7, మార్చి 2012, బుధవారం

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

                   మహిళల హక్కుల కోసం స్త్రీలంతా ఏకమై వందేళ్లక్రితం జరిగిన పోరాటం సాక్షిగా మహిళాదినోత్సవం ప్రంపంచ వ్యాప్తంగా మార్చి 8న జరుపుకోవడం మొదలైంది. 1911 సంవత్సరంలో ఆనాటి మహిళలు రగిల్చిన స్ఫూర్తి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. వందేళ్లక్రితమే మహిళలు పోరాడి అనుకున్నది సాధించారు. నేటిస్త్రీ చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ముందుంది. ఏ రంగంలోనైనా ముందుకు పోగలనని నిరూపించుకుంది. అన్నింటా ధీటుగా సమర్థవంతంగా రాణించి తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. అయినా సమాజంలో సమాన గౌరవాన్ని గుర్తింపును పొందలేక పోతున్నారు. నేటికీ మహిళలపై అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, జరుగుతూనే ఉన్నాయి. యాసిడ్‌ దాడులు, గృహహింస, కట్నపిశాచి, భ్రూణహత్యల పేరిట వారికి అబధ్రత ఎదురవుతూనే ఉంది. స్త్రీని సమాజం ఇప్పటికీ వ్యక్తిత్వం గలదిగా , ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలు గల వ్యక్తిగా గుర్తించడం లేదు. విచిత్రం ఏమిటంటే ... రాజకీయాల్లో , వ్యాపారరంగంలో , ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఇంటా బయట, ఎక్కడైనా ఆమె శక్తి సామర్థ్యాలు గుర్తిస్తున్నట్లే ఉంటుంది. నిజానికది స్త్రీని సమాజం తమకు అనువుగా వినియోగించుకోవడం తప్ప ఆమెకు సమాన హోదా ఇవ్వడం కాదు. ఇన్ని ప్రతి కూల పరిస్థితుల్లోనూ వ్యక్తిగా నిలదొక్కుకోవాలన్న ఆమె ఆకాంక్షను అణచి వేయడానికి జరుగుతున్న యత్నాలు అనేకం. అవేనేడు ఆమెను వెనక్కు పట్టి లాగుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల పేరిట ఆమెను చట్రాల్లో పట్టి బందిస్తున్నాయి. పురుషాధిక్య సమాజంలో ఇంతకుమించిన న్యాయం జరుగుతుందన్న ఆశలు లేవు. మరి పరిష్కారం? అందుకు స్త్రీలే పూనుకోవాలి. వివక్షను సవాలు చేయాలి. తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి. సవాళ్లకు సరయిన రీతిలో సమాధానమివ్వాలి. సాటి మహిళలందరినీ కూడగట్టుకోవాలి. సమస్యలపై సమరశంఖం పూరించాలి. సమైక్య నినాదాన్ని ప్రతిధ్వనింపజేయాలి. సాధికారతను స్వాధీనం చేసుకోవాలి.
ఈ జన్మ ఎంత గొప్పదో...
         స్త్రీగా పుట్టినందుకు ఎంత సంతోషించాలి....ఎంతో గర్వపడాలి. పెద్దలను ఎలా గౌరవించాలో , పిల్లలను ఎలా లాలించాలో , సాటి వారిని ఎలా ప్రేమించాలో తను చేసి నాకు ఎంతో ఆదర్శప్రాయమైంది అమ్మ. గిల్లి గజ్జాలు పెట్టుకున్నా. పరుశమైన మాటనోటి వెంట వచ్చినా అదెంత తప్పో చెప్పి మందలించి మంచి మాట చెప్పింది అమ్మ. అందరితో కలిసి పోతూ నవ్వుతూ బేషిజాలు లేకుండా స్నేహాన్ని పంచి ఇవ్వడం నేర్పింది నాకు అమ్మ. జీవితంలో ఎలా ఉండాలో నేర్పిన అమ్మతనం ఎంత గొప్పదో... ఆడజన్మ ఎంత గొప్పదో....

కామెంట్‌లు లేవు: