27, మే 2012, ఆదివారం

వైఎస్‌ జగన్‌ అరెస్టు

             ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కడప ఎంపీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు యెడుగూరి సందింటి జగన్మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి అరెస్టయ్యారు. తండ్రి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమంగా పెద్దయెత్తున ఆస్తులు పోగేసుకున్నారన్న కేసులో మూడు రోజులుగా జగన్‌ను విచారించిన సిబిఐ 2012 మే 26న రాత్రి అరెస్టు చేసింది. ఆయన్ను 27(సోమవారం) సిబిఐ కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. జగన్‌పౖౖె ఐపిసి సెక్షన్లు 120బి (రెడ్‌విత్‌ 420), 409, 420, 477ఎ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1), (సి), (డి) కింద సిబిఐ కేసులు నమోదు చేసింది. అరెస్టుకు నిరసనగా వైకాపా సోమవారం నాడు రాష్ట్రవ్యాపిత బంద్‌కు పిలుపునిచ్చింది. జగన్‌ చేసిన తప్పేమిటంటూ వైకాపా గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, జగన్‌ భార్య భారతి, సోదరి శర్మిలా దిల్‌కుశ అతిథిగృహం ఎదుట ధర్నాకి దిగారు. వారిని అక్కడి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్‌పాండ్‌ వారి నివాసానికి తరలించారు. హైదరాబాద్‌ నగరంతో సహా రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. కేసు దర్యాప్తులో ఉన్నందున దీనిపై మాట్లాడేదేమీ లేదంటూ కాంగ్రెస్‌ ప్రతినిధి మనీష్‌ తివారీ దాటవేశారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం కుమ్మక్కైన ఫలితమే జగన్‌ అరెస్టని వైకాపా ఆరోపించింది. అరెస్టు చేస్తే చాలదు ఆయన అక్రమంగా ఆర్జించిన మొత్తం సొత్తును స్వాధీన పరచుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. జగన్‌ను అరెస్టు చేసిన సిబిఐ వివాదాస్పద జీవోల జారీకి బాధ్యులైన మంత్రులను కూడా విచారించి అరెస్టు చేయాలని, తద్వారా సిబిఐ తన నిష్పాక్షికతను నిరూపించు కోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు వ్యాఖ్యా నించారు. ఇదీ హర్షించదగిన పరిణామమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
           వైఎస్‌ జగన్‌పై నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకం (క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌), ఖాతాలను తప్పుగా నిర్వహించడం, నేరపూరిత ప్రవర్తన తదితర సెక్షన్ల కింద సిబిఐ కేసులు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. వీటి ప్రకారం నేరాలు రుజువైతే గరిష్టంగా పది సంవత్సరాల నుంచి యావజ్జీవం వరకూ జైలు శిక్షపడే అవకాశం ఉంది.
                                                               సెక్షన్‌ దేనికోసం శిక్ష
ఐపిసి 120 (బి) నేరపూరిత కుట్ర
420 మోసం ఏడేళ్లు
409 విశ్వాస ఘాతుకం యావజ్జీవం
(క్రిమినల్‌ బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌) లేదా పదేళ్లు
477 (ఎ) ఖాతాలను తప్పుగా నిర్వహించడం ఏడేళ్లు
(ఫాల్సిఫికేషన్‌ ఆఫ్‌ అక్కౌంట్స్‌)
                        అవినీతి నిరోధకచట్టం
13(1) ప్రజాప్రతినిధి నేరపూరిత స్వభావంతో వ్యవహరించడం
13(1సి) ప్రజాప్రతినిధిగా సంక్రమించిన కార్యాలయాన్ని,
ఆస్తులను దుర్వినియోగపరచడం
13(డి) (1) తనకు గాని ఇతరులకు గాని చట్టవ్యతిరేక
పద్ధతులు లేదా అవినీతికి పాల్పడి ఆర్థిక లాభాలను,
విలువైన వస్తువులు పొందడం.
(2) తన పదవిని దుర్వినియోగపరిచి ఆర్థిక లాభాలు పొందడం
(3) పదవిలో ఉండగానే ఎటువంటి ప్రజాప్రయోజనం
లేకుండా ఆర్థిక లాభాలు పొందడం
13(2) కనిష్టంగా ఒక ఏడాది నుండి గరిష్టంగా ఏడేళ్ల వరకు

కామెంట్‌లు లేవు: