22, మార్చి 2012, గురువారం

ఉగాదితో శ్రీశ్రీ అనుబంధం

             ఖరనామ సంవత్సరం తీపి, చేదుల్ని మిగిల్చి నందననామ సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. అచ్చమైన పదహారణాల తెలుగువెలుగుకు చక్కటి నిదర్శనం ఉగాది. తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ నివసిస్తున్నా సంప్రదాయబద్ధంగా తెలుగుదనం ఉట్టిపడేలా జరుపుకోవడం ఆనవాయితీ. మారుతున్న సమాజంలో మార్పు ఎంత అనివార్యమైనా తెలుగు సంవత్సరానికి స్వాగతం పలకడం సహజం. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, మామిడి తోరణాలతో ఉగాదిని స్వాగతిస్తాం. కవి సమ్మేళనాలతో తెలుగుభాషకు పట్టాభిషేకం చేస్తాం. ఇంతటి విశిష్టత ఉన్న ఉగాదిని మహాకవి శ్రీశ్రీ తన కవితల్లో విభిన్న రీతుల్లో సామాజిక స్పృహను జోడించి స్వాగతం పలికారు. ఉగాది నాటి అనుభూతుల్ని అనుభావాలతో కలిపి కొత్త సిరాతో అక్షర విన్యాసం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఉగాది సందర్భంగా ఒక్కోసారి ఒక్కోవిధంగా స్వాగతం పలుకుతూ సామాన్యుడి జీవనానికి దగ్గరగా కవిత్వీకరించారు. శ్రమైక జీవన సౌందర్యానికి సాహిత్య స్థానం ఆయనతోనే సాధ్యమైంది.
''ఈ నూతన సంవత్సరం
నవచేతన సంపత్కరము
యువజీవన శోభావహము
కవితామయ బృందావనము''
అంటూ ఉగాదిని స్వాగతించారు. మానవ జీవితాన్ని మానవీయ విలువలతో కలగలిపి కొత్త టానిక్‌ను తయారుచేసి సమాజానికి అందించారు. రుతువులతో మాట్లాడించడం, తిథులు, నక్షత్రాలతో సాహిత్యాన్ని సృష్టించడం ఆయనకే సొంతం.
''ఇదిగో ఇంకో ఏడాది
ఎవరిదీ ఉగాది?
అడగాలా? ఇది నీదీ నాదీ
మన భావి సుఖాల పునాది''
వంటి సామాజిన స్పృహ కలిగిన గీతాలతో భాషా సాహిత్యాలను ప్రజలకు చేరువ చేయడం ఎవరికి సాధ్యమవుతుంది. శ్రీశ్రీ భాషలోని అంతర్లీన భావాలు, బహిర్గత భావనలు తెలుగు భాషకు జీవం పోశారు.
''ఈ ఉగాది మనకిచ్చేదేది
రోజురోజుకి తెచ్చేదేది
అని వైరాగ్యం ప్రకటిస్తూనే
రోజూ సూర్యున్ని తెస్తుంది''
అంటూ వాసంతిక ఎవరిదీ ఉగాది అనే యుగళ గీతిలో విశ్లేషిస్తారు. సాధారణ కవిగా ఉంటూనే అసాధారణ సాహిత్యాన్ని సృష్టించి ప్రాపంచిక దృక్పథాన్ని ప్రకటించారు. ప్రపంచంలో ఏమూల, ఏ సంఘటన జరిగినా మొదట స్పందించి అక్షర నీరాజనం అందించే మహోన్నత కవి శ్రీశ్రీ.
''ప్రతీక్షణం అనేక మంది పుడుతున్నారు
ప్రతీ దినం అనేక మంది వెడుతున్నారు
గతించినట్టివారి వంతు పావు కాగితం
జనించినట్టి వారి హక్కు గొప్ప స్వాగతం
ఉగాది దేవరా...''
అంటూ ఉగాది దేవర కవితలో విశ్లేషించి వీర వియాత్నం విముక్తి సైన్యాలకు అంకితమిచ్చారు. కష్టజీవికి కేరాఫ్‌ అడ్రస్‌ శ్రీశ్రీ అని ప్రతి సాహితీవేత్త అనడం కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుభాషలో ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా శ్రీశ్రీ పేరు ఉచ్ఛరించకుండా కవితల్ని జ్ఞప్తికి తెచ్చుకోకుండా కార్యక్రమం చేస్తే అది ఉప్పులేని వంటకమే. ఉగాది కవి సమ్మేళాన్ని ఈ కింది విధంగా స్వాగతిస్తారు.
''ఉగాది కవి సమ్మేళన
శుభోదయావసరాన
సౌమ్యనామ వర్షానికి
స్వాగతమగు సమయాన''
అంటూ సౌమ్యవాది మ్యానిఫెస్టో కవితలో చెబుతారు. ఈ కవితలో తిరుగుబాటు, చాదస్తం, మానవ స్వాభవం అన్నీ విశ్లేషిస్తూనే..
''మానవులంతా ఒకటని
మనిషి గ్రహించే సుదినం
ఇంతట్లో వచ్చే సూ
చన లేవి కానరావనే''
ఆవేదన చెందుతారాయన. సహజంగా కవిత్వంలో ఉగాది పచ్చడిని వర్ణిస్తూ చేదు, తీపి, పులుపుల కలయికలను, రుతువులను చెప్పడం జరుగుతుంది. కానీ శ్రీశ్రీ అలా కాదు.
''ఎలాగుంది ఉగాది పచ్చడి అని అంటారా
ఓ భేషుగ్గా ఉంది
పత్రిక పొట్లంలోని పాత సాహిత్యం కన్నా బాగానే ఉంది
కొంచెం తియ్యగా ఉంది
చాలా చేదుగా ఉంది
మొత్తం మీద మన జీవితాల్లాగా ఉందంటారు''
ఈరోజు ప్రాంతీయ ఉద్యమాల పేరుతో తెలుగు ప్రజల్ని, భాషా సాహిత్యాలను వేరు చేసే ప్రయత్నాలు ఆరంభించి రాజకీయ పబ్బం గడుపుకునే రోజులొచ్చాయి. వీటిని ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించారాయన.
''తెలుగు జాతిని శిలువ తీస్తున్న
తెలుగు ఖ్యాతిని నలుపు చేస్తున్న
విశాలాంధ్రను చీల్చచూస్తున్న
పిశాచాలను తరిమి వేస్తున్నా''
అంటూ ఘాటుగా ఉగాది గీతిలో కవితలో గర్జిస్తారు.
ఎన్నో కవితలు రాసి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న శ్రీశ్రీకి తెలుగుపై మమకారం ఉగాది నాడు ఈ విధంగా చూపిస్తారు.
''తెలుగువాడి తెలుగు 'వాడి'
దీపించాలి.
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం
చేరాలంతే
ఈ ఉగాది వేళ నేను కోరేదింతే''
అన్నారు. ఎన్నో అభిప్రాయాలు ఉగాదిపై చెప్పినా ప్రత్యక్షంగా ఉగాది పండుగపై సామాన్యుడికున్న అభిప్రాయం చెప్పేందుకే ప్రయత్నిస్తారు.
''ఎన్ని ఉగాదులు రాలేదు ఇం
కెన్ని ఉగాదులు పోలేదు
ఎక్కడి దొంగలు అక్కడే
ఎక్కడి గొంగళి అక్కడే''
అంటు ఉగాది స్వగతం కవితలో కపట రాజకీయాలను తిడుతూనే ఉగాది గీతంలో
''ఈ ఉగాది మహోదయ వేళ
ఈ వసంత నవోదయ వేళ
విప్లవ శంఖం పూరించుదాం
విజయ దుందుభి మ్రోగించుదాం''
అంటూ ముగిస్తారాయన.
కెంగార మోహన్‌ - సాహితీ స్రవంతి కర్నూలు జిల్లా కార్యదర్శి

4 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఈ ఉగాది రోజున "ఉగాదితో మహాకవి అనుబంధం" గుర్తుచేసుకోవటం ఎంతో బాగుంది...
మీకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు!

Unknown చెప్పారు...

ఈ ఉగాది రోజున "ఉగాదితో మహాకవి అనుబంధం" గుర్తుచేసుకోవటం ఎంతో బాగుంది...
మీకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు !

Afsar చెప్పారు...

ఉగాదినీ శ్రీశ్రీని కలిపి గుర్తు చెయ్యడం బాగుంది.

panuganti చెప్పారు...

చిన్నిఆశ, అఫ్సర్‌ 'ఉగాదితో శ్రీశ్రీ అనుబంధం' ఆర్టికల్‌పై స్పందించినందుకు దన్యవాదాలు
మీకూ ఉగాది శుభాకాంక్షలు.