
కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విశ్వాసపరీక్షలో ఓటమి పాలై కుప్పకూలింది. ఇక భాజపా ప్రభుత్వ ఏర్పాటే తరువాయి అని అందరూ అనుకున్నారు. మూడు రోజులు గడిచినా ఉలుకూ పలుకూ లేదు. మళ్లీ ఒక్కసారిగా శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను యడియూరప్ప కలవడం.. ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ప్రమాణస్వీకారం జరగడం.. అంతా కొన్ని గంటల్లోనే చకచకా జరిగిపోయింది. నిన్న రాత్రి వరకు స్తబ్దుగా ఉన్న కర్ణాటక వ్యవహారంలో రాత్రికి రాత్రి ఏం జరిగింది? ప్రభుత్వ ఏర్పాటుకు వేచి చూసిన పార్టీ అధినాయకత్వం ఒక్కసారిగా ఎందుకు ముందడుగు వేసింది?ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆదేశాలిచ్చిన వెంటనే విధానసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉండడం.. దీనికి తోడు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుండడంతో భాజపా అధిష్ఠానం ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాస్త వెనుకడుగు వేసింది. మరోవైపు ఆర్థిక బిల్లుకు సభ ఆమోదం కూడా తప్పనిసరి అయింది. ఈ పరిణామాలను ముందే ఊహించిన భాజపా సర్కారు గురువారం వరకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువ జాము వరకు జరిగిన పలు పరిణామాలు యడియూరప్ప ప్రభుత్వ ఏర్పాటుకు దారి తీశాయి. దీనికి ప్రధాన కారణం.. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు యడ్డీకి అభయమివ్వడమే. కర్ణాటకకు చెందిన భాజపా నేతలు వారితో గురువారం రాత్రి వీడియో కాల్‌లో మాట్లాడటంతోపాటు విశ్వాసపరీక్షకు తాము హాజరవుతామని వారు చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని భాజపా అధిష్ఠానానికి చేరవేయడంతో అక్కడి నుంచి శుక్రవారం వేకువజామున యడియూరప్పకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని తెలుస్తోంది.
75 ఏళ్ల నిబంధన ఏమైంది?
భారతీయ జనతా పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటిన వారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలి. అయితే ఇది అనధికారిక నిబంధనే. అదే సమయంలో యడియూరప్ప వయస్సు 77 ఏళ్లు. కానీ ఆయనకే మళ్లీ అవకాశం ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఓ దశలో యడియూరప్పను గవర్నర్‌గా పంపించి సీఎం పదవికి మరో వ్యక్తిని ఖరారు చేయాలని భాజపా అధిష్ఠానం భావించినా.. చివరికి యడ్డీ పేరును ఫైనల్ చేసింది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పుడూ పూర్తి కాలంపాటు యడియూరప్ప ఆ పీఠంపై ఉండలేదు. ఈ నేపథ్యంలో చివరి అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. దీనికి తోడు తనదైన శైలిలో వ్యూహాలను అమలు పరుస్తూ కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడంలో కీలక పాత్ర పోషించడంతో అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఒకవేళ యడ్డీని తప్పించి వేరొకరిని సీఎం పీఠంపై కూర్చోబెడితే అలకపాన్పు ఎక్కే అవకాశముంటుంది. అదే ఎదురైతే పరిస్థితి ఏంటన్నది ముందుగానే ఊహించిన భాజపా అధిష్ఠానం.. యడియూరప్పకు మరో అవకాశం ఇచ్చింది. గతంలో దాదాపు ఇలాంటి పరిణామాలతోనే ఆయన భాజపాను వీడి సొంతంగా ఓ రాజకీయ పార్టీ నెలకొల్పి వేరుకుంపటి పెట్టిన సంగతి ప్రస్తావనార్హం.

యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు. బలపరీక్ష అనంతరం మంత్రివర్గాన్ని విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్లెట్లిచ్చి గెలిపించుకోవడం.. వారికి మంత్రివర్గంలో చోటివ్వడం ఓ సవాలు. అదే సమయంలో గరిష్ఠంగా ఇచ్చే అవకాశమున్న 34 మంత్రి పదవులకు సుమారు 60 మంది భాజపా ఎమ్మెల్యేలు పోటీ పడటం యడియూరూప్పకు కత్తిమీద సామే. అంటే ఈ లెక్కన కర్ణాటకం ఇంకా సశేషమే!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి