22, నవంబర్ 2010, సోమవారం

ప్రయివేటు పరం కానున్న జాతీయ ప్రసార సాధనాలు

భారతీయ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, జానపదాన్ని, కళలను, రైతులకు వ్యవసాయ రంగంపై సూచనలను, ఆరోగ్య సూత్రాలను సామాన్య ప్రజలకు ఏలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ప్రసారం చేస్తూ ప్రసార విప్లవానికి ప్రతీకలైన ప్రభుత్వ ఆకాశవాణి, దూరదర్శన్‌ ఛానల్స్‌ నేడు ఆపదలో చిక్కుకున్నాయి. నష్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ఛానల్స్‌ను ప్రైవేటుపరం చేయనుంది. ఈ నెల 25 న రెండు ఛానల్స్‌ ఆస్తులను అతి తక్కువ ధరకు కార్పొరేట్‌ మాఫియాకు అప్పగించేందుకు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు అమలైతే భారతమాత ముద్దుబిడ్డ ప్రసార కేంద్రం దూరదర్శన్‌, ఆకాశవాణి స్వరం, రాగం మారిపోనున్నాయి. దూరదర్శన్‌ ఏర్పడినప్పటి నుండి దాదాపు 25 ఏళ్లుగా ఉచిత ప్రసారాలు చేస్తూ పేద ప్రజల హృదయంలో చెరగని స్థానం సంపాదించింది. ఢిల్లీ, హైద్రాబాద్‌ నుండి విడుదలైన ప్రసారాలను శాటిలైట్‌ ద్వారా తీసుకుని రిలే కేంద్రం నుండి 100 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు ప్రసారాలను అందిస్తోంది. కార్పొరేట్‌ మాఫియా కన్ను ఇక జాతీయ ప్రసార సాధనాలైన ఆకాశవాణి, దూరదర్శన్‌లపై పడింది. ఈ నెల 25న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న ప్రసార భారతి సవరణ బిల్లును మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా రిలే కేంద్రం ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 14 నుండి 25 వరకు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, వెల్దండ, కోస్గి, గద్వాల, జడ్చర్ల, మాడ్గుల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తిలలో పది దూరదర్శన్‌ రిలే కేంద్రాలు నడుస్తున్నాయి. ఒక్కో రిలే కేంద్రంలో 12 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, హైద్రాబాద్‌ నుండి విడుదలైన ప్రసారాలను శాటిలైట్‌ ద్వారా తీసుకుని ఆయా కేంద్రం పరిసర గ్రామాలకు ఉచితంగా ప్రసారాలను అందిస్తారు. ప్రైవేటు ఛానల్స్‌ సంచలనం కోసం పాకులాడుతూ విలువలను మరచిపోయి ప్రవర్తిస్తున్నాయి. కుటుంబ సమేతంగా చూడలేని ప్రసారాలను ప్రైవేటు ఛానల్స్‌ ప్రసారం చేస్తున్నాయి. ఈ దిశలో మళ్లీ నెలనెలా వందల రూపాయలు ఫీజుల రూపంలో ఏజెంట్లు వసూలు చేస్తున్నారు. కానీ దూరదర్శన్‌ ఛానల్‌లో ప్రసారాలను కుటుంబ సమేతంగా వినోదాన్ని తిలకించవచ్చు. అలాంటిది ప్రైవేటు పరమైతే జర్నలిజం విలువలు, సామాజిక చైతన్యం మంటగలిసిపోతాయి. నిరుపేదలు వీక్షించే దూరదర్శన్‌ ఛానల్‌ ప్రసారాలు వింతపోకడల రూపంలో వస్తాయి. ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆదరించిన ఆకాశవాణి, దూరదర్శన్‌లను చీదరించుకునేలా పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో ఏలాంటి సందేహం లేదు. కేవలం మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కొన్ని లక్షల కోట్ల విలువ గల ఆకాశవాణి, దూరద్శన్‌ ఆస్తులను అతి తక్కువ ధరలకు అమ్మకానికి కేంద్రం అంగటి సరుకుగా మారుస్తోంది. దక్కించుకునేందుకు కేంద్ర మంత్రులతో పలువురు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. దీన్ని బతికించడానికి ఆకాశవాణి, దూరదర్శన్‌ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వంతో పోటీ పడుతున్నారు. రెండు ఛానల్స్‌ను ఆదరించిన ప్రేక్షకులు ప్రైవేటు పరాన్ని వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో పల్లెలు, చెంచు పెంటలు, ఏజెన్సీ గ్రామాలు అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో ప్రసారాలు, సమాచారం, వినోదం అందకపోయేది. ప్రసార శాఖా మాత్యులు ఎస్‌.జైపాల్‌రెడ్డి దూరదర్శన్‌ రిలే కేంద్రం(లోవర్‌ టీవి ట్రాన్స్‌మీటర్‌)ను ప్రారంభించారు. 1990 నుండి ఎలక్ట్రానిక్‌ ఛానల్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మొదటగా టీవీలో ప్రసారాలు విడుదల చేసి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించింది మాత్రం దూరదర్శన్‌ ఛానలే. ప్రస్తుతం ప్రైవేటు ఛానల్స్‌ పోటీపడుతున్న తరుణంలో దూరదర్శన్‌ను ఆదరిస్తున్నారు. ఒక్కొక్క రిలే కేంద్రంలో అసిస్టెంట్‌ ఇంజనీయర్‌(ఎఇ) ఎస్‌సిఎ, ఈఎ, సీనియర్‌ టెక్నీషియన్‌, ఇద్దరు టెక్నీషియన్లు, హెల్పరు ఉంటారు.
నష్టం పేరుతో ప్రైవేటుపరం అన్యాయం
కేవలం మూడువేల కోట్లు ఖర్చు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. అలాంటిది నష్టం పేరిట దూరదర్శన్‌ను కార్పొరేట్‌కు అప్పగించడం అన్యాయం. దేశ సంస్కృతిని, పవిత్రతను, జానపదాలను ప్రచారం చేస్తూ జాతి భద్రతను ప్రజలకు తెలియజేస్తూ జీవం పోసేది దూరదర్శన్‌ ఛానల్‌. ప్రభుత్వం ఖర్చు భరిస్తూ ఆదుకోవాల్సి ఉంది.
- కర్నాకర్‌, టెక్నీషియన్‌, అచ్చంపేట
జర్నలిజం విలువలు పడిపోతాయి
ప్రస్తుతం మీడియా విపరీతంగా విస్తరించింది. ప్రైవేటు ఛానల్స్‌ ప్రసారాలను కుటుంబమంతా కలిసి చూడలేకపోతున్నారు. కానీ దూరదర్శన్‌ ఛానల్‌ ఎన్నో ఏళ్లుగా అశ్లీలచిత్రాలు లేకుండా, భారతీయ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఉండేది. ప్రైవేటుపరమైతే జర్నలిజం విలువలు మరింతగా దిగజారుతాయి.

3 కామెంట్‌లు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

దరిద్రం వదిలిపోయింది.....విలువలు పడిపోవాలండీ...ఇంకా పడిపోవాలి....నాశనమైపోవాలి....అప్పుడే విలువకు శిలువేసి వలువ కప్పిన వాళ్లమవుతాం.....ఆదిమానవ రూపమెత్తుతాం...వికసిస్తాం....ప్రజ్వలిస్తాం....నాశనమవుతాం....జీవన చక్రం....!

panuganti చెప్పారు...

మీ ఆవేశం నాకు అర్తమయింది. కాని ప్రయివేటు అయితే నష్టం కదా.

సుజాత వేల్పూరి చెప్పారు...

కానివ్వండి! ఎప్పటికో ఒకప్పటికి జనాలకు ఈ నిరంతర వార్తా స్రవంతుల పట్ల అశ్లీల దృశ్యాల అనంత మాలికల పట్ల విరక్తి పుట్టకా మానదు, తిరగబడకా మానరు! పెరుగుట విరుగుట కొరకే!