1, ఆగస్టు 2014, శుక్రవారం

కార్మిక భద్రతపై కేంద్రం దాడి

                            పోలవరం వ్యవసాయం కోసం కాదు
            వరంగల్‌ జాతీయ సెమినార్‌లో పాలగుమ్మి సాయినాధ్‌

        కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్మికుల చట్టాల్లో సవరణలు తేవడం మొదటి ఎజెండాగా పెట్టుకున్నట్లుగా ఉందని సీనియర్‌ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్‌ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఎనిమిదో మహాసభల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌లో 2014 ఆగస్టు ఒకటిన శుక్రవారం సెమినార్లు ఏర్పాటు చేశారు. ‘సరళీకరణ విధానాలు ` గ్రామీణ పేదల స్థితిగతులు’ అంశంపై సాయినాధ్‌, ప్రొఫెసర్‌ షీలా భల్లా మాట్లాడారు. సెమినార్‌లో సాయినాధ్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యవసాయ అవసరాల కోసం కాదన్నారు. బహుళ జాతి సంస్థల కోసమేనని స్పష్టం చేశారు. అక్కడ సెజ్‌లు వెలుస్తాయన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పనిదినాలు పెరగవని చెప్పారు. ఉపాధి హామీకి కేవలం రూ.34 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. కార్పొరేట్‌ శక్తులకు రూ.71 వేల కోట్ల పన్ను మాఫీ చేశారని వివరించారు. రూ.2 లక్షల కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చారని చెప్పారు. దీనిలో రూ.48 వేల కోట్లు బంగారం, డైమండ్స్‌ దిగుమతులపై సబ్సిడీ ఉందన్నారు. ఇటువంటి చర్యల వల్ల లోటు బడ్జెట్‌ కనిపిస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయింపు పెంచాలంటే డబ్బులేవంటున్నారని విమర్శించారు. గడచిన మూడేళ్లలో బహుళ జాతి సంస్థల యజమానులకు ఇచ్చిన రాయితీ సొమ్ముతో దేశంలో వందేళ్లపాటు ఉపాధి హామీ చట్టం అమలు చేయవచ్చని చెప్పారు. అందరికీ పని కల్పించవచ్చన్నారు. ఆహారభద్రత చట్టం అమలుకు డబ్బుల్లేవని కేంద్రం చెబుతోంద న్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో నీటి లభ్యత లేదని, అక్కడ కరువు ప్రకటించారని చెప్పారు. సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదన్నారు. గ్రామాల నుండి ముంబాయికి వలస వచ్చిన వారిని కలిశామన్నారు. వారు ముంబాయిలో 37 అంతస్తుల భవన నిర్మాణంలో పని చేస్తున్నారని తెలిపారు. ఒక్కో అంతస్తులో ఒక్కో స్విమ్మింగ్‌ పూల్‌ ఉందన్నారు. నీరు ఎక్కడ నుండి వచ్చిందన్నారు. ఈ నీటిని వ్యవసాయానికి మళ్లిస్తే గ్రామీణ ప్రాంతానికి ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
                                              శాశ్వత ఉపాధి కరువు : ప్రొఫెసర్‌ శీలా భల్లా
            గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధి కరువైందని ప్రొఫెసర్‌ శీలా భల్లా తెలిపారు. ‘సరళీకృత విధానాలు ` గ్రామీణ స్థితిగతులు’ అంశంపై సెమినార్‌లో ఆమె ప్రసంగించారు. 15 ఏళ్లలో వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు వినియోగం పెరిగిందని చెప్పారు. ఆ రంగంలోనూ ఆశించినంతగా ఉపాధి పెరగలేదని తెలిపారు. నూతన ఆర్థిక విధానాల ప్రారంభం అనంతరం ఇటువంటి పరిస్థితి తీవ్రమైందన్నారు. ముఖ్యంగా యువత ఉపాధికి దూరం కావడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. భారీగా అసమానతలు పెరిగాయని చెప్పారు. వలసలు ఎక్కువయ్యాయని వివరించారు. ఇటువంటి పరిస్థితి మారాలంటే పెట్టుబడిదారులకు, కార్మికులకు మధ్య ఉన్న అంతరాలు పోవాలని ఆకాంక్షించారు.

కామెంట్‌లు లేవు: