22, మే 2020, శుక్రవారం

మంటలు పుట్టిస్తున్న వేసవి


పడమర గాలులతో ఉక్కిరిబిక్కిరి 
ద్వారకా తిరుమలలో 48 డిగ్రీలు 
ఈ నెల 25 వరకూ ఇంతే


                   వేసవి ఠారెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. వడగాలులు ఉధృతమయ్యాయి. వెచ్చటి గాలులతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రోహిణీకార్తె రాకముందే భానుడు భగభగ మండిపోతున్నాడు. పడమర, వాయవ్య దిశల నుంచి వీస్తున్న పొడిగాలులతో కోస్తా ప్రాంతం ఉడికిపోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

              ‘ఆంఫన్‌’ తుఫాను బలహీనపడటంతో వేసవి తీవ్ర ప్రభావం చూపుతోంది. సూర్యాస్తమయం తరువాత కూడా వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. గురువారం కోస్తాలో పలుచోట్ల సాధారణంకంటే 3 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విదర్భ, తెలంగాణలో కొనసాగిన వడగాడ్పుల ప్రభావం కోస్తా వరకు విస్తరించింది. ఆర్టీజీఎస్‌ డేటా ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ రాఘవపురంలో 48, కురించేడు(ప్రకాశం)లో 47.97, పమిడిముక్కల(కృష్ణా), క్రోసూరు(గుంటూరు), జగ్గిలబొంత(శ్రీకాకుళం)లో 46.32డిగ్రీలు నమోదయ్యాయి. భారత వాతావరణ సంస్థ నమోదు చేసే కేంద్రాలను పరిశీలిస్తే గన్నవరంలో 46, బాపట్ల, నందిగామ, ఒంగోలు,. జంగమహేశ్వరపురంలో 45, కావలి, మచిలీపట్నంలో 44 డిగ్రీలు నమోదయ్యాయి. ఈనెల 23న ఉష్ణోగ్రత మరింత పెరిగి 48 డిగ్రీలకు చేరుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో రాత్రి సమయంలోనూ గాలిలో తేమ శాతం బాగా తగ్గిపోయింది. దీంతో వడగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
             
శుక్రవారం నుంచి వేడిగాలులు, ఉష్ణోగ్రతలు అధికం కానున్నాయి. ఉత్తరాంధ్రలో 45-47 డిగ్రీలు, దక్షిణ కోస్తాలో 43-44డిగ్రీలు, రాయలసీమలో 41-42డిగ్రీల నమోదు కానున్నాయి. 23న ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నా, విశాఖ, దక్షిణ కోస్తా జిల్లాల్లో 46-48డిగ్రీలు, విజయనగరం, ఉభయగోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 43-45డిగ్రీలు, నమోదు కానున్నాయి. 24న ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో 44-46 డిగ్రీలు, ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో 42-43డిగ్రీలు, రాయలసీమలో 39-42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 25న కూడా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43-44, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 41-42, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు వడగాలుల బారిన పడకుండా, డీహైడ్రేట్‌ కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ, నీడలో ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. మరో రెండురోజులపాటు కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్‌ విజయభాస్కర్‌ తెలిపారు. 24వరకు వడగాడ్పులు కొనసాగి తరువాత క్రమేపీ తగ్గుతాయని ఇస్రో నిపుణుడు పేర్కొన్నారు.