3, ఏప్రిల్ 2011, ఆదివారం

శ్రీఖర నామ ఉగాది శుభాకాంక్షలు

మనం నిత్యం జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలువులు తదితరాలు మన సంస్కృతిలో భాగం. పండుగలు ఉత్సవాలు అన్నీ మత పరమైనవి కావు. కొన్ని పండుగలు పూర్తిగా మానవుని ఉత్పత్తికి సంబంధించినవి. అంటే వ్యవసాయం, పశుపోషణ వంటి వాటికి సంబంధించి ఉంటాయి. కొన్ని ప్రకృతిపై మానవుడు విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని జరుగుతుంటాయి. కొన్ని పండుగలు మత నమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల పండుగలు, ఉత్సవాలు, జాతరలు వంటి వాటిని మూఢ నమ్మకాలని కొట్టి పారేయలేం. ఉగాది కూడా వ్యవసాయం అధారమైన పండుగ. ఉగాది తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఉగాదిరోజు నుంచి తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి తొలిపండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి, తలంటి స్నానం చేసి, కొత్తబట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభిస్తారు. దేవస్థానానికి వెళ్లి పూజలు చేస్తారు. కొత్త సంవత్సరంలో రాశీఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతుల లాంటివి చేసి సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక పరాఠీలు గుడిపడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మళయాళీలు విషు పేరుతో, సిక్కులు వైశాఖీగానూ, బెంగాలీలు బైశాఖ్‌ గాను జరుపుకుంటారు.
ఉగాది ప్రాముఖ్యం: చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ము తారు. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు ఈజగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయవేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేశాడన్నది పెద్దల భావన. అంతేకాదు వసంత రుతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్తజీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిశషిక్తుడైన దినం కారణంగా ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో కథ ఉంది. ఉగాది , యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగము అనగా ద్వయము లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం (సంవత్సరం) కాగా , ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్ధానికి ప్రతిరూపమైన ఉగాదిగా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొన్నాడు.
సంప్రదాయాలు: ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయసింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం తదితర పంచకృత్య నిర్వహణ చేయాలని వ్రతగంధ నిర్ధేశితం, మామిడాకుల తోరణాలు కట్టడం. తలస్నానం చేయడం. కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం,. పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ, వ్యయాలు, కందాయఫలాలు, రాశిఫలాలు తెలిపే పంచాంగం వినడం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున దేవాలయం వద్ద అంతాచేరి పురోహితుడిని పిలిపిస్తారు. తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది. గ్రహణాలు ఏమయినా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సవంత్సరాలు ప్రభవతో మొదలుపెట్టి అక్షయ నామ సంవత్సరం వరకు గల 60 సంవత్సరాల్లో మానవులు తాము జన్మించిన నామసంవత్సరాన్ని వారి సన్మాంతర సుకృతాలను బట్టి జీవితంలో ఒక్కసారో రెండుసార్లో చూస్తుంటారు. అందువల్లనే జన్మించిన 60 సంవత్సరాలకు తిరిగి ఆనామ సంవత్సరం వచ్చినప్పుడు అది ఒక పర్వదినంగా భావించి షష్టిపూర్తి ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటారు.
చేసే పూజలు: అన్ని పండుగల లాగానే ఉగాది పండుగనాడు ఉదయాన తలస్నానం చేసి కొత్తబట్టలు ధరించి పూజ చేసుకుంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాన దేవుడి పూజ అని ప్రస్తావించలేదు. గనుక ఈ రోజున ఇష్టదేవతాపూజ చేసుకుంటారు. ఆతరువాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడి తింటారు.
ఉగాది పచ్చడి: ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరురుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవంత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కోసం చెరుకు, అరటిపళ్లు, మామిడి కాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం తదితరాలను వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో '' నింబకుసు భక్షణం'' అశోకకళికా ప్రాశనం అని వ్యవహరించే వారు. రుతుమార్పు కారణంగా వచ్చే వాత, కప, పిత్త దోషాలను హరించే ఔషదంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందంటూ ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరపకాయలు, మామిడి చిగుళ్లు, అశోకచిగుళ్లు వేసి చేసేవాళ్లు. ఈపచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.  మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఔషద గుణాన్ని వృక్ష సంరక్షణ అవసరాన్ని ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటి చెబుతుంది. ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్తచింతపండు, లేత మామిడి చిగుళ్లు, ఆశోక వృక్షం చిగుళ్లు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయ ముక్కలు, చెరుకు ముక్కలు చిలకర లాంటివి ఉపయోగించాలి. ఈపచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్టమని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంటుంది. ఈపచ్చడిని కాలిపొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమభక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈపచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పే మాట. అయితే ఒక పూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించడం చైత్రశుక్ల పాడ్యమినుంచి పూర్ణిమ వరకు గాని లేదా కనీసం ఉగాది పండుగనుంచి తొమ్మిది రోజులపాటయినా వసంత నవరాత్రుల వరకయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేస్మాల వల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్లు, వేపపూత, బెల్లం ముక్కలను మాత్రం ఉపయోగించడం కనిపిస్తుంది. పూర్వం లేత వేపచిగుళ్లు ఇంగువ పొంగించి బెల్లం సైందవలవణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లం, పటిక బెల్లంగాని వాము, జిలకర్ర మంచి పసుపు కలిపి నూరేవారు. ఈమిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీకడుపుతో ఉగాదినుంచి తొమ్మిది రోజులుగా పదిహేను రోజులు వీలును బట్టి సేవించాలి. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు. పూర్ణకుంభ లేదా ధర్మకుంభదానాన్ని చేస్తుంటారు. ఈధర్మకుంభ దానం వల్ల సంవత్సరమంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.
ఉగాది ప్రసాదం: ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం, వడపప్పు ఉంటాయి. ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది. వేసవి తాపం తట్టుకోడానికి పానకం లాంటి నీరాహారం తీసుకోవాలని గుర్తు చేస్తుంది. వడపప్పులో వాడే పెసర పప్పు చలవ చేస్తుందని, వేసవిలో కలిగే అవస్థలను తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ రుతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో ఇమిడి ఉంది. ఉగాదికి విసనకర్రలను పంచే ఆచారం ఉంది. ప్రస్తుత కాలంలో ఉన్న పంఖా, ఏసీ, ఏర్‌కూలర్‌ వసతులు లేని కాలంలో వేసవిలో విసనకర్రల ద్వారా గాలి సేద తీర్చుకుంటారు.
పంచాంగ శ్రవణం : పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థం. తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం అనే వాటిని పంచాం గాలు అంటారు. పదిహేను తిథులు, ఏడు వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి పంచాంగం అని అంటారు. కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థి తులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతుల వంటివి చేస్తారు. పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. పూర్వ కాలంలో ఆ ఏడాది పంటలు ఎలా పండబోతున్నాయి. ఏరువాక ఎలా సాగాలి లాంటి విషయాలను తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం మార్గంగా ఎంచుకున్నారు. నిత్య వ్యవహారాల కోసం ప్రస్తుతం గ్రిగేరియన్‌ ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ను ఉపయో గిస్తున్నారు. శుభకార్యాలు, పూజలు వంటి వాటికి మాత్రం పంచాంగాన్ని వాడుకుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమలులోకి వచ్చి మళ్లీ ఉగాది వచ్చే వరకు అమలులో ఉంటుంది. పంచాంగాన్ని ఉగాది నాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబు తున్నాయి. గ్రామాలు మొదలు కొని పెద్ద నగరాల్లో చేస్తారు. పూర్వ కాలం లో పంచాంగాలు అందరికి అందుబాటులో ఉండేవి కావు. తాటాకుల మీద రాయబడేవి కనుక పండితుల వద్ద మాత్రమే ఉండేవి. ఉగాది రోజు ఊరంతటికి పంచాంగ శ్రవణం వినిపించేవారు. పంచాంగ శ్రవణంలో సంవత్సర ఫలితాలను వివరిస్తారు. నవ నాయకులను తెలుసుకుని వారి ద్వారా ఫలాలను అంచానా వేస్తారు. సంవత్సరంలో ఏఏ గ్రహాలకు ఏఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. వీరికి లభించే అధికారాన్ని బట్టి సంవత్సరం ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తారు.

5 కామెంట్‌లు:

SRRao చెప్పారు...

మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

- శి. రా. రావు
ఉగాది ఊసులు
http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html

sunnitham చెప్పారు...

చంద్రయ్య గారికి శ్రీఖర నామ ఉగాది శుభాకాంక్షలు" దీక్షిత ఫోటో బాగుంది... మీరు కొత్త పోస్ట్లు రాయండి..

VENKATA SUBA RAO KAVURI చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు

VENKATA SUBA RAO KAVURI చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు

panuganti చెప్పారు...

SRRao gariki, SUNNITHAM gariki, VENKATA SUBBARAO KVOORIGARIKI Dhanyavadalu.letuga spandinchinanduku kshaminchali.