంలో ప్రతిపక్షం లేనేలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారని, అసెంబ్లీలో పోలవరం సహా అన్ని అంశాలపైనా చర్చించామని చెప్పారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా అఖిలపక్షం అంటూ డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. వారసుడిగా తనకు అవకాశం వచ్చిన మాట నిజమేనని, కానీ ప్రజామోదం ఉండి, సమర్థంగా పనిచేస్తేనే నిలబడగలమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక ప్యాకేజీ ఏపీ హక్కు అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అసలు ఏమీ చేయడం లేదనేది సరికాదన్నారు. కే?ంద్ర, రాష్ట్రాల మధ్య, టీడీపీ–బీజేపీ మధ్య ఎటువంటి గ్యాప్‌ లేదని తేల్చిచెప్పారు. 

కామెంట్‌లు లేవు: