17, అక్టోబర్ 2011, సోమవారం

యాతమేసి తోడినా చేను తడవదు

30 ఏళ్లు వెనక్కి పోయిన సాగు
మిగిలింది కష్టాలు... కన్నీళ్లు
మహబూబ్‌నగర్‌ రైతుల వలసబాట
         ''యాతమేసి తోడినా... ఏరు ఎండదు. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు...'' అని ఓ కవి అన్నాడు. కానీ కరువు ప్రాంత రైతులను కదిపితే 'యాతమేసి తోడినా చేను తడవదు.. మోటరేసి తోడాలంటే కరెంటు వుండదు' అని కంటతడి పెడుతున్నారు. నేడు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులెన్నో. కానీ పాలకులు అమలు చేస్తున్న విధానాల ఫలితంగా రైతన్నలు కష్టాల కడలిలోకి నెట్టబడుతున్నారు. యాతం (గూడ)తో నీళ్ళుతోడి సాగుచేసిన 30ఏళ్ళనాటి వ్యవసాయ పద్ధతులనే పాటించాల్సిన దుస్థితి దాపురించింది. మామూలుగానే మహబూబ్‌నగర్‌ జిల్లాలో వర్షాభావం అధికం. నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు చిటికెలో పూర్తి చేస్తాం... ఇక అంతా పచ్చదనమే... పాడిపంటలకు కొదువలేదు అని చెప్పిన మహానుభావులెందరో... కానీ ఆచరణలో రైతులను పట్టించుకునే ప్రజాప్రతినిధి ఒక్కరంటే ఒక్కరూ లేక వరుస కష్టాలతో చితికిన రైతు పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు. పంట పొలానికి నీరు పెట్టలేకపోతున్నానని కుమిలిపోతున్నాడు. కరువు పరిస్థితి పరిశీలన నిమిత్తం వెళ్ళిన 'ప్రజాశక్తి' ప్ర్రతినిధి ముందు కన్నీటి పర్యంతమయ్యాడు.
          అది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొందుర్గు మండలం చేగిరెడ్డిగనపురం గ్రామం. వెయ్యి ఎకరాలకు పైగా సాగుభూమి వుంది. బావులు, బోర్ల కింద 200 ఎకరాల్లో వరి సాగు చేశారు. 50శాతం పైగా వరిపైర్లు ఎండిపోయాయి. వేరుశనగ, మొక్కజొన్న తదితర మెట్టపంటలు 90శాతం ఎండిపోయాయి. ఏ రైతును కదిలించినా వ్యవసాయం దండగ... గ్రామంలో పనుల్లేవు... ఎటయినా వలసలు పోతామని అంటున్నారు. చెగిరెడ్డి గనపురం గ్రామంలోని నాలుగు గిరిజనతండాల్లో చాలా ఇళ్లకు తాళాలు వేసి వున్నారు... అటుగా వెళుతున్న వారిని 'వీరంతా ఎటువెళ్ళారు?' అని అడిగితే... 'వలసలు పోయిన్రన్నా...' అని బదులు చెప్పారు. ఈ తండాల్లో 100కు పైగా గిరిజన కుటుంబాలుంటే ప్రస్తుతం 40 కుటుంబాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో 'ప్రజాశక్తి' ప్రతినిధి బృందం ఇదే గ్రామాన్ని పూర్తిగా సందర్శించి రైతులను పరామర్శించింది. 'భూమికి నీరు పారించని బతుకెందుకు?' అని రైతు కావాలి చంద్రయ్య కన్నీరు మున్నీరయ్యాడు. ఎకరాకు 12 వేల రూపాయల దాకా ఖర్చుచేసి ఆరు ఎకరాల్లో వరి నాట్లేశాం. మూడురూపాయల వడ్డీకి సావుకారి వద్ద అప్పుతెచ్చినం. పాత అప్పులే తీరలేదు. మళ్లీ అప్పుఅయ్యింది. బాగా పంట చేతికొచ్చి... ఎకరాకు 30 బస్తాలు పండితే, రూ.15 వేలైనా చేతికొచ్చేవి. ఇంతకష్టపడితే ఐదుబస్తాలైనా వస్తుందో లేదో నమ్మకం లేదు. పైభాగాన కుంటలో నీళ్లుండయి... అందుకే బావిలో నీళ్లున్నరు...ఈ నీళ్లు ఎన్నిరోజులు వస్తయో తెల్వదు. కుంటెండితే బాయిలో నీళ్లు తగ్గి కిందికి పోతరు... ఐదుగురం అన్నదమ్ములం భాగాలు పంచుకున్నం. ఒకొక్కరికి ఎకరం పైగా భూమిలో వరిసాగు చేశాం. వేరే మార్గం లేక మానాయిన సెప్పిండని ఇట్ల గూడేసి నీళ్లుతోడుతుండం. ఇట్లా గూడతో నీళ్లు ఎత్తిపోసేది మాతండ్రి వయస్సులో ఉన్నప్పుడు ఉండేదంట. మాకు కొత్తేకాని ఏంజేయాలె. రెండ్రోజులు గూడేసి నీళ్లుతోడితే కాళ్లుచేతులు నొప్పులయినరు. నిన్న చిన్న వానవడింది. కొంతమేలు. లేకుంటే చేను గీమాత్రం కనిపించేదా..? మాకష్టాలు ఎన్నడు తీరుతయో. మాకు ఎనిమిది మంది ఆడబిడ్డలు... కొడుకు కోసం చూస్తే అందరూ ఆడొళ్లే పుట్టిండ్రు. ఇద్దరి పెండ్లి చేసినం... ఇంకా ఇద్దరు పెండ్లికున్నరు. నలుగురు సదువుతున్నరు. కాపుదానం అప్పులు, పిల్లల ఖర్చులు.. మోయ లేకుండయినరు.... ఎవరికి జెప్తే మాకష్టాలు తీరుతరు... పట్టించుకునెటొల్లే లేరు.... బ్యాంకుల్లో అప్పులు పుడ్తల్లేవ్‌.... పాతరు కడితే ఇచ్చెటొల్లేమో... పంటసరిగ్గా పండవ్‌ అప్పుల్తీరవ్‌...' అని వాపోయాడు. చంద్రయ్య తన భార్యతో కలిసి రోజంతా గూడతో నీటిని తోడితే ఒక మడి పారుతుంది. ఆగకుండా వేస్తే మరో సగం మడికి నీరు పారే అవకాశం ఉంది. అన్నదమ్ములు రోజుకొకరు చొప్పున గూడవేసి ఒక్కో మడి ఎండిపోకుండా నీరందిస్తున్నారు. ఇలా కష్టపడి తమ శ్రమశక్తిమీద పంటను కొంతయినా కాపాడుకోవాలనుకుంటున్నారు. కావలి చంద్రయ్యను చూసిన బావుల కింద సాగుచేసే మరో ఇద్దరు గూడ పద్దతిన సాగునీరందిస్తున్నారు. మరి కొందరు రైతులు కూడా ఈ పద్దతికి సిద్దమవుతున్నారు. నీరు పుష్కలంగా ఉంటేనే ఈ పద్దతి సాధ్యమవుతుంది.
            చంద్రయ్య కష్టాలు తెలుసుకునేలోపే 20 మందిదాకా రైతులు వచ్చారు. 'సారు మాగురించి రాసుకోండి. మా చేలన్ని ఎండిపోతున్నరు చంద్రయ్య బాయిలో నీళ్లు పైన ఉన్నరు... ఆయన గూడేసుకుని కొంతయినా తడుపుకుంటున్నడు. మా బాయిలో నీళ్ళు చాలా లోతున్నరు. కరెంటు వస్తేనే మోటర్‌ నడవాలి' అని అదే ఊరికి చెందిన రైతులు ఊరడి కృష్ణయ్య, భీమయ్య, గుండని భీమయ్య, కుక్కల చెన్నయ్య, మాదారపు రాజు, యాదయ్య, వెంకటయ్య, నర్సింహా తదితరులు వారి బాధలు వినిపించారు. ఎవరిని కదిలించినా 'మా వరిచేను ఎండిపోయింది. పశువులకు మేతకూడా కష్టమే. వేరుశనగ, మొక్కజొన్న వందలాది ఎకరాల్లో చేలన్నీ చేతికి రాకుండా పోయాయ'ని వాపోతున్నారు. అప్పులు పెరిగిపోతున్నాయని దిగులు పడుతున్నారు. రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికే వలసలు మొదలయ్యాయి.
             కరువు పరిస్థితికి కరెంటు సమస్య తోడైంది. రాత్రి పగలు నిద్ర లేకుండా పొలం వద్ద కాచుకుని ఉన్నా గంటకు మించి మోటార్లు నడవడం లేదు. దీంతో వరిపొలం ఒక మడి తడిస్తే మళ్లీ కరెంటు వచ్చే వరకు తడారి పోతుంది. తిరిగి అదే మడి పారుతుంది. వరుస కష్టాలతో చితికి పోయిన రైతుకు డీజిల్‌ ఇంజన్లు కొనే స్థోమత లేకుండా పోయింది. కొందరితో డీజిల్‌ ఇంజన్లు ఉన్నా పెరిగిన డీజిల్‌ ధరలను భరించలేకున్నారు. కష్టపడి సాగు చేసిన వరిఫైరు ఎండిపోతుంటే రైతు ఏదో విధంగా సాగునీరందించాలనుకున్నాడు. పాతపద్ధతిని ఎంపిక చేసుకున్నారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా వ్యవసాయంలో మూడు దశాబ్దాల నాటి సాగునీటి పద్దతిని రైతులు ఎంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక యంత్రాలు అనేక కొత్త పద్ధతులకు రైతు స్వస్తిపలికే పరిస్థితి వచ్చింది. 1990 తరువాత రాష్ట్రంలో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానాలు గ్రామీణ వ్యవస్థను ఛిద్రం చేస్తోంది. ఎండిన పంట పొలాలు కళ్లముందు కదలాడుతుంటే... పంటను కాపాడుకునేందుకు నడుంకట్టాడు. మూడు దశాబ్ధాల క్రితం ఉపయోగించిన 'యాతం లేదా గూడ' పద్దతి ద్వారా పొలాలకు రైతులు సాగునీరందిస్తున్నారు. యంత్రాలతో అయ్యే ఖర్చులు భరించలేకున్నామని శ్రమశక్తితో సాగునీరందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు మరిన్ని పాతపద్దతులను అనుసరించే అవకాశాలు కనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు: