6, ఏప్రిల్ 2011, బుధవారం

సత్యసాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరం

''సత్యసాయి బాబా ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. కీలక అవయవాలేవి వాటంతట అవి పనిచేసే పరిస్థితుల్లేవు. కృత్రిమ సహకారంతోనే పనిచేయిస్తున్నాం., అయినా బాబా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది'' అని వైద్యులు చెబుతున్నప్పటికీ ముప్పు తప్పిందని మాత్రం ఘంటాపథంగా చెప్పలేకపోతున్నారు. బుధవారం సాయంత్రం పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం అతిథి గృహంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పివి.రమేష్‌, వైద్యవిద్యాశాఖ డైరెక్టరు డాక్టర్‌ రవిరాజు, సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టరు డాక్టరు సఫాయ మాట్లాడారు. బాబా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని, నిలకడగానే ఉందని చెప్పారు. బాబా ఆరోగ్యం గురించి వైద్య బృందం ఆహర్నిశలు శ్రమిస్తున్నా రని చెప్పారు. వారు తెలిపిన సమాచారం మేరకు అవయవాల పనితీరు ఈ విధంగా ఉంది.
గుండె పనితీరు బాగుంది...
సత్యసాయి బాబా గత నెల 28న గుండె కొట్టుకోవడంలో తేడాలొచ్చినందువల్ల సత్య సాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఆయనకు పేస్‌మేకర్‌ అమర్చి గుండె పనితీరు మెరుగుపరిచారు. ప్రస్తుతం ఆయన హృదయ స్పందన బాగుంది. గుండె రక్తాన్ని పంప్‌ చేయడం కొంత తగ్గింది. తద్వారా బిపి తగ్గుతోంది. దీనికి
మందులు వాడుతున్నారు. దీని వల్ల బిపి సాధారణంగానే ఉంటోంది. ప్రస్తుతం 130/60, 140/70గా బిపి ఉంటోంది. ఇది సాధారణ వ్యక్తి తరహాలోనే ఉన్నట్టు వైద్య, విద్య డైరెక్టరు రవిరాజు పేర్కొన్నారు.
వెంటిలేటరు సహకారంతో..
గుండె పనితీరు మెరుగుపడిన తరుణంలో బాబా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ ప్రబలింది. నీరు చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆయనకు వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమంగా శ్వాస అందిస్తున్నారు. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఆక్సిజన్‌ కూడా శరీరానికి బాగా అందుతోంది. అయితే వెంటిలేటర్‌ తీసేస్తే ఏ మేరకు శ్వాస తీసుకోగలరో చెప్పలేని పరిస్థితుల్లో వైద్యులున్నారు.
సిఆర్‌టిటి ద్వారా మూత్రపిండాలకు వైద్యం...
శ్వాసకోస సమస్యలకు పరిష్కారం చేసేలోపే మూత్రపిండాల పనితీరు మందగించింది. ఇవి పనిచేయకపోవడంతో మూత్రం వచ్చే పరిమాణం తగ్గింది. ఫలితంగా శరీరంలోకి నీరు చేరింది. సిఆర్‌టిటి ద్వారా డయాలసిస్‌ చేసి శరీరంలోని నీటినంతటినీ తొలగించారు. దీని ద్వారా శరీరంలో చేరిన మలినాలను కూడా తీసివేస్తున్నారు. కాళ్లు, చేతులు, మొహం వాపు తగ్గి సాధారణ పరిస్థితికి వచ్చింది. ఈ విధానాల ద్వారా మూత్రపిండాల పనిని కృత్రిమంగా చేయవచ్చునని చెబుతున్నారు. మూత్రంలో యూరియ, సోడియం, పొటాషియం స్థితి కూడా సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
కీలక అవయవాల పని తీరిలా...
సాయిబాబా ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉన్నప్పటికీ ఆందోళన మాత్రం తప్పలేదు. ఎందుకంటే కీలక అవయవాలన్నీ కృత్రిమ సహకారంతోనే పనిచేస్తున్నాయి. వీటిని తొలగిస్తే అవి ఏ మేరకు పనిచేస్తాయన్నది చెప్పలేని పరిస్థితుల్లో వైద్యులున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మూత్రం చాలా తక్కువగా వస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా శరీర ఉష్టోగ్రత 99 నుంచి 100 వరకు ఉంటోందని చెప్పారు. న్యుమోనియా వల్ల శరీరంలోని కొన్ని భాగాలకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చినట్టు కూడా రవిరాజు తెలిపారు. ఈ ఇన్‌ఫెక్షన్‌ శరీరంలో వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాబా ఏ మేరకు స్పృహలో ఉన్నారో కూడా చెప్పలేమని, ఇవన్నీ ఆందోళన కలిగిస్తున్న అంశాలేనని ఆయన చెప్పారు. మొత్తమ్మీద బాబా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పాలన్నారు. ఎంతకాలంలో కోలుకోవచ్చని విలేకరులు అడిగిన ప్రశ్నకు వారి నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. ఎంత సమయం పట్టవచ్చన్నది ఎవరూ చెప్పలేమన్నారు. అయితే తొందరలోనే కోలుకుంటారని అందరం ఆశిద్దామన్నారు.
ప్రభుత్వ సహకారం బాగుంది... : డైరెక్టరు సఫాయా
సత్యసాయిబాబా ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని చెప్పారు. తమ వైద్యులకు తోడు ప్రభుత్వ వైద్య బృందం కూడా సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం బాబాను ఎక్కడికైనా తీసుకెళ్లే ఆలోచనుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ అటువంటిదేమీ లేదన్నారు. ఇక్కడి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోనే అన్ని రకాలైన వైద్య సౌకర్యాలున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఆయన భక్తులుగానున్న ప్రముఖ వైద్యులు చాలా మంది ఉన్నారన్నారు. వారందరూ ఆయన ఆరోగ్యం కోసం కష్టపడుతున్నారని చెప్పారు.

కామెంట్‌లు లేవు: