31, అక్టోబర్ 2010, ఆదివారం

ఆబిడ్డలు ఆనాథలయ్యారు

సూక్ష్మరుణాల సమిధలు
రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న సూక్ష్మ రుణాల దారుణాలు ఎన్నో తెర పైకి వస్తున్నాయి. తెర వెనుక ఆ దారుణాల వల్ల బలైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం సూక్ష్మరుణ వ్యవస్థను పాలకులు ప్రోత్సహించారు. దీని వల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. సూక్ష్మరుణాల బారిన పడి ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకుని.. తమ పచ్చటి సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్న అభాగ్యులను ఆదుకునే సాహసం ప్రభుత్వం చేయకపోవడం విచారకరమే.
'' పెట్టుబడి దారి విధానానికి లాభం అనేది ప్రేరణాశక్తినిస్తుంది. 20 శాతం లాభం వస్తే ఎక్కిడికైనా వెళ్తుంది. 50 శాతం లాభం వస్తే పరుగులు తీస్తుంది. 100 శాతం లాభం వస్తే ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది. 300 శాతం లాభం ఉంటే ఉరి శిక్షపడినా ముందుకు పోతుంది'' అని మార్క్స్‌ ఎప్పుడో చెప్పాడు.
పాలకులు ఇప్పటికైనా కళ్ళుతెరువకపోతే మానవతా విలువలకు పాలకులు సమాధి కట్టినట్లవుతుంది. సూక్ష్మరుణాల వలలో చిక్కి చేజేతులా తమ ప్రాణాలను కోల్పోయిన రెండు కుటుంబాల వ్యథ ఇది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడ్‌ గ్రామంలో రెండు కుటుంబాలు ఈ దారుణాలకు బలయ్యాయి. ఫలితంగా ఈ రెండు కుటుంబాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు అనాథలయ్యారు. పసిప్రాయంలో అనుభవించనంత నరకాన్ని చిన్న వయస్సులో వారు చవిచూస్తున్నారు. హృదయ విదారకమైన ఈ ఇరు కుటుంబాల గోస వర్ణనాతీతం.
ఏం జరిగిందంటే.. ?
మహబూబ్‌నగర్‌ జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడ్‌ గ్రామంలో మహిళా పొదుపు సంఘాలు చాలా చైతన్యంతో ముందడుగు వేస్తున్న తరుణంలో ' స్పందన, స్పూర్తి ' సూక్ష్మ రుణాల పేరిట ఆ గ్రామంలోని ప్రవేశించాయి. మహిళలకు రుణాలు ఇస్తామని అనతికాలంలోనే వాటిని చెల్లించారు. బ్యాంకుకు వెళ్లకుండా డబ్బు ఇంటికే వస్తుంటే వారు సంబరపడ్డారు. గ్రామానికి చెందిన జహంగీర్‌భీ (30) ఏడువేల రూపాయలను రుణంగా పొందింది. ఆ మొత్తాన్ని తన స్నేహితురాలు అదే గ్రామానికి చెందిన కోటవెంకి సత్యమ్మ (33)కు ఇచ్చింది. వారానికి 230 రూపాయలు స్పందన స్పూర్తికి చెల్లించాల్సి ఉండగా అది సాధ్యపడలేదు. సత్యమ్మ తీసుకున్న డబ్బులను అదే గ్రామానికి చెందిన కల్లు వ్యాపారి శ్రీహరిగౌడ్‌కు అప్పుగా ఇచ్చింది. అతను ముఖం చాటేయడంతో డబ్బులు కట్టాల్సిన బాధ్యత సత్యమ్మ పై పడింది. కాయకష్టం చేసుకుంటే తప్పా పొట్ట గడవని సత్యమ్మ కుటుంబంలో అప్పుల గోల మొదలైంది. జహంగీర్‌భీ నుండి ఒత్తిడి పెరిగింది. వీరి ఇరువురి పై స్పందన స్పూర్తి సంస్థ వారు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ వ్యవహారంలో సత్యమ్మకు, జహంగీర్‌బీకి మధ్య మనస్పర్థలు వచ్చి డబ్బుల కోసం తగాదా పడడంతో గొడవ ప్రారంభమైంది. డబ్బులు కట్టలేని దీనస్థితిలో జహంగీర్‌భీ గత ఫిబ్రవరి 23న తీవ్ర అవమానానికి గురై ఇంట్లో కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం హైద్రాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా మరునాడు మరణించింది. జహంగీర్‌భీ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సత్యమ్మ ఇంటి ముందు వేసి రుణం చెల్లించనందుకే చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మృతికి కారణమైన సత్యమ్మను గ్రామస్తులు నిలదీశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేని సత్యమ్మ భర్త కోటవెంకి అనంతయ్య (38).. భార్యను చితకబాది వ్యవసాయ పొలంలో ఉరివేసి చంపాడు. అనంతరం అనంతయ్య కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో ఒకే రోజు వ్యవధిలో తీవ్ర విషాదం ఆలుముకుంది.
సూక్ష్మరుణాల సమిధలు వీరు...
పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయనే నానుడి వీరి పట్ల నిజమైంది. సూక్ష్మరుణాలను చేపట్టి వాటిని కట్టలేని ధీనస్థితిలో కుటుంబ కలహాలకు దారితీసి చనిపోయిన జహంగీర్‌భీ, అనంతయ్య, సత్యమ్మ రెండు కుటుంబాల్లో వారి పిల్లలు తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలిపోయారు. సూక్ష్మరుణాల దారుణాలకు సమిథలుగా వారు సజీవసాక్ష్యాలుగా నిలిచారు. నిరుపేద కుటుంబమైన జహంగీర్‌భీకి ముగ్గురు కుమార్తెలు మహమూదాబేగం (10), షబానాబేగం (8), నాజియాబేగం (6) అనాథలుగా మారారు. భార్యభర్తలు కూలీ నాలి చేసుకుంటేనే పొట్టగడిచే ఈ కుటుంబంలో ఉన్న ఆధారం తల్లి కోల్పోయాక తండ్రి మైమూద్‌ ఒంటరి వాడయ్యాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు బాలికలు నానమ్మ మాలన్‌భీ వద్ద తలదాచుకున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని మాలన్‌భీ (70) వృద్ధాప్యంలో పిల్లల బాగోగులను చూసుకుంటుంది. అదే విధంగా మృతులు అనంతయ్య, సత్యమ్మ లకు శివకుమార్‌ (14), సుస్మిత (6) చిన్నారులు ఉన్నారు. పెద్దమ్మ, పెదనాన్న పద్మమ్మ, కృష్ణయ్యల వద్ద వీరు జీవనం సాగిస్తున్నారు. కష్టం చేస్తే తప్పా పూట గడవని కృష్ణయ్య కుటుంబానికి ఈ అనాథలు అధికభారమయ్యారు. అయినా వీరిని తల్లిదండ్రులలాగే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. జహంగీర్‌భీని కోల్పోయిన ఆమె తల్లి మహబూబ్‌భీ నేటికి దుఖసాగరంలోనే మునిగిపోయింది.
పాపం జైలుకు వెళ్ళారు
సూక్ష్మరుణాల పుణ్యమా అని మరో ఇద్దరు మహిళలు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. మరణించిన జహంగీర్‌భీ మరణవాంగ్మూలంలో తన పై డబ్బుల కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చిన తోటి సభ్యులు గ్రామానికి చెందిన నీలమ్మ, పండగ సత్యమ్మ పేర్లను వెల్లడించడంతో పోలీసులు వీరి పై కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఇరువురు మహిళలు తమకు తెలియకుండానే సూక్ష్మరుణాల దారుణాలకు జైలుకు వెళ్ళాల్సిన ఆగత్యం ఏర్పడింది. అదే విధంగా గ్రామంలో మరో బాధితురాలు ఖాజాభీ పేరు పై 10 వేల రూపాయలు ఆమెకు తెలియకుండా రుణం ఇతరులు పొందడంతో ఖాజాభీ తల్లి జహంగీర్‌భీ ఆత్మహత్యయత్నానికి పాల్పడగా ఆమెను గ్రామస్తులు రక్షించారు. ఇలా ఎన్నో దారుణాలు కంటికి కనిపించకుండా ఆ గ్రామాన్ని కబళిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు: