
‘‘నేను ఎంఏ హిస్టరీ చదువుతున్న రోజుల్లో వినోద్‌ను మొదటిసారి చూశా. మా ఇద్దరిదీ ఒకే క్లాస్. తొలి చూపులోనే ప్రేమ అని చెప్పలేను గానీ వినోద్ చాలా చలాకీగా ఉండేవారు. అందరితో ఇట్టే కలిసిపోయేవారు. అయితే తనతో నాకు పెద్దగా పరిచయం లేదు. నా స్నేహితురాలు.. తన స్నేహితుడు ప్రేమించుకున్నారు. వారి మధ్య ఏదో గొడవ రావడంతో దాన్ని పరిష్కరించే సమయంలో మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నాం. వారి సమస్య పరిష్కారం కాలేదు గానీ, మేం మాత్రం మంచి స్నేహితులమయ్యాం. రోజులు గడుస్తున్న కొద్దీ మా ఇద్దరి మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది. నాది నెమ్మది స్వభావం. తనది దూకుడు మనస్తత్వం. ఆ విభిన్న ధ్రువాలే మమ్మల్ని దగ్గర చేశాయి. క్రమంగా తనకు నేను అన్ని చెప్పుకొనేంత దగ్గరయ్యాం. కానీ, ఏ రోజూ మా మధ్య కుటుంబ విషయాలు రాలేదు’’

‘‘ఆ తర్వాత చాలా కాలం పాటు మేం పెద్దగా కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు. నేను చిన్న ఉద్యోగంలో చేరాను. వినోద్ ఐఏఎస్‌కు ఎంపికవడమేగాక దేశంలోనే 9వ ర్యాంక్ తెచ్చుకున్నారు. అప్పట్లో టాప్ 10 ర్యాంకర్ల పేర్లను రేడియోలో చెప్పేవారు. అది విన్న మా తల్లిదండ్రులు మా ప్రేమకు గర్వంగా పచ్చజెండా ఊపారు. అయితే ఇక ఒప్పించాల్సింది వినోద్ వాళ్లింట్లోనే. వినోద్ నాన్నగారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉమాశంకర్ దీక్షిత్. మాజీ ప్రధాని నెహ్రూకు అత్యంత సన్నిహితులు. పలుకుబడి ఉన్న బ్రాహ్మణ కుటుంబం. ఒకరోజు వినోద్ మా విషయాన్ని తన తండ్రితో చెప్పి నన్ను కలవమన్నారు. నేను భయంభయంగానే కలిశాను. కానీ ఆయన చాలా మంచివారు. నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఆ తర్వాత మా అమ్మానాన్నలను కలిసి మా ప్రేమను అంగీకరించారు. అయితే కులాంతర వివాహానికి వినోద్ తల్లి ఒప్పుకోవడానికి కాస్త సమయం పడుతుందని.. అప్పటిదాకా ఆగాలని చెప్పారు. అది ఒక రోజు.. రెండు రోజులు.. రెండు సంవత్సరాలు కూడా కావొచ్చన్నారు’’
‘‘అన్నట్లుగానే రెండేళ్లు గడిచింది. ఆ రెండేళ్లలో వినోద్ అమ్మను ఒప్పించేందుకు వీరిద్దరూ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆమెకు నచ్చజెప్పారు. చివరకు ఆమె కూడా మా పెళ్లికి అంగీకరించారు. రెండు వేర్వేరు సంప్రదాయాలు కలిగిన కుటుంబాలైనా సరే వాటన్నింటినీ పక్కనబెట్టి అంతా కలిసిపోయారు. 1962 జులై 11న మా పెళ్లికి ముహూర్తం పెట్టారు. మామయ్యగారికి ఆడంబరాలు నచ్చవు. అందుకే పెళ్లి చాలా నిరాడంబరంగా జరిపించారు. అలా నేను దీక్షిత్ ఇంట కోడలిగా అడుగుపెట్టా’ అని ఆమె తన మధురజ్ఞాపకాలను పంచుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి