5, మార్చి 2012, సోమవారం

సమాజాన్ని మేల్కొలిపేలా వార్తలు రాయాలి

గ్రామీణ విలేకరులకు ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌సూచన
            సమాజాన్ని మేల్కొలిపే విధంగా విలేకర్లు వార్తలను రాయాలని ఎపి ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ తిరుమలగిరి సురేందర్‌ కోరారు. 2012 మార్చి 4,5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు నగర శివార్లలోని రాయలసీమ విశ్వవిద్యాలయం, ఎపి ప్రెస్‌ ఆకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకు రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ సురేందర్‌ హాజరయ్యారు. అథితులుగా కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌, ఆర్‌యువిసి కృష్ణానాయక్‌, ఏఎస్పీ పద్మాకర్‌రావు, రిజిస్ట్రార్‌ ఎన్‌టికె నాయక్‌, ప్రెస్‌ అకాడమీ పాలక మండలి సభ్యులు కెబిజి తిలక్‌, డిపిఆర్‌ఓ తిమ్మప్ప పాల్గొన్నారు. మొదట జ్యోతిని వెలిగించి ముఖ్యఅతిథులు శిక్షణా తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్‌ అకాడమీ ఛైర్మెన్‌ సురేందర్‌ మాట్లాడారు. ఇప్పటి వరకూ 15 శిక్షణా శిబిరాలను పూర్తి చేసి 16వది కర్నూలులో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పత్రికా రంగం వృత్తిలో నైపుణ్య విలువలు పెంపొందిం చేందుకు గ్రామీణ విలేకరులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని సమాజాభివృద్ధికి పాటుపడేవిధంగా వార్తలను సేకరించి ప్రజలకు అందిం చాలని ఆయన కోరారు. కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌ మాట్లాడుతూ భారతరాజ్యాంగంలో పత్రికా రంగానికి ప్రధాన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పత్రికలు బాధ్యతా యుతంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని కోరారు. సమాజ అభివృద్ధికి పాటుపడే విధంగా విలేకరులు వార్తలు రాయాలని సూచించారు. ఆర్‌యువిసి కృష్ణానాయక్‌ మాట్లాడుతూ పత్రికలు ప్రస్తుతం సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా కృషి చేయాలని కోరారు. పరిశోధనాత్మక వార్తలు, ప్రభుత్వ పథకాలు, మీడియా భాష, తదితర అంశాలపై లెక్చరర్లు విలేకరులకు శిక్షణను అందజేశారు.

కామెంట్‌లు లేవు: