
న్యూఢిల్లీ : రాహుల్
గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన వారసుడు ఎవరనే
ప్రశ్న ఇటు నాయకులను, అటు కార్యకర్తలను వేధిస్తోంది. కొందరు రాహుల్ గాంధీయే
కొనసాగాలని డిమాండ్ చేయగా, మరికొందరు సోనియాగాంధీ తిరిగి పగ్గాలు
చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో పేరు చాలా సీరియస్‌గా
తెరపైకి వచ్చింది. ఆ పేరే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.
ప్రియాంకా గనుక అధ్యక్ష బాధ్యతలను భుజాన వేసుకుంటే పార్టీ పరిస్థితి
బాగుంటుందని, కేడర్‌లో నూతనోత్తేజం వస్తుందని కొందరు అగ్ర నేతలు గట్టిగానే
వాదిస్తున్నారు.
అయితే ప్రియాంకా గాంధీ మాత్రం ఈ
వ్యవహారంలో తనను దూర్చవద్దని, తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టే స్థితిలో
ఎంతమాత్రమూ లేనని కుండబద్దలు కొట్టారట. అయితే తాజాగా... మరోసారి గురువారం
ఉదయం జరిగిన ప్రధా కార్యదర్శుల సమావేశంలోనూ ఈ ప్రతిపాదన మరోసారి
ముందుకొచ్చింది. జార్ఖండ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్.పి.ఎన్. సింగ్
బాధ్యతలు చేపట్టాలని ప్రియాంకను కోరగా... బాబోయ్... ఈ వ్యవహారంలోకి తనను
ఎంతమాత్రం లాగొద్దని ఖరాకండిగా చెప్పినట్లు తెలుస్తోంది.
కొన్ని
రోజుల క్రితం తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా తాజాగా ఓ
కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రియాంకా గాంధీ అధ్యక్ష పగ్గాలు
చేపట్టాల్సిందేనని తన కోరికను బహిరంగంగానే వ్యక్తం చేశారు.సార్వత్రిక
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్
గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబం నుంచి
కాకుండా బయటి వ్యక్తులను అధ్యక్షుడిగా నియమించాలని రాహుల్ పట్టుబట్టారు.
దీంతో
అగ్రనేతలైన గులాంనబీ ఆజాద్ మరికొందరు నేతలు సీనియర్ నాయకుడైన ఏకే ఆంటోనీని
ఆ గురుతర బాధ్యతలు చేపట్టాలని కోరారు. ఈ ప్రతిపాదనను ఆయన సున్నితంగా
తిరస్కరించారు. ఆ తరువాత రాహుల్‌కే అత్యంత సన్నిహితుడైన మరో ప్రధాన
కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆజాద్ కోరగా ఆయనా ముందుకు రాకపోవడంతో
కాంగ్రెస్ నేతలకు పాలుపోవడం లేదు. దీంతో గత్యంతరం లేక ప్రియాంక గాంధీ
బాధ్యతలు చేపడితే బాగుంటుందన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి