25, అక్టోబర్ 2010, సోమవారం

కూటికి లేకున్నా కాటుక మాననట్లు

వెనుకటికి ఒకావిడ కూటికి లేకపోయినా కళ్లకు కాటుక పెట్టడం మానలేదట. తిండి లేక లొట్టలయిన కళ్లకు కాటుక పెడితే ఎంత పెట్టక పోతే ఎంత ... మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చట్టబద్దతకే నోచుకోలేదంటే బడుగులకు రిజర్వేషన్లు అనటం కూడా అలాంటిదే....
ఆమె అప్పుడే మహిళా రాజ్యంకు మాజీ అధ్యక్షులయ్యారు. మహిళా రాజ్యమంటే అదేనండి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ మహిళా విభాగాన్ని మహిళా రాజ్యం అంటారు. మాజీ అధ్యక్ష్యురాలు ఎవరో కాదండీ ఆవిడే శోభారాణి . మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కోసం పార్లమెంటులో పెట్టిన బిల్లుకు అనేక అడ్డంకులు వచ్చిన సంగతి తెలువంది కాదు. ఈ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం పెడితే బాగుంటుందని చిరంజీవికి సలహా ఇచ్చిందటావిడ. అందుకు ఆయన గ్రేటర్‌ హైదరాబాద్‌ మహిళారాజ్యం అధ్యక్షురాలు షేక్‌ షహిదాబేగంకు బాధ్యత అప్పగించారట. ఆమె మహిళా రాజ్యం ఆధ్వర్యంలో అక్టోబరు 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీల మహిళా విభాగం నాయకుల ను పిలిచి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా బిల్లు అమలుకు నోచుకోకముందే కొన్ని రాజకీయ పార్టీలు రకరకాల ఆటంకాలు కల్గిస్తున్నాయి. ఆడాళ్ల పెత్తనం పెరిగితే మగాళ్ల పదవులు పోతాయనుకునే వారు. మహిళలకు రిజర్వేషన్లు చట్టబద్దత చేయడానికి ఇష్టం లేని వాళ్లుబిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని అడుగుతున్నారు. ఇంకేవో కారణాలు చెప్పి చేతగాని కాంగ్రెస్‌ పార్టీ కాళ్లకు బందం పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో రౌండు టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతూ ఏదోలా ముందు రిజర్వేషన్‌ రావాలని కోరకుండా బిసిలకు , ఎస్సీలకు రిజర్వేషన్లు కావాలని కోరిన మహిళా రాజ్యం మాజీ అధ్యక్షులు శోభారాణి పరిస్థితి ఎలా ఉందంటే ' కూటికి లేకపోయినా కాటుక మాననట్లుంది' కదూ. అదే పరిస్థితిలో బడుగుబలహీన వర్గాల మహిళలంటే గిట్టని మాజీ మంత్రి త్రిపురాన వెంకటరట్నం తక్కువ తిన్నదా శోభారాణికి అడ్డుతగిలింది. అందరినీ ఉసికొల్పింది. దీంతో అగ్రవర్ణ మహిళలందరూ ఏకమయ్యారని ఫీలయిన శోభారాణి సమావేశాన్ని బైకాట్‌ చేసి వెళ్లిపోయింది. ఈ పరిస్థితి అర్థం కాని టిడిపి స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సినీనటి కవిత మాట్లాడుతూ మహిళా రాజ్యంకు సమావేశం నిర్వహించడం చేతగాలేదని నొక్కి వొక్కానించింది. ఈ పరిస్థితినంతా గమనించిన టివి9 చర్చ పెట్టింది. ఆచర్చకు త్రిపురాణ వెంకటరత్నంను పిలిచారు. ఆమె జరిగినదంతా చెప్పాక కవితను ఫోన్‌ఇన్‌లో సంప్రదించారు. త్రిపురాణ కవిత మధ్య గొడవ పెట్టారు. కవిత కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెకు తెలువదులే అంది త్రిపురాణ. అందకు స్పందించిన కవిత ఆమెను తప్పు పట్టింది. రిజర్వేషన్లు వస్తాయో లేదో గాని మహిళా నాయకుల మధ్య గొడవమాత్రం మానుతుందోలేదో తెలువదు.
రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగిన తీరు పరిశీలిద్దామా.....అణగారిన సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు 33 శాతం మహిళా రిజర్వేషన్‌లో ఉప కోటా ముందే ఖరారు చేయాలనే అంశాన్ని మహిళా రాజ్యం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు శోభారాణి లేవనెత్తారు. ఆ వాఖ్యలను మాజీ మంత్రి త్రిపురాణ వెంకటరత్నం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి అందరూ మహిళా నాయకురాళ్లు మద్దతు తెలిపారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిలో అగ్రకులాలకు చెందిన మహిళలే పెత్తనం చెలాయిస్తున్నారని భావించి తీవ్ర మనస్థాపానికి గురైన శోభారాణి బారుకాట్‌ చేస్తునట్లు ప్రకటించారు. దీంతో సభ్యులందరూ ఆమెను సమూదాయించినా వినకుండా వెళ్లిపోయారు. టిడిపి స్టేట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సినీనటి కవిత మాట్లాడుతూ సభానిర్వహణ సక్రమంగా లేదని అన్నారు. అందరు కలిపితే 20 మంది కూడా లేని మహిళల్ని ఐక్యం చేయని వారు నాలుగు కోట్ల మంది మహిళల కోసం ఏం చేస్తారన్నారు. మహిళారాజ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ నాయకుల మధ్యనే సఖ్యత లేకపోవడం విడ్డూరంగ ఉందన్నారు. ఇదంతా ఆదివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజారాజ్యం గ్రేటర్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ జరిగిన వ్యవహారం...ఈ సమావేశంలో ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు మల్లు స్వరాజ్యం, ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ కృష్ణకుమారి, మాజీ మంత్రులు త్రిపురాణ వెంకటరత్నం, పుష్పలీల, పిఆర్పీ గ్రేటర్‌ మహిళా అధ్యక్షురాలు షేక్‌ షహిదాబేగం, కాంగ్రెస్‌ మహిళా సంఘం నాయకురాలు ఉప్పుల శారద, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.ఝాన్సీ, న్యాయవాది పి.వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

2 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

Interesting.
మీరు పత్రికా విలేకరియా?

the news చెప్పారు...

పోస్ట్ బాగుంది . ఒక ఫోటో పెడితే
బాగుండేది