25, నవంబర్ 2010, గురువారం

అగ్రరాజ్యంలో ఆకలి కేకలు

ప్రతి ఆరుగురిలో ఒకరు అన్నార్తులే- బాలల్లో నాలుగో వంతు మంది బాధితులు
ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా ప్రజలకు కూడా ఆకలి బాధ తప్పడం లేదు. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ఏదో ఒక సాకుతో యుద్ధాలకు దిగుతున్న అమెరికాలో అన్నార్తుల సంఖ్య పెరుగుతోందనేది నగ సత్యం. యుద్ధాల కోసం వేల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్న అమెరికా తన ప్రజల ఆకలిని తీర్చడంలో విఫలం కావడం సిగ్గుచేటు. అక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు. దేశంలోని పిల్లల్లో నాలుగింట ఒక వంతు మంది ఆకలి బాధను చవిచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 92.5 కోట్ల మంది లేదా మొత్తం ప్రజల్లో 15 శాతానికి కొంచెం తక్కువగా పౌష్టికాహార లోపంతో ఉన్నారు. దేశం వెలుపల ఆకలిని తొలగించే అమెరికా చర్యలు దేశంలో కంటే ఎక్కువగా విజయవంతం కావడం హాస్యాస్పదమని విశ్లేషకులు చెప్పారు. 2009లో 1.7 కోట్ల మంది బాలలు సహా 4.9 కోట్ల మందికి పైగా అమెరికా ప్రజలు ఏదో ఒక సమయంలో తగినంత ఆహార లేని స్థితిలో ఉన్నట్లు గత వారం అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 2008లో ఆర్థిక సంక్షోభం మూలంగా అమెరికాలో ఆహార అభద్రత ఉన్న కుటుంబాల సంఖ్య పెరిగింది. కానీ అది 2009లో కూడా తగ్గలేదు. ఈ నిరంతర సమస్యను ఎదుర్కొనేందుకు అమెరికా ప్రభుత్వం పోషకాహార సహాయ కార్యక్రమాలు చేపట్టింది. వాటిని సహజంగానే ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో విస్తరించింది. 2008-2009 మధ్య కాలంలో నిరుద్యోగుల సంఖ్య 90 లక్షల నుంచి 1.4 కోట్లకు పెరిగినప్పటికీ ఆహార అభద్రత అంత స్థాయిలో పెరగలేదని ఆహారం, పోషకాహారం, వినియోగదారుల సేవల ఉప మంత్రి కెవిన్‌ కోన్‌కన్నన్‌ చెప్పారు. అయితే ప్రభుత్వం తన దృష్టిని ఫెడరల్‌ రుణాలను తగ్గించడంపై పెట్టడంతో ఈ కార్యక్రమాలు కొంత వెనకపట్టు పట్టాయి. గతంలో ఫుడ్‌ స్టాంప్‌ కార్యక్రమంగా వ్యవహరించిన దాని స్థానంలో అనుబంధ పోషకాహార సహాయ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక ఉద్దీపన నిధుల ద్వారా దాన్ని కొంతమేర విస్తరించింది. అయితే అది ఇప్పుడు కోతలను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు మధ్యతరగతిగా ఉన్నవారు ఇప్పుడు పేదరికం, ఆకలి అంచుకు చేరినట్లు న్యూయార్క్‌ సిటీ ఆకలి వ్యతిరేక సంకీర్ణ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జోయెల్‌ బెర్గ్‌ చెప్పారు. కాగా పాఠశాల భోజన కార్యక్రమాలకు నిధులు సమకూర్చే పిల్లల పోషకాహార చట్టం కాంగ్రెస్‌ పునరామోదం కోసం వేచి ఉంది. సంప్రదాయికంగా పేదలు నివసించే ఆహార ఎడారులుగా పిలవబడే ప్రాంతాల్లో తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు 40 కోట్ల డాలర్లు అవసరమని అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలిపారు. అనేక దశాబ్దాలుగా తగినంతగా ఆహారం లేకుండా జీవిస్తున్న అల్పాదాయ సమూహాలు నేటికీ అక్కడున్నాయి.
అమెరికాలోనే ఆకలిని గురించి అంచనా వేయలేకపోతే ఇక విదేశాల్లోని పరిస్థితిని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 92.5 కోట్ల మంది ప్రజలు ఈ సంవత్సరం నిరంతర ఆకలితో ఉన్నట్లు ఐరాస తెలిపింది. అనేక దశాబ్దాలుగా వ్యవసాయ ఆధారిత అభివృద్ధిని విస్మరించిన ఫలితమే ఈ పరిస్థితి అని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యుఎస్‌ఎఐడి) అడ్మినిస్ట్రేటర్‌ రాజీవ్‌ షా చెప్పారు. 'ఆహార ధరల సంక్షోభం ఒక మేలుకొలుపు. ఇది ఆకలి, పోషకాహార లోపం, ఆహార భద్రతకు సంబంధించి ఒక నూతన ప్రపంచ చర్చను ప్రారంభించింది' అని బ్రెడ్‌ ఫర్‌ ది వరల్డ్‌ సంస్థ డైరెక్టర్‌ అస్మా లతీఫ్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నార్తుల్లో మూడింట రెండు వంతుల మంది కేవలం ఏడు దేశాల్లోనే ఉన్నట్లు ఐరాస తెలిపింది. అయితే పౌష్టికాహార లోపమున్న ప్రాంతాలు అమెరికా సహా అన్ని చోట్లా ఉన్నట్లు పేర్కొంది.

కామెంట్‌లు లేవు: