20, జూన్ 2015, శనివారం

బతకడమే ముఖ్యం

   సీతారాం ఏచూరి                                     

              ఈ బిజెపి ప్రభుత్వం దూకుడుగా చేస్తున్న అంతర్జాతీయ ప్రచారాల నేపథ్యంలో, భారతదేశం అంతర్జాతీయ స్థాయిని సాధించాలని కోరుకుంటున్నట్లు కన్పిస్తోంది. అయితే ఇది భారత్‌కు ఉన్న అంతర్గత శక్తి సామర్థ్యాలు, ఆర్థికపరమైన అంశాలు లేదా ఇతరత్రా కారణాల రీత్యా మాత్రం కాదు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించిన దాని ప్రాతిపదికన సాధించాలనుకుంటోంది. ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా ఇది ఢల్లీిలోని రాజ్‌పథ్‌లో నిర్వహిస్తున్నారు. అయితే బాబ్రీ మసీదు విధ్వంసం ఘటన అనంతరం రాజ్‌పథ్‌లో ప్రజా సమావేశాలను నిషేధించారు. పైగా యోగా విన్యాసాల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్న సంఘటనగా ఇది గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కాలనేది లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జీవితపు నాణ్యతను మెరుగుపరిచే యోగా భంగిమలను ఆచరించడంపై ఎలాంటి వివాదం ఉండాల్సిన అవసరం లేదు. హిందూత్వ ఎజెండాను పెంచి పోషించడంపై ఉన్న వివాదాలను పక్కన పెడితే, ఇటువంటి బృహత్తర మార్కెటింగ్‌ విన్యాసాలు కచ్చితంగా సుసంపన్నమైన భిన్నత్వమున్న మన ప్రజలను, సమాజాన్ని హిందూవాదం వైపునకు మళ్ళించేందుకు జరిగే గట్టి ప్రయత్నంగానే దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన మార్కెటింగ్‌ ప్రచారంలో కపట సూత్రం ఒక అంతర్వాహినిగా సాగుతోంది. ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ అయోధ్య (రామ్‌ జన్మస్థానం), మధుర(కృష్ణ జన్మస్థానం), బెనారస్‌ కాశీ విశ్వనాథ్‌ ఆలయాలకు విముక్తి చేస్తామనే మాటల్లో మన లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్‌ స్థానే అత్యంత అసహనంతో కూడిన ఫాసిస్ట్‌ హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలనే లక్ష్యం అంతర్గతంగా దాగి ఉంది. బాబ్రీ మసీదు విధ్వంసమైంది. మోడీ వారణాసి నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. మధురను తమ ప్రభుత్వ మొదటి పుట్టిన రోజు వేడుకను ప్రారంభించే వేదికగా ఎంపికచేసుకున్నారు. ఇదొక స్పష్టమైన అంతర్వాహినిగా ఉన్న నమూనా.
               యోగా అనేది ప్రాచీనమైన భారతీయ భంగిమల సమాహారం. ఇది వేద కాలంనాటి నాగరికతను బోధిస్తుంది. సింధులోయ నాగరికత ప్రాంతాల్లో కనుగొన్న పలు సీళ్ళపై ఉన్న అనేక భంగిమలు యోగా ధ్యాన ముద్రలను పోలి ఉంటాయి. రుగ్వేదం, ఇతర వివిధ ఉపనిషత్తులు ఈ పదాన్ని ప్రస్తావించాయి. క్రీపూ నాలుగు, మూడు శతాబ్దాలు మధ్య రచించబడినట్లు విశ్వసిస్తున్న కథా ఉపనిషత్‌ యోగాను మన మనోభావాలను నిలకడగా, నియంత్రణలో ఉంచగలిగేదిగా పేర్కొంది. ఇది ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళుతుందని పేర్కొంది. మన గ్రహణ శక్తిని విడుదల చేసేందుకు ఇటువంటి ధ్యాన భంగిమలను గురించి పాళీ భాషలోని బౌద్ధ గ్రంథాలు, అలాగే తొలినాటి జైన గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇంకా పతంజలి యోగ సూత్రాలు కూడా ఉన్నాయి. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల గురించి భగవద్గీత పేర్కొంటోంది. ప్రతి మానవుని శరీరంలోనూ అజ్ఞాతంగా ఒక శక్తి నిబిడీకృతమై ఉంటుందని విశ్వసించబడుతోంది. మానవ శరీరంలో వెన్నెముక కింద ఉన్న ఈ శక్తిని మెదడుకు చేరేలా పురిగొల్పడమే యోగా ఉద్దేశం.   ఇది ఆధ్యాత్మిక విముక్తికి దారి తీస్తుంది. ఈ స్థితిని సాధించేందుకు నిర్దేశించిన ఈ విన్యాసాలనే స్థూలంగా యోగా భంగిమలని అంటున్నాం.
         అయితే, ఇటువంటి ఉత్కృష్టమైన ఆథ్యాత్మిక అనుసరణల గురించి మోడీకి పట్టదు. జీవిత నాణ్యతను మెరుగుపరచుకునేందుకు యోగాను ఆచరించాల్సి ఉంది.  వాస్తవానికి, అనేకమంది ఈ యోగాను చాలా ఉపయుక్తమైనదిగా భావిస్తున్నారు. పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో కూడా దీని ప్రభావం బాగా ఉంది. అక్కడ దీన్ని కార్డియో ఎక్సర్‌సైజ్‌ సప్లిమెంట్‌ (గుండెకు సంబంధించిన వ్యాయామ అనుబంధం)గా పేర్కొంటూ ఉంటారు. దేహంలోని కణజాలం మొత్తానికీ ఆక్సిజన్‌ బాగా సరఫరా జరిగేలా చూసేందుకు ప్రాణాయామం, వ్యాయామ విన్యాసాలు ఆచరించడం అనేది మానవుని ఉనికి నాటి నుంచే ఉన్న ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు. చురుగ్గా ఉండేందుకు లేవగానే ఒళ్ళు పూర్తిగా విరుచుకుని పరుగెత్తే కుక్కతో పోల్చి పేరు తెలియని ఒక యోగ గురువు చెప్పారు. ఈనాటి యోగా భంగిమలు మన పూర్వీకుల నుంచే వచ్చి ఉండవచ్చు. మన పూర్వీకులు వేటను ప్రారంభించేందుకు రోజూ శరీరాన్ని ఇలా సాగదీసి ఉంటారు. వీటి పర్యవసానాలు ఏవైనా కానీ, యోగా విన్యాసాలు లేదా భంగిమలు అనేవి సార్వజనీనంగా ఆరోగ్యపరమైన కార్యక్రమంగా గుర్తించబడ్డాయి. అయితే, ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రజలు ముందుగా బతకాలి, ఆ తర్వాతే వారు తమ జీవిత నాణ్యతను మెరుగుపరచుకోగలరు. మోడీ ప్రచారాలకు ఇటువంటి ఆందోళనలన్నీ ఐహికమైనవిగా కనిపిస్తూ ఉంటాయి.
                    భారతదేశ జిడిపి వృద్ధి రేటు మన పొరుగు దేశమైన చైనా ఆర్థిక వ్యవస్థ కన్నా చాలా మెరుగ్గా ఉందని అధికార ప్రచారం సాగుతోంది. ఈ వృద్ధి రేటును లెక్కవేసే ప్రాతిపదికలను మార్చివేస్తూ ద్వంద్వ ప్రమాణాలను అనుసరించి గణించడం వల్ల ఇది సాధ్యపడుతోంది. అయితే ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఎఒ ‘ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా పరిస్థితులు`2015’ పేరిట రూపొందించిన నివేదికను పరిశీలిస్తే భారతదేశం క్షుద్బాధను తీవ్రంగా ఎదుర్కొనే దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల పతాక శీర్షికలకెక్కిన వార్తతో వెల్లడైంది. 19.46 కోట్ల మంది అన్నార్తులతో భారతదేశం ప్రపంచంలోకెల్లా అధిక సంఖ్యలో పోషకాహార లోపం కలిగిన ప్రజలతో ఉన్నదని ఆ నివేదిక పేర్కొంది. అంటే పోషకాహార లోపం ఎదుర్కొనే ప్రతి నలుగురిలో ఒకరు భారత్‌లోనే ఉన్నారు. నేపాల్‌, బంగ్లాదేశ్‌ల కన్నా భారత్‌ వెనుకబడి ఉంది. ప్రపంచ తల్లుల పరిస్థితిపై 2015 నివేదికను పరిశీలిస్తే భారత్‌ 140వ స్థానంలో ఉంది. జింబాబ్వే, బంగ్లాదేశ్‌, ఇరాక్‌ వంటి దేశాల కన్నా వెనుకబడి ఉంది. ప్రసూతి మరణాలు, ఐదేళ్ళలోపు పిల్లల్లో మరణాలు, పిల్లలు ఎన్నేళ్ళు స్కూల్‌కు హాజరవుతున్నారు, తలసరి జిఎన్‌పి, ప్రభుత్వంలో మహిళలు ఈ ఐదు అంశాలకు సంబంధించిన సూచీలో భారత్‌ 140వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్‌లో ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 52.7 మంది ఐదవ పుట్టిన రోజు జరుపుకోకుండానే మరణిస్తున్నారు. ప్రభుత్వ రంగ ఆరోగ్య వ్యవస్థలకు నిధుల కొరత చాలా ఉంది. అవసరంలో ఉన్నవారికి ఈ సేవలు ఏమాత్రం అందడం లేదు.
                162 దేశాలతో కూడిన ప్రపంచ బానిసల సూచీ 2013 ప్రకారం, ప్రపంచంలో ఆధునిక తరం బానిసల్లో సగానికి సగం మంది భారత్‌లోనే ఉన్నారని వెల్లడైంది. మొత్తంగా 2.96 కోట్ల మందిలో 1.33 నుంచి 1.47 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. ఆధునిక తరం బానిసల్లో సంప్రదాయ బానిసలు, కట్టు బానిసలు, బలవంతంగా పనిలోకి దింపబడినవారు, బలవంతపు పెళ్ళిళ్ళు, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించబడిన పిల్లలు వీరందరూ కూడా ఈ కోవలోకే వస్తారు.
              యోగా ద్వారా తమ జీవితాలను మరింత మెరుగ్గా, నాణ్యమైనవిగా మార్చుకోవాలంటే ముందుగా ప్రజలు బతకాల్సి ఉంటుంది. అవునంటారా? కాదంటారా? ఈనాడు మన దేశానికి కావాల్సింది హిందూత్వ ఎజెండాను పెంచి పోషించే ఇటువంటి ప్రదర్శనా కార్యకలాపాలను మార్కెటింగ్‌ చేయడం కాదు, మన ప్రజల స్థూల లేమిని తొలగించే దిశగా ప్రభుత్వం, ఈ ప్రధాని కూడా నిర్దిష్ట చర్యలు చేపట్టడం కావాలి. రోజు రోజుకు పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం ప్రస్తుతం దేశానికి అవసరం.  వ్యవసాయ సంక్షోభం కారణంగా ఈ ఏడాది రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. మన ప్రజలందరికీ అన్నం పెట్టగల సమర్థవంతమైన ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత అవసరం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం వంద రోజుల పాటు పనులు కల్పించే పరిస్థితి నుంచి ఈ ఏడాది దిగ్భ్రాంతి కలిగించే రీతిలో 60 శాతానికి పడిపోయింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత సొమ్ము ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈనాడు ప్రభుత్వం ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్నది జిడిపిలో ఒక శాతం కూడా ఉండడం లేదు. ఇవన్నీ చేసేందుకు వనరుల కొరతేమీ లేదు. దీనికి కావాల్సిందల్లా విధానాల దిశ మార్చడమే. సంపన్నులను మరింత సంపన్నులుగా, పేదలను మరింత పేదలుగా చేసే విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత మాత్రమే యోగాను పాటించగలుగుతాం.

కామెంట్‌లు లేవు: