23, నవంబర్ 2010, మంగళవారం

పర్యాటకులను అబ్బుర పరిచే బెలుం గుహలు

పర్యాటకులను అబ్బుర పరిచే బెలుం గుహలకు చూసేందుకు రోజుకు 400 నుండి 500 మంది దాకా వస్తుంటారు. సెలవురోజుల్లో ఎక్కువగా వస్తుంటారు. ఇటీవల మాకార్యాలయం సిబ్బందితో విహార యాత్రకు వెళ్లాం. అందులో మాకుటుంబసభ్యులు కూడా ఉన్నారు. భూమి పై భాగంలో గుహల దగ్గరకు రాగానే ద్యానంలో ఉన్న 50 అడుగుల బుద్దుని విగ్రహం కనబడింది. బుక్కింకు ఆఫీసు క్యాంటీన్‌ వగైరాలున్నాయి. గుహలోకి వెళ్లగానే మొదట సింహద్వారం, ద్యాన మందిరం దాటిన తరువాత ఒక మహిళను ఎత్తుకుని మాకు ఎదురుగా వస్తున్నారు. ఆమెకు దాదాపు 30 ఏడ్లుంటాయి. ఏంటని అడిగితే ఉదయం టిఫిన్‌ చేయలేదు. ఆమెకు కొంత నీరసంగా ఉందని చెప్పారు. ఆపరిస్థితి చూడగానే కొందరు గుహలలోకి రాకుండా వెనుదిరిగారు. నాక్కూడా వెనక్కి వెళ్లాలనిపించింది. అప్పటికీ మాతో వచ్చిన గైడ్‌ చెబుతూనే ఉన్నాడు. ఏమి కాదు చివరిదాకా ఎలాంటి బ్రీతింగు సమస్య రాదు నేనున్నానుగా నాతో రండని...అయినా కొందరు భయపడ్డారు. మాసిబ్బందిలో కూడా కొందరు వెనుదిరిగారు. లోపలికి వెళ్లేకొద్దీ చెమటలు పడుతున్నాయి. మధ్యమధ్యలో వెంటిలేటర్ల ద్వారా గాలి వస్తుంది. అక్కడ అందరూ గుమిగూడుతారు. గైడ్‌ చెప్పేవి సక్రమంగా వినడం లేదు. వేయిపడగలు...మండపం.. .మర్రిఊడలు... .దాటాం... అక్కడ మాపెద్దబ్బాయి గౌతమ్‌ డాడి మర్రి ఊడలు ఉన్న దారిలో లోపలికి వెళ్ధాం అంటాడు. అక్కడ ఎవ్వరూ వెళ్లడం లేదురా అందరూ వెళ్లే దారిలో వెళ్ధామని చెప్పాను. మా మూడో అబ్బాయి చంటి ఏడుస్తున్నాడు. చెమటలు పడుతుంటే కొంత భయపడి నట్లున్నాడు. నేను భుజానికొత్తకుని ఏమి కాదని సమాదాన పరిచాను.. కొందరు చంటి బిడ్డలను కూడా వెంటతెచ్చుకున్నారు. హాప్పీగా ఫాలో అవుతున్నారు. ఇలా ఒక్కోటి దాటుకుంటూ లోపలికి వెళ్తున్నాం. మాయా మందిరం...కోటి లింగాలు...చివరగా పాతాళ గంగ....కొన్నిచోట్ల ఒక్కో మనిషి మాత్రమే నడిచే దారుంది. అక్కడ కొంచెం భయమనిపిస్తోంది. గుహలలో రాతి పొరలు కనబడుతాయి. దీనిని చూస్తుంటే భూగర్భ జలం ఎంత అడుగంటి పోయిందో అర్థమవుతుంది. పాతాళ గంగ దాకా వెళ్లాక మా చంటి మరింత భయపడుతున్నాడు.. దీంతో తొందరగా బయటికి వెళ్లాలని పించింది. గైడును అడిగాను షార్టుకట్‌ రూటేదయినా ఉందాని లేదని చెప్పాడు. వచ్చిన దారినే వెళ్లాలని చెప్పాడు. అక్కడ దాహమేసింది. పాతాళగంగలో నీళ్లు తాగవచ్చా అని గైడ్‌ను అడిగాం... అవి బ్యాక్టీరీయా ఎక్కువగా ఉండే నీరు ఏమైనా అవుతుంది. గొంతు పట్టేయడం లేదా మోషన్స్‌ కావచ్చు తప్పదంటే తాగండని చెప్పారు. అక్కడే ఒక అమ్మాయి చేతిలో వాటర్‌ బాటిల్‌ కనిపించింది. అడగ్గానే ఇచ్చింది నేను మాచంటి తాగాం. డాడీ మాకు నీళ్లంటాడు..మా రెండో వాడు ఆదిత్య వాడికి కూడా తాపాను. తిరిగి బయటకు వచ్చే వారందరికీ చెమటలు పట్టాయి. మరోపక్క ఎదురుగా వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. ఆరోజు ఆదివారం కావడం వల్ల ఎక్కువగానే ఉన్నారు. సంహద్వారం దాకా వచ్చాక కూర్చున్నాం. గైడ్‌ను అప్పుడు మరిన్ని వివరాలడిగాను. మనం 120 ఫీట్లు లోతుకు వెళ్లి బయటకు వచ్చాం. అంటే దాదాపు పదంస్తుల భవనం అంత అని ఊహించుకున్నాను. 140 ఫీట్ల లోతుకు ఆక్సిజన్‌ పుష్కలంగా ఉంటుంది. వృద్ధులు కూడా లోపలికి వెళ్లి రావచ్చని గైడ్‌ చెప్పారు. లోబిపి లేదా ఆస్తమా ఉన్న వారు వెళ్లితే కొంత సమస్య అవుతుంది. వారు మాకు ముందే చెబితే ఆక్సీ కేర్‌ పెడుతాం. వారికిఊపిరి తీసుకునే సమస్య రాదన్నాడు. లోపల ఏమైనా అవుతుందేమో అనే ఫీలింగు మనుసులో ఉన్నవాళ్లు భయపడుతారు తప్ప ఎవ్వరికీ ఏమి కాదని చెప్పాడు. సింహద్వారం నుండి పాతాళగంగ వరకు పెట్టిన పేర్లు పర్యాటక శాఖ ఆధీనంలోకి వచ్చాక పెట్టినవే..... మూడు కిలో మీటర్ల భూగర్భ జలం తగ్గిపోయాక సహజంగా గుహలు ఏర్పడ్డాయి. ...అయితే కిలో మీటరున్నర మాత్రమే వెళ్లగలుగుతున్నాం... ఇంకా లోపలికి వెళ్లడానికి దారి బాగలేదు. ఆతరువాత కొంత లోపలికి వెళ్లడానికి దారిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎక్కువగా మనుషుల ద్వారా తయారు చేసినవే ఉన్నాయి. యంత్రాల వినియోగం చాలా తక్కువ. ఇటీవల బెంగుళూరు, జమ్ముకాశ్మీర్‌ , స్విట్జర్‌ లాండు వాళ్లు దీనిపై కొంత పరిశోధన చేస్తున్నారు. ఆక్సిజన్‌ లోపలికి ఎలా వెళ్లేది....టెంపరేచర్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొన్ని పరికరాలను అమర్చారు.
ప్రంపంచలోనే రెండోది బెలుం గుహలు
అండర్‌ గ్రౌండ్‌ కేవ్స్‌ ప్రంపంచంలోనే బెలుం గుహలు రెండోది. స్పెయిన్‌దేశంలో 10 కిమీటర్ల పొడవునా గుహలు ఉన్నాయి. ఆతరువాత ఇక్కడే ఉన్నాయి. మేఘాలయలో కేవ్స్‌ ఉన్నాయి. కాని అవి కొండకు ఉన్నాయి. వైజాగ్‌లో బొర్రాకేవ్స్‌ ఉన్నాయి. అవికూడా కొండకే ఉన్నాయి. భూగర్భంలో సహజంగా ఏర్పడిన మొదటి గుహలు మాత్రం బెలుంలోనే ఉన్నాయి.
భారతీయ సంస్కృతిలో గుహలు దేవతలకు దేవుళ్లకు నివాసమనే నమ్మకం వల్ల అవి పవిత్ర స్థలాలుగా గుర్తించబడ్డాయి. గుహలు కొండ చెరియలలోనూ అడవులలోనూ ఎక్కువగా కన్పిస్తూ ప్రకృతి నిలయాలై విరాజిల్లుతుంటాయి. పురాతన కాలంలో ఈ గుహల్ని ప్రాచీన మానవుడు నివాసాలుగా ఉపయోగించుకున్నాడు. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ గుహల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవల్సిన అవసరం ఎంతయినా ఉంది కదా.......
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం, బెలుం గుహల కథా, కమామి షు ............
ఈ గుహలలో క్రీ.పూ.4500 నాటి మట్టి పాత్రలు వీటిలో దొరకటం విశేషం. జైనమునులు వుండెవారని శంకరాచార్యులు చెప్పారు. 1884లో హె.బి. పూటె అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా వీటి ఉనికిని చాటి, కొంత వరకు కొలిచాడు. 1982-83, 83-84 శీతాకాలాల్లో జర్మనీకి చెందిన గుహాన్వేషకుడు, హెచ్‌.డి.గేబర్‌ ఆయన సహచరులతో ఈ గుహ సొరంగాలను మూడు కిలోమీటర్ల 225 మీటర్లు పరిశోధించి పటాన్ని తయారు చేశారు. 1988 ఆంధ్రప్రదేశ్‌ పురాతత్వ శాఖవారు వీటిని రక్షిత స్థలంగా ప్రకటించి కొన్నేండ్లు కాపలాదారుని కూడా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి వాటి పోషణ భారాన్ని తమ పరిధిలోకి తీసుకొన్నారు. సారంగ మార్గాల గుండా మట్టి దిబ్బలు తొలగించి నాపరాళ్లు పరిచి ఒకటిన్నర (1 1/2) కిలో మీటర్‌ పొడవునా నడక దారి తయారు చేశారు. విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. సొరంగాల చివరి ప్రదేశాలలో గాలిని లోపలకు పంపే పంకాలు ఏర్పాటు చేశారు. ఉపరి తలం నుంచి 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల వరకు ఉన్న ఈ సొరంగాలు (120 ఫీట్లలోతున) కొన్ని చోట్ల విశాలంగానూ కొన్నిచోట్ల యిరుకుగానూ వివిధ ఆకృతులు కలిగిన స్ఫటికాకారం స్టాలెగ్‌ మైట్లు, నీటి మడుగులు, గిజిబిజిగా ఉన్న ప్రక్క సొరంగాలు చూచుటకెంతో యింపై పర్యాటకులనెంతో అకట్టుకొంటున్నాయి. ఈ గుహాన్వేషణలో పాల్గొన్న డానియల్‌ గేబర్‌, ఆయన సహచరులు, వారికి సహకరించిన స్థానికులు రిటైర్డ్‌ ఎస్‌.పి బి.చలపతిరెడ్డి, ఆయన అల్లుడు కీర్తి శేషులు పి.రామసుబ్బారెడ్డి, రిటైర్డ్‌ హైస్కూలు హెడ్‌ మాస్టర్‌, రామస్వామిరెడ్డి, వెంకటరమణ, పద్మనాభయ్య సహకరించారు. ఈ గుహలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలోకి రావడానికి కృషి చేసిన రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్‌.పి ఎం.నారాయణరెడ్డి చిరస్మరణీయులు కృషిచేశారు. నల్లరేగడి నేలలో పంట పొలాల నడుమ సేద్యానికి అనువుగాని 90 సెంట్ల రాతి ప్రదేశంలో చేదురు బావిలాంట మూడు రంధ్రాలు 10 మీటర్ల లోతున ఉన్నాయి. ఒకటి అడుగు పూడి పోయింది. నడుమనున్న దాని గుండా దిగటానికి మెట్లు కట్టారు. అడుగు నుండి నేలకు సమాంతరంగా పొడవైన విశాలమైన సొరంగ మార్గం ఉంది. లోపల కొంత దూరం పోయిన తర్వాత ఇది మూడు భాగాలుగా చీలి పోయింది. ఒకటి ఒకే చిన్న గదికి, ఒకటి మండపం అనే చోటికి, ఒకటి పాతాళ గంగ అనే నీటి మడుగు, కోటి లింగాలు అనే వ్రేలాడేస్ఫటికాకాృతులు గల గదికి దారి తీస్తాయి. విద్యుద్దీప కాంతిలో ఈ సొరంగాల సోయగాలను తిలకిస్తూ పయనిస్తూ ఉంటే వేరే ప్రపంచంలో ఉన్నట్లనిపిస్తుంది. భూగర్భంలో దాగి ఉన్న ఊహాతీతమైన ప్రకృతి ప్రసాదమైన పై చిత్రాలు పోయినంత దూరం కనిపిస్తూ సందర్శకులను మైమరిపిస్తూ ఉంటాయి.
బెలుం గ్రామంలోని చారిత్రాత్మిక బావి
ఊరు చివర, శివాలయం పక్కన, నిటారుదారులు కలిగిన రాతి బావి దర్శనమిస్తుంది. అది దిగుడు బావి ఒకవైపు మెట్లున్నాయి. నిజానికది బావి కాదు. ఒక నిటారు గుహ వర్షాకాలంలో నీరు నిండి ప్రవహిస్తుంది. వేసవిలో నీరు యింకిపోతుంది. కరువు కాలంలో అడుగున పక్కకు గల సొరంగంలో నీరు నిలుస్తుంది. ఇదే గ్రామస్తులందరికీ నీటి వనరు 1946 మొదటిసారి గ్రామ మునసబు బి.మల్లారెడ్డి బావి పటం గీశారు. బెలుం గుహలలో చేరే నీటిని బట్టి చాలా తక్కువ ఎత్తులో గల ఈ బావి నీటి మట్టం ఉంటుంది. 30 కిలో మీటర్లలో ఉన్న పెన్నానది నీటి మట్టం కూడా దీనిపై ప్రభావం చూపుతుందంటారు. ఇది నిండినప్పుడు శివాలయంలోని శివలింగం కింది నుంచి నీరు ఉబికి పారుతుంది. బెలుం గుహలు భూగర్భంలో ఏర్పాటు కావటం ఈ గుహల యొక్క విశిష్టత.
బెలుం గుహలు ఉనికి
బెలుం గ్రామానికి 1 1/2 కి.మీ నైరుతి దిశలో ఉంటుంది. దీనికి 1 1/2 కిలోమీటర్ల దూరంలో తూర్పున బస్సు రోడ్డు ఉంది. ఈ రోడ్డు కర్నూలు-తాడిపత్రి, విజయవాడ-బెంగుళూరు, నంద్యాల, అవుకు (బనగానపల్లె మీదుగా) తాడిపత్రి మార్గాలకు
సందర్శనార్థం సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం గం.5-30 నిమిషముల వరకు
ఛార్జీలు: పెద్దలకు రూ.30/- పిల్లలకు రూ.20/-
బెలుం గుహలు : హరిత అతిథి గృహము డార్మిటరీ బెడ్‌-రూ.40/-
బెలుం గుహలకు గల దూరం:
- తాడిపత్రి నుంచి 30 కి.మీ
- అనంతపూర్‌ నుంచి 80 కి.మీ
- తిరుపతి నుంచి 275 కి.మీ
- హైదరాబాదు నుంచి 320 కి.మీ
- బెంగుళూరు నుంచి 280 కి.మీ
- చెన్నై నుంచి 420 కి.మీ

1 కామెంట్‌:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

బెలుం గుహలను సందర్శించడం నిజంగా ఓ అద్భుత అనుభూతి.చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.