16, అక్టోబర్ 2025, గురువారం

భారత ఆర్థిక విప్లవానికి ఎపి కీలక ప్రాంతం

- ఎపి సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నాం సూపర్‌ జిఎస్‌టి `సూపర్‌ సేవింగ్స్‌ సభలో భారత  ప్రధాని నరేంద్రమోడీ

` మోడీని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌
                  భారత ఆర్థిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్‌ కీలక ప్రాంతమని, ఢల్లీి, అమరావతి కలిసి అభివృద్ధివైపు నడుస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. 2025 అక్టోబర్‌ 16న గురువారం ఆంధ్రప్రదేశ్‌  ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. తొలుత ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. తరువాత సున్నిపెంట నుంచి హెలీకాప్టర్‌ ద్వారా కర్నూలు నగర శివార్లలోని నన్నూరు టోల్‌గేట్‌ వద్ద ఉన్న హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ఓపెన్‌ టాప్‌ వాహనంలో సూపర్‌ జిఎస్‌టి సూపర్‌ సేవింగ్స్‌ బహిరంగ సభ వేదికకు చేరుకున్నారు. చంద్రబాబు, పవన్‌ మోడీకి శాలువా కప్పి సన్మానించారు. ఎపిలో రూ.13,400 కోట్లతో పలు ప్రాజెక్టులకు, ప్రారంభానికి మోడీ బటన్‌ నొక్కారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ వికసిత భారత్‌కు స్వర్ణాంధ్రప్రదేశ్‌ మరింత తోడ్పడనుందని, డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లో ఎపి సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నామని తెలిపారు.
శ్రీకాకుళం నుంచి ఆంగుల్‌ వరకూ గ్యాస్‌ పైప్‌ లైన్‌ ను జాతికి అంకితం చేశామని చెప్పారు. దేశ ఆర్ధిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్‌ ఓ కీలక ప్రాంతంగా ఉందని, సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో రాష్ట్ర వేగంగా అభివృద్ధి దిశగా నడుస్తోందని అన్నారు. 20 వేల సిలిండర్ల సామర్ధ్యంతో ఇండేన్‌ బాటిలింగ్‌ ప్లాంట్‌ను చిత్తూరులో ప్రారంభించామన్నారు.  మల్టీమోడల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులతో కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు.     సబ్బవరం నుంచి షీలానగర్‌ వరకూ కొత్త హైవేతో కనెక్టివిటీ పెరిగిందన్నారు.  రైల్వేరంగంలో కొత్తయుగం ప్రారంభ మైందని,  ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రాజెక్టులను ప్రారంభించుకున్నామని తెలిపారు.     వికసిత్‌భారత్‌ 2047 సాధన సంకల్పానికి స్వర్ణాంధ్ర లక్ష్యం మరింత బలం అందిస్తుందని చెప్పారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది వేగాన్ని మరింతగా పెంచు తుందన్నారు.  భారత్‌ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. గూగుల్‌ లాంటి ఐటీ దిగ్గజం ఎపిలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించిందని, దేశపు తొలి అతిపెద్ద ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అమెరికా వెలుపల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌ పెడుతున్నట్టు గూగుల్‌ సిఇఒ చెప్పారని వివరించారు. డేటాసెంటర్‌,ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్వర్క్‌ లాంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు.  ప్రపంచ దేశాలను కలుపుతూ వేయనున్న సబ్‌ సీ కేబుల్‌ ద్వారా తూర్పు తీరం బలోపేతం అవుతుందన్నారు.     విశాఖలో ఏర్పాటు కానున్న కనెక్టివిటీ హబ్‌ భారత్‌ కే కాదు ప్రపంచానికి సేవలందింస్తుందని తెలిపారు.  సీఎం చంద్రబాబు విజన్‌ ను అభినందిస్తున్నానన్నారు.     దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చాలా కీలకం ఎపి అభవద్ధి చెందాలంటే రాయలసీమ కూడా అభివృద్ధి అంతే అవసరమన్నారు.  కర్నూలులో ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయన్నారు.  పారిశ్రామిక అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు.  ఎపి  వేగవంతమైన అభివద్ధి కోసం కొప్పర్తి -ఒర్వకల్‌ పారిశ్రామిక నోడ్ల ద్వారా పచ్చే పెట్టుబడులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.     21వ శతాబ్దపు మాన్యుఫాక్చరింగ్‌ కేంద్రంగా ప్రపంచ దేశాలు భారత్‌ను చూస్తున్నాయన్నారు. భారత్‌ లో ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ రూపుదిద్దుకుంటోందని, ఆత్మనిర్భర్‌ భారత్‌లో ఎపి కీలకంగా మారిందన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో ఎపి ప్రగతి ద్వారాలు తెరుచుకుని వేగంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తోందన్నారు. కష్ణా జిల్లా నిమ్మకూరులో రక్షణ రంగానికి చెందిన నైట్‌ విజన్‌ గాగుల్స్‌, క్షిపణుల సెన్సార్లు, డ్రోన్‌ గార్డులను తయారు చేయగలదన్నారు.     రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులను కూడా చేసేందుకు ఆస్కారం ఇస్తుందని తెలిపారు. ఆపరేషన్‌ సింధూర్‌ లో దేశంలో తయారైన ఉత్పత్తుల బలం ఏమిటో చూశామని,     కర్నూలులో భారత్‌ డ్రోన్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని ఎపి నిర్ణయించటం సంతోషదాయకమన్నారు.     డ్రోన్ల తయారీ ద్వారా కర్నూలు భారత్‌ కు ఓ గర్వకారణంగా నిలుస్తుందన్నారు.     పౌరులను అందుకు  అనుగుణంగా అభివృద్ది చేయాలనేది ఎన్‌డిఎ ప్రభుత్వ నినాదమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ అనే అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు.     ప్రజల జీవితాలను సులభతరం చేయటమే సంకల్పమన్నారు.     రూ.12 లక్షల ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరికీ పన్ను లేకుండా చేశామని,  వృద్ధుల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సరిగ్గా నవరాత్రి ముందు జిఎస్‌టి సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చాం. ప్రజలపై పన్నుల భారం తొలగించాం.    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో జిఎస్‌టి పొదువు ఉత్సవాన్ని పండుగలా చేసుకున్నారు. సూపర్‌ జిఎస్‌టి సూపర్‌  సేవింగ్స్‌ పేరిట కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయం. జిఎస్‌టి సంస్కరణల వల్ల ఎపి ప్రజలు రూ.8 వేల కోట్ల మేర ప్రజలకు ఆదా అవటం సంతోషదాయకమన్నారు. కానీ ఆ ప్రయోజనాలు అందరికీ అందాల్సి ఉందని తెలిపారు.  అప్పుడే అది సఫలమైనట్టని చెప్పారు.     స్థానిక తయారీ రంగాన్ని కూడా ప్రోత్సహించేలా ఈ సంకల్పం తీసుకోవాలని,    వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ తోనే వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.

బడుల్‌ ఇంజన్‌ సర్కారుతో రెట్టింపు ప్రయోజనం : ఎపి సిఎం చంద్రబాబు

                     కేంద్రంలో రాష్ట్రంలోని ఎన్‌డిఎ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో ఆంధ్రప్రదేశ్‌ కు రెట్టింపు ప్రయోజనాలు దక్కుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్‌ జిఎస్‌టి - సూపర్‌ సేవింగ్స్‌, బచత్‌ ఉత్సవ్‌ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిఎస్‌టి 2.0 సంస్కరణలతో దేశ ప్రగతి వేగాన్ని పెంచటంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని సీఎం ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  అత్యంత అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తున్న మోదీ ఓ విశిష్టనేత అని కొనియాడారు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని స్థానంలో మోదీ ఉన్నారన్నారు.  ఆయన 21 వ శతాబ్దపు నేత అని సీఎం వ్యాఖ్యానించారు. ఎలాంటి విరామం లేకుండా ప్రజల సేవలోనే ఆయన అంకితమై ఉన్నారన్నారు.  తాను చూసిన ప్రధానుల్లో మోదీ అత్యంత ప్రగతిశీల నేత అని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన కీలకమైన సంస్కరణలు తీసుకువచ్చారని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంటోందని అన్నారు. 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారతదేశం ప్రధాని మోదీ సంకల్పంతో ఇప్పుడు 4వ స్థానానికి చేరిందన్నారు.  వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా 2047కు దేశం సూపర్‌ పవర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌ ద్వారా సైనిక పరంగా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటేలా చేశారని ముఖ్యమంత్రి  అన్నారు.
                                                    జిఎస్‌టి  సంస్కరణలతో ప్రజలందరికీ లాభమే
                  ఒకే దేశం ` ఒకే పన్ను ` ఒకే మార్కెట్‌ నినాదంతో వచ్చిన జిఎస్‌టి పన్ను విధానంలో ప్రస్తుత సంస్కరణల వల్ల 99 శాతం వస్తువులు సున్నా నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయన్నారు. తద్వారా అన్ని వస్తువుల ధరలు తగ్గాయని సీఎం అన్నారు. జిఎస్‌టి 2.0తో పన్నులు తగ్గి పేదలు, మధ్యతరగతికి గణనీయంగా ఉపశమనం కలిగిందని అటు వ్యాపారులు, ఎంఎస్‌ఎంఇ వర్గాలకూ ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ది కలిగించేలా సంస్కరణలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. జిఎస్‌టి తగ్గింపుతో ప్రతీ కుటుంబానికీ రూ.15 వేల వరకూ ఆదా అవుతుందని స్పష్టం చేశారు. దసరా నుంచి దీపావళి వరకూ జిఎస్‌టి సంస్కరణలను పండుగలా నిర్వహిస్తున్నామని వెల్లడిరచారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 98 వేల ఈవెంట్లు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. జిఎస్‌టి బచత్‌ ఉత్సవ్‌ కాస్తా ఇవాళ భరోసా ఉత్సవ్‌ గా మారిందని చంద్రబాబు అన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ తో రాష్ట్రానికి డబుల్‌ ప్రయోజనాలు కలుగుతున్నాయని సిఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు, సూపర్‌ జిఎస్‌టితో ప్రజలకు సూపర్‌ గా పొదుపు జరిగిందని సీఎం అన్నారు.
                                                                        స్వదేశీ మంత్రమే బ్రహ్మాస్త్రం
               ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న టారిఫ్‌ లను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ పిలుపే తారకమంత్రం అవుతుందని అన్నారు. ఈ స్వదేశీ పిలుపును అందిపుచ్చుకుని సెమీ కండక్టర్ల నుంచి శాటిలైట్ల వరకూ చిప్‌ల నుంచి షిప్పుల వరకూ ఎపిలోనే ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా మెగా డిఎస్‌సి, పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం-2.0, పెన్షన్ల పంపిణీ, వంటి సంక్షేమ పథకాలను కేంద్ర సహకారంతోనే సూపర్‌ హిట్‌ చేశామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి 16 నెలలుగా ప్రధాని మోదీ అందిస్తున్న సాయాన్ని మరువలేం అన్నారు. కేంద్రం సహకారంతో అమరావతిని నిలబెట్టామని, పోలవరాన్ని గాడిన పెట్టామని, విశాఖ ఉక్కును బలోపేతం చేశామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక పెట్టుబడులు సాధిస్తోందని విశాఖలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌, 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో గూగుల్‌ ఎఐ డేటా హబ్‌ వస్తోందని, నెల్లూరులో భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ రిఫైనరీ వస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.  రాయలసీమకు త్వరలో హైకోర్టు బెంచ్‌ రాబోతోందని సిఎం చెప్పారు. రాయలసీమలో స్టీల్‌, స్పేస్‌, డిఫెన్స్‌, ఏరో స్పేస్‌, ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, డ్రోన్స్‌ తయారీ, గ్రీన్‌ ఎనర్జీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సిమెంట్‌ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వీటితో పాటు సెమీ కండక్టర్‌ యూనిట్‌, క్వాంటం వ్యాలీ రావడానికి కారణమైన ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్టు సిఎం వ్యాఖ్యానించారు.
                                               మోడీ కర్మయోగి : ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌
                డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. మోడీ నిజమైన కర్మయోగి అన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ 15 ఏళ్ల పాటు ఉంటుందని, ఆత్మ నిర్భర్‌ భారత్‌ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెడుతున్నారన్నారు. జిఎస్‌టి సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోందన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌ నడుస్తోందన్నారు. జిఎస్‌టి తగ్గింపుతో రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పినా పేదలకు మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారన్నారు. భారత్‌ 4వ ఆర్ధిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోడీనే కారణమన్నారు.
                                        రాష్ట్రంలో డబల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌:మంత్రి నారా లోకేష్‌
              రాష్ట్రంలో డబల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌ నడుస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. జిఎస్‌టి తగ్గింపుతో రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పినా పేదలకు మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులు, రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయన్నారు. భారత్‌ 4వ ఆర్ధిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోదీనే కారణమన్నారు.
                                 ఓటు వేసి కోట్లు రాబట్టాం : ఆర్థిక  మంత్రి పయ్యావుల కేశవ్‌
                       2024 మీరు వేసిన ఓటు వేల కోట్ల సంక్షేమ అభివృద్ధి పనులు అందించింది. తల్లికి వందనం,ఉచిత బస్సు, ఉచిత  గ్యాస్‌,వంటి ఎన్నో  పథకాలు అందించాం.ప్రధాని ఆశీస్సులతో మనరాష్ట్రంలో గూగుల్‌ సంస్థ పెట్టుబడులు పెట్టింది.ప్రధాని ఆపరేషన్‌ సిందూర్‌ తో మన దేశ  శక్తిని,గొప్పతనాన్ని చాటి చెప్పారు. భవిష్యత్‌ తరాల కోసం కూటమిగా ఏర్పడి  మన రాష్ట్రాన్ని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ గాడిన పెట్టారు.
                                                 ఎపిలో  రూ.13,429 కోట్ల కేంద్ర ప్రాజెక్టులు
                రాష్ట్రంలో విద్యుత్‌, రైల్వే, జాతీయ రహదారులు, పారిశ్రామిక, రక్షణ రంగాలకు చెందిన రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. వర్చువల్‌ విధానం ద్వారా వివిధ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఇంకొన్నింటిని శంకుస్థాపనలు చేశారు. మరో రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రూ.9,449 కోట్ల విలువైన 5 అభివద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇక రూ.2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.
           శంకుస్థాపనలు: విద్యుత్‌ ట్రాన్స్‌ మిషన్‌ వ్యవస్థ - రూ. 2886 కోట్లు, ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్‌ - రూ. 4922 కోట్లు, కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్‌  రూ. 493 కోట్లు, పెందుర్తి - సింహాచలం నార్త్‌ మధ్య రైల్‌ ఫ్లైఓవర్‌ లైన్‌ - రూ. 184 కోట్లు, సబ్బవరం-షీలానగర్‌ జాతీయ రహదారి - రూ. 964 కోట్లు.
              ప్రారంభోత్సవాలు: రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు - రూ. 82 కోట్లు, కడప - నెల్లూరు - చునియంపల్లి రోడ్లు - రూ. 286 కోట్లు, కనిగిరి బైపాస్‌ రోడ్‌ - రూ. 70 కోట్లు, గుడివాడ-నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి - రూ. 98 కోట్లు, కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు -రూ. 13 కోట్లు, పీలేరు - కలసూర్‌ నాలుగు లేన్ల రోడ్‌ - రూ. 593 కోట్లు, నిమ్మకూరులోని భెల్‌ఇ అడ్వాన్స్‌డ్‌ నైట్‌ విజన్‌ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం - రూ. 362 కోట్లు, చిత్తూరులోని ఇండేన్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌` రూ. 200 కోట్లు.
               జాతికి అంకితం: కొత్తవలస `కొరాపుట్‌ రైల్వే డబ్లింగ్‌ పనులు` రూ. 546 కోట్లు, శ్రీకాకుళం- అంగుల్‌ నాచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ - రూ. 1730 కోట్లు.

                                                   శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించిన ప్రధాని సిఎం
                     కర్నూలు విమానాశ్రయం నుంచి శ్రీశైల క్షేత్రానికి హెలికాప్టర్‌లో వెళ్లిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న శక్తిపీఠంలోని భ్రమరాంబ అమ్మవారిని దర్శించి.. వేదపండితుల ఆశీర్వచనాలను తీసుకున్నారు. శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రానికి వెళ్లిన ప్రధాని మోదీ సహా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వెళ్లారు. స్పూర్తి కేంద్రంలోని దర్బార్‌ హాల్‌, ధాన్య మందిరాన్ని ప్రధాని సందర్శించారు.
                కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు,  భూపతి రాజు శ్రీనివాస్‌ శర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర ఐటీ , విద్యా శాఖ మంత్రి  నారా లోకేష్‌,  రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్‌ , రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి, కర్నూలు జిల్లా ఇంచార్జి మంత్రి మరియు జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌, హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ప్రధానమంత్రి ప్రోగ్రామ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి వీరపాండియన్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, ఐఎఎస్‌ అధికారి దినేష్‌ కుమార్‌, సమాచార శాఖ డైరెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, అభిషేక్‌, తదితరులు పాల్గొన్నారు.


                                                                        ప్రధాని పర్యటన సైడ్‌లైట్స్‌
                                                                                పరస్పరం పొగడ్తలతో సరి

` -ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రిలోకేష్‌, ఇతర మంత్రులు ప్రధాని మోడీ కర్మయోగి, ఇంతగొప్ప నాయకుడిని చూడలేదని, జిఎస్‌టి తగ్గించి మేలు చేశారని పొగడ్తలతో ముంచెత్తినా ప్రజల డిమాండుపై ప్రధాని ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఎపికి ప్రత్యేకహోదా, విశాఖస్టీల్‌ప్లాంటును బలోపేతం చేస్తామని చెప్పలేదు. గతంలో ప్రకటించిన వాటి గురించే మాట్లాడారు.
`-చంద్రబాబు నాయుడు ఉపన్యాసం ప్రారంభంలో జిఎస్‌టి వల్ల లాభం చేకూరిందా లేదా తమ్ముళ్లూ లాభం చేకూరిన వారు చేతులెత్తాలంటే జనం నుంచి స్పందన కనబడలేదు. `భవిష్యత్తులో నైనా లాభం ఉంటుందని నమ్ముతున్నారా అంటే కూడా చేతులెత్తలేదు. మోడీ...మోడీ..అని గట్టిగా చెప్పండండే మిశ్రమ స్పందన వచ్చింది.
`-చివరగా ప్రధాని చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ సమర్థవంతమైనా నాయకులను పొగడ్తలతో ముంచెత్తారు.
`-సభావేదికపై మోడి అభివాదం చేస్తూ పోడియం వద్దకు వస్తున్నప్పుడు పెద్దఎత్తున అరుపులు కేకలు వినపించాయి.
`-ప్రసంగం పూర్తయ్యాక అందరి మొహాల్లో నిరాశ కనబడిరది.
`-చంద్రబాబు నాయుడు, లోకేష్‌ కంటే మోడి, పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగాలకు జనం నుంచి స్పందన కనిపించింది.
`-మోడీ ప్రసంగం ప్రారంభంలో కర్నూలు జిల్లాలోని దేవాలయాలు, దేవుళ్లు , జిల్లా పోరాట యోధుల గురించి ప్రస్తావించారు.
`- వేదికపై ప్రధాని మోదీని శాలువతో సత్కరించి, మహాశివుడు ప్రతిమను జ్ఞాపికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
`-ట్రాఫిక్‌ జామ్‌ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పార్కింగ్‌ చాలా దూరం ఉండటంతో మహిళలు, వృద్దులు వాహనాల వద్దనే ఆగిపోయారు.
`-టాయిలెట్ల దగ్గర నీళ్లు లేక ఇబ్బందులు పడ్డారు.
`-వేదికపై చంద్రబాబు నాయుడుకు దగ్గువచ్చి గొంతు బొంగురు పోవడంతో ఎంపి బైరెడ్డి శబరి పరుగుపెట్టి నీళ్లు తెచ్చారు.
`-బస్సులన్నీ మోడీ సభకు పోవడంతో బస్టాండులో కర్నూలు బస్సులు, జనం లేక బోసి పోయింది.
`-ప్రధాని రాష్ట్ర, జిల్లా ప్రధాన సమస్యలను పట్టించుకోవాలని నన్నూరు వద్ద యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 

-విద్యాద్ఘాతానికి ప్రధాని సభా ప్రాంగణం వద్ద కర్నూలు జిల్లాకు చెందిన అర్జున్‌ అ
ను యువకుడు మృతిచెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.






కామెంట్‌లు లేవు: