7, మార్చి 2014, శుక్రవారం

మార్కెట్‌ శక్తులను నియంత్రించాలి


సామాజిక న్యాయ సాధనలో అందరికీ భాగస్వామ్యం'ప్రజాస్వామ్యం, సోషలిజం'పై అంతర్జాతీయ సదస్సులో వక్తలు ,అహింసాయుత పద్ధతుల్లో బలమైన ఉద్యమాలు - జైపాల్‌రెడ్డి , రాజకీయాలను శాసిస్తోన్న మాఫియాలు - జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి 
            మార్కెట్‌ శక్తులను నియంత్రించటం ద్వారా సహజ వనరుల లూటీని అడ్డుకోవాలని రాజకీయ, ఆర్థిక, న్యాయ, సామాజికరంగాలకు చెందిన పలువురు వక్తలు సూచించారు. రాజ్యం ప్రోత్సహించే పెట్టుబడిదారీ విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి విధానాల వల్ల పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తులు, బహుళజాతి కంపెనీలు మొత్తం రాజకీయాలను, రాజ్య వ్యవస్థను తమ గుప్పిట్లోకి తీసుకుంటాయని తెలిపారు. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ పెను ప్రమాదంలోకి నెట్టబడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
         'ప్రజాస్వామ్యం, సామ్యవాదం, 21వ శతాబ్దపు దృక్పథం' అనే అంశంపై నాలుగు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సు 2014 మార్చి7న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ విద్యావంతుల వేదిక, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌, డెమోక్రసీ డైలాగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతికరంగాలశాఖ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ...ప్రజాస్వామ్యం, సోషలిజం అనేవి 19వ శతాబ్దం నుండే ప్రారంభమయ్యాయని అన్నారు. అప్పటి సోషలిజం నుండే కమ్యూనిజం రూపాంతరం చెందిందని, ప్రస్తుతం అది ఆధునిక ప్రజాస్వామ్య సోషలిజంగా రూపాంతరం చెందిందని చెప్పారు. వివిధ దేశాల్లో సంపద అతి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవటంతో ఆయా దేశాల్లోని కార్మికులు, కర్షకులు, శ్రామికులు అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరిట దేశ సంపదను లూటీ చేసేందుకు ప్రయత్నించే శక్తులకు వ్యతిరేకంగా ఈ పోరాటాలు జరిగాయని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో మొత్తం రాజ్యాన్నే తమ చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తుంటాయని వివరించారు. ఏ దేశంలోనైనా ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, అసమానతలు తారాస్థాయికి చేరితే అక్కడ కచ్చితంగా ఉద్యమాలు పుట్టుకొస్తాయని చెప్పారు. ఇదే సమయంలో పార్లమెంటరీ వ్యవస్థలోనే ఇలాంటి ఉద్యమాలకు ఆస్కారముంటుందని అన్నారు. మరోవైపు ప్రపంచదేశాల్లో సందప విపరీతంగా పెరుగుతూ వస్తోందని, అయితే ఈ సంపదను దేశంలోని అన్ని వర్గాలవారికి సమానంగా పంపిణీ చేయకపోవటం వల్ల అభివృద్ధి అనేది డోలాయమానంలో పడిపోతోందని చెప్పారు. ఫలితంగా ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శక్తివంతమైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరముందని అన్నారు. ఇవన్నీ అహింసాయుత పద్ధతుల్లోనే సాగాలని సూచించారు. సామాజిక న్యాయం, సామాజిక మార్పు పేరుతో హింసను ప్రేరేపించటం ఫాసిజమవుతుందని విమర్శించారు. ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాలన్నీ తమ దేశ స్థూల జాతీయోత్పత్తిలో అత్యధిక భాగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాల మీదకాకుండా సైన్యం మీద ఖర్చు పెడుతుండటం శోచనీయమన్నారు. అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికాలో సైతం ఇప్పటికీ 3 కోట్ల మంది ప్రజానీకం బీమా సౌకర్యాన్ని పొందలేక పోతున్నారని చెప్పారు. ఆ దేశంలో నివసిస్తున్న భారత సంతతి వారిలో సైతం శతకోటీశ్వరులున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోన్న మార్కెట్‌ శక్తుల్ని క్రమక్రమంగా నియంత్రించాలని సూచించారు. తద్వారా సంపదలో అందరికీ వాటా దక్కేలా చూడాలని కోరారు. అంతర్జాతీయ సదస్సులో ఈ విషయాలన్నింటిపైనా సమగ్రంగా చర్చించాలని జైపాల్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ... పెట్టుబడిదారులు మార్కెట్‌ శక్తుల రూపంలో దేశంలోని అటవీ సంపద, నదులు, ఖనిజాలు, నూనెలు (ఆయిల్‌) తదితర సహజ సంపదలను కొల్లగొడుతున్నాయని చెప్పారు. ప్రచార, ప్రసార మాధ్యమాలతోపాటు వివిధ విశ్వవిద్యాలయాలను కూడా కబళిస్తూ ఒక పెద్ద మాఫియా రాజ్యాన్ని నిర్మిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు దేశ రాజకీయాలను, పార్టీలను సైతం శాసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా రాజకీయ అజెండాను సైతం ఖరారు చేసే స్థాయికి ఆయా శక్తులు ఎదుగుతున్నాయని, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. మైనింగ్‌ మాఫియాతో పాటు ఇతర మాఫియాలు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు, జాతులను ఐక్యం చేసి బలమైన ఉద్యమాలను నిర్మించాలని సూచించారు. తద్వారా పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయ సాధన అనే లక్ష్యాల్ని సాధించాలని సూచించారు. సదస్సు ప్రారంభంలో ప్రజా గాయకుడు గద్దర్‌, అరుణోదయ సమాఖ్య విమలక్క బృందం ఆలపించిన గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విశ్రాంత ఐఎఎస్‌ అధికారి కాకి మాధవరావు, హెచ్‌ఎమ్‌టివి ప్రధాన సంపాదకులు కె.రామచంద్రమూర్తి, ఆహ్వాన సంఘం ఛైర్మన్‌ చుక్కా రామయ్య, సీనియర్‌ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, బూర్గుల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎమ్‌.గేయానంద్‌, ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు తెలకపల్లి రవి, పూర్వ సంపాదకులు ఎస్‌.వినయకుమార్‌, విశాలాంధ్ర ఎడిటర్‌ కె.శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈనెల 10 వరకు జరిగే ఈ సదస్సుకు 30 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఆర్థిక వేత్తలు, విద్యా వేత్తలు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాల ప్రతినిధులు, మానవ హక్కుల సంఘాల నేతలు హాజరవుతు న్నారు. 
              ఈ సదస్సులో '21వ శతాబ్దంలో సామ్య వాదంపై దృక్కోణం' అనే అంశంపై కాటు ఆర్కోనాడా (బొలీవియా), అమియా బగచీ (ఇండియా) ప్రసంగించారు. 'భూమి, కూలీలు, సహకార వ్యవస్థ' అనే అంశంపై అడాల్‌బెర్టో మార్టిన్స్‌ (బ్రెజిల్‌), గాస్‌పర్‌ మోర్కెన్చో (మెక్సికో), వినీత్‌ తివారీ (ఇండియా), సందీప్‌ చంద్రా (ఇండియా) ప్రసంగిం చారు. 'నూతన సమాజ నిర్మాణంలో కొత్త దృక్కో ణాలు' అనే అంశంపై యాన్నిస్‌ ఆలమ్‌పనిస్‌ (గ్రీస్‌), మిచెల్‌ లెబోవిజ్‌ (కెనడా), కెఆర్‌ వేణుగోపాల్‌ (ఇండియా), పి.టాన్యా (ఇండియా), డి.నర్సింహారెడ్డి (ఇండియా) ప్రసంగించగా, 'తెలంగాణలో వామపక్ష చరిత్ర నిర్మాణం' అంశంపై మల్లేపల్లి లక్ష్మయ్య, రమా మెల్కొటే, జి.కృష్ణారెడ్డి, డివి కృష్ణ, శాంతా సిన్హా మాట్లాడారు. '21వ శతాబ్దంలో వ్యవసాయిక విప్లవం' అనే అంశంపై అడాల్‌బెర్టో మార్టిన్స్‌ (బ్రెజిల్‌), గాస్‌పర్‌ మొర్కెన్చో (మెక్సికో), శామ్‌మోయో (జింబాబ్వే), గద్దర్‌ (ఇండియా), సంతోష్‌ రత్నా (ఇండియా) ప్రసంగించారు.  

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

ఈ బ్లాగు యజమానికీ వ్యాఖ్యాతలకీ చిన్న విన్నపం. విభజన అనంతరం రెండు ప్రాంతాల్లోనూ జరగాల్సిన పునర్నిర్మానం కోసం కొన్ని ప్రతిపాదనల్తో ఒక కొత్త రాజకీయ చట్రం గురించి కొన్ని వూహలు చేశాను. మీ అభిప్రాయాలు తెలిపేటందుకు ఆహ్వానిస్తున్నాను.
ఇట్లు
భవదీయుడు
http://harikaalam.blogspot.in/2014/03/4.html