10, అక్టోబర్ 2010, ఆదివారం

ఆకట్టుకున్న తెలుగు తొలి జంట కవయిత్రుల అష్టావధానం

ఆకట్టుకున్న తెలుగు తొలి జంట కవయిత్రుల అష్టావధానం


తెలుగు తొలి జంట కవయిత్రులు టి. ఉదయచంద్రిక , బి.అపర్ణల అష్టావధానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రముఖ సాహితీవేత్త తోపుదుర్తి వెంకట్రామయ్య ప్రోత్సాహంతో ఆదివారం తెలుగు లలితకళాసమితీలో డాక్టర్‌ ఆశావాది అధ్యక్షతన ఈ అష్టావధానం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే 24 సార్లు అవధానం చేసిన ఈ జంట కవయిత్రులు ధూలిపాల మహదేవమణితో శిక్షణ పొందారు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఉదయచంద్రిక, రాజమండ్రికి చెందిన అపర్ణ అవధాన కళను సాహితీలోకానికి తెలపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవధాన ప్రక్రియ ఒక్క తెలుగు భాషలోనే ఉన్నప్పటికీ దానికి అంత ఆదరణ లేదని, తెలుగు ప్రజలకు అవగాహన కల్పించి ఆదరణ పెంచుతామని తెలిపారు. ఫృశ్చకులు ఇచ్చిన సమస్యలను పూరించి చక్కటి ధారనా పటిమతో అవధానాన్ని రక్తి కట్టించారు. ఫృచ్చకులతోపాటు , సభకు హాజరయిన కవి పండితులు ప్రశంసించారు.
ఈ అవధానంలో ఫృశ్చకులుగా నిశిద్ధాక్షరి -డాక్టర్‌ మహ్మద్‌హుస్సేన్‌, సమస్య -నారాయణ స్వామి , దత్తపది -వైద్యం వెంకటేశ్వర్లు, వర్ణన -పద్మావతమ్మ, న్వస్తాక్షరి-పార్వతీదేవి, వారగణనం -తోపుదుర్తి వెంకట్రామయ్య, అప్రస్తుత ప్రసంగం -రామచంద్ర , గంటానాధం తెలకపల్లి పాండురంగశర్మ పాల్గొన్నారు.
పద్యకవితలో శిక్షణ అవసరం : ఆశావాది
తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవడానికి ప్రధానంగా పద్యకవితలో ఔత్సాహికులకు శిక్షణ అవసరమని ప్రముఖ అష్టావధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు సూచించారు. కర్నూలు జిల్లాలో అనేక సాహితీ సంస్థలున్నాయని వారు పుస్తకావిష్కరణ సభలు, కవిసమ్మేళనాలకే పరిమితం కాకుండా పద్యకవితమై శిక్షణా తరగతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చక్కటి అవధానం చేసిన ఉదయచంద్రిక, అపర్ణలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అభినందించారు. చిన్నపాటి లోపాలను సరిచేసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. అవధానంలో పూరించిన చక్కటి పద్యాలివి
నిశిద్ధాక్షరి పద్యం : -
శ్రీకిన్‌ ధీకిన్‌ నీవే
వాకున్‌ జేతుల్‌ సతంభు వాణీ నీవే
గాకర్త వింక దయతో
మాకై తలనిండియుండి మాతా గనుమా!
సమస్యాపూరణ పద్యం: -
నీవా ఇంటికి దేవతై వెలుగుచున్‌ నీరాజనంబందుచున్‌
జీవంబౌచు ప్రజాంతరంగములకున్‌ జేజేలనేబొందుచున్‌
కావేనీవు జనాలహార్టుబీటువు గదా కల్లోలమున్‌ చేసే ఓ
'' టీవీ ఎంతటి జానవైతివిగదే టీనేజి కుర్రోళ్లకున్‌ ''
దత్తపది :'' చెప్పు, చేట, పేడ, గాడిద '' పదాలతో ( అల్లసాని పెద్దనను శ్రీకృష్ణదేవరాయల సత్కారం తో పద్యం)
కైతల రేడు చెప్పు ఘన కావ్యసుధన్‌గని కృష్ణరాయలే
ఏతరి సల్పెనన్నమును పేడను చూడని రీతిలో భువిలో
నూతనమైనగాడిదను నోటబల్కగ రాజ్యమంతయున్‌
మ్రోతల చేటపాసులన్‌ ముచ్చటజేసె పెద్దనార్యుకున్‌
వర్ణన:-
ఇంతికి నర్థభాగమిడి ఈశ్వరుడొందెన్‌ లోకమాన్యతన్‌
ఎంతనిజెప్ప బూనినను ఏరికిసాధ్యముమాన్యతో శంకరుడహో
వింతగు లీలల న్నిటిని వేవుపాడగ భక్తకోటిమీ
చెంతను చేరి మ్రొక్కినను చింతలు చేరవుమానసంబునన్‌

న్యస్తాక్షరి : నవరాత్రి వచ్చేట్లుగా వృత్త పద్యం
నావరణీయ భావమున నర్తనమాడగ తల్లిరో సదా
సేవలు చేయు భాగ్యమిక తెన్నుగ భక్తుల కీయ వేడెదన్‌
కావగమమ్ము రాదె కామ్యములీయగ శంకరాకృపన్‌
ప్రోవగ కృష్టజాలమిది బ్రోచుతో మమ్ముసుగాత్రీ వేడెదన్‌.

పై పద్యాలన్నింటినీ చక్కటి ధారణతో సభికులకు వినిపించారు.

కామెంట్‌లు లేవు: