3, నవంబర్ 2010, బుధవారం

'బుడబుడ కావడం'


ఏదైనా రహస్యం మెల్లగా బహిర్గతం కావటం అనేఅర్థంలో 'బుడబుడ కావడం' జాతీయ ప్రయోగంలో ఉంది. నీటి నుంచి గాలిబుడగలు కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి. రబ్బరు గొట్టాలాంటివి చిల్లులు పడిన సందర్భాల్లో వాటిమీద నీరు ప్రవహిస్తున్నప్పుడు బుడబుడమంటూ బుడగలు పైకొస్తూ ఉంటాయి. దీన్నిబట్టి ఆగాలిబుడగలు వచ్చే ప్రాంతంలో రబ్బరు గొట్టానికి రంధ్రం పడిందన్న విషయం స్పష్టమవుతుంది. ఇక్కడ రంధ్రం అనేది రహస్యం. ఆరహస్యాన్ని బహిర్గతం చేసేవి నీటి బుడగలు. ఈ భావనతోనే బుడబుడ కావటం అనే జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. నవంబర్‌ 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇక్కడి రహాస్యాలు మంత్రుల ద్వారా బయటకు వెళ్తున్నాయని ముఖ్యమంత్రి రోశయ్య ఆగ్రహం చెందారట..... పై జాతీయానికి ఆయన ఆందోళన సరిపోయిందని నాభావన... ఈ సందర్భంగా మరో సామెత కూడా గుర్తుకొస్తుంది. '' గుణం మార్చుకోవే గూటాల మల్లీ అంటే అవసరమైతే నామొగున్నయినా మార్చుకుంట గాని గుణం మార్చుకోనన్నదట'' మంత్రుల వ్యహార మాత్రం ఈ సామెతలా ఉంది.
ఈ సమావేశం తీరును పరిశీలిద్దామా...ముఖ్యమంత్రి రోశయ్య మంత్రులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మీడియాకు లీకు చేయకూడదని ఎన్నిసార్లు నిర్ణయించుకున్నా విషయాలు బయటకు పొక్కుతూనే ఉన్నాయని, మనమేమన్నా చిన్నపిల్లలమా అని సిఎం రోశయ్య ప్రశ్నించారట. దీంతో మంత్రివర్గ సమావేశం వాడివేడిగా సాగిందట. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తెలంగాణాపై ఎలాంటి నిర్ణయం వచ్చినా కట్టుబడతామని, అప్పటివరకు మంత్రులందరూ కలిసిమెలిసి ఉండాలని, ప్రభుత్వంలో భాగస్వామ్యంగానే ఉంటారని చెప్పినట్లు తెలిసింది. పేదలకు రెగ్యులరైజ్‌ చేస్తున్న భూమి అంశంపై దానం నాగేందర్‌, బొత్స సత్యనారాయణ మధ్య వాదన జరిగిందట. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పేదలకు 80 గజాల వరకు భూమిని రెగ్యులరైజ్‌ చేస్తున్నామని, దానిని 120 గజాలకు పెంచాలని దానం సూచించగా రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒక్క హైదరాబాద్‌కు పరిమితం ఎలా కుదురుతుందని బొత్స వాదించినట్లు తెలిసింది. రెగ్యులరైజ్‌ కోసం జీవో 166ను కూడా ప్రభుత్వ పరంగా విడుదల చేశామని, ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని, హైదరాబాద్‌కు ఎలా పరిమితం చేస్తారని బొత్స అడిగినట్లు సమాచారం. 120 గజాలకు రెగ్యులరైజ్‌ చేయాలనుకుంటే నామినల్‌ ఛార్జీ వసూలు చేస్తే బాగుంటుందని సూచించినట్లు తెలిసింది. దానికి దానం ఏదో చెప్పబోతుండగా సిఎం వారించినట్లు తెలిసింది. 'మంత్రులు ఒకరి నొకరు ఇలా వాదించుకుంటారు. ఈ విషయాలు కేబినెట్‌ వరకే పరిమితం కావడం లేదు. మీడియాకు కూడా ఎక్కుతున్నాయి. దీనివల్ల మంత్రుల మధ్య సఖ్యత లేదని పెద్దపెద్ద హెడ్డింగ్‌లు వస్తున్నాయి. వాదించుకోవడం ఎందుకు మీడియాకు చెప్పుకోవడం ఎందుకు' అని రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేబినెట్‌లో చర్చించుకున్న అంశాలను బయట చెప్పకూడదని ఎన్నోసార్లు చెప్పుకొన్నా అమలు కావడం లేదని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట తప్పితే ఎలా అని మందలించినట్లు తెలిసింది. 'ఇలా ఎన్నిసార్లు చెప్పుకుంటాం. మనం చిన్నపిల్లలం కాదు కదా' అని సిఎం అన్నట్లు తెలిసింది.

కామెంట్‌లు లేవు: