20, మే 2012, ఆదివారం

ప్రపంచీకరణ దుష్పరిణామాలపై మేల్కొలపాలి

                                              'విన్యాసం' పుస్తకావిష్కరణ సభలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి

        ప్రపంచీకరణ దుష్పరిణామాలపై ప్రజలను మేల్కోలిపేలా తమ రచనల ద్వారా కృషి చేయాలని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి సాహితీవేత్తలను కోరారు. ఆదివారం కర్నూలు ఎంపిపి హాల్‌లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో కెంగార మోహన్‌ రచించిన 'విన్యాసం' పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి, జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ పి. బుచ్చన్న, అథితులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లబాపురం జనార్ధన్‌, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ సామాజిక ప్రయోజనం కోరేది సాహిత్యమని, సాహిత్యం ప్రజలకు చేరువ కావాలంటే విస్తృతంగా సమాజ హితం కోరే రచనలు రావాలని ఆకాక్షించారు. ప్రపంచీకరణలో మనిషి నుంచి మనిషి దూరమయ్యారని పేర్కొన్నారు. నైతిక, మానవతా విలువలు తగ్గిపోయి మనిషి వ్యాపార వస్తువుగా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ జీవితంపై సరళీకరణ ప్రభావం గరిలీకరణగా మారిందన్నారు. దేశం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు పాలకులు చెబుతున్నా మరోపక్క అన్నార్థులు సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శత కోటీశ్వరులు, పెట్టుబడిదారులకు స్వేచ్చ తప్ప కార్మికులకు, రైతులకు, పేదలకు మాత్రం కాదన్నారు. ప్రపంచీకరణ పేరుతో సాగుతున్న ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దురాక్రమణపైన, చొరుబాటు పైనా ఇలాంటి కవితా విన్యాసం చేయడం అవసరమన్నారు. ఈ ప్రాంతంలో ప్రగతిశీల సాహిత్యాన్ని పెంపొందించాలన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్‌ మీద సినిమాలు చూపించి ఇక్కడ ప్రజా బతుకులను దుర్బర జీవితాలను తెరమరుగుపరుస్తున్నారు. హంద్రీనదీ తీరానా కవితా పుష్పాల్లా అనేక మంది కవులు, కళాకారులు వికసించాలని రవి అభిప్రాయపడ్డారు. అనంతరం డిఇఒ డాక్టర్‌ బుచ్చన్న మాట్లాడుతూ విష సంస్కృతి కోరల్లో మన కుటుంబాలు నలిగిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. తల్లి, చెల్లి అక్క, అన్న కూర్చోని వీక్షించలేని కార్యక్రమాలు టివిలో వస్తుంటే, చూడలేని దౌర్భాగ్యమైన స్థితి ఉందన్నారు. సామాజిక కోణాన్ని ఆవిష్కరించిన విన్యాసం కవితా సంపుటి అందరికీ ఆదర్శమన్నారు. పిల్లలు సక్రమమైన మార్గంలో నడిచేందుకు ఉపాధ్యాయులు కవితలను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాబాపురం జనార్ధన మాట్లాడుతూ విన్యాసం కవితా సంపుటిలో మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు, సమకాలిన సంగతులు ప్రత్యక్షంగా కనిపిస్తాయన్నారు. మనిషికి మనిషికి దూరం పెరిగినప్పుడు దగ్గరచేసేది సాహిత్యమన్నారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె. సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సాహిత్య రంగంలో రానించడం అభినందనీయమన్నారు. కవి కెంగార మోహన్‌ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునీకతలో మనిషి మోసపోతున్న తీరు ఈ విన్యాసం కవితా సంపుటిలో ఉన్నాయన్నారు. ఇక ముందు సామాజిక అంశాలపై కవిత్వం రచిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఈ పుస్తకాన్ని తెలకపల్లి నరసింహయ్యకు అంకితమిచ్చారు. అంతకు ముందు తెలకపల్లి రవి పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం కవి కెంగార మోహన్‌ను ఘనంగా పలువురు సన్మానించారు. ప్రంపంచీకరణ నేపథ్యంలో మోహన్‌ రచించిన 'విన్యాసం' కవితా సంపుటి బాగుందని పలువురు అభినందించారు. పలువురు సాహితీ వేత్తలు, సాహిత్యాభిమానులు హాజరయ్యారు.

2 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

బుద్ధదేవ్ భట్టాచార్య విధానాలని ఓపెన్‌గా సమర్థించే తెలకపల్లి రవి గారు నిజంగా ప్రపంచీకరణని వ్యతిరేకిస్తున్నారా? గార్ధభము అండముని ఉత్పత్తి చేయును అంటే నమ్మెదము కానీ తెలకపల్లి రవి ప్రపంచీకరణని వ్యతిరేకించెదడు అంటే నమ్ముటకు మేము పంగనామములు పెట్టుకొనలేదు.

panuganti చెప్పారు...

ప్రవీణ్‌గారు ప్రపంచీకరణ అంటే మీకు తెలిసే ఉంటుంది. కాని తెలకపల్లి రవి గురించి మీకు అవగాహన లేనట్లుంది. చాలా పెద్దపెద్ద పదప్రయోగం చేశారు. తెలకపల్లి రవి మీకు రెగ్యులర్‌గా టీవీఛానల్లోగాని, లేదా ఆయన ఫోన్లోగాని అందుబాటులో ఉంటారు. మాట్లాడండి. మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. తెలుసుకోకుండా ఎదుటివారిమీద కామెంటు చేయవద్దు. బుద్దదేవ్‌బట్టాచార్య అంటే ఎవరో తెలిస్తే ప్రపంచీకరణ అంటే ఏమిటో తెలుస్తుంది. మీకు అదికూడా తెలువదని నేను అనను. మీరు పంగనామాలు పెట్టుకున్నా, అడ్డనామాలు పెట్టుకున్నా నష్టం లేదు. అవగాహన లేకుండా కామెంటు చేస్తేనే నష్టం.