25, ఏప్రిల్ 2015, శనివారం

ప్రత్యేక హోదా కోసం ఐక్య ఉద్యమం


                                                                    
     వి.శ్రీనివాసరావు
     కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన బిజెపి, టిడిపిలు రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేశాయని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి  ప్రత్యేక హోదా కల్పించడంలో, దానిని సాధించడంలో రెండు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల ముందు ప్రజాద్రోహులుగా నిలబడిపోతాయన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వామపక్షాలుఉమ్మడిగాఉద్యమాన్నిఉధృతం చేస్తాయని చెప్పారు. రాష్ట్రాన్ని మోసం చేసిన టిడిపి, బిజెపిలను నిలదీయాలని కోరుతూ సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో 2015 ఏప్రిల్‌ 25న  విజయవాడ అన్సారీపార్క్‌ సెంటర్‌లో  బిజెపి, టిడిపి., ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం సుందరయ్య భవన్‌ నుండి ప్రదర్శనగా అన్సారీ పార్కు వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ఐదేళ్లుకాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఆనాడు పార్లమెంట్లో మాట్లాడిన ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు నోరుమెదపడంలేదన్నారు. ప్రత్యేక హోదాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని చెబుతున్న రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్రం బాగా వెనుకబడిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వరాదని 14వ ఆర్థిక సంఘం సిఫారస్సులను సాకుగా చూపుతున్నా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల నిధులను విడుదల చేసినట్లు బిజెపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని, కానీ ఆ నిధులు ఆయా రాష్ట్రాలకు కేటాయించినట్లుగానే ఆంధ్రాకూ కేటాయించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనలోఉంటే సిఎం చంద్రబాబు కనీసంగా నోరు మెదపడం లేదన్నారు.

కామెంట్‌లు లేవు: