30, మార్చి 2015, సోమవారం

నటశేఖరుడి విజయప్రస్థానం


                                            ఘట్టమనేని శివరామ‘కృష్ణ’కు ప్రస్తుతం 70 వసంతాలు పూర్తయ్యాయి. సాధారణ స్థాయి నటుడిగా జీవితాన్ని ప్రారంభించి టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌గా ఆయన ఎదిగిన వైనం అబ్బరపరుస్తుంది. విజయాలు వరించినా సినీ కళామతల్లికి వినమ్రంగా ఉండే ఆయన తీరు అత్యద్భుతం. ఆయన నిర్మాతల హీరో.. ఆయన దర్శకుల హీరో.. ఆయన కోసం అభిమానులు ఏమైనా చేస్తారు.. ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటశేఖరుడాయన. సినిమా నిర్మాణంలో సరికొత్త ఆవిష్కరణలు చేసి రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ ‘సూపర్‌స్టార్‌’ అనిపించుకున్న ఘనత ఆయన ఒక్కడికే దక్కింది. సరికొత్త పాత్రలకు పర్యాయపదంగా నిలిచిన నటశేఖర కృష్ణ తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతూ నిర్మితమైన ‘తేనేమనసులు’ విడుదలై నేటితో 50 సంవత్సరాలు పూర్తి చేసు కుంది. 1965 మార్చి 31న ‘తేనె మనసులు’ చిత్రం విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో సంచలన విజయం సాధించింది. ‘తేనె మనసులు’... 50 ఏళ్ళ సుదీర్ఘ విజయ ప్రస్థానానికి నాంది పలికిన వైనాన్ని.. గుర్తు చేసుకుంటూ మీడియాతో ‘సూపర్‌స్టార్‌’ కృష్ణ పంచుకున్న అనుభూతుల సమాహారం ఆయన మాటల్లోనే..
                                                           తొమ్మిదేళ్ళలో 100 సినిమాలు...
             కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే వంద  సినిమాల్లో నటించాను. ఇదొక రికార్డుగా చెప్పుకోవచ్చు. కేవలం సినిమాలపై ఉన్న ప్యాషన్‌తోనే ఎండనక, వాననక ఇష్టపడి నటించాను. రోజుకు మూడు షిప్టుల్లో మూడు సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఎప్పుడైతే వంద సినిమాలు పూర్తయ్యాయో తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను. యాభై సంవత్సరాల సినీ కెరీర్‌లో 350కి పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నాను. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, పద్మాలయ స్టూడియో అధిపతిగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా.. పలు బాధ్యతల్ని నిర్వహించినందుకు గర్వంగా ఉంది.  
                                                               ఆరు నెలలు ఖాళీగా ఉన్నా..
          ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ముళ్లపూడి వెంకటరమణ రాసిన కథతో  ‘తేనె మనసులు’ చిత్రంతో రంగ ప్రవేశం చేశాను. నేటితో ఈ చిత్రం విడుదలై, నాకెరీర్‌ ప్రారంభమై యాభైఏళ్లు పూర్తయ్యాయి. చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఎన్నో విజయాలు చూశాను. అపజయాలు చూశాను. విజయాలకు పొంగి పోలేదు, అపజయాలకు కుంగి పోలేదు. ‘తేనె మనసులు’ తర్వాత ఆరు నెలలు ఖాళీగా ఉన్నాను. ఆ తర్వాతే ఆదుర్తిగారు పిలిచి ‘కన్నె మనసులు’ సినిమాలో నటించమని అడిగారు. అలా ఆయనతో కలిసి రెండవసారి కలిసి పనిచేశాను.
                                                   ఆ సినిమాలు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి..
              ఆదుర్తి సుబ్బారావు ‘కన్నె మనసులు’ చిత్రంలో నటిస్తున్నప్పుడు ‘గూఢాచారి 116’లో అవకాశం వచ్చింది. తెలుగులో తొలి డిటెక్టివ్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా అది. ఆ చిత్రం కోసం అప్పట్లో ఫైట్స్‌, డ్యాన్సులు బాగా ప్రాక్టీస్‌ చేసేవాడిని. ఆ పనితనం, సినిమా ఫలితాలు నాకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.        ఈ నేపథ్యంలోనే యాక్షన్‌ కథలు చేస్తూనే ‘మరుపురాని కథ’, ‘అత్తగారు కొత్తకోడలు’, ‘ఉండమ్మా బొట్టు పెడతా’ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించాను. అవి నా స్థాయిని పెంచాయి.. కెరీర్‌ ఆరంభంలోనే టాలీవుడ్‌ అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి నటించే అవకాశం కల్గింది. వారితో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ‘స్త్రీజన్మ’, ‘నిలువుదోపిడి’, ‘విచిత్ర కుటుంబం’ వంటి చిత్రాలకు వారితో పనిచేశాను. నటుడిగా నా స్థాయిని పెంచిన చిత్రాలవి. అప్పట్లో కొన్ని నా యాక్షన్‌ సినిమాలు తమిళ, హిందీ భాషల్లో కూడా అనువాదమయ్యాయి. 
                                             కౌబాయ్‌ చిత్రాల ట్రెండ్‌ అప్పటి నుంచే ప్రారంభం..
    పద్మాలయ స్టూడియో స్థాపించి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాను. అప్పట్లో భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించాను. ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు, ‘అల్లూరి సీతారామరాజు’, ‘అగ్ని పరీక్ష’ వంటి చిత్రాలు ఈ బ్యానర్‌లోనే వచ్చాయి. విజయ నిర్మలతో కలిసి ‘విజయకృష్ణా మూవీస్‌’ స్థాపించి ‘మీనా’, ‘దేవదాసు’ వంటి విజయవంతమైన చిత్రాలు చేశాను. 1970 దశకంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’తో కౌబాయ్‌ సినిమాలను తెలుగులోకి తీసుకువచ్చాను. ఈ చిత్రం ఇంగ్లీష్‌, తమిళ్‌, హిందీ భాషలో అనువాదమైంది. అప్పటి నుంచి కౌబాయ్‌ సినిమాల ట్రెండ్‌ మొదలైందని అందరూ అంటుంటారు.
                                                    నన్ను బాగా ప్రభావితం చేసిన చిత్రమిది...
           ‘అల్లూరి సీతారామరాజు’ నా కెరీర్‌లో ఉత్తమ చిత్రం. 1974 మే 1న ఈ సినిమా విడుదలైంది. స్వాతంత్ర సమరయోధుడు సీతారామరాజు జీవితంపై రూపొందిం చడంతో ఆ సినిమాకు ఎనలేని ప్రశంసలు లభించాయి. అయితే నాకిది 100వ సినిమా కావడం విశేషం. పైగా నా కెరీర్‌లో చేసిన అన్ని చిత్రాలకంటే నన్నెంతో ప్రభా వితం చేసిన చిత్రం ఇదే. అలాగే నా స్వీయ దర్శకత్వంలో ‘సింహాసనం’ తొలి సినిమా. ఇందులో ద్విపాత్రాభినయం చేశాను. తెలుగు, హిందీలో రూపొందించాను. తెలుగులో తొలి 70ఎంఎం సినిమా, స్టీరియోస్కోపిక్‌ సౌండ్‌ చిత్రమిది.
                                                         వాళ్ళిద్దరికీ నేను వీరాభిమానిని
      ఎన్టీర్‌, ఏఎన్నార్‌లు నాకు నచ్చిన హీరోలు. వారితో కలిసి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాను. శోభన్‌బాబు, కృష్ణంరాజు మంచి స్నేహితులు. వీరిద్దరికీ నేను అభిమానిని. కృష్ణంరాజు విలన్‌గా, నేను హీరోగా 50కిపైగా సినిమాలు చేశాం. వాళ్ళందరితో పనిచేయడం నా అదృష్టం. ఇకపోతే, నా వారసుడిగా మహేష్‌బాబు వంద శాతం నాపేరు నిలబెట్టాడు. అతను ఇప్పుడీ స్థాయిలో ఉండటం నాకెంతో గర్వకారణంగా ఉంది. నేటి తరం హీరోల్లో నా అభిమాన నటుడు మహేష్‌. ఆ తర్వాత ప్రభాస్‌ నటనంటే కూడా బాగా ఇష్టం. మహేష్‌ను జేమ్స్‌బాండ్‌గా చూడాలనుకుంటున్నా.
                                                               నిర్మాణ వ్యయం తగ్గాలి
                      ప్రస్తుతం తెలుగు సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. అందువల్ల సినిమాలు విజయం సాధించినా నిర్మాత నష్టపోతున్నారు. ఇటీవల మహేష్‌బాబు నటించిన ‘వన్‌’, ‘ఆగడు’ వంటి సినిమాలకు 70కోట్లకు పైగా ఖర్చు చేశారు. అంత ఖర్చు అనవసరం. సినిమాకు నలభై, యాభైకోట్ల మించకుండా చూసుకోవాలి. ఈ పరిధిలో నిర్మాణం జరిగితే నిర్మాతకు పెద్దగా నష్టాలుండవు, మహేష్‌కు కూడా ఆ విషయమే చెప్పాను. ప్రస్తుతం మహేష్‌ పారితోషికం కూడా తగ్గించుకున్నాడు. అలాగే నిర్మాణ పరంగా చాలా కాలం నుంచి పద్మాలయలో సినిమాలు నిర్మించలేదు. మారుతి డైరెక్ట్‌ చేసిన ‘ప్రేమకథా చిత్రమ్‌’ సినిమాని హిందీలో అక్కడ హీరోలతో మారుతితోనే రీమేక్‌ చేయాలనుకుంటున్నా. అలాగే ఇకపై నా నటన గురించి చెప్పాలంటే..పెద్ద బ్యానర్‌ సినిమాలైతే కొనసాగుతాను.  లేదంటే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. పిల్లలంతా స్థిరపడ్డారు కదా!.
........................................................................................నవతెలంగాణా సౌజన్యంతో.

కామెంట్‌లు లేవు: