3, డిసెంబర్ 2018, సోమవారం

తెలంగాణ ఎన్నికల చరిత్ర



                      భారతదేశంలో తెలంగాణ 29 వ రాష్ట్రంగా ఆవిష్కృతమైంది. రెండువేల ఐదువందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అనేక పరిణామాల అనంతరం 2014 జూన్ 2 వ తేదీ (అపాయింటెడ్ డే) రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణగా ఏర్పడింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత నిజాం సంస్థానం విలీనమైంది. అప్పటి భారత ప్రభుత్వం 17 సెప్టెంబర్ 1948 తేదీన నిర్వహించిన ఆపరేషన్ పోలో పేరుతో నిజాం స్టేట్ భారత యూనియన్ లో విలీనమైంది. 26 జనవరి 1950 న ఆనాటి కేంద్రం సివిల్ సర్వెంట్ ఎం.కె.వెల్లోడిని హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రిగా నియమించింది.
                    నిజాం స్టేట్ (మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలతో కూడిన తెలంగాణ) కు తొలిసారిగా 1952 లో ప్రజాస్వామిక ఎన్నికలు జరగ్గా ఆనాడు తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. తిరిగి 66 ఏళ్ల తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాలతో కూడి ఉంది. 2014 జూన్ 2 అపాయింటెడ్ డే రోజు నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. 
                     2014 లో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని తెలిసినప్పటికీ ఆనాటి ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరిగాయి. ఎన్నికల అనంతరం ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత ఎన్నికల అనంతరం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో జిల్లాల సంఖ్యను పది నుంచి 31 కి పెంచారు. 2008 లో నియోజకవర్గాల పునర్విభజన చట్టం ద్వారా ఏర్పడిన ప్రస్తుత 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 19 స్థానాలు ఎస్సీలకు, 12 స్థానాలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఈస్థానాలకు డిసెంబర్ 7 వ తేదీన పోలింగ్ జరగనుండగా ప్రస్తుతం రాష్ట్రంలోని 2.80 కోట్ల మంది ఓటర్లు ఆయా పార్టీల భవిష్యత్తును తేల్చనున్నారు.

కామెంట్‌లు లేవు: