27, మే 2012, ఆదివారం

ఆశావాది ప్రతిభకు అరుదైన గౌరవం

                                      కళారత్నకు కర్నూలు తెలుగు రచయితల సంఘం సన్మానం
                  అవధాన ప్రక్రియలో అత్యంత ప్రతిభావంతుడు డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావుకు కళారత్న అవార్డు రావడం అరుదైన గౌరవమని ఆయన సన్మాన సభలో వక్తలు కొనియాడారు. ఆదివారం కళారత్న డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావుకు కర్నూలు తెలుగు రచయితల సంఘం ఆధ్వర్వంలో సిటీ కేంద్ర గ్రంధాలయంలో ఘనంగా సన్మానించారు. కర్నూలు తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు హీరాలాల్‌ అధ్యక్షతన సన్మాన సభ జరిగింది. ఈసందర్భంగా ప్రముఖ కవి , విమర్శకుడు గొట్టిముక్కుల సుబ్రమణ్యశాస్త్రి మాట్లాడుతూ సంస్కారవంతంగా జీవించిన ప్రముఖుల మాదిరిగా జాషువా, దువ్వూరి రామిరెడ్డి లాంటి కవికోకిల డాక్టర్‌ ఆశావాది అని అన్నారు. 171 అష్టావధానాలు చేసి సభికులను మెప్పించారని చెప్పారు. ఆయనకు కళారత్న, పద్మభూషణ లాంటి అవార్డులు ఎప్పుడో రావల్సిందని అన్నారు. ఇప్పటికైనా ఆశావాదికి కళారత్న అవార్డు రావడం ప్రభుత్వానికే గౌరవమని అన్నారు. డాక్టర్‌ ఎన్‌.శాంతమ్మ మాట్లాడుతూ ప్రతిభ, విత్పత్తి, పరుగుతీసే కైత డాక్టర్‌ ఆశావాది సొంతమని అన్నారు. ధార, ధోరణి, ధైర్యం నిర్భయంతో ఆశావాది అవధానం చేశారని కొనియాడారు. శతావదాని సివి సుబ్బన్న, బోగిసెట్టి జూగప్ప, నండూరి రామకృష్ణమాచార్య శిష్యరికంలో ఆయన పద్యకవిగా, అష్టావధానిగా ఎదిగారని అన్నారు. 2008లో ఆశావాది సాహితీస్వర్ణోత్సవాల సందర్భంగా పెనుకొండలో రెండు రోజులపాటు పది సాహితీ వేదికల్లో వివిధ ప్రక్రియల్లో కార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారని చెప్పారు. అంతేకాకుండా ఆశావాదిని కుంచెంఅశ్వత్తయ్య గండెపిండేరం తొడిగి గొప్ప సన్మానం చేశారని అన్నారు. శాంతమ్మతో ఆశావాదికి ఉన్న సాహితీ పరిచయాన్ని కవిత్వంలో ఆమెను ప్రోత్సహించిన తీరును వివరించారు. సభాధ్యక్షులు హీరాలాల్‌ మాట్లాడుతూ అవదాన శిరోమణి డాక్టర్‌ ఆశావాదికి కళారత్న అవార్డు రావడం సంతోషించదగిన విషమని అన్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో విలువలు భ్రస్టుపట్టిన తరుణంలో విలువలతో కూడి సాహిత్యాన్ని ప్రజలకు అందించే వారు తక్కువని అన్నారు. వారు రచనలతోపాటు నిజజీవితంలో కూడా విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన ప్రముఖుడు డాక్టర్‌ ఆశావాది అని కొనియాడారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 28 అష్టావధానాలు చేశానని చెప్పారు.జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని , జిల్లా ప్రముఖ కవుల విశేషాలను ఈసందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు , సమావేశాలలో పాల్గొని సాహితీ మిత్రులను, శిష్యులను పొందానని స్నేహసంపద చాలా గొప్పదని చెప్పారు. ఆస్నేహాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అన్నారు. సమాజం పట్ల నిరంతర పరిశీలనా కవులకు, రచయితలకు అవసరమని సూచించారు. ఏ కవి పద్యాలు ప్రజల నోళ్లలో మెదులుతాయే అలాంటి వారే ప్రముఖులని చెప్పారు. కళలను గురించి వివరిస్తూ ఏది ధనాపేక్ష లేకుండా ఉండేదే నిజమైన కళ అన్నారు. సన్మాన పత్రాన్ని అధ్యాపకులు వేణుగోపాలశర్మ చదివి వినిపించారు. రిటైర్డ్‌ అధ్యాపకులు కాల్వసంజీవరాయుడు, జానపదకవి గిరిరాజులు, రోశయ్య, శశిధర్‌రావు తదితరులు మాట్లాడారు. గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ కె.జి గంగాధరరెడ్డి, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ప్రత్యేక జ్ఞాపికను అంజేపి సన్మానించారు.

కామెంట్‌లు లేవు: