13, నవంబర్ 2010, శనివారం

కర్నూలు జిల్లాలో వ్యవసాయం

కర్నూలు జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. రబీ పంటలూ వర్షం ఆధారంగా సాగుచేస్తారు. జిల్లా సగటు వర్షపాతం 670 మిల్లీ మీటర్లు. 44.15 లక్షల ఎకరాల భౌగోళిక విస్తీర్ణం ఉంది. అందులో 23.475 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. సాగునీటి వనరుల కింద ఐదు లక్షల ఎకరాల భూమి ఉంది. ప్రధానంగా వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు, పత్తి, శనగ, జొన్న పంటలు పండిస్తారు. రెండేళ్లుగా ఖరీఫ్‌ సీజన్‌లో ఆముదం, కంది పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 13.5 లక్షల ఎకరాలు. ఈ సీజన్‌లో వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు, కంది, పత్తి, ఉల్లి పంటలు సాగు చేస్తారు. గిట్టుబాటు ధరలు లభించడం లేదని గత ఏడాది నుండి వేరుశనగ, పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు ఆముదం, కంది పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది కందులు లక్షా 25 వేల ఎకరాల్లో, ఆముదం 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. రబీలో బావుల, సాగునీటి వనరుల కింద 14 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. గతంలో రెండున్నర లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసేవారు. 4,5 సంవత్సరాలుగా పత్తికి ధరలు లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రబీలో 4.3 లక్షల హెక్టార్లలో శనగ, జొన్న, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేశారు. ధనియాలు 20 వేల హెక్టార్లలో, వేరుశనగ 18 వేల హెక్టార్లలో, వరి 12 వేల హెక్టార్లలో, మినుములు 10 వేల హెక్టార్లలో సాగు చేస్తారు. వీటితో పాటు టమోట, వంకాయ, బెండకాయ, ఉల్లి పంటలు విస్తృతంగా సాగు చేస్తారు. జిల్లాలో కెసి కెనాల్‌, తుంగభద్ర దిగువ కాల్వ, ఎగువ కాల్వ, తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బిసి, గాజులదిన్నె ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు నదీ పరివాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడం వల్ల కెసి కెనాల్‌లో 150 కిలోమీటర్ల వరకు ఆయకట్టు సాగు కష్టంగా మారింది. ఎల్‌ఎల్‌సి కింద కర్నాటక రాష్ట్రంలో నాన్‌ ఆయకట్టు విపరీతంగా ఉండటంతో జిల్లాలో ఎల్‌ఎల్‌సి ఆయకట్టు క్రమేణా తగ్గిపోతోంది. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు కొంత వరకు నీరు అందుతున్నా కోడుమూరు ప్రాంత రైతులకు అందడం లేదు. ఓ పక్క వర్షాభావ పరిస్థితులు, మరోపక్క సాగు నీటి విధానంలో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో జిల్లా రైతులు ఏటా కరువు బారిన పడుతున్నారు. ఏటా సరైన దిగుబడులు రాక... ఒకవేళ వచ్చిన మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జిల్లాలో కెసి కెనాల్‌, ఎల్‌ఎల్‌సి, హెచ్‌ఎల్‌సి, తెలుగుగంగ, గాజులదిన్నె, గురురాఘవేంద్ర ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉంది. కరువు ప్రాంతాలపై డోన్‌, పత్తికొండ, ఆలూరు, నియోజక వర్గాల్లో సాగునీరు అందించేందుకు చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హంద్రీనీవాకు ఆగస్టు 15 నాటికి నీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ వాగ్ధానాన్ని నిలుపుకోలేకపోయింది. దీంతో అసలు హంద్రీనీవాకు నీళ్లు ఇస్తారా? ఇవ్వరా? అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంద్రీనీవాకు నీరిస్తే కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. జిల్లా నుండి ఉల్లి, టమోట పంటలను ఇక్కడి నుండి హైదరాబాద్‌, కలకత్తా, చెన్నై వంటి నగరాలకు ఎగుమతి చేస్తారు. ఉల్లి మార్కెట్‌లోకి ఎక్కువగా వచ్చినప్పుడు కొనుగోలు చేసి, నిల్వ చేసేందుకు గోడౌన్ల వసతి లేక రైతులు నష్ట పోతున్నారు. టమోట రైతుదీ అదే పరిస్థితి. టమోటాను చెన్నై, తాడేపల్లిగూడెం, విజయవాడ, హైదరాబాద్‌, గుంటూరు, వరంగల్‌ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. టమోట దిగుబడులు అధికంగా ఉన్నప్పుడు మార్కెట్‌లోకి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ఆదుకునేందుకు ఆస్పరిలో జ్యూస్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తామని పాలకులు ఎన్నికల సందర్భంగా వాగ్ధానం చేస్తున్నా అమలుకు నోచడం లేదు. జిల్లాలో కెసి కెనాల్‌ కింద పండించే సోనామసూరి రకం బియ్యానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది.

కామెంట్‌లు లేవు: