29, అక్టోబర్ 2010, శుక్రవారం

సన్నాయి నొక్కులే గానీ.. సంగీతం లేదన్నట్లు

రోడ్డు ప్రమాదాలకు చెక్‌ ?
ఐజి స్థాయి అధికారి చేతికి పగ్గాలు- వాహనాదారులకు డిఎస్పీ క్లాసులు
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎట్టకేలకు పోలీసు యంత్రాంగం నడుం బిగించిందట. ఇది ఎన్ని సార్లు బిగించినా ప్రమాదాలు ఎక్కడా నివారించిన దాఖలాలు లేవు.. ఈ వ్యవహారం ఎలా ఉందంటే '' సన్నాయి నొక్కులే గాని సంగీతం లేదన్నట్లు.''  కొత్తతరహాలో రోడ్డు ప్రమాదాలను అరికట్లాలనుకున్నామని పోలీసు శాఖ ప్రకటనలు చేస్తూనే ఉంది. కాని నివారించింది మాత్రం నామమాత్రమే. దేశంలో మనరాష్ట్రం రోడ్డు ప్రమాదాల్లో అగ్రగామిలో ఉంది. కేంద్రం మందలించిందనో..కోర్టు మొట్టికాయలు వేసిందనో ఇలాంటి కదలికలు పోలీసు శాఖలో రావడం మామూలే. మనుషుల్లో మనకు తరుచూ ఆరంభశూరులు కనిపిస్తూ ఉంటారు. అలాగే పోలీసులు శాఖ కూడా...తారసిల్లే మనుషుల తత్వాలను విశ్లేషించడానికి తెలుగునాట సామెతలు ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గుమస్తాలకు అప్పగించిన పనిలో రోజుకు రెండులైన్లో మూడు లైన్లో రాసి కాలయాపన చేస్తుంటారు. నోట్‌ఫైల్‌ పుటప్‌ చేసి పై అధికారికి పంపడంలో జాప్యం చేస్తుంటాడు. ఈ లోపు పని చేయాల్సిన అధికారి బదిలీ కావడమో. రిటైర్డ్‌ కావడమో.. ప్రమోషన్‌ మీద వెళ్లడమో జరుగుతుంది. ఫైల్‌ మాత్రంకదలదు. ఇలాంటి అలసత్వాన్ని దుయ్యబట్టేందుకు సున్నితంగా హెచ్చరించడానికి ఈ సామెత ఉపయోగ పడుతుందని మా తెలుగు మాష్టారు చిన్నప్పుడు చెప్పేవాడు. సంగీత కచ్చేరిలో పూర్తి సంగీత జ్ఞానం లేని వాడయినా లేదా తానెందుకు కచ్చేరికి సహకరించాలనుకునే వాడయినా సన్నాయి నొక్కులు అంటే శృతి చేస్తూ కూర్చుంటాడే తప్ప అస్సలు పూర్తి పాటను పాడే స్థాయికి రాడు. ఇలాంటి వారు ఏ కొద్దిపాటు పని చేసి కాలయాపన చేసే వాళ్లతో పోల్చడానికి ఈ సామెత ఉపయోగపడుతుంది. ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటనే మన పోలీసుల శాఖ వ్యవహారం అలా ఉంది మరి...
రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్ర స్థానంలో నిలించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మొట్టికాయలు వేసింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇతర రాష్ట్రాలు అనేక చర్యలు తీసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడంలేదని మండిపడింది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాల్సిందిగా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా ఏ ఏ జిల్లాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో అధ్యయనం చేసేందుకు ఐజి స్థాయి అధికారి పర్యవేక్షణలో 'డిస్ట్రిక్ట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌' అనే కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఈ తరహా ప్రణాళికను అమలు చేయడంవల్ల నూటికి 80 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఆ కోణంలో ప్రయత్నాలు ప్రారంభిస్తే మన రాష్ట్రంలో కూడా ఫలితాలు సాధించుకోవచ్చని అధికారులు ఆలోచిస్తున్నారట. సీనియర్‌ ఐపిఎస్‌ అధికారుల్లో ఐజి స్థాయి అధికారిని ఎంపిక చేసి ఆయన పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని యోచిస్తున్నారట. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే రోడ్డు సేఫ్టీ అథార్టీ పనిచేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈ తరహా ప్రయోగాన్ని చేస్తున్నారు. కేవలం డిస్ట్రిక్ట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినంత మాత్రాన రోడ్డు ప్రమాదాలు నివారించలేమని, గ్రామ స్థాయిలో కూడా వాహనాదారుల్లో చైతన్యం తీసుకురావాలని, అప్పుడే అనుకున్న ఫలితాలు సాదించవచ్చనే ఉద్దేశంతో త్వరలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించనున్నాట. జిల్లాల్లో ఉన్న రోడ్లపై ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకంగా ఓ డిఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని నిర్ణయించారు. ఈ డిఎస్పీ ప్రతి రోజూ ఓ నియోజక వర్గ కేంద్రాన్ని (గ్రామాలు) ఎంపిక చేసుకొని ఆయా గ్రామాల్లో రచ్చబండ వద్ద అవగాహనా సదస్సులు ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జాతీయ రహదారులతో పాటు ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు ఒకటి చొప్పున 'బ్రీత్‌ అనలైజర్‌' (మద్యం సేవించిన వ్యక్తిని పసిగట్టే మిషిన్‌)ను అందివ్వనున్నారు. ఆయా పోలీస్టేషన్లకు చెందిన సిబ్బంది ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఆర్‌అండ్‌బి రోడ్లు, జాతీయ రహదారుల్లో చెకింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసి వాహనాదారుల (డ్రైవర్ల)ను బ్రీత్‌ అనలైజర్‌ మిషిన్‌తో తనిఖీలు చేయనున్నారు. వాహనదారుడు మద్యం సేవించి ఉంటే వాహనాన్ని అక్కడే నిలిపి, చలానుతోపాటు అతనికి కౌన్సిలింగ్‌ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. నెల రోజుల్లో ఇలా నాలుగైదు సార్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే అతని డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు చేయడం, అవసరమైతే వారు నడిపే భారీ వాహనాలను సైతం సీజ్‌ చేసేందుకు చట్టం తీసుకువచ్చే విధంగా పోలీసు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. ఒక పక్క పద్యం అమ్మకాలతో లాభాలు గడించేందుకు చర్యలు ... మరో పక్క తాగి వాహనం నడిపితే చర్యలు తీసుకుంటారట.
ఇదిలావుండగా జాతీయ రహదారుల్లో తిరిగే వాహనాల వేగాన్ని గుర్తించే 'రాడార్‌ వెకౌంటెడ్‌ వెహికిల్‌' మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వెహికిల్‌ 7, 9 వ నెంబర్‌ జాతీయ రహదారుల్లో అప్పుడప్పుడూ తిప్పుతున్నారు. దీంతో కొంత వరకు ఫలితాలు వస్తున్నప్పటికీ ఆశించిన మేర రోడ్డు ప్రమాదాలను నియంత్రించలేకపోతున్నారు. ఒక్క వెహికిల్‌తో వేగంగా వెళ్లే వాహనాలకు కళ్ళెం వేయడం కష్టంగా మారడంతో మరికొన్నిటిని కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి పోలీసు ఉన్నతాధికారులు లేఖ రాయనున్నారు. జాతీయ రహదారుల్లో స్లోమోషన్‌ వెహికల్స్‌ (ఎద్దుల బండ్లు, తోపుడు బండ్లు, రిక్షాలు)లను నిషేధించడంతో పాటు, మూడు చక్రాల వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణీకులను ఎక్కించకుండా, ప్రతి వాహనానికి హెడ్‌లైట్లు ఖచ్చితంగా పనిచేసే విధంగా, వీటిని స్థానిక పోలీసులు, ఆర్టీఏ అధికారులు పర్యవేక్షించే విధంగా కూడా చర్యలు తీసుకుంటారట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 37 వేల పోలీసు నియామకాల్లో చురుకైన కొంత మంది సిబ్బందిని ట్రాఫిక్‌ విభాగంలో నియమించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి తోడు ప్రత్యేకంగా హోంగార్డులను కూడా నియమించాలని అధికారుల ఆలోచన. ఆర్‌అండ్‌బి, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులు యోచిస్తున్నారు. భారీలోడుతో వెళుతున్న వాహనాలు వేగంగా వెళ్లకుండా రాడార్‌ వెకౌంటెడ్‌ వెహికిల్స్‌ ద్వారా కళ్ళెం వేయాలని, దీంతో కొంత మేరకు రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని అధికారుల యోచన. పోలీసు యంత్రాంగం రూపొందించిన ఈ ప్రతిపాదనను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏం చేస్తారో .... ఏమి నివారిస్తారో వేచి చూద్దాం...

2 కామెంట్‌లు:

VENKATA SUBA RAO KAVURI చెప్పారు...

' సన్నాయి నొక్కులే గాని సంగీతం లేదన్నట్లు.' very very good

Unknown చెప్పారు...

చంద్రయ్యసార్‌,
మీరు రాసిన ఈ స్టోరీ బాగుంది. కానీ దీఁ ఉద్దేశ్యం భక్త పహ్లాదుడు గురించి చెప్పేలా ఉంది. అనంతపురం జిల్లాలో ఉన్న ప్రకృతి అందాలను వివరించేలా లేదన్నది నా అభిప్రాయం. కరువు జిల్లా అనగానే కఁ్పంచేది ఎడారుల దిబ్బలు అఁ కొందరు అనుకఁంటారు. కానీ అనంతపురంలో ఇలాంటి ప్రకృతి అందాలు ఉన్నాయన్నది వివరిస్తూ, ఇలాంటి ప్రదేశాఁ్న ఇతర ప్రాంతాల వారు కూడా సందర్శించాలఁ అనుకఁనేలా వివరించాల్సింది. కేవలం భాగవతం అవతారాల గురించి చెప్పడం నాకఁ నచ్చలేదు.