23, మార్చి 2015, సోమవారం

మా భూమి సినిమాకు 35 ఏళ్లు


          సూర్యుడు నడినెత్తిమీదికొచ్చాడు. మగాళ్లు ఎడ్లకు నాగళ్లు కట్టి దున్నుతున్నారు. ఆడాళ్లు నాట్లు వేస్తున్నారు. పెత్తందారు చూస్తున్నాడు. ఇంతలో పసిబిడ్డ ఏడుపు వినిపించింది. గుడ్డ ఉయ్యాలలో పడుకోబెట్టిన బిడ్డ గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. తల్లడిల్లిన కన్నతల్లి పని ఆపి పరుగున వచ్చింది. ‘అయ్యా! బిడ్డ ఆకలికి ఏడుస్తున్నడు. జరంత పాలిచ్చి వస్తా’ చేతులు కట్టుకుని దీనంగా అడిగింది. ‘నోర్మూయవే దొంగముండా! పని ఎగ్గొట్టడానికి ఇదోటా..ఏదీ నీకు పాలొస్తున్నాయా.. చూపించు’ అన్నాడు దుర్మార్గుడు. అక్కడున్న వాళ్లంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఆ తల్లి తన బిడ్డ కోసం అభిమానాన్ని చంపుకుంది..సిగ్గును వదిలేసింది. తన స్తన్యాన్ని పిండి పాలు చూపించింది. ఆ దొర మనిషి తుపుక్కున ఉమ్మాడు. ‘సరే పో, ఆ ఉమ్మి ఆరేలోపు రావాలా’ అన్నాడు.
               ఈ ఒక్క సన్నివేశం చాలు.. తెలంగాణలో దొరల దాష్టీకం ఎంత దారుణంగా ఉండేదో తెలుసుకోవడానికి. వెట్టిచాకిరీ ఎంత దయనీయమో అర్ధం కావడానికి. ఈ ఒక్క ఉదంతం చాలు ఆవేశంతో నరాలు ఉప్పొంగడానికి, పిడికిళ్లు బిగించడానికి. ఈ చరిత్రను ప్రపంచానికి తెలియచేసింది ‘మా భూమి’ చిత్రం. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 35 ఏళ్లయింది. తెలంగాణలో వెట్టిబతుకులు, దొరల దుర్మార్గం, నిజాం పైశాచికత్వం గురించి ఆ కాలంలో జీవించినవారికి తెలిసినా, తర్వాతి తరానికి తెలియచేసింది మా భూమి చిత్రమే. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో వస్తవ్‌ కొడకో నైజాము సర్కరోడా’ అంటూ బండి యాదగిరి రాసిన పాటను నేటి తెలంగాణ బిడ్డలు పాడుకునేలా చేసిందీ మా భూమి సినిమా. వెట్టిచాకిరీ చేసే ఓ జీతగాని పిల్లగాడు కూడా జీతగాడిగానే బతకాల అంటూ ప్రధాన పాత్ర రామయ్యకు తండ్రి చెప్పే మాటలు నాటి వెట్టి బతుకుల దౌర్భాగ్యాన్ని తెలియచేస్తాయి.
             దొరలు, నిజాం నియమించిన తహశీల్దార్లు ప్రజల రక్తాన్ని పన్నుల పేరుతో పీల్చేసేవారు. అప్పులున్నట్లు దొంగ కాగితాలు రాయించి భూములు లాక్కునే దొరలు.. వడ్డీ కింద వెట్టిచాకిరీ చేయించుకునేవారు. తరతరాలుగా వారి కుటుంబాల్లోనివారు జీతగాళ్లుగా మగ్గిపోయేవారు. ఇవన్నీ చాలక దొర విందు విలాసాలకు కూడా బలిపశువులయ్యేవారు. నచ్చిన ఏ ఆడది అయినా పిలిస్తే దొర గడీకి పోవాల్సిందే. అలాంటి ఓ ఘటన ఈ సినిమాలో ఉంది. వారి బాధ, ఆవేదన మన హృదయాలను జ్వలింపచేస్తాయి.
          ఓ జీతగాడి కొడుకుగా రామయ్య తన బాల్యాన్ని దొర పశువుల కొట్టంలో గడుపుతాడు. వయసు పెరిగాక అతని ప్రియురాలిని దొర గడీకి రప్పించుకుని బలాత్కరిస్తాడు. అక్కడే ఉంటే తన జీవితం కూడా దొర కాళ్ల కాడే ఉంటుందని.. ఊరే వదిలి పోతాడు రామయ్య. సూర్యాపేట, ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకుంటాడు. ఓ ఫ్యాక్టరీలో పనికి చేరటం.. అక్కడ యూనియన్‌లో చేరటం..దోపిడీ అంటే ఏంటో తెలుసుకోవడం..చదువు కూడా నేర్చుకోవడంతో పాటు.. సమాజాన్ని కూడా అర్ధం చేసుకునే స్ధితికి చేరతాడు. తన కర్తవ్యమేంటో తెలుసుకుంటాడు. ఊరికి తిరిగెళ్లి అదే దొరను తరిమి తరిమి కొడతాడు. ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు పోయినా..లెక్కచేయరు. ఒక్కో వీరుడు నేలకొరుగుతుంటే..రక్తం మరిగి మరింత తెగించి దొరలపై దాడులు చేస్తారు.  మహిళలు సైతం తుపాకులు పడతారు. సినిమాలో దర్శకుడు తెలంగాణ  పోరును.. అది పుట్టిన తీరును చూపించాడు. కూలి బతుకులు, రైతు బాధలతో పాటు ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలను తెలియచేశాడు. బలమైన దొరను ఎదుర్కోవడానికి కుల,మతాల  అంతరాలను జనం పక్కన పెట్టారని, అన్ని సామాజిక వర్గాలవారు ఏకమై నిజాంను ఎదిరించిన తీరును కళ్లకు కట్టాడు. ప్రేక్షకులకు మాత్రం ఒకటి అర్ధమైంది. తెలంగాణలో వెట్టిచాకిరీ పేరుతో ప్రజలను దొరలు, నిజాం కలిసి దోచుకున్నారని.. పశువుల కంటే హీనంగా చూశారని.. అందుకే వారంతా తిరగబడి తుపాకీ పట్టారని. దొరను తరిమికొట్టారని. అదే మా భూమి చిత్రం సాధించిన అపూర్వ విజయం.

కామెంట్‌లు లేవు: