
మరికొద్ది రోజుల్లో బీహార్‌లో ఎన్నికలు జరగుతుండగా ఆ రాష్ట్రంలో ప్రముఖ నాయకుడైన రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయన మృతి ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) బాధ్యతలు స్వీకరించిన ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ నితిష్‌కుమార్‌ను ఓడించాలనే లక్ష్యంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాడు. కానీ బిజెపికి మాత్రం సహకరిస్తున్నాడు. బిజెపి పోటీచేసే సీట్లలో పోటీ పెట్టకుండా కేవలం జెడియు పోటీ చేసే స్థానాలపైనే గురి పెట్టాడు. రామ్ విలాస్ పాశ్వాన్.. మృతికి ముందు కొద్ది నెలల నుంచి అనారోగ్యం కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఎన్డీయే నుంచి బయటకొచ్చి పోటీ చేయాలన్న చిరాగ్ నిర్ణయంపై బిజెపి నేత సుశీల్ మోడీ మాట్లాడుతూ రామ్ విలాస్ పాశ్వాన్ క్రియాశీలకంగా ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని అన్నాడు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూడా మాట్లాడుతూ సీనియర్ పాశ్వాన్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఉన్న మంచి సంబంధాల కారణంగానే పాశ్వాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
ఎన్నికల సమయంలో ప్రజల అంతరంగాన్ని అంచనా వేయడంలో రామ్‌విలాస్ పాశ్వాన్ దిట్ట. అందుకనే ఆయన్ను రాజకీయ పండితుడు అని కూడా అంటారు. 1999లో పాశ్వాన్ తన బిజెపి వ్యతిరేక వైఖరిని విడిచి పెట్టి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో నితీష్‌కుమార్‌తో కలిసి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో 54 పార్లమెంట్ సీట్లలో ఆర్‌జెడి ఏడు సీట్లకు మాత్రమే పరిమితమైంది. లాలూప్రసాద్ తన స్వంత నియోజకవర్గమైన మాధేపూర్‌ను కూడా కోల్పయాడు. తర్వాత 2004 ఎన్నికల్లో బిజెపిని వదిలేసి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏతో కలిశాడు. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్, పాశ్వాన్, కాంగ్రెస్ కూటమి నితీష్‌కుమార్ నేతృత్వంలోని కూటమిని చిత్తుగా ఓడించింది. ఒక్క 2009లో మాత్రం రామ్ విలాస్ పాశ్వాన్ తన హాజీపూర్ స్థానాన్ని కోల్పయాడు. 2014 వరకు కొంచెం ఇబ్బంది పడ్డాడు. మళ్లీ ఆ తర్వాత 2014లో మోడీని ఎవ్వరూ నిలువరించలేరని భావించిన పాశ్వాన్ తిరిగి బిజెపితో చేతులు కలిపాడు. ఇదే సమయంలో బిజెపిని వీడిన నితీష్‌కుమార్ మూడేళ్ల కాలంలోనే ఆర్జేడి,కాంగ్రెస్‌కు మోసం చేసి తిరిగి ఎన్డీయేలో చేరాడు.
రామ్‌విలాస్ పాశ్వాన్ చనిపోగానే బీహార్‌లోని కొందరు రాజకీయ విశ్లేషకులు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ వ్యూహంలో మార్పులు జరిగే అవకాశముందని అంచనా వేశారు. అయితే ఇప్పటికే చిరాగ్ పెద్ద రాజకీయ ఎత్తుగడే వేశాడు. ఈ ఎత్తుగడ అతన్ని చావో రేవో అని తేల్చుకునే పరిస్థితిలోకి నెట్టింది. బీహార్‌లో 223 అసెంబ్లీ సీట్లకు గాను అక్టోబర్ 28, నవంబర్ 3, నవరబర్ ఏడు తేదీల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. నవరబర్ పదో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల్లో తనవైఖరిపై చిరాగ్ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశాడు. నితీష్‌కుమార్‌ను ఓడించాలనేదే తన లక్ష్యమని, బిజెపి స్థానాల్లో పోటిపడబోమని, బిజెపికి ఎటువంటి నష్టం కల్గించబోమని తెలిపాడు. తన తండ్రి అరోగ్యం గురించి విలేకర్లు నితీష్‌కుమార్‌ను ప్రశ్నించినప్పుడు ఏమీ తెలియదన్నట్లు వ్యవహరించారని ఆరోపించారు. కానీ జెడియు నేతలు మాత్రం ఈ విషయంలో చిరాగ్‌ను సంప్రదించేందుకు నితీష్‌కుమార్ ప్రయత్నించాడని, కానీ అతను స్పందించలేదని చెబుతున్నారు.
మరి పాశ్వాన్ మృతి చిరాగ్ ఎన్నికల వ్యూహంపై ఎటువంటి ప్రభావాన్ని చూపనుంది? మొదట చిరాగ్ బిజెపి పోటీచేసే అన్ని స్థానాలు మినహా మిగిలిన 122 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు, మూడు దశల్లో ఎన్నికలు జరిగే స్థానాల్లో చిరాగ్ పెద్దగా అభ్యర్దులను నిలబెట్టకపోవచ్చుని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే 42 మంది అభ్యర్ధులు నామినేషన్ వేసేవారు. వారిలో ఆరుగురు బిజెపి నుండి వచ్చిన అసంతృప్త నేతలు కూడా ఉన్నారు. వీరంతా కూడా బిజెపి పోటీ చేయని స్థానాల్లోనే నామినేషన్ వేశారు.
అయితే నితిష్‌కుమార్ చిరాగ్ పాశ్వాన్ గురించి అంతగా టెన్షన్ పడడం లేదని జెడియు నేతలు చెబుతున్నారు. కేవలం ఐదు శాతం మాత్రమే ఓట్లు ఉన్న పాశ్వాన్ దళితులు 2005 నుండి తనకెప్పుడూ వ్యతిరేకంగానే ఓటు వేశారని, ఎల్‌జెపి అభ్యర్ధులు పోటీ చేయడం వల్ల తనకు వచ్చే నష్టమేమీ లేదని నితీష్ భావిస్తున్నాడు. మరో వైపు పాశ్వాన్లు మినహా మిగిలిన దళిత కులాల ఓట్లన్నింటికీ ప్రాథినిధ్యం వహిస్తున్న మహా దళిత గ్రూపుకు నాయకుడైన జతిన్ రామ్ మాంజీ తనకు మద్దతు ఇస్తున్నందున, అది తనకు కలిసివచ్చే అవకాశమని నితీష్ భావిస్తున్నాడు. అందుకు మంజీ నేతృత్వంలోని పార్టీకి నితీష్ తనకు వచ్చిన కోటాలో నుండి ఏడు సీట్లును కేటాయించాడు.
ఈ నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్‌తో బిజెపి ఎలా వ్యవహరిస్తుందనేది కీలకం. ఒకవైపున నితీష్‌తో పొత్తు కొనసాగుతూనే చిరాగ్‌ను కూడా బిజెపి ట్రంప్ కార్డు లాగా వాడుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపున చిరాగ్ కేంద్ర కేబినెట్‌లో తన తండ్రి స్దానాన్ని తాను పొందాలని కోరుకుంటున్నాడు. బీహార్‌లో బిజెపికి లాభం చేకూర్చే వైఖరి తీసుకోకుండా కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లడం కష్టమని చిరాగ్‌కు కూడా తెలుసు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి